కలియుగ గరిమ శతకము
- Sudarsana Rao Pochampalli

- 13 hours ago
- 9 min read
#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #AmruthaDharaSathakamu, #కలియుగగరిమశతకము, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Kaliyuga Garima Sathakamu - New Telugu Poems Written By - Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 23/01/2026
కలియుగ గరిమ శతకము - తెలుగు శతకము
రచన : సుదర్శన రావు పోచంపల్లి
(1)శ్రీలు పొంగిన ఈదేశ శీల మెంతొ
చెడుపు జెందుచు జనమందె చెదలు బుట్టె
జనము మనసులో దురితమే జపము ఆయె
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(2)నేటి మనిషికి నీతులే నేర మగును
తనకు దోచిన విధములే తనకు గాని
పరుల మాటలు చెవికెక్క పనికి రావు
కనుము మానవా కలియుగ గరిమ మెంతొ
(3)ఉప్పు పప్పులు దినుసులు ఊర గాయ
తప్పు మాటలు గప్పాలు దెప్పు డింక
నేటి వ్యాపార విధములు నేర మనరు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(4)పాల బుగ్గల పసివారి పాలు గూడ
నేర చరితుల జాబితా నెక్కె నేడు
కాదు ఏదియు కలుమష కార కంటు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(5)ఓటు అనగను పండుగ ఓటు ఉన్న
వారు వీరును అననేల వాద మేల
కోటి నుండియు కోట్లకు కొనెద రోటు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(6)తల్లి దండ్రులు బ్రతికుండ దలువ కుండ
మరణ మొందగ శ్రాద్ధపు మనసు బెట్ట
పాటు బడువాని జూడగ పాప భీతె
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(7)అన్న దమ్ములు సతతము తన్ను కొనుచు
అదుపు ఆజ్ఞయు లేకను అరుచు కున్న
తల్లి దండ్రుల బాధించు తల్ల డిల్ల
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(8)ఇంటి కెవరిని రానీక కుంటి సాకు
చెప్పు చుందురు అదియొక తప్పు గాద
మంది వచ్చుచు పోవగ మనకె మంచి
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(9)కోటి కోర్కెలు నిత్తెము కోరు కుంటు
అమ్మ నాన్నల వేధించు సమ్మ తేల
నీకు నీవుగ సాధించ నీకె కీర్తి
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ.
(10)మగువ గనగానె మగవాడు మనసు పడుచు
ఆమె వెంటనె తిరుగుచు అడుగు ప్రేమ
కాదు పోదన్న వినడింక కాల్చ జూచు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(11)మోస మెంతయొ జేసేడి మోస గాడ్రు
ఎచ్చు తగ్గుల భేదాలు ఎన్న కుండ
బంధు మర్యాద సైతము బంధ మనరు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(12)ఏమి జదివెనో పోతన ఎవరి కెరుక
భాగ వతమును వ్రాసెను బాగు గాను
అట్టి గ్రంథాలు ఈనాడు అనగ లేవు
కనుము మానవా కలియుగ గరిమ మెంతొ
(13)కొడుకు బిడ్డలు ఉండంగ కొడుకు లేమొ
తల్లి దండ్రుల పోషణ తగదు అనుచు
వృద్ధ ఆశ్రమ మునజేర్చ పెద్ద తప్పు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(14)మహిళ లందున దాష్టీక మనెడు భావ
నున్న మగవాడు మనుషని నెన్న కుండ
యతని సంఘవి ద్రోహియె యనగ తగును
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(15)చేత బడియంటు మనుషుల చెండు వారు
మృగము లందున మానవ మృగము లనగ
ఉచిత శిక్షలు యనగను ఉరియె తగును
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(16)ఘల్లు ఘల్లను క్వణముతొ గంతు లేయు
ఆడ బిడ్డింక అత్తింట అడుగు లిడను
పోవు చుండగ ఇల్లంత బోసి పోదె
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(17)సృష్టి యందున మానవ సృష్టి యెంతొ
మేధ యుండియు భోగించ మేది యందు
వనరు లుండగ తగవుల వరుస లేల
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(18)పుల్ల దైనను తింత్రిణి పుల్ల దనుచు
తినక యుందుమ పులుపైన తినగ తగును
తనయు డటులనే దుష్టైన తనరు సాక
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(19)ఆలు గొడ్డను అపవాదు ఆమె కేన
నీదు లోపము కూడను నీకు దెలియ
వాదు లాటలు నీవింక వదలు కొమ్ము
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(20)చేగ లమెకము చెడుపగు చేష్ట లగని
మకర మొచ్చియు పట్టెను మత్త ఇభము
ఎవరి చోటను వారున్న ఎగ్గు అగున
