top of page

జీవన రేఖలు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండిVideo link


'Jivana Rekhalu' Written By Gorthi VaniSrinivas

రచన : గొర్తి వాణిశ్రీనివాస్

గుండెను పదిలంగా చూసుకోవాలి.

హృదయాన్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి.

భార్యను అంతకంటే శ్రద్ధగా చూసుకోవాలి

అప్పుడే ఆరోగ్యం, మనఃశాంతి ఉంటాయి.

ఈ విషయాన్ని ఆలస్యంగానైనా తెలుసుకున్నాడు సుందరం.

భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలో ఈ కథలో ప్రముఖ రచయిత్రి గొర్తి వాణిశ్రీనివాస్ గారు చక్కగా వివరించారు." ఇన్నాళ్లూ నిన్ను నిర్లక్ష్యం చేశానని నామీద కోపమా! అందుకేనా నాకింత శిక్ష వేశావు? ఇకపై జాగ్రత్తగా నడుచుకుంటానని మాటిస్తున్నాను. ఇకనైనా నన్ను క్షమిస్తావా!" అన్నాడు సుందరం మెల్లని స్వరంతో.


హాల్లో కూర్చున్న భర్త మాటలు వినిపించేసరికి ఎవరితో మాట్లాడుతున్నాడా అని గదిలోంచి తొంగి చూసింది శశిరేఖ.


అక్కడ ఎవరూ కనపడలేదు. మరి ఎవరితో మాట్లాడుతున్నారీయన?!

ఎవరితో ఏంటి నాతోనే. ఈ తడిక రాయబారం దేనికో. అయినా ఈరోజు నా ప్రయాణం మాత్రం ఆగేది కాదు.


నలభై ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కుని అలిసిపోయాను. నాకూ కాస్త విరామం కావాలి.

ఇక ఈయనతో వేగలేను.

బతిమాలినా ఆగను. వెళ్లే తీరతాను.

తన బాధని తలపోస్తూ బట్టల బ్యాగ్ సర్దుకుంటోంది శశిరేఖ.


"ఉద్యోగ నిర్వహణలోనే కాదు అడుగడుగునా నిన్నెంతగా నిర్లక్ష్యం చేశానో తలుచుకుంటుంటే నేనింత పెద్ద తప్పుచేశానా అనిపిస్తోంది.

అప్పుడే నిన్ను కాస్త కనిపెట్టుకుని ఉన్నట్లయితే నీకింత ఆగ్రహం రాకపోను.

నిన్ను చాలా హైరానా పెట్టాను కదూ!


ప్రతి విషయంలోనూ మంకుపట్టు పట్టేవాడిని. ఆరోజుల్లో పట్టుదల అలాంటిది.

నాకు సరైన ఉద్యోగం లేనప్పుడు, పెళ్లై ఆరేళ్ళైనా ఇంకా పిల్లలు కలగలేదని, ఇలా ఎన్నో సార్లు నిన్ను అతలాకుతలం చేసాను.

దేవుడు కరుణించి పిల్లలు పుట్టాక ఏడు కొండలు కాలి నడకన వస్తానని మొక్కుకుని... ఇలా ఏవేవో ఇబ్బందులకు గురిచేశాను కదూ. "


భర్త మాటలు వింటున్న శశిరేఖకు దుఃఖం పొంగుకొచ్చింది.

"అంతేనా! బిడ్డలు కలగలేదని మీ అమ్మగారు రోజూ నన్ను వేపుకుతింటుంటే నా తరపున ఒక్క మాటైనా మాట్లాడారా?

మీకు రెండోపెళ్లి చేస్తానంటూ మీ అమ్మ గంతులేస్తుంటే గమ్మునున్నారే గానీ నోరు మెదిపారా?! పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతుంటే నా అదృష్టం బావుండి మీరు బాత్ రూమ్ లో కాలుజారి స్పృహతప్పి పడిపోవడంతో ఆ పెళ్లి ఆగిపోయింది . లేకపోతే నా గొంతు కోసేవారేగా! " తనలో తనే గొణుక్కుంటూ కొంగుతో కళ్ళొత్తుకుంది .


"ఎట్టకేలకు ఒక కొడుకు పుట్టి వాడు ఎదిగే క్రమంలో ఎదురైన కష్టాలు, ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టినప్పుడు నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు కదూ!" అన్నాడు సుందరం తలొంచుకుని నేలచూపు చూస్తూ.


కాదా మరి! ఉద్యోగం అంటూ ఊళ్ళు తిరుగుతూ ఇంట్లో ఏముందో ఏం లేదో కూడా చూసేవారు కాదు. ఒకోసారి తినడానికి కూడా ఇంట్లో ఏమీ వుండేది కాదు. పక్కింటివాళ్ళు ఏదో ఇస్తే పిల్లాడికి పెట్టి, నేను పస్తుండేదాన్ని. కానీ ఇవన్నీ మీకు ఎప్పుడూ చెప్పలేదు. మీరు బాధపడతారని కాదా! కళ్ళు తుడుచుకుని మందుల పెట్టె బ్యాగ్గులో సర్దుకుంది శశిరేఖ."నేనొక సంబంధం మాట్లాడాక అబ్బాయి వేరే పిల్లని పెళ్లి చేసుకుంటానని పట్టుబడితే నువ్వెంతగా నలిగిపోయావో కదా! వాడు ఈ ఇంటితో తెగదెంపులు చేసుకున్నప్పుడు కూడా ఇంట్లో అయిన గొడవలు అన్నీ ఇన్నీ కావు . అప్పటికీ ఏదో గందరగోళం జరగబోతోందని

నన్ను ముందే హెచ్చరించావు. ప్చ్.. నేనే ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు."అన్నాడు సుందరం కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకుంటూ.


