కలయా… నిజమా!
- Ronanki Divija Saibhanu

- 3 hours ago
- 6 min read

Kalaya Nijama - Telugu Inspirational Story | Ronanki Divija Saibhanu కలయా… నిజమా! - తెలుగు ప్రేరణాత్మక కథ | రోణంకి దివిజ సాయిభాను
Published In manatelugukathalu.com On 11/08/2026
“కలయా… నిజమా!” అనేది పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రుల్లో పెరుగుతున్న పోటీ, ఆందోళన, అంచనాలపై ఆలోచింపజేసే తెలుగు కథ. హైదరాబాద్ నగర జీవితంలో బిజీగా ఉండే రవి, సంజనలకు బిడ్డ పుట్టబోతున్న ఆనందంతో పాటు, ఆ బిడ్డను చిన్నప్పటి నుంచే విజయవంతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలనే ఆలోచనలు ఉంటాయి. అయితే సంజనకు వచ్చిన ఒక విచిత్రమైన కలలో, పుట్టబోయే బిడ్డ కోసం తల్లిదండ్రులే పరీక్షలు రాయాల్సిన ఒక భయానక ప్రపంచం కనిపిస్తుంది. ఆ కల ద్వారా పిల్లల బాల్యాన్ని ర్యాంకులు, పోటీలు, విజయాల కోసం త్యాగం చేయడం ఎంత ప్రమాదకరమో కథ సున్నితంగా చెబుతుంది.
బయట సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. కార్లు, బైకుల హారన్‌ల శబ్దాలతో హైదరాబాద్ నగరం దద్దరిల్లుతోంది.
రవి, సంజనలకు ఆరు నెలల క్రితమే పెళ్లి అయింది. ఇద్దరూ మల్టీ నేషనల్ కంపెనీలలో మంచి హోదాలో ఉన్నారు.
కొన్ని రోజుల క్రితం, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడంతో, డాక్టర్ సలహా మేరకు సంజన మెడికల్ లీవ్ పెట్టి ఇంట్లో ఉంది. రవి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మిషన్ తీసుకుని, సంజనకు తోడుగా ఇంట్లోనే ఉంటున్నాడు.
వారి జీవితంలో అతిపెద్ద, అందమైన అధ్యాయం మొదలు కాబోతోందన్న ఉత్సాహం వారి కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
కిటికీ వైపు చూస్తూ, తన చేతి గడియారం వైపు చూస్తూ, “సరే అమ్మా! నేను మళ్లీ చేస్తాను. నీరసంగా ఉంది, కాసేపు పడుకుంటాను,” అని ఫోన్ పెట్టేసింది సంజన. అలా మంచం పైన నడుం వాల్చి, కళ్లు మూసింది.
“సంజూ, త్వరగా రా! డాక్టర్ అపాయింట్‌మెంట్‌కి లేట్ అవుతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, వెళ్లేసరికి టైమ్ పట్టేలా ఉంది,” అని అంటున్నాడు రవి.
“వస్తున్నా రవి, కూల్!” అంటూ సంజన హడావిడిగా బాటిల్‌లో నీళ్లు నింపుకుని బ్యాగ్‌లో పెట్టుకుంది. ఆమె కళ్లల్లో ఉత్సాహం, గుండెలో చిన్న భయం కలగలిసి ఉన్నాయి.
కారు ట్రాఫిక్‌లో మెల్లగా కదులుతోంది. ఒక్కో అడుగు ముందుకు పడుతుంటే, రవికి టెన్షన్ పెరుగుతోంది. “చూశావా సంజూ, ఈ ట్రాఫిక్... అందుకే ముందే బయలుదేరదాం అన్నాను,” అని అసహనంగా అన్నాడు.
“రవి, ప్రశాంతంగా ఉండు. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, అదీ ఒక మంచి వార్తతో. ఇంత టెన్షన్ పడితే ఎలా?” అంది సంజన ప్రశాంతంగా నవ్వుతూ. రవికి కూడా నిజమేననిపించి కాస్త ఊరుకున్నాడు.
ఎట్టకేలకు, గంట పైనే ప్రయాణం తర్వాత, వారు హాస్పిటల్ దగ్గరకు చేరుకున్నారు. భవనం బయట గోల్డెన్ లెటర్స్‌లో ‘ది ఫ్యూచర్ బేబీ అకాడమీ – ప్రెగ్నెన్సీ టు హార్వర్డ్’ అని రాసి ఉంది. రవి, సంజన అర్థంకాక ఒకరినొకరు చూసుకున్నారు. అది ఒక ఆసుపత్రిలా కన్నా, అంతర్జాతీయ విద్యా సంస్థలా ఉంది.
