top of page

లైఫ్ స్కిల్స్


'Life Skills' written by Gorthi VaniSrinivas

రచన : గొర్తి వాణిశ్రీనివాస్

" పౌర్ణమికి ఏం మంత్రం వేశావు కావ్యా!? తిరిగి భర్త దగ్గరకు వెళ్లటానికి ఒప్పుకుంది? నువ్వు అసాధ్యురాలివే సుమా! పెళ్ళైన రెండు నెలలకే పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికి వచ్చిన పౌర్ణమిని కోప్పడి తిరిగి పంపించకుండా ఇంట్లోనే ఉంచేసుకున్న మా అక్కకెలా నచ్చచెప్పావ్. అసలే అది రాక్షసి. దాని కూతురు ఓ పిల్ల భూతం. నేను వద్దని వారిస్తున్నా ఇనిషియేట్ తీసుకున్నావ్. ఏమవుతుందో అని భయపడ్డాను. మొత్తానికి కథ సుఖాoతం చేసావు" అన్నాడు మోహన్ భార్య స్కూటీ వెనకాల కూర్చుని వేరుశెనక్కాయలు తింటూ . "మరేమనుకున్నారు! నేను బ్రేక్ ఇన్స్పెక్టర్ ని. ఆమాత్రం చెప్పలేనా. పెళ్ళైన రెండునెలలకే కాపురానికి బ్రేక్ ఇచ్చి ఇంటికొచ్చిన ఆడపిల్ల అజ్ఞానానికి బ్రేక్ వేయకపోతే ఇక మనమేం పెద్దలం. పెళ్లికి వెళ్ళామా ,తిన్నామా, గిఫ్ట్ చదివించామా వచ్చామా అనుకోవడం పొరపాటు. అది వాళ్ళ పర్సనల్ విషయమైనాగానీ అక్షింతలు వేసినందుకు కొత్త జంట కాపురంగురించి కాస్తన్నా ఆలోచించాలి" అంది కావ్య. "ఉపోద్ఘాతం ఆపు. ఇంతకీ ఏం చెప్పి ఒప్పించావ్ అది చెప్పు." అన్నాడు మోహన్ ఆసక్తిగా. "ఏం లేదు. కాపురం కార్ లాంటిది. మీ ఆయన యాక్సిలేటర్ అయితే నువ్వు బ్రేక్ . నీ భర్తకు నీ అవసరం గేర్ అనుకో. యాక్సిలేటర్ రైజింగ్ లో వున్నప్పుడు బ్రేక్ తొక్కితే యాక్సిడెంట్స్ అయిపోతాయ్. అందుకే వెంటనే గేర్ మార్చి బండిని న్యూట్రల్ కి తీసుకురా. అప్పుడు బ్రేక్ తొక్కేశావంటే బండి నీ కంట్రోల్ లోకి వచ్చేస్తుంది. మీ మావయ్య కూడా నాకు అలాగే సరెండర్ అయిపోయారు .నువ్వూ ప్రయత్నించి చూడు. అదేమంత కష్టం కాదు అని చెప్పాను. పౌర్ణమి మొహం వెలిగిపోయింది. మీ అక్క ఈగో తృప్తిపడింది." చెప్పింది రమ్య సిగ్నల్ దగ్గర బండి ఆపి హ్యాండిల్ మీద వేళ్ళతో దరువేస్తూ. "హమ్మ రమ్యా! నన్ను నీ వెనక కూర్చోమన్నప్పుడే అనుమానించాల్సింది .ఐ డిడ్ ఏ మిస్టేక్. అవునూ నీ హెల్మెట్ ఏదీ? కమాన్ ఫైన్ కట్టు" అంటూ సిగ్నక్ దగ్గర బండి దిగిపోయి జేబులోంచి చేలాన్ బుక్ తీసి ఫైన్ రాసి రమ్య చేతికిచ్చాడు. "హెల్మెట్ మర్చిపోయానని ఇంట్లోనే చెప్పొచ్చుగా. పెళ్ళాన్ననికూడా చూడరే!? మీ ట్రాఫిక్ కానిస్టేబుల్ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు." అంది రమ్య బండి దిగుతూ. "బ్రేక్ ఇన్స్పెక్టర్ స్పీడ్ కి ఇంట్లో ఎలాగూ బ్రేకుల్లేవు. నిన్ను నేను ఆపగలిగే ఒకే ఒక్కచోటు ఇదే. పోలా ఆదిరిపోలా. డబుల్ మాస్క్ ఏదమ్మా. దీనికీ ఫైన్ కట్టాలి మరి" అంటూ మరో చెలానా రాసి పర్రున చించి చేతిలో పెట్టాడు . కొంపతీసి ఈయన బ్రేక్ మరీ ఎక్కువగా తొక్కేశానా? అనుకుంది రమ్య. వాళ్లిద్దరూ ఉద్యోగ నిర్వహణలోనే కాదు, జీవితంలో కూడా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినజంటపక్షులు. కర్తవ్యంలో స్ట్రిక్టు.కాపురాల్ని నిలబెట్టడంలో బెస్ట్ అని అంటారంతా. జీవితాన్నంతా కాచి వడబోయ్యక్కర్లేదు. ఇంతచిన్న జీవితాన్ని నడిపించే ఒక సూత్రాన్ని పట్టుకుంటే చాలు ఇక లైఫ్ అంతా నల్లేరుమీద బండినడకే అంటారు వాళ్ళు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

విశాఖపట్నం.

భర్త : గొర్తి శ్రీనివాస్ గారు

ఇద్దరు పిల్లలు. కుమార్తె, కుమారుడు

గత కొంతకాలంగా సామాజిక సమస్యలను అధ్యయనం చేస్తూ

కథలు , కవితలు రాస్తున్నాను. సమాజంలోకి, వ్యక్తులలోకి, మనసులలోకి

తొంగి చూస్తాయి నా రచనలు.

హాస్య రస ప్రధాన రచనా ప్రక్రియ మీద మక్కువ ఎక్కువ.

కథలు, కవితల పోటీలలో బహుమతులతో పాటు వివిధ పత్రికలలో ప్రచురణ.

సామాజిక ప్రయోజనం కలిగిన కొత్త ఆలోచనకు బీజం వేయగలిగే రచన చేసినపుడు కలిగే తృప్తి నా రచనలకు మూలధనం.



163 views1 comment
bottom of page