కనక ధారా శతకము
- Sudarsana Rao Pochampalli

- Sep 16
- 9 min read
#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #KanakaDharaSathakamu, #కనకధారాశతకము, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Kanaka Dhara Sathakamu - New Telugu Poems Written By - Sudarsana Rao Pochampally
Published In manatelugukathalu.com On 16/09/2025
కనక ధారా శతకము - తెలుగు పద్యాలు
రచన : సుదర్శన రావు పోచంపల్లి
(1) శ్రీలు పొంగ నీది సేగి కనబడదు
శ్రామికులె నిరంతర శ్రమ జేయు
తేటి లన్ని తేనె తెచ్చిన విధముగ
కనగ నాదు మాట కనక ధార
(2) అగ్గు వంటు దిన్న అదియును చెడుపగు
కష్ట పడ్డ తిండె కనగ సుఖము
దొంగ సొమ్ము గూడ దొరయును ఇడుములు
కనగ నాదు మాట కనక ధార
(3) వ్యాఘ్ర చెంత జేరి వాలము చేబూన
గాండ్రు మంటు పైకి గదిలి వచ్చు
మూర్ఖు చెంత నట్టె ముదమన బోరాదు
కనగ నాదు మాట కనక ధార
(4) ఆత్మ హత్య అన్న అదియొక నేరము
దాని నాప బూన దగును నెపుడు
మనసు యెరిగి ఇకను మసలుట నయమగు
కనగ నాదు మాట కనక ధార
(5) చేతి బదులు కూడ జ్ఞాతిని అడుగకు
చులుక నగుదు వింక చూడ కుండ
పజ్జ నవ్వు నవ్వు పైకము లేదంటు
కనగ నాదు మాట కనక ధార
(6) నిప్పు నెప్పు డైన నెరుగక తొక్కిన
కాల కుండ బోదు కాస్త నయిన
తప్పు తెలువ బోక తనరించ నేరమె
కనగ నాదు మాట కనక ధార
(7) భర్తిక చని పోవ భార్యకు పెండ్లేల
అనెడి నాటి మాట అనుట తగదు
లక్ష ణంగ ఆమె లగ్గము మేలగు
కనగ నాదు మాట కనక ధార
(8) ఆడ పిల్ల బుట్ట అణుచుట తగదను
నీదు తల్లి ఆడ నికను భార్య
ఆడ లేక నీదు అడపొడ నెచటిగ
కనగ నాదు మాట కనక ధార
(9) అమ్మ నాన్న మీద అలకలు గనపడ
ప్రేమ చిహ్న మంటు పెనగొనంగ
ఆలు మీద జూపు అలక చేటగునిక
కనగ నాదు మాట కనక ధార
(10) పెంట మీద తులసి పెరిగిన మనసిడి
ఇంట కోట గట్టి ఇంపు యనగ
ఇంట చెదలు బుట్ట ఇంపు యేలనదగు
కనగ నాదు మాట కనక ధార
(11) పైస క్రింద బడ్డ పైసల కొరకును
వెదక బూను చుండు వెతలు బడుచు
దస్త్ర మెదుక మన్న తగదు తగదనును
కనగ నాదు మాట కనక ధార
(12) చదువు ఉండి గూడ సంస్కార మెరుగడు
చదువు లేక గూడ చనువు గుండు
ఇరువు రందు భేద మినుముయు కనకము
కనగ నాదు మాట కనక ధార
(13) ఇరువు వదిలి ఇకను ఇగురము గనకను
తీరు మార లేని తిరుగు బోతు
తనువు వంచి పనియె తగదన దరుమమా
కనగ నాదు మాట కనక ధార
(14) దేహ శుద్ధి లేక దేవునిని గొలువ
భక్తి లేని చోట భజనలు యును
ముక్తి యేల వచ్చు ముదమున మనిషికి
కనగ నాదు మాట కనక ధార
(15) పాడి ఆవు చెంత పాలు పితుకుచును
దూడె నెండ బెట్ట దరుమ మెటుల
నీకు తిండి లేక నీదు బతుకెటుల
కనగ నాదు మాట కనక ధార
(16) పాతి జావ నేడ్చు పాలుషి గనుచును