కారు పార్క్ చేసి లోపలికి నడిచారు. రిసెప్షనిస్ట్ వద్ద పేరు చెప్పి అడిగితే, ఆమె రవి దగ్గరున్న కార్డు తీసుకొని స్కాన్ చేసి, “డాక్టర్ వేద గారు మీ కోసం ఎదురుచూస్తున్నారు.
త్వరగా వెళ్లండి,” అంటూ దారి చూపించింది. తమలాంటి దంపతులు అక్కడ ఎంతోమంది ఉన్నారు. కానీ వారంతా తమలాగా నవ్వుతూ లేరు. అక్కడి వాతావరణం తీవ్రమైన ఏకాగ్రతతో, ఒక తెలియని భయంతో నిండి ఉంది. కొందరు తల్లులు ఫోన్ చూస్తూ పుస్తకంలో ఏదో రాసుకుంటున్నారు. మరికొందరు భర్తలు పోటీపడి పుస్తకాలు చదువుతున్నారు.
ప్రతి ఒక్కరూ ఏదో పరీక్షకు సన్నద్ధమవుతున్నట్టున్నారు.
రవి, సంజన ఇదంతా వింతగా చూస్తూ డాక్టర్ వేద గదిలోకి ప్రవేశించారు. ఆమె రిపోర్ట్స్ చూసి, గర్భధారణను ధ్రువీకరిస్తూ, రవి, సంజనల వైపు చూశారు.
“కంగ్రాట్స్! మీరు పేరెంట్స్ కాబోతున్నారు. కానీ, మీరు చాలా లేట్‌గా వచ్చారు. ఇప్పుడు వస్తే ఎలా? బేబీ విషయంలో కేర్ తీసుకోవాలి కదా!” అని అన్నారు. ఆమె గొంతులో సానుభూతి కన్నా, ఒక కఠినమైన హెచ్చరిక ధ్వనించింది.
“లేటా డాక్టర్? మేము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే వచ్చేశాం కదా...” అని తడుముకుంటూ అన్నాడు రవి.
“కేవలం కన్ఫర్మేషన్ సరిపోదు రవి గారూ. మీరు ‘ఫ్యూచర్ బేబీ అకాడమీ’లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేయలేదా? మీరు రిజిస్టర్ చేసుకున్నారా?” అని అడిగారు.
వీరికి ఏమి అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు.
“డాక్టర్... బేబీకి ఇంకా పుట్టడానికి తొమ్మిది నెలలు ఉంది కదా? అయినా అడ్మిషన్ ఎవరికి?” అంది సంజన భయంగా.
డాక్టర్ వేద నిట్టూర్చి, కంప్యూటర్‌ను మూసివేసి, “ఇది సాధారణ హాస్పిటల్ మాత్రమే కాదు. ఇది భవిష్యత్ పౌరులను తయారుచేసే అకాడమీ. మీ బిడ్డకు ఈ రోజుల్లో గర్భంలో ఉండగానే సరైన పునాది వేయాలి.
అందుకే, మీరు వెంటనే మా ఫ్యూచర్ ప్లానింగ్ టీమ్‌ని కలవండి. వారు మీకు దీనికోసం వివరిస్తారు. ఇది చాలా క్లిష్టమైన విషయం. మీకు టైమ్ తక్కువ ఉంది. మీ బిడ్డ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యేలా ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెళ్లి కలవండి,” అని అన్నారు.
రవి, సంజన భయం, ఆందోళనతో డాక్టర్ గది నుండి బయటకు వచ్చారు. రిసెప్షనిస్ట్ వారికి ‘ప్రాజెక్ట్ ఫ్యూచర్’ రూమ్ చూపించింది. ప్రాజెక్ట్ ఫ్యూచర్ టీమ్ లీడర్, సత్య, వారిని చిరునవ్వుతో ఆహ్వానించి, సోఫాలో కూర్చోబెట్టింది. ఆమె నవ్వు వెనుక ఒక పెద్ద వ్యాపార ధోరణి దాగి ఉందని వాళ్లకు తెలీదు.
“వెల్కమ్ టు ది రేస్!” అని నవ్వుతూ ప్రారంభించింది సత్య. “మీరు ఆలస్యం చేశారు, కానీ కంగారు పడకండి. మేము మీకు సహాయం చేస్తాం.