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(21) కోటి పనులేవి జేసిన కూటి కొరకె
చదువు లెన్నియు జదివిన చేత నొంద
పంట పండించ మనకును పరుల కింక
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(22)జామ చెట్టెక్క నునుపుతో జారు చుండు
చింత చెట్టెక్క లేదింక చింత యనగ
మాన వుండైతె మదిగని మాట తగును
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(23)నిధుల కొరకని బలియంటు నిమిష మైన
చలన మనకను ఇతరుల చదుప బూన
నీకు మరణమే మిగిలుండు నిధుల కన్న
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(24)లేత పిందెల దెంపేయ లేశ మైన
కనిక రంబును లేకున్న కనము ఫలము
కడుపు నుండగ జీవిని కడపు టంతె
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(25)కుక్క విశ్వాస మనగను కూడు దినుటె
కూడు దిన్నను మనిషియే కూళు డగును
జంతు వైనను నయమేను జకుట మనగ
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(26)పక్ష మొచ్చిన వెంటనే పక్షు లెగురు
అధిక చదువులు జదివించ అరుగు దురిక
కొడుకు కూతురు పరదేశ కొలువు కొరకు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(27)అద్ద మందున ముఖమును దిద్దు కొనెడు
విధము మనుజుడు సుగుణుండు విద్దె లెంతొ
నేర్చి నతనితొ విద్యను నేర్వ మేలు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(28)అపరి శుభ్రము తిండిని అడిగి తినుట
కన్న ఆకులు అలములు కాన నంబు
కలుగ తినుటయే మనిషికి కలుగు సుఖము
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(29)దీవ నెప్పుడు పెద్దల దీసు కోగ
క్షామ ముండదు బతుకంత క్షేమ మేను
వారి దీవెనె నీకుండు వాద మేల
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(30)మాదు నాన్నర తినురోయి మారు ముద్ద
అనుచు బతిలాడి లాలించి అమ్మ బెట్ట
అట్టి తల్లిని గనకుండు పుట్టు కేల
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(31)కుంభి నందున ఏదేని కుళ్ళి పోగ
విత్త నంబులు మాత్రము ఉత్త గావు
అదియె మహిమలు అనగను అవని యందు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(32)లోహ మందున ఉత్తమ లోహ మనగ
కనక మనెదరు మగువల కాంతి బెంచు
కవుల పండిత కేయూర కనక మేను
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(33)బూడి దన్నను గాడిద బురద యన్న
కొమ్ము కాడును పొరలును కొదువ యనక
నీచు డటులనె మలినము నేర కుండు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(34)ఒక్క దేవుని నమ్మక ఓపి కనుచు
పెక్కు గుడులను దిరుగగ దక్కు నేమి
అంత రంగము నుండగ అంత రాత్మ
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(35)మేను వంపులు సొంపులు మించు బోడి
పదుగు రెదుటను పలుమార్లు పనిగ జూప
కలుగు యువకుల మనసిక కలుషి తంబు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(36)పుడమి యందున స్త్రీలును పురుషు లున్ను
సరిస మానము మనసుతొ సరస నుండ
తప్పు జేయగ ఇరువురి తప్పె యగును
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(37)పొగడ తగునిక మనదేశ పొడవు లన్ని
ఇతర డేశము లందున ఇతరు లినగ
ఘనత అన్నింట మనదని ఘనము గాను
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(38)యుద్ధ నీతిలొ కనికరం యుక్త మనరు
శత్రు సంహార మొకటియె శత్రు తోడ
సమర మనగను జరుపగ సమసి పోవు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(39)కోమ లినికన అందము కోప ముఎల
భామి నికినియు శీలము బారె డుండు
చికుర జాలంబు తోడుగ చిరుత నవ్వె
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(40)భాష రాకను పరదేశ బాట బట్ట
అడుగ డుగునను అవరోధ అగుచు నుండు
తిరుగు పయనంబు కనబోగ తిప్ప లౌను
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(41)ఆడ మగవారు అనుభేద అనక యున్న
ఇంటి సంసార మంతయు కంటి కింపు
అంద రొక్కొక పనిజేయ అగును సుఖము
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(42) కాచ పాలకు తోడుతో కాగ పెరుగు
పెరుగు చిలుకగ వెన్నయు పెకిలి వచ్చు
జపము తోడనె గననగు జంగ మయ్య
