'Karmanye Vadhikarasthe' Written By Gorthi VaniSrinivas
రచన : గొర్తి వాణిశ్రీనివాస్
'కర్తవ్యం మాత్రమే నీ వంతు.
ఫలితం ఆశించకు.
అలాగని కర్తవ్యాన్ని విస్మరించకు.
ఏమివ్వాలో ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు' అని తెలియజెప్పే గీతా శ్లోకానికి ప్రముఖ రచయిత్రి గొర్తి వాణిశ్రీనివాస్ ఇచ్చిన చక్కటి కథా రూపమే 'కర్మణ్యే వాధికారస్తే' అనే ఈ కథ.
అటూ ఇటూ పంటచేలు.
కారు మాత్రమే పట్టేంత వెడల్పున్న దారిలోంచి
తెల్లని స్విఫ్ట్ డిజైర్ కార్ మెలికలు తిరుగుతూ వచ్చి ఊరి చివరున్న గెస్ట్ హౌస్ పోర్టీకో ముందు ఆగింది.
ఆ పక్కనేవున్న పొలంలో పనిచేస్తున్న కూలీలు తలెత్తి కారు వెళ్లినవైపు చూసారు.
ఆ కార్ ఎవరిదో ఇట్టే పోల్చుకున్నారు.
"ఊళ్ళోకి రావు బాబొచ్చాడ్రా! నగరంలో ఊపిరి సలపని పనులతో విసిగిపోయినప్పుడల్లా ప్రశాంతత కోసం ఇక్కడికే వస్తాడు పాపం." .
"అవునుమరి! పల్లెల్లో వుండే నిశ్శబ్ద వాతావరణం పట్నాల్లో దొరకదుగా. రణగొణధ్వనులకే సగం రోగాలొస్తాయి.అంతా కాలుష్యం కదా"
అందుకేగా రావు బాబు అప్పుడప్పుడూ ఇక్కడకొచ్చి రెస్టు తీసుకుంటుంటాడు.
మన కళ్ళముందు పుట్టి పెరిగిన రావు బాబు ఎంత ఎదిగిపోయాడ్రా. సినిమాలు తీసి కోట్లు సంపాదించాడు.
ఇదంతా ఆయన మేనమామ గారి చలవ.
యాభై ఎకరాల పొలం అమ్మించి పట్నం తీసికెళ్లి తనదగ్గర ఉంచుకుని ప్రయోజకుడ్ని చేశాడు.
ఆయన ఆసరాతోనేగా సినీ నిర్మాతగా ఎదిగి కోట్లు గడించి ఎంతోమందికి ఉపాధి కల్పించాడు.
ఏదైనా గొప్పోళ్ళు గొప్పోల్లేరా! ఆళ్ళు చెయ్యాలంటే ఏదైనా చేసేస్తారు.
సినిమాల్లో వచ్చిన డబ్బుతో ఊరిచివర స్థలం కొని గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు.
కన్నతల్లిలాంటి సొంతూరిమీద మమకారం ఎక్కడికీ పోదురా! అలసిపోయి వస్తే అక్కున చేర్చుకుంటుంది. ఆ ఆదరణ కోసమే ఆ బాబు అప్పుడప్పుడూ వచ్చిపోతుంటాడు.
మనం ఏదన్నా సాయం అడిగితే కాదనకుండా చేసిపెడతాడు. పుణ్యాత్ముదు"
చేలో పనిచేస్తున్న కూలీలు రావుగురించి మాట్లాడుకుంటున్నారు.
ఒక మనిషి వ్యక్తిత్వం ఎదురుగా మాట్లాడేవాళ్ళవల్ల తెలీదు.
మనిషి ముందు కంటే వినక మాట్లాడేవే వాస్తవాలు. రావు ఆఊళ్ళో మంచి పేరు సంపాదించుకున్నాడు అనడానికి సాక్ష్యాలు.
కార్ గెస్ట్ హౌస్ ముందు ఆగగానే
రావు కారు దిగి చెకచెకా నడుస్తూ లోపలికి వెళ్ళిపోయాడు.
నాలుగెకరాల విస్తీర్ణంలో పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది.
ఎకరం స్థలంలో పండ్ల, పూల చెట్లు. మధ్యలో బిల్డింగ్. అతను వున్నా లేకపోయినా పనివాళ్ళు రోజూ శుభ్రం చేస్తారు.