తాళి బొట్టు గాజు తగదు యంటు
జాలి లేని వారు జనమన తగుదుర
కనగ నాదు మాట కనక ధార
(17) జాతి సొత్తు తిండి జగముయు దెలియగ
పొట్ట నిండ మెక్కి పొగరు తోడ
తినగ మిగులు నింక దీసేయ తగదిక
కనగ నాదు మాట కనక ధార
(18) తల్లి తండ్రి ముసలి తనమున మసలిన
గోము తోడ వారి కొలువు సేయ
మాత పితరు దీవె ముదమన దొరకొను
కనగ నాదు మాట కనక ధార
(19) పూట కొక్క మాట పాటియు యనబోరు
మాట తీరు లోనె మర్మ మెరుగ
మంచి మాట లున్న మనిషియె మనిషగు
కనగ నాదు మాట కనక ధార
(20) శుంఠ కాయ జూడ శూన్య జ్ఞానియనగ
ఆండ ఏది లేని చండి యతడు
దండి మాట విన్న దడయుట కననగు
కనగ నాదు మాట కనక ధార
(21) పంచ భాష ఖ్యాతి నెంచ లోకమునను
ఆంగ్ల హింది స్పానిషారబి చయిన
ఏడు వేల భాషలందేది తెలుగిక
కనగ నాదు మాట కనక ధార
(22) దేశ భాష లందు దెలియ తెలుగుయును
లెస్స అన్న నేడు లేదు తెలుగు
ఆంగ్ల భాష మోజు అణచుట వలనను
కనగ నాదు మాట కనక ధార
(23) కాలు చేయి మెడయు కాంచగ నికనును
కౌను కేశ వీధి కర్ణ నకుట
కాంచ నంబు దొడుగ కలముడు ఒలుచును
కనగ నాదు మాట కనక ధార
(24 రూప్య మొక్క టైన రూకలు శతమన
చాల ఉన్న వంటు చాలు అనగ
లెక్క తెలువ నోడి లెక్కయిదనెదరు
కనగ నాదు మాట కనక ధార
(25) చెడ్డ దేది యైన చేయ విడుపులన
త్యాగ మెంత కాదు తప్పు అనగ
మెప్పు పొందు కన్న ముప్పు అనబడును
కనగ నాదు మాట కనక ధార
(26) మొండి వాడు మాన మొరటు అ తనినియు
చూచు చున్న వారు చూపు మరలి
రోక లింక చిగురు రోసియు ననెదరు
కనగ నాదు మాట కనక ధార
(27) నిప్పు సాక్షి పెళ్ళి నిగ్గు అయిననిక
జాయ వీడి వండ జాడ లెతుక
పొన్ను వీడి బీడు పొంది నటులగును
కనగ నాదు మాట కనక ధార
(28) ఇంచు బోడి కంద మింపగు అలకలు
మాను శోభ జూడ మాను విరులె
ముంగి టందు ముగ్గు ముదముగ గనపడు
కనగ నాదు మాట కనక ధార
(29) జిబ్బ డాయి గాన జిబ్బు తిమిరమున
ఆట లాడు చుండు అలుపు లేక
అంటు గాడు అట్లె అంగలు వేయును
కనగ నాదు మాట కనక ధార
(30) విశ్వ మంత దిరిగి విజయము సాధించి
రాయి రప్ప మ్రొక్కి రాత్రి పగలు
తల్లి తండ్రి గాన తగదన తనయుడా
కనగ నాదు మాట కనక ధార
(31) గాదె నిండ ధాన్య గాలి కొదిలియును
పేద బీద గోర పెట్ట గనక
కొక్కు దిన్న నింక దక్కునదునుకయె
కనగ నాదు మాట కనక ధార
(32) ఆలి గూడ అమ్మ అవతార మెయనగ
అమ్మ ఎంత గొప్ప ఆలి నడుగు
అమ్మ ఆలి బిడ్డ ఇమ్మహి అమరులు
కనగ నాదు మాట కనక ధార
(33) దుంధు మార జంపి దూసిన దారమే
పట్టు బట్ట గాను పుట్ట మమరు
అట్టి కోక గట్ట అతివలకు హితమా
కనగ నాదు మాట కనక ధార
(34) మంచి రోజు లేక పంచాంగ దహనము
చేయ నేర మింక చెడును బనులు
ఇంట ఎలుక దూర మంటలు పెడుదురా
కనగ నాదు మాట కనక ధార