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(43)దేవు డాడించు ఆటలో దేహి కికను
ప్రార బ్దమనుస రించియు పాత్ర యుండు
దేవు డదియును మెచ్చగ దేహి దివికె
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(44)భూత దయయును మనిషికి భూరి తొడవు
జీవ కారుణ్య మెపుడును జీవి పూచి
దైవ చింతన కన్నను దైవ మదియె
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(45)తోట కనుచును నీరిచ్చు తోట మాలి
నీటి వనరులు తగులగే నీయు ఫలము
చదువు వలననే బతుకులు చక్క బడును
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(46)గురువు లతిరస ఫలభార తరువు లనగ
కరువు కింకని చెరువులు కనగ వారు
తరుగ నివెలుగు నిచ్చెడి తరణి యనగ
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(47)వచ్చె బతుకమ్మ పండుగ తెచ్చె శోభ
విచ్చె విరులన్ని బతుకమ్మ విజయ మొంద
తరణు లందరు ఆడేరు తనివి దీర
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(48)నీతి నీచెంత నున్నను నీకె ఖ్యాతి
పరువు మర్యాద పనులనే పరుచ తగును
నీడ నిచ్చెడి చెట్టునే మాడ రక్ష
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(49)గర్వ మించుక లేకను గడుప బతుకు
జనుమ సార్థక మగునీది జగము నందు
మధుర ఫలముల వృక్షాలు కుదురు వోలె
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(50)తేనె లొలికెడి పలుకులు తెలుగు నందు
కనగ తునకలు అవియును కనక మోలె
గుండ్ర ముత్యాల లిపితోడ గుబ్బతిల్లు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(51)దాన మందున త్యాగము దాగి ఉంది
ధనము పంచగ మానవ దరుమ మగును
సాటి వారికి చేసెడు సాయ మదియె
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(52)ఇంటి అందరి లోనను ఇంత ఎదుగ
గరువ మొక్కింత గలుగుచు గరకు మాట
లనుచు నిర్లక్ష్య ధోరణు లనగ చేటు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(53)చెడుపు అన్నది ఎపుడును చెదలు తీరు
పడుపు వృత్తియు చెడుపగు పడతు లందు
మంచి మార్గము నరులను ముంచ బోదు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(54)ఆప దొచ్చిన పరులైన ఆదు కొనగ
మనుజు లందున మర్యాద మనుచు నుండు
పాద పమువలె మైత్రియు పాదు కొనును
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(55)పచ్చి గడ్డైన సింహము పట్ట బోదు
మాంస భక్షణె దానికి మంచి తిండి
భాగ్య వంతున కటులనే భారి తిండి
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(56)విందు భోజన మునుబెట్ట విస్త రేసి
కులము ఏదని పంక్తిలొ కులము అడుగ
కలత జెందుచు చుట్టాలు కదలి పోర
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(57)లేకి వానికి సిగ్గన లేక యుండు
తిర్రి వేషాలు వేయుచు తిరుగు చుండు
ఎంగి లైనను కాకోలె ఏరి తినును
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(58)చావు పుట్టుక గనగను చాల యున్న
కాల మొక్కటి నిలకడే కాన నింక
గ్రహము లన్నియు గదులగ గలుగు వేళ
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(59)ఇంద్రు చెంతన యున్నను ఇక్క టేల
తలచు కుక్కలు బొక్కలు తనర దినుచు
బొడ్డ గీడుయు దినుచుండు భోక్త లందు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(60)కార ణంబులు లేకను కార్య మనరు
నిప్పు లేకుండ నివురుయు గప్ప బోదు
పిల్ల లేకుండ పెళ్ళని పిలిచి నట్టె
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(61)పెళ్ళి కాగనె ఇల్లాలు పెనిమి టిగని
వేరు కుంపటి బెట్టను వేగు దమను
అట్టి వారుండ సంసార గట్టి యేమి
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(62)ప్రకృతి సంపద జాతికి ప్రకృతి ఈయ
ధనికు లమనుచు తామేను ధరణి సొత్తు
పంచు కొనజూడ ప్రజల పంచ నెవరింక
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(63)ప్రజల సంక్షేమ మెరుగని ప్రభుత యేల
సజల నయనాల తోనుండ సరస మేల
రోగ గ్రస్తుకు భోగాల యోగ మేల
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(64)ప్రజలు మొత్తుక చచ్చిన ప్రబుత కేమి
ఓట్ల బాగోత మొక్కటె ఓంప్ర థమము
నీతి నియమాలు ఎన్నడొ నీరు గారె