చల్లని పైరగాలి పీలుస్తూ పొద్దుటి ప్రకృతి దృశ్యాలను దర్శిస్తూ కాఫీ చప్పరిస్తూ పోర్టికోలో కూర్చున్నాడు రావు.
రకరకాల పక్షులకది విడిది ప్రాంతం. అవి చెట్లమీద వాలి కువకువలాడుతూ వింత ధ్వనులు చేస్తుంటే ఆహ్లాదకరమైన ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చుట్టూ చూశాడు.
గెస్ట్ హౌస్ పక్కనే కృష్ణయ్య పొలం ఉంది.
ఉదయాన్నే పొలానికొచ్చి పనుచేసుకుంటూ కృష్ణయ్య కనిపించాడు.
రావు కూర్చుని వున్నా మనసంతా ఏదో అశాంతిగా ఉంది.ఏవేవో ఆలోచనలు తలలో తిరుగుతున్నాయి. మనిషి విశ్రాంతి తీసుకోవాలన్నాగానీ మానసిక ఆరోగ్యం బాగుంటేనే కుదురుతుంది.
చిత్రరంగంలో ఎదురైన అవమానాలు, చాపకింద నీరల్లే ఎదురైన నీచ రాజకీయ సంఘటనలు గుర్తొచ్చాయి.
ఇక్కడకొచ్చినా వాటిగురించి ఎందుకని
ఎంత సర్ది చెప్పుకుందామన్నా
యమభటుల్లా ఒక్కొక్కటే వచ్చి ఎదురుగా నిలబడి భయపెడుతున్నాయి.
ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోవడం,నటీ నటుల రెమ్యునరేషన్ రెట్టింపవడం,బాక్సాఫీస్ దగ్గర బొమ్మ తలకిందులై నష్టాలు రావడం ఇంకా ఏవో కారణాలవల్ల రావుకి కోలుకోలేని దెబ్బ తగిలింది.
అప్పులు తీర్చి మిగిలినదానితో బయటపడినా రావుని ఫీల్డులో ఓడిపోయానన్న భావం వెంటాడుతోంది.ఓటమిని అంగీరకరించేందుకు కూడా తగిన మానసిక దృఢత్వం కావాలి
దేనికో తెలియని సంక్షోభం రావు మనసుని తొలిచేస్తోంది.
ఏకాగ్రతగా నాగలితో పొలం దున్నుతున్న కృష్ణయ్యకేసి చాలా సేపు చూసాడు.
నిశ్చలంగా ఉన్న అతని మొహాన్ని చూస్తుంటే రావుకి తనలోనూ ఏదో ప్రశాంతత ఆవరించనట్లయ్యింది.
ఆలోచనలనల్ని పక్కనపెట్టి
కృష్ణయ్య పొలం వైపు నడిచాడు .
గళ్ళ లుంగీ తెల్లటి లాల్చీతో వస్తున్న రావులో దర్పం కొట్టొచ్చినట్టు కనబడుతోంది.
చేస్తున్న పనిమానేసి పరిగెత్తుకొచ్చాడు కృష్ణయ్య.
"ఇట్టా వచ్చారేంటి బాబూ . పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా" అన్నాడు
"ఏం లేదు కృష్ణయ్యా! ఏదో ఉబుసుపోక ఇలా వచ్చాను. నీపనికి అడ్డం వచ్చినట్టున్నాను. ఈ పైరగాలి, ఈ నిశ్శబ్ద వాతావరణం చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. ఇన్నాళ్ల నా పరుగుకి స్వస్తి పలికి నిలకడగా ఇక్కడే వుండిపోవాలనిపిస్తోంది" అన్నాడు.
ఇద్దరూ మాట్లాడుకుంటూ పొలం గట్లమీద కాసేపు నడిచారు.
అవన్నీ చిన్నప్పుడు రావు తిరిగిన పొలాలే. ఆటలాడుకున్న ప్రాంతాలే.
చిన్నప్పుడు రావు ,కృష్ణయ్య కలిసి ఆడుకున్నారు
తర్వాత కాలంతోపాటు మారిన అంతస్తులు దూరాన్ని పెంచేచేసాయి.