(35) మదితొ ఒయ్యి జదువ మనసుకు సరిపడు
అదియె పద్ధ తింక అవస రంబు
విద్దె వల్ల గలుగు వినయము నీకింక
కనగ నాదు మాట కనక ధార
(36) ముసలి వారి జూసి ముసిముసి నగవేల
ముదము గాదు యెంచ మూర్ఖ మనగ
చిన్న వాడు గూడ చివరకు ముదుసలె
కనగ నాదు మాట కనక ధార
(37) తీర్థ మీడ ఆడ తిరుగుచు స్నానము
ఆచ రించ బూన అగున మేలు
ఆత్మ శుద్ధి గూడ అవసరము అగును
కనగ నాదు మాట కనక ధార
(38) పక్కి నరుడు యైన పశువుయు యయినను
సంతు రక్ష గోరు సతత ధ్యాస
నారి కేళ మాను న్యాయము తీరుగ
కనగ నాదు మాట కనక ధార
(39) సంతు ఒక్క టైన సరిపోవు ననగను
వరుస వావి లేక వగపు గలుగు
కరము ఒక్క టైన కడుబాధ కలుగింక
కనగ నాదు మాట కనక ధార
(40) వంశ మన్న వృత్తి వరమన మతమగు
కులమ తములు రెండు కలసి యున్న
వసుధ జూడ యింక వసువు మయమగును
కనగ నాదు మాట కనక ధార
(41) ఉన్న వాని జూసి ఉబుకుట కన్నను
లేని వాని జూసి లేశ మయిన
జాలి జూప బోవ జనముయు మెచ్చర
కనగ నాదు మాట కనక ధార
(42) దేశ భాష యైన తెలుగుకు సొగసన
ఇతర భాష లందె ఇష్ట పడుట
ఆత్మ వంచ నగును అదియును సొగసేల
కనగ నాదు మాట కనక ధార
(43) బాధ పడ్డ నాడు భగవంతు దలిచియు
బాధ లేని నాడు భయము లేక
అక్క రున్న నాడె అజునిదలచనేల
కనగ నాదు మాట కనక ధార
(44) మట్టి జూడ యెంతొ మహిమల మయమగు
మట్టి లేక మనిషి మనువు లేదు
మట్టి ఎలుక రౌతు మనకును విజయము
కనగ నాదు మాట కనక ధార
(45) అమల గౌరి వాణి అనగను బతుకమ్మ
ముగ్గు రమ్మ లండ ముదము గాద
పూలు దెచ్చి పేర్చి పూజించ దరుమము
కనగ నాదు మాట కనక ధార
(46) కరుణ యెరుగ నారి కననిక లేఖగు
కరుణ గలిగి యున్న కనుల విందు
కరుణ మారు పేరె కలకంఠి కనగను
కనగ నాదు మాట కనక ధార
(47) ఊరి వారు ఎపుడు ఉపకార మనుజులు
ఒకరి కొకరు నెపుడు ఒనరు తోడు
కలసి మెలసి బతుకు కనికర చరితులు
కనగ నాదు మాట కనక ధార
(48) కాలు చేయి ఊపి కడుపున కదలెడి
పుట్ట బోవు బిడ్డ పెరిమ బెంచ
కనెడు తల్లి దెంతొ కనికర మనబడు
కనగ నాదు మాట కనక ధార
(49) వీధి వాడ జూడ విభుడుండ తెలిసియు
తీర్థ యాత్ర లంటు తిరుగు టేల
అణువు అణువు నందు అజుడుని కనగను
కనగ నాదు మాట కనక ధార
(50) లేని వాడు అడుగ లవలేశ మయినను
పుడిగ ఫలిత మన్న బలము గున్న
వాని కీవి కడలి వరుషము బడినట్టె
కనగ నాదు మాట కనక ధార
(51) అతిగ తిండి వాగు డతిగను అతివల
నడుమ జేరి అతిగ నగవు బ్రీతి
అనెడు వాని గనగ అవివేకు డనెదరు
కనగ నాదు మాట కనక ధార
(52) వ్యాధు లెన్ని యున్న వగపేల కలబంద
ఇంట నుండ ఇంక ఇడుము లేల
లక్ష వ్యాధు లైన లయముకు కలబంద
కనగ నాదు మాట కనక ధార
(53) బుద్ధి ఉన్న వానె బుధుడని యనెదరు
బుద్ధి లేక యున్న బుధులు గారు
బుద్ధి గలుగ కున్న బుధులిక రానీరు