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(65)కలరు సన్యాసు లెందరో కలియు గాన
బవిరి గడ్డాలు బెంచుచు భజన లంటు
భక్త కోటిని దోచుచు ముక్తి అంద్రు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(66)ఒకని ముఖమును జూడగ ఒంద కీడు
ఇతని ముఖమును జూడను అతని కొందు
ముఖము లందున తప్పన మూర్ఖ మగును
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(67)పిసిని గొట్టును జూచుచు పిల్ల లైన
నవ్వు కొందురు వీడేమి నరుడు అంటు
మనిషి కౌచితి బుద్ధియె మన్న నగును
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(68)కొలవ ధాన్యము మరిమరి కొలువ బూన
కొలువ కొలువగ కొంతైన కొరత యుండు
అధిక మర్యాద తోడను అలుసు గూడ
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(69)పెద్ద పులినోట తలబెట్టు పెద్ద లున్న
కొంద రుందురు మగవారు కొంగు గనగ
భార్య కాబోలు అనుకుంటు భయము తోడ
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(70)కెరట ముపడును లేచుచు కడలి యందు
పుడమి నందుచు వెనుకకు పోవు చుండు
ఆశ పాశము మనిషికి అలల బోలు
కనుడు మానవా కలియుగ గరిమ తీరు
(71)ఆలు సొత్తును దోచియు ఆట వెలది
కంద జేయగ ఆలియు కుందు చుండ
పాండు రంగని భక్తుని పాటు లుండు
కనుడు మానవా కలియుగ గరిమ తీరు
(72)మోడు వారిన చెట్టుయు మొగ్గ దొడుగ
కూడు లేకయు యుండక కుక్క మొరుగు
తిండి లేకను మనిషియే తిరుగ లేడు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(73) సాన మందులు బోయొచ్చె సూది మందు
షోడ శదినము పెండిలి షోకు బాయె
కాల మందున మార్పులు కాన వచ్చె
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(74)పనులు జేయుచు అడియాస పడుట తగదు
తావు ఈయదు సత్కృతి తనర దింక
పొంగు తోడనె ఫలితము పొంద నగును
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(75)పుడమి మహిమలు గనగను పుట్ల కొద్ది
విత్తు ఏదైన అందీయు వివిధ గుణము
రూపు వాసన రుచియును రూఢి గాను
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(76)జీవ జాలము పృథ్విలో జీవ మొంద
ఉండ నరులును అందులో ఉత్త ములన
చెడ్డ వారుందు రందులొ చెదలు తీరు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(77)ఒకరి కొకరిలొ చేదోడు ఒనరు నుండ
మనుషు లందున అభివృద్ధి మన్ని కగును
తేనె టీగల సహకార తీరు వోలె
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(78)మనిషి బతుకేది శాశ్విత మనగ లేదు
ఉన్న కాలము నందునె ఉచిత రీతి
బ్రతుకు పరమార్థ మెరుగుచు బ్రతుక మేలు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(79)ఉద్ద తునికేల ఉపకార ముద్ద రించ
ఆర్తి గలవాని కేసేయ కీర్తి దక్కు
ఉచిత నుచితాల నెరిగియే ఉచిత మనగ
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(80)దొంగ సొమ్ములు అగ్గువ దొరక కొనగ
దొంగ పొందెడు శిక్షలు దొరల నుండు
ముప్పు రాకుండ ప్రియమైన ముదము కొనుము
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(81)మనిషి దూరము అవగను మమత బెరుగ
ముదిమి మీదను పడగను మనసు మారు
సత్తె మనగను ఇదియేను సతత మంతె
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(82)అంగు లేనగు అర్థాంగి పొంద నింక
ఉల్ల మందున గృంగుచు తల్ల డిల్ల
బతుకు భారము అగునింక బతుక లేరు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(83)దాన ధర్మాలు జేసిడి దాత గనగ
దయయు సత్తెము అతనిలో దాగి యుండ
దాన మాపడు ధవళాంగి ధరుడు సెప్ప
కనుము మానవా కలియుగ గరిమ మెంతొ
(84) ధరలు పెరుచును నుండగ ధరణి యందు
ధిషణి ధరగూడ పెరిగెను దివిని అంట
పేద వాడింక పేదగ పెరుగు నట్టు
కనుడు మానవా కలియుగ గరిమ యెంతొ
(85)సాటి మనిషిని సమముగ సత్క రించ
సంఘ మందున మర్యాద సంత రించు
యాచ కుండైన మనిషియే ఆద రించ
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(86)మరువ కెపుడును నీఊరు మదిలొ నింక
కన్న తల్లియు నంతనె కనగ సుఖము
ఊరు వాడయు తల్లియు ఉన్న తనుము
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(87)పొగుడు గురువును ఎదుటనే పొగుడు బంధు