ఈ రోజుల్లో పోటీ ఎంత ఉందో మీకు తెలుసు. మా లక్ష్యం ఏంటంటే, మీ బిడ్డకు ఐదేళ్ల వయసు వచ్చేసరికి కోడింగ్‌తో పాటు, అన్ని కంప్యూటర్ లాంగ్వేజెస్ పైన పూర్తి అవగాహన వచ్చేయాలి; పదిహేడేళ్ల వయసు వచ్చేసరికి ప్రపంచంలోని టాప్-5 యూనివర్శిటీలలో సీటు గ్యారెంటీ అవ్వాలి.
దీనికి పునాది గర్భంలో ఉండగానే వేయాలి,” అంటూ ఆమె మూడు దశల ప్రణాళికను వివరించటం మొదలుపెట్టింది.
మొదటి దశలో, “శిశువు పుట్టకముందే తల్లిదండ్రులు తమ మానసిక, శారీరక సామర్థ్యాలను మెరుగుపరచుకోవాలి. మొదట, తల్లిదండ్రులుగా మీ మానసిక స్థితిని, ఫిజికల్ ఫిట్‌నెస్‌ను పరీక్షించాలి.
ఇప్పటివరకూ మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాం. సంజన గారు స్థిమితంగా ఉంటూ 95%తో ‘ఏ’ గ్రేడ్ సాధించారు. కానీ రవి గారూ, మీ కారు బయో-సెన్సార్ల ప్రకారం, మీరు హాస్పిటల్‌కు వచ్చే దారిలో ట్రాఫిక్‌లో 15 నిమిషాల పాటు తీవ్రమైన ఒత్తిడి, చిరాకును వ్యక్తపరిచారు. ఇది మీ స్కోర్‌ను 80%కి తగ్గించింది.
ఒత్తిడికి లోనయ్యే తల్లిదండ్రులు ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనివ్వలేరు. అడ్మిషన్‌కు ఇది సరిపోదు. మీరు వెంటనే స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోర్సులో జాయిన్ అయ్యి, మూడు వారాల లోపు పూర్తి చేయాలి. దానితో పాటు ప్రతి రోజు ఒక గంట పాటు ప్రశాంతమైన వాతావరణంలో మ్యూజిక్ వింటూ యోగా చేయాలి.
అప్పుడే మీ స్కోరు పెంచుకోవడానికి అవకాశం ఉంది,” అని అంది.
ఇదంతా విన్నాక, రవికి, సంజనకి నోట మాట రాలేదు. రవి నోరు తెరిచాడు, కానీ మాట రాలేదు.
సత్య మళ్లీ చెప్పడం మొదలు పెట్టింది: “రవి గారు కోర్సు పూర్తి చేసేలోగా, సంజనా గారు, మీరు కూడా మీ శిక్షణ మొదలుపెట్టాలి. ఇది మీ బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్ కోసం కీలకం. మీరు రోజూ ఉదయం రెండు గంటలు మాండరిన్ భాష నేర్చుకోవాలి.
ఇలా కొత్త భాషను నేర్చుకోవటం వలన మీ మైండ్ ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. ఇది మీకు మాత్రమే ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం, బేబీని చలాకీగా ఉంచటానికి మీరు క్వాంటం ఫిజిక్స్, అడ్వాన్స్‌డ్ మెకానిక్స్ సిద్ధాంతాలను రోజూ బిగ్గరగా చదవాలి.
సాయంత్రం, కాసేపు అడ్వాన్స్‌డ్ మ్యాథ్స్ సాధన చేయాలి. అలానే రోజూ రాత్రి పడుకునే రెండు గంటల ముందు కోడింగ్ అసైన్‌మెంట్స్ పూర్తి చేయాలి. మీకేమైనా సందేహాలు ఉంటే, వాటికి కూడా ప్రత్యేకంగా క్లాసెస్ జాయిన్ అవ్వొచ్చు; ఆ ప్యాకేజీని తర్వాత వివరిస్తాం.
7వ నెలలో, మీకు ఒక ముఖ్యమైన పరీక్ష ఉంటుంది. మీరు చదివిన క్వాంటం సిద్ధాంతాలను, మ్యాథ్స్, మాండరిన్ పదాలను గుర్తుంచుకుని, వాటిని మీ గర్భంలోని శిశువుకు సంకేత భాషలో వివరించాలి. అది మేము చూసి, మీరు 98% కంటే తక్కువ సాధిస్తే, మీ బిడ్డకు ‘గోల్డ్ ట్రాక్’ అడ్మిషన్ దొరకదు, ఒక అమూల్యమైన అవకాశాన్ని కోల్పోతారు,” అని అంది.
