top of page

జ్ఞానము నీవే వారాహీ



'Jnanamu Nive Varahi' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 06/07/2024

'జ్ఞానము నీవే వారాహీ' పెద్ద కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


"కాలం కదిలి పోతుంది. మానవత్వం మరిగి పోతుంది. దానవత్వం చెలరేగిపోతుంది. "అన్నాడు ఆనందం.

 

 "కాలమెప్పుడూ కరిగిపోతూనే ఉంటుంది. మిగతా వన్నీ మనిషి మనస్తత్వం బట్టి మారిపోతుంటాయి. కొందరికి గతమంటే ఇష్టం. మరికొందరికి వర్తమాన మంటే ఇష్టం. ఇంకొందరికి భవిష్యత్తు అంటే ఇష్టం. వారి వారి ఇష్టాలను బట్టి వారి వారి ఆలోచనలు మారుతుంటాయి. " అన్నాడు నిగమం.

 

"అదిసరే, నువ్వు ఇప్పుడు ఎక్కడకు వెళుతున్నావు?" అడిగాడు ఆనందం. 


"వారాహీ మాత పూజకు " అన్నాడు నిగమం. 


"వారాహీ మాత గురించి నాకు కొంచమే తెలుసు. నీకు తెలిసిందేమిటో చెప్పు?" అని అడిగాడు ఆనందం. 


"కొందరు దేవుడిని పూజిస్తారు. మరికొందరు పూజించరు. కొందరు అందరికీ దేవుడు లేడని చెబుతూ, వారు మాత్రం దేవుని పూజిస్తారు. ఎవరు ఏం చేసినా, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనేది అక్షర సత్యం. 


ఒకప్పుడు హిరణాక్షుడు అనేవాడు తన జ్ఞాన శక్తినంత కన్నులలోకి తెచ్చుకుని భూమి తన కక్ష్య మీద తాను తిరుగుతూ సూర్యుని చుట్టడం చూసాడు. భూమి తిరిగే కక్ష్యనే మహర్షులు ఆది శేషుడు అంటారని గ్రహించాడు. 


 హిరణ్యాక్షునికి భూమిని తన కక్ష్య నుండి తప్పించాలనే దుర్బుద్ధి పుట్టింది. భూమిని శ్రీ సూర్య నారాయణుని రూపం లో విష్ణు శక్తి, ఆదిశేషుని రూపం లో శివశక్తి రక్షిస్తుందని హిరణ్యాక్షుడు గమనించాడు. 


హిరణ్యాక్షుడు అంధకాసురుడు వంటి రాక్షసులను సృష్టించాడు. అంధకాసురుని రక్తం నుండి రక్త బీజుడు వంటి రాక్షసులు పుట్టారు. వారిని తనకు అండగా ఉండమని చెప్పి, భూమిని తన కక్ష్య నుండి తప్పించడానికి హిరణ్యాక్షుడు ముందడుగు వేసాడు. అలా సృష్టిని సర్వనాశనం చెయ్యాలనుకున్నాడు. 


హిరణ్యాక్షుడు భూమిని అంటి పెట్టుకుని ఉన్న కక్ష్య దగ్గరకు వెళ్ళాడు. అక్కడ భూమి ని సంరక్షిస్తున్న కాళి, తార, ధూమావతి, త్రిపుర సుందరి, భువనేశ్వరి, కమలాత్మిక, మాతంగి, భగళాముఖ, భైరి, భైరవి అనే దశమహా విద్యలను చూసాడు. వాటి మీదకు రక్త బీజుడు వంటి రాక్షసులను పంపి హిరణ్యాక్షుడు భూమిని తన కక్ష్య నుండి తప్పించాడు. 


ఇది చూచిన సూర్యనారాయణుడు భూమాత సంరక్షణ నిమిత్తం వరాహ రూపం ధరించాడు. వరాహ మూర్తి భూసంరక్షణకు బయలుదేరగానే అతనికి అంధకాసురుడు, రక్త బీజుడు వంటి రాక్షసులు ముందు కనపడ్డారు. అప్పుడు వరాహమూర్తి తన యోగనిద్ర నుండి తన ధర్మపత్ని గా వారాహిని సృష్టించాడు. 