జనుల వెనుకగ ఇకనేమొ జరుగ పనులు
పొగుడు పటలము తగదింక పొగడ సుతుల
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(88)అబల కాదింక అంగన అనగ ధీర
అన్ని రంగము లందున అతివ నేర్పు
కనగ వినగను కడుగొప్ప కలికి నేడు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(89)పాత చెప్పులు అరుగంగ పార వైచి
కొత్త చెప్పులు కొందురు కోరు కుంటు
కామ వాంఛలు దీరగ కామి నంతె
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(90)తరువు తీయని ఫలములు తనర నీయ
తరువు మెప్పును బొందగ తగిన కీర్తి
తనయు లెంతగ బుధులైన తండ్రి కేను
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(91) ఆడ పసికందు చూడగ ఆగ దింగ
కౄర పురుషందు మనసున కౄర మేను
కౄర పులికన్న మనిషియే కౄరు డనగ
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(92)తిండి లేనిది అవనేది తిరుగ లేదు
జీవ జాలము తినకను జీవ మేల
మనిషి చేసిన యంత్రము మయిన నంతె
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(93)దివము నేలన నీటిలొ దిరుగు చుండు
ప్రాణు లేవైన వ్యాధుల పాలు గావు
మాన వునికేను రోగాల మాట యనగ
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(94)కలహ మెపుడును మనిషికి కలుగు చేటు
కలసి మెలసుండ సుఖములు కలుగు చుండు
కనక రతనాలు పొదుగగ కలుగు శోభ
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(95)రోగ మొచ్చిన మందీయ రోగ మణుగు
బాధ లొచ్చిన సాంత్వన బాధ లణుగు
మాయ రోగము అనగను మందు లేదు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(96)జనని జనకులు జగమున జనుమ నీయ
కదులు దేవత లనవారు కనగ నుంద్రు
కాన నిరతము సేవించ కలుగు జయము
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ.
(97)తోవ వెంటన నడుచుచు తోయ జాక్షి
కనగ మనసున దుర్బుద్ధి కలుగు మనిషి
కౄర మృగముక న్ననునింక కౄర మృగము
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(98)కుటిల కుంతల కురులను కుదుర జేయ
దువ్వె నాడించి వీధిలో దువ్వు చుండ
కనగ మగవారి మదినింక కదలు చుండు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(99)అతిగ వినయము మర్యాద అతిగ జేయ
కనెడు వారికి వింతగ కనగ నుండ
ధూర్త లక్షణము అనుచు దూర ముంద్రు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(100)అద్ద మందున చూడగ అంద మనగ
చికుర జాలము రంగద్ద చిరువ యసుయు
కోర రావింక కోల్పోవు కొదమ తనము
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(101) భావ రాగము తాళమె భరత నాట్య
మనగ ప్రాముఖ్య మైనది మనకు దెలియ
కూచి పూడేమొ బుట్టెను కుపిత మందు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(102)కాలు విరిగిన కట్టులు కట్ట వచ్చు
చేయి విరిగిన చేదోడు చెప్ప వచ్చు
మనసు విరిగిన మనిషిని మార్చ రాదు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(103)నేర చరితము గలవాడు నేర వృత్తె
ఎన్ను కొనుచుండు బతుకింక ఎదుగ లేక
కులట అటులనె కులుకును కులము చెడుప
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(104) కడుపు నిండుగ దిన్నింట కన్న మేయ
నీచ బుద్దికి వారింక నీచు డనుచు
చీద రింతురు దరికింక చేర కుండ
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(105) జిహ్వ రుచులను గనిపెట్టు జీర్ణ మవగ
జిహ్వ లేకున్న జీవికి జీవ నేది
జిహ్వ అదుపుండ నయమెంతొ జీవి తాన
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(106) పురుష ఆధిక్య మనుపేరు పురుషు కేల
మగువ కేనింక మరియాద మన్నికగును
మగువ ఆధిక్య సంస్కృతి మనది గాగ
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(107)జాత కాలను పిచ్చితొ జనము సతము
జోస్యు లందున నమ్మిక జూడ నుంద్రు
జాత కాలేను తమకింక జాగ్ర తంద్రు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ
(108) భార్య లేనట్టి మనిషికి బాధ జాస్తి
పిల్ల లెరుగను తలిదండ్రి తల్ల డిల్లు
ఎవరు లేకుండ సుఖమును ఎరుగ రెవరు
కనుడు మానవా కలియుగ గరిమ మెంతొ.
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.




Comments