కష్టే ఫలి
- Yasoda Gottiparthi

- Apr 7
- 4 min read

జీవితంలో కష్టం, నిజాయితీ, పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా జయించవచ్చు. అలాంటి ఒక సాధారణ కుంభకారుడి కథ… చివరకు గొప్ప విజయంగా మారింది.
Kashte Fali - Telugu Moral Story | Yasoda Gottiparthi
కష్టే ఫలి - తెలుగు నీతి కథ | యశోద గొట్టిపర్తి
Published In manatelugukathalu.com On 07/04/2026
చంద్రయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన పెద్ద చదువులు చదువుకోలేదు. నేర్చుకున్న అక్షరాలు, పేరు రాయడం, అంకెలు, లెక్కలు మాత్రమే తెలుసు. చంద్రయ్య చాలా ఏళ్ల నుండి కుండలు, బొమ్మలు చేస్తూ జీవితం గడుపుతున్నాడు. కుండల కోసం మట్టి తీసుకురావడానికి చెరువుగట్టుకు వెళ్లడం, అక్కడ ఉన్న మట్టిని తట్టలతో తీసుకెళ్లి బండిలో వేసి ఇంటికి తెచ్చుకునేవాడు. వాడుక ఎక్కువ కావడం వల్ల చెరువులో మట్టి అంతా అయిపోయి వండ్రుమట్టే తేలింది. కొత్త మట్టి తీసుకురావడానికి అడవిలో చెరువుకు బయలుదేరాడు.
“వద్దండీ! అంత దూరం.. దారిలో క్రూర మృగాలు ఉంటాయి. వాటి బారి నుండి తప్పించుకోవడం కష్టం. వేరే ఇంకేదైనా పని చూసుకోండి” అని బ్రతిమలాడినా వినలేదు.
"ఈ చెరువునంతా ఆక్రమించుకొని ఇళ్లు కట్టి, వాళ్ల స్థలాన్ని ఆక్రమించుకొని మనకు పని లేకుండా, ఆదాయం లేకుండా చేశారు," అన్నాడు.
చంద్రయ్య తన స్నేహితుడు రామయ్య దగ్గరికి వెళ్లి తన సంగతంతా చెప్పాడు. అంతా విన్న తర్వాత రామయ్య "నేను కూడా నీతో అడవికి వస్తాను," అన్నాడు.
ఇద్దరూ కలిసి వెళ్తుంటే పేదరాశి పెద్దమ్మ ఎదురయింది.
"నాయనలారా! మీరు ఈ అడవి వైపు వస్తున్నారు. ఎందుకని?" అన్నది.
"పెద్దమ్మా! మేము స్వతహాగా కుండలు చేసే కుమ్మర్లం. అడవిలోకి వెళ్లి రకరకాల బొమ్మలు, వస్తువులుగా తయారు చేస్తాము. కావలసిన మట్టి, రంగులు, సుద్ద దొరకడం లేదు. పెద్ద పెద్ద చెరువుల వద్ద దొరుకుతుందని వెళ్తున్నాము..." అని చెప్పగానే, "అలాగా? మీరు బొమ్మలు తయారు చేస్తారు కాబట్టి, అవి సరిగా అతుక్కోవడానికి నా దగ్గర మంచి బంక ఉంది. అది ఇస్తాను, తీసుకెళ్లండి," అన్నది.
"సరే పెద్దమ్మా," అని సంతోషంగా తీసుకొని బయలుదేరారు.
భద్రంగా బంకను బ్యాగులో పెట్టుకుని, "చూచావా రామయ్యా, మనము కొనకుండానే కావలసినంత బంక దొరికింది. అలాగే మట్టి, సుద్దలాంటివి కూడా దొరుకుతాయి. ఈ మార్గంలో మనకు కర్ర ముక్కలు, ఎండిన ఆకులు, మనకు ఇంకా అవసరమైనవి చాలా కనిపిస్తున్నాయి," అని ఆనందంతో చాలా దూరం వెళ్లారు.
ఎన్నో వస్తువులు దొరకడం, అన్నీ ఉపయోగమైనవే కాబట్టి సంతోషపడ్డారు. కొంత దూరంలో ఒక పెద్ద చెరువు కూడా కనిపించింది. దాంతో ఇద్దరి సంతోషం రెట్టింపు అయ్యింది. "కావలసినంత బంక మట్టితో పాటు కుండలు, బొమ్మలు తయారు చేసుకోవచ్చు. చేతినిండా డబ్బులు, ఇంకా మనకు దేనికీ కొదవ ఉండదు. పెళ్ళాం పిల్లలతో సుఖపడవచ్చు.."