కనగ నాదు మాట కనక ధార
(54) ఒజ్జ లేని జదువు ఒనరదు ఎవరికి
మజ్జ లేక ఎముక మలుప రాదు
సొజ్జ లేని బూరె సొగసనబడదిక
కనగ నాదు మాట కనక ధార
(55) బధిర మూగ కైన భాషుండు నొకటన
సయిగ తోడ నయిన సరిగ నుండ
మెదడు కెక్క దేది మొరటుకు తెలుపగ
కనగ నాదు మాట కనక ధార
(56) సార త్రాగు వాడు సంసార మెరుగుడు
ఆలి గొట్టు వాడు అనగ కేడ
తస్క రుండు ఎపుడు తలువడు తప్పని
కనగ నాదు మాట కనక ధార
(57) బిడ్డ పెళ్ళి జేయ బీదని దలువక
అంట గట్ట బూన అగును కీడు
మంచి వాని నెంచి మనువన మేలగు
కనగ నాదు మాట కనక ధార
(58) నిప్పు నీరు నేల నిత్యగతి నభము
పంచ భూత మగుచు ప్రబలు చుండ
దేవ దేవు డటుల దెలుపగ బుట్టించె
కనగ నాదు మాట కనక ధార
(59) పడుపు వృత్తి జేయు పడతిని గనగను
సొమ్ము గోరు చుండు సొగసు జూపి
ఇంటి ఆడ దెపుడు ఇరుకున బెట్టదు
కనగ నాదు మాట కనక ధార
(60) చేత గాని నాడు చేలమె బరువగు
కలుగు నాడె కొంత కడకు ఉంచ
అవస రాని కొచ్చు అదియిక మేలగు
కనగ నాదు మాట కనక ధార
(61) మనము తినెడు తిండె మనసిడి పేదకు
పెట్ట న్యాయ మగును ప్రేమ జూపి
పాచి యన్న మింక పాటియు గాబోదు
కనగ నాదు మాట కనక ధార
(62) మంచి వాడు ఎపుడు మంచిగ మాటాడు
నిండు కుండ తొణక కుండు నట్టు
వంచ కుండు వాగు వంచన మాటలె కనగ నాదు మాట కనక ధార
(63) అమ్మ చేతి వంట అదియెంతొ కమ్మన
ఆరు న్నొక రుచిగను అవత రించె
అమ్మ బెట్టు రుచియె అవనిలొ అమృతము
కనగ నాదు మాట కనక ధార
(64) నాడు దేవు డుండె నాగము పైనను
నేడు దేవు డుండు నెలవు లేక
నాడు నేడు జూడ నళినాక్షు మహిమయే
కనగ నాదు మాట కనక ధార
(65) వల్ల భుండు జావ వనితను విధవన
వధువు జావ మగని విధురు డంద్రు
ఎవరు లేని వాని ఎరుగను యేకాకి
కనగ నాదు మాట కనక ధార
(66) మేలు మనది మంది మేలును మ్రానుల
మేలు గోర నదియె మేలు అగును
ఎవరి మేలు అనగ ఎరుగని మనిషేల
కనగ నాదు మాట కనక ధార
(67) విత్త వంతు కుండు వెలగల భవనము
పేద వాడు ఉండ పెంకు టిల్లె
తిరుప రెరుగ గనడు తీరము దరియును
కనగ నాదు మాట కనక ధార
(68) కాళ్ళు బట్టి కోడి కర్ణము కుందేలు
బాతు మెడయు దొరక బట్ట వలెను
మనిషి నెటుల యనగ మనసును పసిగట్టి
కనగ నాదు మాట కనక ధార
(69) ఆయు ధాలు ఆత్మ అభయము కొరకన
రాజు రాజ్య మేల రణము కాదు
ధనము తనకె కాదు దానము కొరకును
కనగ నాదు మాట కనక ధార
(70 గుడ్డ గొన్న చోట గునుసియు బంగరు
బేర మింక జేయ బెదురు కుంటు
కూర గాయ లందు కొసరుట భావ్యమా
కనగ నాదు మాట కనక ధార
(71) కుక్క తోక దొక్క కుయ్యుమనునికను
వ్యాఘ్ర తోక దొక్క వణుకు బుట్టు
కౄర జంతు వనగ కౄరమె కనగను
కనగ నాదు మాట కనక ధార
(72) తప్పు జేసి నోడు తప్పును ఒప్పను
రుజువు లన్ని జూప రుషిత జెందు