"కృష్ణయ్యా! నువ్వు అప్పుడెలావున్నావో
ఇప్పుడూ అలాగే ఉన్నావు. అదే నిదానం
అదే ప్రశాంతత. నిన్ను చూస్తుంటే మెల్లగా కదిలే నది గుర్తొస్తోంది. నా ఆలోచనల అలలు తీరం చేరాలని ఆరాటపడుతున్నాయి. ఎందుకంటావ్?" అన్నాడు రావు ఎటో చూస్తూ
రావు మాటల్ని బట్టి కృష్ణయ్యకి ఒకటి అర్ధమైంది.
రావు మనశ్శాంతి పోగొట్టుకుని ఈ ఊరికి వచ్చాడని.
"నదికూడా ఒకోసారి ముంచేస్తుంది బాబూ!" అన్నాడు కృష్ణయ్య
"కృష్ణయ్యా! అతివృష్టి అనావృష్టి పరిస్థితుల్లో పంట నష్టం వచ్చినప్పుడు,ఆర్ధిక ఇబ్బందుల్ని తట్టుకుని మీరెలా
నిలబడతారు. ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనిపించదా?" అన్నాడు రావు పంట బోది పక్కన గట్టుమీద కూర్చుంటూ.
కృష్ణయ్య ఏం చెబుతాడా అని ఆసక్తిగా చూస్తున్నాడు.
" అదేం లేదు బాబూ. మా బతుకుల్లో మేం పెద్ద విజయాలేం చూసింది లేదు. అందుకే పెద్ద అపజయాలు కూడా ఏమీ ఉండవు.
ఎంత చెట్టుకు అంతగాలి. పెద్ద పెట్టుబడికి పెద్దనష్టం రావచ్చు. మా చిన్న బతుకులకి చిన్న కష్టాలు కూడా ఎక్కువే.
కానీ ఒడిదుడుకులు వచ్చినప్పుడు మాత్రం ఓ పాలి నా బండి చక్రంకేసి చూస్తాను. నా బాదంతా చేత్తో తీసినట్టు మాయమైపోతుంది" అన్నాడు కృష్ణయ్య తన ఎడ్లబండి వైపు చూపిస్తూ.
"అవునా! నీ బాధ అలా ఎలా మాయమవుతుంది? అక్కడ ఏముంది నాక్కూడా చూపించవా?" అన్నాడు రావు ఆతృతగా.
రావు మానసిక కల్లోలం కృష్ణయ్యకి అర్ధమయ్యింది. అతని కలవరం నా మాటలవల్ల తీరుతుందా? అనుకున్నాడు .
తన బండి దగ్గరకు తీసికెళ్లి బండి చక్రాన్ని చూపించాడు.
"ఇదే నా దగ్గరున్న పెద్ద వేదాంత పుస్తకం బాబూ! ఇది తిరుగుతున్నప్పుడు ఇరుసు స్థిరంగా ఉంటుంది. చక్రంలో కమ్మీలు ఒకదాని తరవాత ఒకటి తిరుగుతూ ఉన్నప్పుడు వాటిని కష్ట సుఖాలతో పోల్చుకుని చూస్తాను.
అవి పైకీ కిందకీ వస్తూ పోతూ తిరుగుతూవుంటేనే
బండి ముందుకు సాగేది. మనం మాత్రం ఇరుసల్లే చూస్తూ ఉండాలి. చక్రంలో పాటే ఇరుసు కూడా తిరిగితే బండి బోల్తా పడుతుంది.
అదే నేను ఒంటపట్టించుకున్న జీవిత సత్యం . అన్నిటికీ పొంగిపోతూ కుంగిపోతూ ఉంటే నష్టం మనకేగా. చూసేవాళ్ళ కళ్లెప్పుడూ మనం కోరుకున్నట్టు చూడవు. వాళ్లేమనుకున్నా మనపని మనం చేసుకుపోతుండాలి. అప్పుడే మన మనసుకు సుఖం" అన్నాడు కృష్ణయ్య.
రావు బండిచక్రాన్ని చూస్తూ ఆలోచనలో పడ్డాడు.
ఇది నాకు తెలియని వేదాంతం కాదు.
కృంగుబాటులో మరుగుపడిన సత్యాలివి.
మనిషి మనోధైర్య చిహ్నం
ఈ బండి చక్రం.
