కలిసి వచ్చిన అదృష్టము
- Nandyala Vijaya Lakshmi

- 2 days ago
- 4 min read
#NandyalaVijayaLakshmi, #నంద్యాలవిజయలక్ష్మి, #KalisiVachhinaAdrushtamu, #కలిసివచ్చినఅదృష్టము, #TeluguChildrenStories, #తెలుగుబాలలకథలు

Kalisi Vachhina Adrushtamu - New Telugu Story Written By - Nandyala Vijaya Lakshmi Published in manatelugukathalu.com on 04/01/2026
కలిసి వచ్చిన అదృష్టము - తెలుగు కథ
రచన: నంద్యాల విజయలక్ష్మి
సంక్రాంతి... పండుగ అంటే అందరికీ ఉత్సాహం వస్తుంది. పంటచేతికి వచ్చిన రైతులు, స్కూళ్ళకు సెలవులు, కుటుంబముతో కలిసి విహారయాత్రలు, హరి దాసులకు, గంగిరెద్దులు ఆడించేవారికి అదనపు ఆదాయము, విచిత్రవర్ణాల ముగ్గులు, గొబ్బెమ్మలు, కోడిపందాలు, కొత్త అల్లుళ్ళ రాక, కొత్త బియ్యపుపిండితో మహిళలు కలిసికట్టుగా చేసే తీపి పిండివంటలు, నింగి అంచును తాకాలని పిల్లల చేతులతో చేసే గాలిపటాల విన్యాసాలు, భోగి మంటలు, భోగిపళ్ళ పేరంటాలు, గోపూజలు ప్రత్యేకించి పల్లెటూళ్ళలో కనిపించే సందడి ఇవన్నీ కలిసి, తెలుగువారికి ప్రియమైన ముచ్చటైన మూన్నాళ్ళ పండగ సంక్రాంతి.
అందరిలాగే ఆనందికి కూడా సంక్రాంతి అంటే చాలా ఇష్టం. ఈ సారి అన్నా, అమ్మ తనకు పట్టుపావడా జాకెట్, కాళ్ళకు గజ్జెలు కొంటే ఎంచక్కా మువ్వలు సందడిచేస్తూ, గొబ్బెమ్మలచుట్టూ తిరిగితే ఎంత బాగుంటుందో అనుకుంది ఆనంది.
తండ్రి రామయ్య ఒక సామాన్య రైతు. తల్లి జానకి ఇంటిపని చేసుకుంటూ కుట్టు మిషన్ తో లంగాలు జాకెట్లు కుట్టి కొంత సంపాదిస్తోంది. చాలీ చాలని ఆదాయము అయినా ఉన్నంతలో తృప్తిగా బతకాలని పట్టెడు అన్నము దొరకడము కూడ అదృష్టమే అని పిల్లలకు చెప్తూ పొదుపుగా ఇంటిని సమర్థిస్తోంది. ఇవన్నీ ఆనందికి తెలుసు. ఆనంది తమ్ముడు అరుణ్. ఆనందిని ప్రభుత్వస్కూలులో, అరుణ్ ని కాన్వెంట్ లో చేర్పించారు.
రామయ్య, జానకి ఇద్దరికీ ఫీజులు కట్టలేక. అరుణ్ అప్పుడప్పుడు కొత్త బూట్లు, కొత్త స్కూల్ సంచీ కావాలని గొడవ చేసినప్పుడు వాడికి ఎలాగో సర్దిచెప్పి చిన్న మరమ్మత్తులు చేస్తుంది జానకి. స్కూల్ కి సెలవులు ఇచ్చారు. పాతకాగితాలు, చీపురుపుల్లలు, జిగురు సీసా దగ్గర పెట్టుకుని గాలిపటము తయారు చెయ్యాలని తంటాలు పడుతున్నాడు అరుణ్. పొద్దున్న స్కూల్ నుండీ వచ్చేటప్పుడు దుకాణములో చూసిన రంగు రంగుల కొత్త కొత్త బొమ్మలతో తయారైన గాలిపటాలు గుర్తొచ్చాయి.