చెవులు బిండి తేనె చేసిన దొప్పును
కనగ నాదు మాట కనక ధార
(73) కలువ పూలు బూయు కనగను రాతిరి
కమల మన్న విచ్చు కనగ ప్రొద్దు
సూర్య చంద్రు లకును చుట్టములవియన
కనగ నాదు మాట కనక ధార
(74) కనగ ఒక్క సంతు కాష్ఠీల వంధ్యన
కాగ ఇద్ద రైన కాక వంధ్య
కనుక కనెడి వారు కడుపెక్కు సంతును
కనగ నాదు మాట కనక ధార
(75) దేవు డెక్క డంటు దేవులా టేలింక
తల్లి దండ్రు లందె దనరు చూడ
వారి సేవ వాల్ల వచ్చును పున్నెము
కనగ నాదు మాట కనక ధార
(76) ఒక్క మొక్క బెంచ ఒనగూడు ఒనరులు
పెరిగి పెద్ద దయిన ఫలము లిచ్చు
ఎండ వాన కండ ఎరుగగ నిలువదా
కనగ నాదు మాట కనక ధార
(77) కాకి కోడి కుండు కరుణగు గుణముండు
మనిషి కన్న గొప్ప మమత యుండు
మేత చూడ గానె కూతలు కనగను
కనగ నాదు మాట కనక ధార
(78) అడవి జంతు లెపుడు అడవినె గనపడ
గ్రామ మందు జేర కనగ రావు
కౄర మైన నయము కలుషిత నరుకన్న
కనగ నాదు మాట కనక ధార
(79) భాష బుట్టె నెపుడొ బాగుగ దెలువదు
మనిషి పుట్టు కెపుడొ మనిషి తోటె
భాష బుట్టి యుండు భావన నిజమగు
కనగ నాదు మాట కనక ధార
(80) జనము తెలివి గలిగి జగమున లేకను
ప్రగతి సాధ్య మగున ప్రజల యందు
తిథము లేక యున్న దీపము వెలుగునా
కనగ నాదు మాట కనక ధార
(81) నవ్వు నవ్వ ఎంతొ నయమగు రోగాలు
నవ్వ కున్న జూచు నలుగురింక
ఏడ్పు గొట్టు అనుచు ఎగతాళి జేతురు
కనగ నాదు మాట కనక ధార
(82) రంగు రంగు పూలు రమణులు బేరిచి
ఇంటి ముందు ఆడు ఇగురు బోండ్ల
కనగ ఎంతొ ప్రీతి కలియుగ బతుకమ్మ
కనగ నాదు మాట కనక ధార
(83) దున్న పోతు మీద దుమికెడు వానను
దున్న దెలువ బోదు దులుపు తోక
మూర్ఖు కేది జెప్ప మూగగ నుండును
కనగ నాదు మాట కనక ధార
(84) తేనె టీగ దీయు తేనెయె మధురము
వాటి తిండి మనము వగపు లేక
అనుభ వించ బూన అదియొక పాపమే
కనగ నాదు మాట కనక ధార
(85) ఏడు కొండ లందు వెలసిన దేవుడు
వేంక టేశు డనగ వెలుగు చుండె
కనగ తిరుమ లేశు కలియుగ దైవమె
కనగ నాదు మాట కనక ధార
(86) తేనె లొలుకు భాష తెలుగుయె అనగను
అన్ని భాష లందు అదియె మేటి
వేల యేండ్ల నుండి వెలుగొందు భాషది
కనగ నాదు మాట కనక ధార
(87) ఎండ కాల మందు కుండెడు శీతల
జలము దారి నుంచ జనుల దప్పి
దీర వారు నొసగు దీవన వరమగు
కనగ నాదు మాట కనక ధార
(88) ముదము మాట యనెడు ముసుగున ఇప్పటి
నాయ కుండు మిగుల నయపు మాట
లనుచు మోస పుచ్చు లయకారె అతడగు
కనగ నాదు మాట కనక ధార
(89) శోభ నకుప శోభ శోభను ఇవ్వగ
శోభి తములె పసలు సొగసు నీయ
సోకు లన్న పడక సోంబేరి అనెదరు
కనగ నాదు మాట కనక ధార
(90) కూళు డైన ఒక్ఖ కొడుకుయు గలుగగ
తల్లి తండ్రి పొందు తపన జూడ
సకటు కొడుకు కన్న సంతతి వలదంద్రు
కనగ నాదు మాట కనక ధార