బాధ ఎవరికైనా ఒక్కటే. పోలిక కూడా ఎటువంటి జీవితానికైనా ఒక్కటే.
అర్ధం చేసుకోవడంలోనే తేడా.
స్తాయీ బేధాలకు దీటుగా పోలిక కూడా అదే స్థాయిలో వుండాలనుకోవడం తన అజ్ఞానం.
చలి చీమను పరిశీలించినా అందులోనూ తాత్వికత కనబడుతుంది.
"ఏంటి బాబూ ఆలోచిస్తున్నారు. నేనేమన్నా తప్పు చెప్పానా? "కృష్ణయ్య పిలుపుతో ఇహం లోకి వచ్చాడు రావు.
"నువ్వు చెప్పిందే ఆలోచిస్తున్నాను కృష్ణయ్యా! ఇప్పుడు నువ్వే ఆ కృష్ణుడివి. నేను అర్జునుడిని.. ఊ ..గీత బోధచెయ్యి వింటాను" అన్నాడు రావు
సిగ్గుపడుతూ నవ్వాడు కృష్ణయ్య.
"ఊరుకోండి బాబూ! నేను సీ కిస్టుడినేంటి?
కాలమే అందరికీ పెద్ద దేవుడు.
మా ఇంటిది ఎప్పుడూ ఒక మాట అంటుంటుంది బాబూ! మీకేమన్నా ఉపయోగిస్తాదేమో!
చాటలో ఎక్కువ వడ్లు పోసుకుంటే ఎక్కువ బెడ్డలూ వుంటాయి.
ఆశగా అన్నొడ్లు పోసునేటప్పుడు లేని బాధ ఏరుకునేందుకు దేనికని.
ఆశని బట్టే అడ్డంకులు కూడా. పాత్రను బట్టే ఫలితం కూడా. " కృష్ణయ్య తన ధోరణిలో తను చెప్పుకు పోతున్నాడు.
వీళ్ళు వేదాంతాన్ని జీవితాన్ని విడివిడిగా చూడరు.
వాళ్ళ జీవితంలో తాత్విక భావన ఒకభాగం. చేసే ప్రతిపని త్రికరణశుద్ధిగా చేసి
ఫలితాన్ని పూర్తిగా దైవానికి వదిలేస్తారు. అందుకే వీళ్ళింత నిశ్చింతగా వుండగలుగుతున్నారు.
అంతసేపూ రావుని వేధిస్తున్న ఏదో చింత మబ్బులా వీడిపోయింది.
చేయాలనుకుంది చేసుకుపోవాలి లాభనష్టాలు పైవాడి దయ. మనం బాధ్యులం కాము అని అనుకున్నాక
అతని మనసు తేలికయ్యింది.
కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన
గీతా వాక్యం ఎన్నోసార్లు విన్నా
అనుభవంలోకి వచ్చినప్పుడే దాని భావం అర్ధమవుతుంది
తామరాకు మీద నీటి బొట్టులా ఉండటం కష్టమే. కానీ తేలిగ్గా పట్టుకుంటే అంతే తెలిగ్గా వదిలేయొచ్చు అనే చిన్న సూత్రం పట్టుకుంటే బతుకు నల్లేరుమీద బండినడకే.
రావు తృప్తిగా ఊపిరిపీల్చి కర్తవ్యం వైపు కదిలాడు.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)
విశాఖపట్నం.
భర్త : గొర్తి శ్రీనివాస్ గారు
ఇద్దరు పిల్లలు. కుమార్తె, కుమారుడు
గత కొంతకాలంగా సామాజిక సమస్యలను అధ్యయనం చేస్తూ
కథలు , కవితలు రాస్తున్నాను. సమాజంలోకి, వ్యక్తులలోకి, మనసులలోకి
తొంగి చూస్తాయి నా రచనలు.
హాస్య రస ప్రధాన రచనా ప్రక్రియ మీద మక్కువ ఎక్కువ.
కథలు, కవితల పోటీలలో బహుమతులతో పాటు వివిధ పత్రికలలో ప్రచురణ.
సామాజిక ప్రయోజనం కలిగిన కొత్త ఆలోచనకు బీజం వేయగలిగే రచన చేసినపుడు కలిగే తృప్తి నా రచనలకు మూలధనం.
留言