కలం చెప్పిన సత్యాలు
- Gadwala Somanna

- Jun 17
- 1 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #KalamCheppinaSathyalu, #కలంచెప్పినసత్యాలు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 90
Kalam Cheppina Sathyalu - Somanna Gari Kavithalu Part 90 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 17/06/2025
కలం చెప్పిన సత్యాలు - సోమన్న గారి కవితలు పార్ట్ 90 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
కలం చెప్పిన సత్యాలు
----------------------------------------
పని చేస్తే నవ్వుతూ
ఏదీ కష్టం కాదోయ్!
చిరునవ్వులు రువ్వుతూ
జీవిస్తే నష్టం రాదోయ్!
ఇష్టాన్ని పెంచుకొమ్ము
అదే కదా నీ సొమ్ము
ఆత్మవిశ్వాసాన్ని నమ్ము
చూపించుము గుండె దమ్ము
పొరపాట్లు అతి సహజం
అది మానవ నైజం
దిద్దుకుంటే గౌరవం
అక్షరాల వాస్తవం
పెంచుకో వ్యక్తిత్వం
పంచుకో దైవత్వం
అమూల్యమైనది బ్రతుకున
చాటుకో దాతృత్వం

సత్యాల ముత్యాలు
----------------------------------------
ఏడుస్తూ కూర్చుంటే
పగటి కలలు కంటుంటే
ఏదీ కూడా జరగదు
సత్ఫలితాన్ని ఇవ్వదు
బద్దకం ఆవరిస్తే
అదుపు తప్పి జీవిస్తే
సమాజం హర్షించదు
ఏది మనకు ప్రాప్తించదు
అజాగ్రత్త ప్రమాదం
కబళించును ప్రమోదం
అప్రమత్తంగా ఉంటే
శుభములన్ని మన వెంటే
శ్రమిస్తే ఏది కూడా
అసాధ్యం కానేరదు
భ్రమిస్తే ఉన్నది కూడా
ఊడిపోక ఉండబోదు

అమూల్యమైనవి అక్షరాలు
-----------------
అక్షరాల వెలుగులోన
అజ్ఞానం తొలగుతుంది
ఆశ్రిస్తే గుండెలోన
ఆనందం మిగులుతుంది
నేర్చుకున్న అక్షరాలు
మార్చునోయి!తలరాతలు
సుఖపడును జీవితాలు
అగునోయి! కాగడాలు
బలమైనవి అక్షరాలు
అవి రక్షణ కవచాలు
అవినీతిని ప్రశ్నించే
బహు గొప్ప ఆయుధాలు
అక్షరాలు లేకుంటే
వెలుగెక్కడ జీవితాన
అజ్ఞానం పోకుంటే
మోదమెక్కడ హృదయన

మాటల సరాలు
----------------------------------------
ఆడంబరానికి అప్పులు
ఆనందానికి తప్పులు
ఎప్పుడూ చేయరాదు
ఆలోచన రాకూడదు
అవరోధాలెదురైనా
అవమానాలొచ్చినా
ఆశయమే వీడరాదు
వెనుకడుగు వేయరాదు
పుట్టించ వద్దు వదంతులు
వేయవద్దు అపనిందలు
పరులజోలికి పోకుంటే
చల్లగుండును బ్రతుకులు
చెప్పరాదు చాడీలు
తీయరాదు ఆరాలు
ఎవరి పని వారు గనుక
చేసుకుంటే బహు మేలు

గురువు గారి మాటలు
----------------------------------------
పలకరించు ప్రేమగా
బలపడును బంధాలు
యోచించు గొప్పగా
వృద్ధినొందు జీవితాలు
ప్రశ్నించు సూటిగా
పుట్టును ప్రకంపనలు
నిలబడుము గట్టిగా
తెలియును బలాబలాలు
జీవించు హాయిగా
స్వర్గమే నీదగును
కష్టపడు పూర్తిగా
ఫలితాలు సొంతమగును
భాషించు మృదువుగా
హత్తుకొనును మనసులు
బోధించు గురువుగా
మార్పునొందు మనుషులు
-గద్వాల సోమన్న




Comments