top of page

ఆశయాలు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






'Asayalu' written by Gorthi VaniSrinivas

రచన : గొర్తి వాణిశ్రీనివాస్

చాలా చక్కగా బొమ్మలు గీచి, పెయింట్ చేస్తుంది సుశీల. ఆమె వంశంలో తరాలనుంచి ఆ విద్య వస్తోంది.

కానీ తన కొడుక్కి చిత్ర కళ పట్ల, పెయింటింగ్ పట్ల ఆసక్తి లేకపోవడంతో బాధ పడింది.

కానీ అనూహ్యంగా మనవడు బొమ్మలు గీచి పెయింట్ చేయడం చిన్నప్పుడే మొదలు పెట్టాడు.

ప్రముఖ రచయిత్రి గొర్తి వాణిశ్రీనివాస్ గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

ఇక కథ ప్రారంభిద్దాం.

సుశీల నవ్వుతూ ఆప్యాయంగా అందించిన గిఫ్ట్ ని ఎంతో అభిమానంగా అందుకున్నాడు విహారి.


ప్యాకెట్ విప్పి చూడగానే అతని కళ్ళు సంభ్రమంతో మెరిసాయి.


తన పుట్టినరోజునాడు భార్య బహూకరించిన పెయింటింగ్ లో చిత్రించిన ప్రతి వర్షపు చినుకులో తన మొహమే, హర్షాతిరేకంతో మెరిసే పుష్పంగా భార్య వదనం.


కళాత్మకమైన అనురాగ అభివ్యక్తికి అనురక్తి తోడై పులకరిస్తూ అనిర్వచనీయమైన అనుభూతిలో తడిసి ముద్దయ్యాడు విహారి.


ఆమెపై ప్రశంశల జల్లు కురిపించాడు.

చిరునవ్వులతో వాటిని స్వీకరిస్తూనే ఆమె వదనం వివర్ణమైంది.


వాళ్ళ వంశంలో ఏడుతరాలుగా ఆర్ట్ అండ్ పెయింటింగ్ కళకు ప్రాణంపోస్తున్నారు.

కొడుకు కౌశల్ దగ్గరకు వచ్చేసరికి అతను తన అయిష్టతను కనబరిచారు.

కౌశల్ ని క్యాన్వాసుముందు నిలబెట్టి లైన్స్ గీయమని ప్రోత్సహిస్తూ

విఫల ప్రయత్నాలు చేసింది సుశీల.


వాడికి ఇష్టం లేకపోతే బలవంతం చెయ్యకు పెద్దయ్యాక నేర్చుకుంటాడులే అనేవాడు విహారి. చిన్నతనం నుంచీ అభ్యసించే విద్యలో ప్రత్యేక ప్రావీణ్యతలుంటాయని సుశీల నమ్మకం.


సుశీల తండ్రి కూడా తమ వంశీకుల కళను పరంపరగా భవిష్యత్తు తరాలకు అందిస్తూ వందేళ్ల చరిత్రను సృష్టించాలని సంకల్పంతో వున్నాడు. ఈ తరంలో తన ఆశయానికి గండి పడడంతో ఆయన ఎంతో బాధపడ్డాడు.

సుశీల కూడా కొడుకులో పెయింటింగ్ కళ పట్ల అభిరుచి కల్పించలేకపోయింది.


ఆమె మొహంలో కనబడ్డ విచారాన్ని గమనించిన విహారి

"సుశీ!ఎందుకలా బాధపడతావ్. వాడికి ముప్పై ఏళ్ళు వచ్చాయి. తనకు ఏది కావాలో అదే ఎంచుకున్నాడు. మన కౌశల్ డాక్టర్ వృత్తిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతకంటే మనకేంకావాలి చెప్పు.వాడి ఇష్టాల్ని గౌరవించడం మాన బాధ్యత.ఆ విషయం వదిలెయ్యి" అన్నాడు .


విహారి సుశీల ఇచ్చిన పెయింటింగ్ ని సంతోషంగా చూసుకున్నాడు. అంతలోనే ఛాతీ పట్టుకుని మూలుగుతూ కుప్పకూలిపోయాడు.


విహారీ ! అంటూ సుశీల గట్టిగా అరిచిన అరుపుకు పరిగెత్తుకొచ్చిన డాక్టర్ కౌశల్, తండ్రిని చేతులమీద ఎత్తుకుని కార్లో పడుకోపెట్టి హాస్పిటల్ కి తీసుకెళ్లాడు.


ఆపరేషన్ థియేటర్ లోకి వెళుతున్న కౌశల్ ని పట్టుకుని బావురుమంది సుశీల.


మీ నాన్నగారు లేకపోతే నేను లేనట్టే. ఆయన్ని ఎలాగైనా బతికించు. అంటూ ఏడుస్తున్న తల్లిని ఓదారుస్తూ పొదివిపట్టుకున్నాడు కౌశల్.