'అప్పుడు చేసిన తప్పులకు ఇప్పుడు రాజీకి వస్తున్నట్టున్నారు పాపం. ఆ పప్పులు మనదగ్గర ఉడకవు.

ఊ.. ఇప్పుడు నా విలువ తెలిసొచ్చినట్టుంది.

అవును! అటు కొడుక్కి చెప్పలేక, ఇటు ఈ మూర్ఖపు మనిషికి నచ్చచెప్పలేక ఎంత వేదన అనుభవించానో ఆ దేవుడికే తెలుసు . కొంత కాలం కొడుకుదగ్గర వుండి వస్తాను. అప్పుడే ఈయనకు నా విలువ తెలిసేది' అనుకుని బ్యాగ్ భుజానికి తగిలించుకుంది శశిరేఖ.


"నీకూ నాకూ మధ్యన ఏమంత దూరం ఉందని?! ఒకరికొకరం తెలియనంత ఎడం కాదుగా.

ఒక గోడే అడ్డం . నా మాటలు నీకు వినబడుతున్నాయా....నన్ను అర్ధం చేసుకుంటున్నావా?" అన్నాడు.

'ఎందుకు వినబడవు. ఒకే ఇంట్లో వున్నా నన్ను ఓ గోడగానో తలుపుగానో భావించారు తప్ప నాకూ ఓ మనసుందని గుర్తించలేదు. అడుగడుగునా అన్నీ నేనే సర్దుకు పోయాను మీ ధోరణే మీదిగా ఆలోచించారు తప్ప, నా మనసు అర్ధం చేసుకున్న పాపానపోలేదు.

మీ ఈగో తో నేను అలిసిపోయాను.

యాంత్రిక జీవితానికి స్వస్తిచెప్పి, నా కొడుకు దగ్గరకి వెళ్లి కొన్నాళ్ళు నిశ్చింతగా గడుపుతాను'

అనుకుంది శశిరేఖ.


"నిన్నిక బాధ పెట్టను. నా మాట నమ్ము.

నేను ప్రశాంతంగా వుంటూ నిన్నూ ప్రశాంతంగా ఉంచాలని నిర్ణయించుకున్నాను.

నీకు ఇబ్బంది కలక్కుండా చూసుకుంటాను.

ఇకనుంచి నిన్ను భద్రంగా చూసుకోవడం నా కర్తవ్యంగా భావిస్తాను." అన్నాడు సుందరం."ఇదిగోండి! మీరెన్ని కబుర్లు చెప్పినా నా మనసు మారదు. నేను వెళ్లే తీరతాను. విసిగిపోయిన నా మనసుకు కాస్త ఊరట కావాలిప్పుడు" అంటూ భర్త దగ్గరకి వెళ్ళి బ్యాగ్ పట్టుకుని నిలబడింది.


"నిన్ను చూసినప్పుడల్లా నా గతం మెదిలి నాలో పాశ్చాత్తాపం కలుగుతుంది తెలుసా? అందుకే నీతో ఈ మాటలు చెప్తున్నా" అన్నాడు సుందరం తల పైకెత్తి చూడకుండానే.


"అవునా! మీ తప్పు ఇప్పుడు తెలుసుకున్నారా? లేక నా ప్రయాణం ఆపటానికి ఇదొక ఎత్తా?" అంటూ బ్యాగ్ పక్కన పెట్టి భర్త పక్కనే కూర్చుంది శశిరేఖ.


"నిన్ను ఫోటో తీసుకుని నా వాల్ పేపర్ గా పెట్టుకుంటానుండు. రోజూ చూసుకుంటుంటే నాలో ఆవేశం అదుపులో ఉంటుంది " అని ఫోన్ తీశాడు సుందరం.


శశిరేఖకు భర్త మీద జాలి, ప్రేమ ఉప్పొంగాయి. అంతకంటే దిగజార్చి భర్తని తన కాళ్ళ దగ్గరకి రప్పించుకునే ఉద్దేశ్యం లేదామెకు.

సరే అని పొజిషన్ లో భర్త ఎదురుగా కూర్చుని ఫోటోకి ఫోజిచ్చింది శశిరేఖ.


అతను ఫోన్ లో కెమెరాని క్లిక్ మనిపించాడు. టీపాయ్ మీదున్న 'ఈ సీ జీ' పేపర్ ని ఫోటో తీసుకుని , ఫోన్ లో వాల్ పేపర్ గా అమర్చుకున్నాడు.


అదిచూసిన శశిరేఖకి ఒళ్ళుమండింది.