నడుస్తుంటే దారిలో కొన్ని మామిడి చెట్లు కనిపించాయి. మామిడి పళ్లు కోసుకున్నారు. కడుపునిండా తిని వాళ్లు బయలుదేరారు. "చీకటి కావస్తోంది. ఈ రాత్రి చెరువు దగ్గరికి చేరడం కంటే ఇక్కడే ఈ మామిడి తోటలో నిద్రపోతే సరి," అని అక్కడే మంచి నిద్రలోకి జారుకున్నారు.
తెల్లవారేసరికి తోట యజమాని వచ్చి, "మా తోటలో మీకు ఏం పని? మామిడి కాయలు కోశారా? అసలు ఈ ప్రదేశానికి ఎవరూ రారు. ఇంత శ్రమపడి ఇక్కడికి వచ్చారంటే ఏదో కారణం ఉండి ఉంటుంది. చెప్పండి," అని బెదిరించాడు.
"సరే చెప్తాం," అని అంతా చెప్పారు.
"ఇలా దొంగతనంగా పళ్లు కోయడం నేరం. వాటికి డబ్బులు ఇచ్చి తీసుకెళ్లండి," అనగానే భయపడుతూ,
"మా దగ్గర డబ్బులు లేవు బాబూ. మేము పొట్ట చేత పట్టుకుని వచ్చాము. ఆకలితో కొన్ని కోసుకుని తిన్నాము.మిగిలినవి తీసుకోండి," అంటూ ఇవ్వబోతే, "తీసుకున్న పళ్లు మాకు అక్కర్లేదు. మీరు నిజంగా పని కోసం వచ్చారా? లేక రౌడీలు, దొంగలు అని అనుమానం వస్తోంది. నేను మీ వెంట వస్తాను. పక్కన చెరువు దగ్గరికి అంటున్నారు మీరు. పదండి," అంటూ ముందు కదిలారు.
ముగ్గురు చెరువు దగ్గరికి చేరుకున్నారు. రామయ్య, చంద్రయ్యలు మట్టితో బొమ్మలు, కుండలు చేశారు. తయారు చేసిన కుండలను పళ్ల బాకీ కింద ఇచ్చారు.
తోట యజమాని వారు మంచివారే అని నమ్మి వెళ్లిపోయాడు. అందమైన బొమ్మలు, కొన్ని కుండలు, కూజాలు, తట్టలు వంటివి తయారు చేయడం మొదలుపెట్టారు. చిన్న గుడిసెలో ఉంటున్నారు.
వారం, పది రోజుల తర్వాత అక్కడికి కొందరు దుండగులు రావడం, వారు చేస్తున్న పనిని చూసి ఆశ్చర్యపోయారు. "ఇంత అందమైన బొమ్మలను మేము ఎప్పుడూ చూడలేదు. రాధాకృష్ణ బొమ్మ చాలా బాగుంది. ఇది ఒక్కటే కాదు, అన్ని బొమ్మలు మాకు కావాలి," అని చెప్పగానే...
(పైకి చూస్తే దొరబాబుల్లా ఉన్నారు. ఈ అడవిలో వీళ్లకి ఏం పని? అన్నీ వీళ్లకే అమ్మేస్తే మన ఊళ్లో కొనుక్కునేవారు నిరాశ పడతారు) అని లోలోపల ఆలోచించి...
"మేము పట్నం తీసుకెళ్లి మా సేటుకు ఇవ్వాలి. మీరు అక్కడికి వచ్చి మా సేటు దగ్గర కొనుక్కోండి," అని సందేహించకుండా గట్టిగా చెప్పారు.
అయినా వినకుండా దుండగులు, "ఈ బొమ్మలు మాకు అమ్మకపోతే చంపేస్తాం," అని బెదిరించారు.
"ఇక్కడ మీకు ఏం సహాయం కావాలన్నా మమ్మల్ని అడగండి. మీరు రకరకాల బొమ్మలు తయారు చేయండి. మీకు కావాల్సినన్ని డబ్బులు ఇస్తాం," అని మంచి మాటలతో స్నేహితులు అయ్యారు.
రామయ్య, "మనకు కావలసింది డబ్బే కదా, వీళ్ళకే అమ్ముదాం," అన్నాడు.
ఇద్దరూ కలిసి నెల రోజుల్లో ఒక వెయ్యి బొమ్మలు తయారు చేశారు. ఒక్కొక్క బొమ్మ వంద రూపాయలకు అమ్మి, లక్ష రూపాయలు చూసి మిక్కిలి సంతోషించారు. ఆ డబ్బులు తీసుకుని తిరిగి వాళ్ళ ఊరికీ వెళ్లిపోయారు.
ఆ దుండగులు ఆ బొమ్మలన్నిటిని విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేయడానికి కొందరు విదేశీ రాయబార్లతో మాట్లాడడం, మధ్యలో లావాదేవీలు చేస్తూ దొంగదారిలో పంపించే ప్రయత్నం చేస్తున్నారు.
రామయ్య, చంద్రయ్య ఇద్దరూ తమ డబ్బులతో కావాల్సిన వస్తువులు కొనుక్కుంటూ సంతోషంగా పెళ్ళాం, బిడ్డలతో ఉన్నారు.