 తుఫానులో వచ్చే నల్లని మేఘాకారంగల వారాహీ మాత, లలితాదేవి సైన్యాధిపతి అయ్యింది. 


వజ్రవారాహి, రక్త బీజుడు వంటి రాక్షసులను సంహరించే టప్పుడు గేదె మీద, శవం మీద, మహిషం మీద సంచరించింది. ఆమె నల్లని ఆకారాన్ని, ఆమె అరుపులను చూచి కొందరు రాక్షసులు అక్కడికక్కడే గుండె ఆగి మరణించారు. వజ్రవారాహి చక్రం పట్టుకుని కత్తితో సమరం చేస్తుంటే రాక్షసులు భయంతో పారిపోయారు.. వజ్రవారాహి మరీచి అయ్యి రాక్షసుల కంఠాలను కొరికి వారి రక్తం తాగింది. 


 వారాహీ మాత రెండు చేతులతో కత్తి పట్టి రాక్షస సంహారం చేసింది. అవసరమైనప్పుడు నాలుగు, ఆరు, ఎనిమిది చేతులను ధరించి రాక్షస సంహారం చేసింది. 


దశమహావిద్యలలోని ధూమావతిగా  మారి అసురుల అంతం చూసింది. సమర రంగంలో మహా నృత్యం చేసింది. చండిక వీపుగా వారాహి మహా అవతారాన్ని ధరించింది. రక్త బీజుడు వంటి రాక్షస సంహారం జరగగానే వరాహమూర్తికి హిరణ్యాక్షుని సంహరించడం తేలిక అయ్యింది. 


 వరాహమూర్తి హిరణ్యాక్షుని చంపి భూమిని యథాస్థానంలో ఉంచాడు. అంత వారాహీ మాత దశ మహా విద్యలలో తనూ ఒకటిగా కలిసి భూ సంరక్షణకు మరింత పటిష్టతను చేకూర్చింది. వారాహీ మాత సేనాధిపత్యాన్ని చూచిన భూమాత, వారాహీ మాతను విష్ణు స్వరూపిణిగా, శైవశక్తిగా, లలితాదేవి సైన్యాధిపతిగ పలు రీతుల్లో స్తుతించింది" అని తనకు తెలిసిన వారాహీ మాతకు సంబంధించిన విజ్ఞాన విషయాలను నిగమం, ఆనందానికి చెప్పాడు. 


"పురాణ కథలను కథలుగా చూస్తే కాలక్షేపం. విజ్ఞానంగా చూస్తే, మహోన్నత విజ్ఞానం" అన్నాడు ఆనందం. 


"అలా అనుకుంటూ కాలక్షేపం చేస్తే ఫలితం శూన్యం. కథలు ప్రయోగ శాలలకు వెళితేనే సత్ఫలితం. భూమిని కక్ష్య నుండి తప్పించే విజ్ఞానవంతులు, స్వార్థపరులైన రాక్షసులు, భూమిని కక్ష్య లో ఉంచి ప్రజలను కాపాడే పరోపకారులు, విజ్ఞానవంతులైన దేవతలు నాడే ఉన్నారు " అన్నాడు నిగమం.

 

"నిజమే. వారాహీ మాత ప, ఫ, బ, భ, మ అనే అదరోత్ప త్తి వర్ణాలను పరిపాలిస్తుందని విన్నాను. అలాగే లలితా సహస్ర నామం వారాహీ మాతను స్తుతిస్తుంది. వారాహీ మాత రాత్రి పూజను ఇష్టపడుతుందట. 


‘అభయం నీవే వారాహీ.. 

శుభముల నీవే వారాహీ.. 

జ్ఞానము నీవే వా రాహీ.. 

జయజయ హే వారాహీ.. 

జయము నీవే వారాహీ.. 

విజయం నీవే వారాహీ.. 

అమ్మవు నీవే వారాహీ.. 

భూ రక్షణ నీవే వారాహీ..


 “ఏదేమైనా వారాహీమాత వ్రతాలు ఇప్పుడు బాగా వెలుగులోకి వచ్చాయి" అన్నాడు ఆనందం. 


శుభం భూయాత్


వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు







36 views0 comments

Comments


bottom of page