top of page

కపోతం హితోక్తులు

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #KapothamHitokthulu, #కపోతంహితోక్తులు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 106


Kapotham Hitokthulu - Somanna Gari Kavithalu Part 106 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 09/08/2025

కపోతం హితోక్తులు - సోమన్న గారి కవితలు పార్ట్ 106 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


కపోతం హితోక్తులు

----------------------------------------

సాయము చేసిన వారిని

ఎప్పుడూ విస్మరించకు

అనవసరంగా నోటిని

అదే పనిగా వాడకు


అదుపులోన ఉంటేనే

పెద్దల మాట వింటేనే

జీవితాల్లో శాంతము

కుటుంబాల్లో క్షేమము


ప్రక్క వారి వృద్ధి చూసి

పిరికితనంతో ఏడ్వకు

అభాండాలు వేసివేసి

మనిషితనం కోల్పోకు


వెన్నుపోటు పొడిచి పొడిచి

దానవుడుగా మారిపోకు

పొరపాట్లు చేసి చేసి

వ్యక్తిత్వం చంపుకోకు


ree













నెమలమ్మ హితవు

------------------------

కష్టించే తత్త్వమే

ఘన విజయ రహస్యము

ఆరోగ్య ఔషదమే

సుతిమెత్తని హాస్యము


మితిలేని శత్రుత్వము

అశాంతికి కారణము

సృష్టిలో పవిత్రమైన

బంధాలకు విఘాతము


ఆవిరిస్తే బద్ధకము

అభివృద్ధి ఇక శూన్యము

చేస్తుందోయ్! మనిషిని

సమూలంగా నాశనము


బహు గొప్పది చురుకుదనము

మనిషికదే బహుమానము

ముందడుగు వేయడానికి

అగును తొలి సోపానము


ree




















అమ్మ ఆకాంక్ష

---------------------------------------

శ్రద్ధగా చదవాలి

బుద్దిగా మసలాలి

హద్దులోన ఉంటూ

వృద్ధిలోకి రావాలి


పువ్వులా ఉండాలి

దివ్వెలా వెలగాలి

నవ్వులే రువ్వుతూ

గువ్వలా ఎగరాలి


చుక్కలా పొడవాలి

మొక్కలా ఎదగాలి

చక్కని మార్గంలో

మక్కువతో నడవాలి


పల్లె మనసుండాలి

మల్లెలా మారాలి

ఎల్లరికి సాయపడి

ఉల్లాసమొందాలి


ree
















చిన్నారి-చిలుకమ్మ


--------------------------------------

చిన్నారి చిలుకమ్మ

ఎగురుతూ వచ్చింది

పాపాయి భుజముపై

ముద్దుగా వాలింది


సుద్దులే చెప్పింది

హద్దులే నేర్పింది

వృద్ధులను ప్రేమతో

శ్రద్దగా చూడమంది


చెలిమినే పంచింది

విలువతో బ్రతకమంది

కలుపుగోలుతనంతో

కలసి జీవించమంది


చిట్టీ పాప నవ్వింది

ముద్దులే పెట్టింది

హాయిగా నవ్వుతూ

ప్రేమతో నిమిరింది


ree













నాన్న ప్రబోధం

--------------------------------------

మానుకొమ్ము కోపము

పెంచుకొమ్ము శాంతము

శ్రేష్టమైన గుణాలతో

దక్కుతుంది గౌరవము


సాటి లేని సుగుణము

శుద్ధమైన సువర్ణము

కల్గియుంటే గనుక

అద్భుతం జీవితము


బ్రతుకులోన వినయము

ఖరీదైన హారము

చేసుకోకు దూరము

పెంచుకోకు గర్వము


జీవితాన దీపము

విలువైన పుస్తకము

పెద్ద వారి సూచనలు

అత్యంత అమూల్యము

-గద్వాల సోమన్న

Comentários


bottom of page