కొన్ని 500 రూపాయల నోట్లలో నకిలీ నోట్లు ఉన్నట్టు కనిపెట్టారు షాపువారు. వెంటనే పోలీసులకు తెలియజేసి, ఇద్దరిని ప్రశ్నించ సాగారు.
"మాకేం తెలియదు. మేము బొమ్మలు తయారుచేసి అమ్ముకున్నాము అంతే. వాళ్లు కొనుక్కున్నారు. మాకు ఈ నకిలీ గుర్తుపట్టడం తెలియదు," అని బ్రతిమిలాడారు.
అయినా సరే వినకుండా, జరిగిన సంఘటన తెలుసుకొని అక్కడికి వెళ్లి ఆ దుండగులు ఉన్నారని వారి కోసం గాలించారు. కానీ వారు అక్కడ లేకపోయేసరికి వారి కోసం వెతకడం మొదలుపెట్టారు.
ఆ దుండగులు తప్పించుకోకుండా అన్ని చెక్ పోస్టుల దగ్గర నిఘా పెట్టారు. వచ్చే వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
బొమ్మల లారీలు రాష్ట్రం దాటుతున్నట్టు తెలుసుకొని, ప్రతి ఒక్క లారీని చెక్ చేస్తున్నారు. పెద్ద, చిన్న బొమ్మలు షాపుల్లో చెక్ చేస్తూ, కొన్నిటిని చంద్రయ్యకు చూపించి గుర్తుపట్టమన్నారు. "తాను చేసిన బొమ్మలు కావని, వాటికి ప్రత్యేకమైన బంకమన్ను సువాసన ఉంటుంది" అని గుర్తించమన్నారు. తయారు చేసిన వాటిని తన దగ్గర ఉన్న కొన్ని వాటిని చూపించాడు. ఆ ఆధారాలతో నకిలీ నోట్ల తయారీ దారులను గుర్తించి ప్రభుత్వానికి పట్టించాలి. అలా రక్షణ శాఖకు మంచి గుర్తింపు తీసుకురావాలని పోలీసులు బలగాలు ముమ్మరం చేశారు.
చివరకు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నట్లు కనిపెట్టారు. వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లి చుట్టుముట్టారు. సమయం చూసుకొని బొమ్మల లారీని దాటిద్దామని వేచి ఉన్న సమయం చూసి పోలీసులు చుట్టుముట్టారు.
రకరకాల బొమ్మలు వివిధ ప్రాంతాల నుండి తయారైనవి కూడా ఉన్నాయి. ఒక్కొక్కటీ ప్రత్యేకంగా పరీక్షించుచుండగా కొన్ని సువాసనతో ఉన్నాయి. కొన్నిటికి మెరుపులు అద్ది ఉన్నాయి.
వాటిని పరీక్షించగా ఏదో లోహం అంటుకుని ఉండవచ్చు అని ప్రయోగశాలకు పంపించారు. బంగారం గుర్తులున్నాయి అని తేలింది. బొమ్మలతో పాటు కొన్ని బంగారు నాణాలు కూడా ఎవరికంటా పడకుండా కుండలు, బొమ్మల మధ్య పెట్టి పంపిస్తున్నట్లు తెలిసింది.
పోలీసులు వెంటనే వివరాలతో సహా కోర్టులో ప్రవేశపెట్టారు. వెంటనే వాటన్నిటిని సీజ్ చేసి, నకిలీ నోట్ల తయారీ ప్రదర్శన ప్రదేశానికి వెళ్లి ఫోటోలతో సహా వాటిని ప్రభుత్వానికి పంపించి, ఆ దుండగులకు కఠిన శిక్షలు విధించాలని కోరారు.
ఎంత ప్రయత్నించినా కనిపెట్టలేని, చాలా రోజుల నుండి సాగుతున్న నకిలీ నోట్ల వ్యాపారం చంద్రయ్య, రామయ్య వల్ల బయటపడి దుర్మార్గులకు దొరికినందుకు ప్రభుత్వం వారిరువురిని ప్రశంసించింది.
అంతేకాకుండా వారిద్దరికీ అవార్డులను ప్రకటించింది.
వారి పట్టుదల, పడిన కష్టం అంతా ప్రభుత్వానికి మేలు జరిగినందుకు, వారికి ఒక్కొక్కరికీ లక్ష రూపాయల పారితోషకమిచ్చి, వారిద్దరికీ పెద్ద షాపులను కట్టించింది. వారిద్దరు సుఖసంతోషాలతో కాలం గడుపుతున్నారు.
(నీతి : నిజాయితీతో కష్టపడి పని చేస్తే ఏదో ఒకరోజు మంచి జరుగుతుంది)
సమాప్తం
యశోద గొట్టిపర్తి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం




Comments