సంజన వణికిపోయింది. ఆమె కళ్లలో భయం నిండిపోయింది. “క్వాంటం ఫిజిక్స్ నేను చదవాలా? మాండరిన్ భాష నేర్చుకోవాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు?” అంది.
సత్య చిన్న నవ్వు నవ్వి, “మీ బిడ్డ కోసం మీరు ఏమైనా చేయగలరు సంజన గారూ! ఇది కేవలం పరీక్ష మాత్రమే కాదు, మీ అంకితభావానికి, మీ ధైర్యానికి కూడా పరీక్షనే! మీలాంటి ఎంతో మంది పేరెంట్స్ అడ్మిషన్స్ కూడా సాధించారు,” అని అంది.
“చివరిగా, 9వ నెల ప్రారంభంలో, తుది అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది. ఇది బేబీకి సంబంధించినది కాదు, కేవలం సంజన గారికి మాత్రమే! ఈ పరీక్షలో, మీరు గర్భధారణ సమయంలో నేర్చుకున్న అన్ని విషయాలను కలిపి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మా టీంకు వివరించాలి.
మీరు చేసిన ప్రకారం, మీ బేబీకి స్కోరు ఉంటుంది. ఇందులో ఫెయిల్ అయితే, మీ బిడ్డ ‘సాధారణ’ పిల్లలలో ఒకరిగానే పుడతారు. బేబీ బయటకి వచ్చాక మళ్లీ కొత్త ప్లాన్ ఉంటుంది,” అని అంది.
సంజన అదంతా విని తీవ్రమైన ఒత్తిడితో తల పట్టుకుంది. ఆ గదిలో ఉన్న లైట్లు, సత్య నవ్వు, రవి పాలిపోయిన ముఖం అంతా ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తన కడుపులోని బిడ్డకు ఇదంతా అర్థమవుతుందేమోనన్న భయంతో, ఆమె ఊపిరి ఆడక సోఫాలో అలానే వెనక్కి వాలిపోయింది.
“నేను చేయలేను... నేను ఒక మంచి తల్లిని కావాలనుకున్నాను. కానీ, నా బిడ్డను ఈ రేసులో భాగం చేయొద్దు ప్లీజ్! మనం ఇది ఒప్పుకోవద్దు రవి, ప్లీజ్...” అంటూ సంజన గట్టిగా అరుస్తుంది.
“సంజూ! ఏమైంది? దేనికోసం మాట్లాడుతున్నావు?” అంటూ రవి నిద్రలో కలవరిస్తున్న సంజనను పిలుస్తున్నాడు.
సంజన రవి పిలుపుకి ఉలిక్కిపడి కళ్లు తెరిచి, చుట్టూ చూసింది. తను బెడ్ పైన పడుకోవటం, రవి అయోమయంగా చూస్తుండటం అంతా గమనించింది.
“రవి... అదంతా... అదంతా ఒక కల! భయంకరమైన కల!” అని గట్టిగా ఊపిరి తీసుకుంది సంజన.
“ఎలాంటి కల సంజూ?” అని అడిగాడు రవి.
“మనం ఒక హాస్పిటల్‌కు వెళ్లాం. హాస్పిటల్ కన్నా అదొక అకాడమీ అంటే బెస్ట్! అక్కడ మన బేబీ అడ్మిషన్ కోసం పరీక్షలు రాయాలంట! నీకు కోపం వచ్చిందని నీ కారు సెన్సార్లు రికార్డ్ చేశాయంట! నేను క్వాంటం ఫిజిక్స్ చదవాలంట! పుట్టబోయే బిడ్డ కోసం నేను 98% తెచ్చుకోవాలంట! లేకపోతే, మన బిడ్డ సాధారణ పిల్లాడిలా మిగిలిపోతాడంట! ఏవేవో చెప్తున్నారు,” అంటూ సంజన భయంతో రవి భుజంపై వాలిపోయింది.
రవి నవ్వి, ఆమెను హత్తుకున్నాడు. “ఓ మై గాడ్, ఎంత భయంకరమైన కల! ఆ పోటీతత్వం గురించి మనం ఎంతగానో ఆలోచిస్తాం కదా సంజూ! అందుకే అలాంటి కల వచ్చి ఉంటుంది, ఏం కాదు, కాసేపు ప్రశాంతంగా ఉండు,” అని అన్నాడు.