అవి ఎంత బాగున్నాయో అప్పటికి ధర ఎంత అని అడిగాడు. 25 రూపాయలని చెప్పాడు దుకాణదారు. అమ్మో అన్ని డబ్బులా? అలాంటి ఒక్క గాలిపటము కొనుక్కుంటే ఎంత బాగుంటుంది? అయినా ఎలా? చూస్తూ చూస్తూ అమ్మను అడగాలి అంటే భయమేసింది. పాపం. అమ్మ ఎంత కష్టపడుతోందో సంక్రాంతికి ఎక్కువ బట్టలు కుడితే ఎక్కువ డబ్బులు వస్తాయని పగలూ రాత్రి కష్టపడుతోంది. కోసిన పంట అంతాచేతికి రావాలని ఏ ఆటంకాలూ లేకపోతే ఈ సారి పండగకు చేతిలోకి డబ్బు వస్తుంది అనుకుంటూ రామయ్య పగలూ రాత్రి పొలం దగ్గరే పని చేసుకుని వీలైనప్పుడు తినడానికి ఇంటికి వచ్చి అక్కడ పొలములోనే పడుకుంటున్నాడు కాపలాకాస్తూ.
ఆ రోజు రామయ్య అనుకున్నాడు. ఈ సారి సంక్రాంతికి ఎలా అయినా జానకికి రెండు చీరలు కొనాలి. తను ఇది కావాలి అని ఏనాడు అడగలేదు. ఉన్నదానితోనే సర్దుకుపోతూ పిల్లలకు కూడా చెప్పి ఇంటిని పొదుపుగా నడుపుతోంది ఉన్నంతలో. ఇలా ఆ కుటుంబము లో అందరూ సంక్రాంతి పండగ కోసము ఎదురుచూస్తూ ఉన్నారు. రామయ్య వాళ్ళు ఉంటున్న ఇల్లు కూడా తరతరాలనుండీ ఉన్న పెంకుటిల్లే. పాతది కస్బట్టి అప్పుడప్పుడు చిన్న మరమ్మత్తులు చేసుకుంటూ వాసయోగ్యముగా చేసుకుని గుట్టుగా ఉంటున్నారు.
రామయ్యకు చదువు ఎందుకో చిన్నప్పుడు చదువు అబ్బలేదు. రామయ్య తమ్ముడు రమణ బాగా చదివేవాడు. రామయ్య మాత్రము తండ్రి కష్టము చూసి రోజూ ఆయనతో పాటూ పొలముకు వెళ్తూ పని నేర్చుకున్నాడు ఇంట్లో అమ్మకు సాయం చెయ్యడం. తండ్రి నుంచీ అతనికి వారసత్వంగా మిగిలింది ఇప్పుడు ఉంటున్న ఇల్లే. తమ్ముడు రమణ ఉద్యోగములో చేరాక ఇల్లు రామయ్యనే ఉంచుకోమన్నాడు తనకు వాటా అవసరము లేదన్నాడు.
సంవత్సరానికి ఒక సారి వచ్చి అందరినీ కలిసి వెళ్తూ ఉంటాడు. అన్నదమ్ములు, తోడికోడళ్ళూ కలిసిపోయి సరదాగా ఉంటారు. అందువలన వేరే గొడవలు ఏమీ లేవు. జానకి కూడా ఉన్నంతలో మర్యాదలు, ఆర్భాటాలు, హంగులు చేయక ఇంటిని ప్రశాంతముగా ఉంచుతుంది. ఈ సారి మాత్రము. సంక్రాంతికి పిల్లల కోరికలు తీర్చాలి అనుకుంది జానకి. ఇంతలో తపాలాబంట్రోతు ఒక ఉత్తరము ఇచ్చాడు. అది రమణ రాసినది.
తను కుటుంబము తో ఆ ఊరు సంక్రాంతి పండగకు వచ్చి వారము రోజులు ఉంటామని. ఇదితెలిసి రామయ్య, జానకి ఈసారి వాళ్ళు రాకుండా ఉంటే బాగుండును అనుకున్నారు మనసులో. వాళ్ళు వస్తే అదనపుఖర్చు. పైగా ఈ సారి కూడా సంక్రాంతికి తము అనుకున్నవి కొనడము కుదరదు. అసంతృప్తిగా అనిపించింది జానకికి కూడా.