ఇంతసేపూ చెప్పిన మాటలన్నీ 'ఈ సీ జీ' ప్రేయసితోనా? నేనింకా నా మీద ప్రేమతో

చెబుతున్నారనుకున్నాను. మీకసలు గుండె అనేది ఉంటేగా. అక్కడున్నది బండరాయని ఎప్పుడోనే నాకు తెలుసు. అయినా ఏదో పిచ్చి ఆశతో ఎదురుచూసి మోసపోయాను" అని ఏడుస్తూ బ్యాగ్గు తీసుకుని వెళ్లిపోబోయింది.


"ఆగు రేఖా! నేను ఈ సీ జీ తో చెప్పే మాటలు నీకూ వర్తిస్తాయి.

ఆనాడు మా అమ్మ నాకు రెండోపెళ్లి తలపెట్టినప్పుడు ఆవిడని ఎదిరించలేకపోయాను. ఒత్తిడి భరించలేక పోయాను. కానీ నీ గురించి ఆలోచించటం మానలేదు. బాత్రూం లో స్పృహ తప్పింది మీ అందరికీ తెలుసు. కానీ గుప్పెడు నిద్ర మాత్రలు మింగిన సంగతి నాకు మాత్రమే తెలుసు.

బతుకంతా ధారపోస్తూ దేనికో ఒకదానికి తాపత్రయ పడుతూనే ఉంటాం అందరం.

జీవితంలో అతి ముఖ్యమైన వాటిని మాత్రం అశ్రద్ధ చేస్తాం.


ఆరాటాలన్నీ అణగారిపోయాక, అప్పుడు నిర్లక్ష్యం చేసినవే ఇప్పుడు అతి ముఖ్యమైనవని గుర్తిస్తాం. అప్పటికే చాలా ఆలస్యమైపోతుంది. అందులో ఒకటి భార్య, రెండోది హృదయం.

అలసిపోతున్న గుండెను , అనుసరిస్తూ వస్తున్న భార్యను సరైన సమయంలో గుర్తించం.


మీ ఇద్దరికీ ఒక విన్నపం .

నువ్వు నాతోనే ఉండాలి. నా భాగ్యరేఖలా.

నా అదృష్ట లలాట రేఖలా.

ఈ సీ జీ మాత్రం అస్తవ్యస్తంగానే ఉండాలి.

మనిద్దరం జీవితంలో చవి చూసిన ఎత్తుపల్లాల్లా, కష్ట సుఖాల్లా . అవి పైకీ కిందకీ ఉంటేనేగా మనం మరి కొంతకాలం కలిసుండేది" అన్నాడు సుందరం భార్యను దగ్గరకు తీసుకుంటూ.


ఈ సీ జీ రిపోర్ట్ చేత్తో పట్టుకుని, "మీకు గుండె నొప్పి వచ్చిన సంగతి నాకెందుకు చెప్పలేదండీ . ఇది గుట్టుగా ఉంచాల్సిన విషయమా?" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది శశిరేఖ.


భార్య మాటను, గుండె చప్పుడును ఈ రెండూ చేస్తున్న హెచ్చరికల్ని పట్టించుకోకపోతే పర్యవసానం ఇలాగే ఉంటుంది" అన్నాడు సుందరం భార్య కళ్ళలోకి చూస్తూ.


" మీకేమన్నా అయితే నా గతేమికాను?! మిమ్మల్ని విడిచి ఎక్కడికీ పోనండీ" అంటూ అతని చేతితో చేయికలిపింది.

భార్య చేతిని మృదువుగా పట్టుకుంటూ "నీగురించి నాకు తెలుసు.నేను జాగ్రత్తగా ఉంటే, నువ్వూ నన్ను భద్రంగా చూసుకుంటావ్" అన్నాడు.

చివ్వున తల పైకెత్తి చూసింది.

" చెప్పేది నాతోనేనా లేక మీ గుండెతోనా?" అంది.

"ఇద్దరితోనూ. అదే నువ్వు, నువ్వే అది !" అన్నాడు భార్యను దగ్గరకు తీసుకుంటూ.

కన్నీటితో అతని భుజాలు తడిపింది శశిరేఖ..


---------------------

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

విశాఖపట్నం.

భర్త : గొర్తి శ్రీనివాస్ గారు

ఇద్దరు పిల్లలు. కుమార్తె, కుమారుడు

గత కొంతకాలంగా సామాజిక సమస్యలను అధ్యయనం చేస్తూ

కథలు , కవితలు రాస్తున్నాను. సమాజంలోకి, వ్యక్తులలోకి, మనసులలోకి

తొంగి చూస్తాయి నా రచనలు.

హాస్య రస ప్రధాన రచనా ప్రక్రియ మీద మక్కువ ఎక్కువ.

కథలు, కవితల పోటీలలో బహుమతులతో పాటు వివిధ పత్రికలలో ప్రచురణ.

సామాజిక ప్రయోజనం కలిగిన కొత్త ఆలోచనకు బీజం వేయగలిగే రచన చేసినపుడు కలిగే తృప్తి నా రచనలకు మూలధనం.


85 views0 comments
bottom of page