(91) కంట కమయ మైన కంటికి ఇంపగు
రోజ పూవు జూసి రోచనయును
దాని ద్రెంచ బూను దయయును లేకయు
కనగ నాదు మాట కనక ధార
(92) కొత్త మిత్రు గనగ కోపము అనకను
అడుగ వలయు అతని అనుభ వాలు
ముచ్చ టెంతొ వినుచు ముదమైన దరిజేర్చు
కనగ నాదు మాట కనక ధార
(93) తరము తరము నుండి తగవులు సహజము
ప్రకృతి వికృతి లందు పరమ సత్తు
భరత చరిత అంత బన్నము కనరాద
కనగ నాదు మాట కనక ధార
(94) ద్వాప రందు గృష్ణ దారుగ జన్మించి
జలధి నడిగి గొంత జగము లోన
ద్వార మధిక ముండ ద్వారక గట్టించె
కనగ నాదు మాట కనక ధార
(95) భావ మన్న గనము బాధయు గనలేము
ఖంబు చూలి గనము గనము నేమ
అంత రంగ మొకటె అనుభూతి గలిగించు
కనగ నాదు మాట కనక ధార
(96) దేవు డనగ మనకు దేహియు నెరుగగ
అధిక కులము అంటు అధిక జేయ
దేవు డింక కినుక దేహిని శిక్షించు
కనగ నాదు మాట కనక ధార
(97) గుణము చూడు గాని కులమును జూడకు
ఖ్యాతి నడుగు గాని ఖలము కాదు
మాట లందు వెదుకు మనసగు గుణముల
కనగ నాదు మాట కనక ధార
(98) ఇంట ఇంతి లేక ఇల్లంత అడివియె
ఇగుర మెంత లేక ఇడుము లుండు
నాతి లేని చోటె నరకము అనెదరు
కనగ నాదు మాట కనక ధార
(99) విద్దె యనగ మూడు విధములు ఉండగ
బతుకు కొకటి రెండు భరణి జ్ఞాన
మనగ మూడు భక్తి మయమగు జదువులు
కనగ నాదు మాట కనక ధార
(100) పెద్ద మబ్బు గప్ప పెనుగొను చీకటి
పెక్కు రవము తోడ పెరుగు వాన
జాయ వోఢ నడుమ జగడము లటులనె
కనగ నాదు మాట కనక ధార
(101) వయసు నున్న నాడు వత్తురు చుట్టాలు
ముదిమి గనగ రారు మునుప టోలె
మనిషి కెంత మార్పొ మనమున దలువగ
కనగ నాదు మాట కనక ధార
(102) కూళు డున్న చోట కులమెల్ల చెడగను
సజ్జ నుండు ఉన్న సమత మెండు
మంచి ఉన్న చోటె మందిర మనబడు
కనగ నాదు మాట కనక ధార
(103) మూడు రెక్క లంటు ముచ్చట నడిచెడి
దేశ పాల నందు దెసలు మార్చ
మూడు రెక్క లందు ముడుపుల లెక్కలె
కనగ నాదు మాట కనక ధార
(104) రోజు పప్పు వండ రోషము రాకను
అప్పు డప్పు డున్న ఆవ పులుసు
పెట్టి నట్టు దిన్న పెనిమిటె హేమాద్రి
కనగ నాదు మాట కనక ధార
(105) రసన దాక శబరె రఘురాము ఫలమీయ
సరఘ రుచులు జూసి సబబు తేనె
మనిషి కంద నిచ్చె మరియది ఎంగిలె
కనగ నాదు మాట కనక ధార
(106 ఒయ్యి ఒకటి గలిగి ఒనరగ జదువగ
బుద్ధి కలుగు నీకు బుధులు మెచ్చు
అట్టి బుద్ది పంచు అందరు కోరగ
కనగ నాదు మాట కనక ధార
(107) చెట్టు యిచ్చు నీడ చేనన పంటలు
పూల మొక్క లిచ్చు పరిమ ళాలు
పూలు పండ్లు బుట్ట పూషుణి మహిమలే
కనగ నాదు మాట కనక ధార
(108) నవ్వు గనగ నదియె నయమగు మందన
నవ్వ గలుగ నదియె నయన కింపు
నవ్వ లేక యున్న నదియొక రోగమె
కనగ నాదు మాట కనక ధార
***
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.




Comments