ఏమి చెయ్యాలో అనే ఆలోచనలో పడింది. ఇక్కడ సమస్య ప్రేమలు లేక కాదు, శ్రమకు భయపడి కాదు, చాలినంత సంపాదన లేకపోవడము. నాలుగు రోజులు గడిచాయి. పండగ దగ్గర పడింది అని బూజులు దులపడము మొదలు పెట్టింది జానకి. చివరిగా పూజ గదిలోకి వెళ్ళింది. ఆ గదిలో. ఎప్పటినుండో ఒక మూల చిన్న ట్రంక్ పెట్టె తాళము పెట్టి ఉంటోంది. తాళము చెవి కనపడక, కొంత ఆ పాత పెట్టెలో ఏమి ఉంటాయిలే అనే అశ్రద్ధతో ఎవరూ దానిని తీసే ప్రయత్నము చెయ్యలేదు.
జానకికి ఆ రోజు తీసి చూడాలని పించింది. సుత్తితో నెమ్మదిగా తాళము పగలకొట్టి మూత తీసింది. గట్టిగా ఊపింది పెట్టె. గలగలమని శబ్దము వచ్చింది. నెమ్మదిగా ఒక్కొకటి తీసింది. ముందు పాతకండువా, చిరిగిన జరీ చీర, కొన్ని గవ్వలు, చెక్క బొమ్మలు 'ఓస్! ఇవా?' అనుకుంది జానకి. దులుపుదాము అని పెట్టె లో చెయ్యి పెట్టింది. చేతికి చిన్న మూట తగిలింది. మూట కట్టిన బట్ట చిరగడానికి సిద్ధం గా ఉంది. తీస్తూ ఉంటేనే చిరిగి పోయి దానిలో ఉన్న బంగారు నాణేలు కొన్ని వెండినాణేలు కింద పడ్డాయి.
వాటిని చూడగానే "ఏమండీ ఇటు రండి" అంటూ అప్పుడే వచ్చిన రామయ్యను పిలిచింది.
"వస్తున్నా, అంతా తొందరే" అన్నాడు రామయ్య మొహం, కాళ్ళూ చేతులూ కడుక్కుంటూ.
"ఏమిటమ్మా?" అంటూ పిల్లలు కూడా వచ్చారు.
"ఒక సారి రమ్మంటే అర్థం కాదా?" అరిచినట్లే పిలిచింది జానకి.
రామయ్య మొహం తుడుచుకుంటూ వచ్చాడు. ఎదురుగా ఉన్న బంగారు నాణేలు, వెండివి చూసి ఆశ్చర్య పోయాడు. జానకికి నోట మాట రాలేదు కొంచెము సేపు.
"ఏమిటమ్మా ఇవి?" అని పిల్లలు అడిగారు.
జానకి ఒక క్షణం తెలివి తెచ్చుకుంది. "ఇవి మనకు దేవుడు ఇచ్చాడు. మీకు కావలిసినవి కొనిపెట్టమని. కానీ ఈ విషయము ఎవరికీ చెప్పద్దు అన్నాడు."
"ఇంక మీరు వెళ్ళి ఆడుకోండి" అని చెప్పి పిల్లలను పంపించివేసింది.
రామయ్య జానకి తెలివిని మనసులోనే మెచ్చుకున్నాడు.
"చూడండి, ఇది మీ తాత ముత్తాతలు దాచినది. దీనిలో నుండీ కొంత తీసుకుని అవసరాలకు మాత్రమే ఖర్చు పెడదాము. ఈ విషయము ఎవరికీ చెప్పనవసరము లేదు."
రామయ్య కు కూడా జానకి చెప్పింది నిజమే అనిపించి, "అలాగే, నువ్వు చెప్పినట్లే చేద్దాము" అన్నాడు రామయ్య.
జానకి అన్నీ సర్ది ఆ పెట్టెలోనే పెట్టి రెండు బంగారు నాణేలు తీసింది. ఇద్దరి మదిలో సంతోషము. ఈ సారి సంక్రాంతి జీవితములో నిజమైన క్రాంతిని ఇచ్చింది అనుకున్నారు. ఇద్దరూ కలిసివచ్చిన అదృష్టమును తలచుకుని మురిసిపోయారు.
***
నంద్యాల విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: నంద్యాల విజయలక్ష్మి
ఊరు. హైదరాబాదు
నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము బి.ఇ. డి
చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను .
రెండు వందలపైగా కవితలు మూడుకథానికలు రాసాను
యాభై పైగా సర్టిఫికెట్స్ సహస్రకవిమిత్ర బిరుదు పొందాను .
పుస్తకపఠనము పై నాకు ఆసక్తి .
విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను .ఇంకా ఎన్నో చదవాలని కోరిక .




Comments