“నిజమే రవి. ఆ కల మామూలుగా లేదు. కేవలం ఒత్తిడి, పోటీ, భయం మాత్రమే ఉన్నాయి. ఆ డాక్టర్లు, ఆ టీమ్... అంతా మన బిడ్డను ఏదో రోబో లాగా తయారు చేయాలనుకున్నారు. మన నవ్వులు, మన ప్రేమ వారికి అవసరం లేదు; మన సంతోష క్షణాలు, మన బేబీ ఊసులు ఇవేమీ వారికి అవసరం లేదు అనుకుంటున్నారు,” అని సంజన అంది.
రవి ఆమె చేయి పట్టుకుని, “నిజమే సంజూ, కానీ, ఆ కల మనకు ఒక హెచ్చరికను పంపింది. మన బిడ్డకు ఈ ప్రపంచంలో అతి ముఖ్యమైనది ఏంటో నాకు అర్థమైంది. రోజువారీ జీవితంలో మనం పరుగులు తీస్తూ, డెడ్‌లైన్స్‌ను చేధిస్తూ సతమతమవుతున్నాం.
కానీ, మన బిడ్డకు ఇవన్నీ అలవాటు చేయొద్దు. కాస్త సమయం తీసుకొని ఆలోచించి మంచిగా పెంచుదాం, మన బిడ్డతో పాటే మళ్లీ మనం తిరిగి పెరుగుదాం... ఈ రేస్‌కి దూరంగా... అప్పటివరకూ నీ హెల్త్, బేబీ హెల్త్ ముఖ్యం. పదా, టాబ్లెట్స్ వేసుకుందువు,” అని అన్నాడు.
సంజన సరేనని, లేచి ముఖం కడుక్కుంది. తన కడుపు పైన చేయితో నిమురుతూ అద్దంలో తనను తాను చూసుకుంది. ఈసారి, ఆమె ముఖంలో టెన్షన్ లేదు, పోటీ లేదు. కేవలం ప్రశాంతమైన నవ్వు, ఒక కొత్త జీవితం కోసం ఎదురుచూస్తున్న ఆనందం మాత్రమే ఉంది. ఎప్పట్లానే, ఆ సమయంలో హైదరాబాద్ నగరం రణగొణ ధ్వనుల మధ్యన దద్దరిల్లుతూనే ఉంది.
కానీ ఆ ఇంటిలో మాత్రం, ఒక కొత్త ప్రపంచం...
“ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఎటువంటి భయం లేకుండా... ప్రశాంతంగా, ఆనందంగా మొదలైంది.”
ఈ లోకంలో బిడ్డ పుట్టడమనేది ఒక అద్భుతం.
అది ఒక ఎగ్జామ్ కాదు… ఒక ఈవెంట్ కాదు…
ఒక రేసు అయితే అసలే కాదు. అది రెండు హృదయాలు కలిసి ఒక అద్భుత హృదయాన్ని ఆహ్వానించే ఒక అపూర్వ ప్రయాణం.
ఈ రోజు రవి, సంజన మేల్కొన్నట్లు...
మనమందరం కూడా మేలుకోవలసిన సమయం ఇది. పిల్లలు పుట్టకముందే వారిని భవిష్యత్తుకు సిద్ధం చేయడానికి ప్రయత్నించకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లల భవిష్యత్తు ర్యాంకులతో కాదు, వారితో కలిసి మనం మిగిల్చే చిన్న చిన్న జ్ఞాపకాలతోనే తయారవుతుంది.
***
రోణంకి దివిజ సాయిభాను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
నా పేరు రోణంకి దివిజ సాయిభాను. తెలుగు భాషాభిమానిని. తెలుగు భాషలో కవితలు మరియు కథలను రాస్తుంటాను. మనసును నింపిన ప్రతి భావాన్ని పదాలతో అల్లుతూ ఇప్పటివరకు ఎన్నో కవితలను రాసాను. నా కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఎన్నో సాహిత్య పోటీల్లో పాల్గొని, విజయాలు సాధించడం నాకు మరింత ప్రేరణనిచ్చింది. భావాలకి, కలలకి మాట దొరికేలా చేసే ఈ సాహిత్యయాత్రలో నిరంతరం కొత్త అంచులను అన్వేషిస్తూ ముందుకు సాగుతున్నాను.






Comments