చిన్నప్పుడే మానవ గుండె స్పందనల రహస్యాన్ని ఛేదించాలనే పేషన్ తో ఉన్న కౌశల్

కార్డియాలజీ సబ్జెక్ట్ మీద థీసెస్ తయారుచేసి మెడికల్ కౌన్సిల్ కి పంపి ఎన్నో ప్రసంశలు పొందాడు. అత్యుత్తమ అవార్డులు పొందిన అతి పిన్న వయస్కుడిగా తన పేరును నమోదు చేసుకున్నాడు .


"నువ్వు చెప్పినట్టే ఎందులోనైనా సృజనాత్మకత, ఒక ప్రేత్యేకత సాధించాలంటే చిన్న వయసునుంచే అది మొదలవ్వాలి. నేను కనిపెట్టిన చిన్న చిప్ పరిజ్ఞానాన్ని వాడి, గుండెపోటు మరణాల్ని ఆపి రికార్డు సృష్టిస్తాను.నా కొడుకుని కూడా నాలా డాక్టర్ ని చేస్తాను. కనీసం పది తరాల వరకూ ఈ వృత్తి కొనసాగేలా చేయడమే నా ఆశయం.

నాన్న నవ్వుతూ నీదగ్గరకు వస్తారు . నువ్వు ధైర్యంగా వుండమ్మా" అని చెప్పి ఆపరేషన్ థేయేటర్ లోకి వెళ్ళాడు కౌశల్.


దైవాన్ని ప్రార్ధిస్తూ కూర్చున్న సుశీల తన పక్కనే కూర్చున్న మనవడికేసి చూసింది . బామ్మ పక్కన కుర్చీలో కూర్చుని తెల్లకాగితాన్ని ఒళ్ళో పెట్టుకుని చక్కటి చిత్రాలు గీసి రంగులేస్తున్నాడు ప్రమోద్...సన్ ఆఫ్ కౌశల్.


అది చూసి చిన్నగా నవ్వుకుంది సుశీల.

తన కొడుకు కౌశల్ ఆర్టిస్ట్ కావాలని తను ఎన్నో కలలుకంది.

కౌశల్ కి తన కొడుకు చేత కార్డియాలజి చేయించాలని కోరుకుంటున్నాడు.


ఎవరి కోరికను ఎవరు నెరవేరుస్తారో.

ఎవరి భావాంకురాలు ఎవరిలో మొలకెత్తుతున్నాయో ఎవరికీ తెలీదు.

పిల్లల ఇష్టాలకు విలువనిచ్చి ,వాళ్ళు ఎంచుకున్న అభిరుచిలోనే వాళ్ళు నిష్ణాతులు కాగలరు.

వంశపారంపర్యంగా కొనసాగించేందుకు పిల్లల ఇష్టాఇస్తాలు రాచరిక కిరీటాలు కావు.ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి తర్వాత ఒకరు ధరించటానికి. ఏ కళయినా దైవదత్తమే. ఆరాధించి అభివృద్ధి చేసుకున్నప్పుడు ఫలితాలన్నీ ప్రమోదభరితాలే.

ఆలోచిస్తున్న సుశీల ఒళ్ళో ప్రమోద్ తను గీసిన పెయింటింగ్ ని పెట్టాడు.

చూసి చాలా బాగుందని మెచ్చుకుంది సుశీల.

"గ్రానీ! నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం బాగా వేయడం నేర్పిస్తారా! డాడీకి మాత్రం చెప్పొద్దూ.." అన్నాడు గుసగుసగా.

"అలాగే నేర్పిస్తాను నాన్నా!" అని నవ్వుతూ ప్రమోద్ ని నుదుటిని ముద్దాడింది సుశీల.

***శుభం***

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

విశాఖపట్నం.

భర్త : గొర్తి శ్రీనివాస్ గారు

ఇద్దరు పిల్లలు. కుమార్తె, కుమారుడు

గత కొంతకాలంగా సామాజిక సమస్యలను అధ్యయనం చేస్తూ

కథలు , కవితలు రాస్తున్నాను. సమాజంలోకి, వ్యక్తులలోకి, మనసులలోకి

తొంగి చూస్తాయి నా రచనలు.

హాస్య రస ప్రధాన రచనా ప్రక్రియ మీద మక్కువ ఎక్కువ.

కథలు, కవితల పోటీలలో బహుమతులతో పాటు వివిధ పత్రికలలో ప్రచురణ.

సామాజిక ప్రయోజనం కలిగిన కొత్త ఆలోచనకు బీజం వేయగలిగే రచన చేసినపుడు కలిగే తృప్తి నా రచనలకు మూలధనం.


118 views2 comments

2件のコメント


srinivas gorty
srinivas gorty
2021年11月06日

Inspirational storyline 💐

いいね!

Lalitha Gorthi
Lalitha Gorthi
2021年11月05日

Nice story. Keep it up.

いいね!
bottom of page