top of page
Original.png

గోండుల రగల్ జెండా

కొమరం భీమ్, గోండులు, జోడేఘాట్, నిజాం, తెలంగాణ చరిత్ర, ఆదివాసులు, గిరిజన ఉద్యమం, జల్ జమీన్ జంగిల్, చారిత్రక కథ, గోండీ, అటవీ హక్కులు, స్వాతంత్ర్య పోరాటం

కొమరం భీమ్ నాయకత్వంలో రగల్ జెండా ఎగురవేస్తూ గోండుల అటవీ హక్కుల పోరాట దృశ్యం
కొమరం భీమ్ నాయకత్వంలో రగల్ జెండా ఎగురవేస్తూ గోండుల అటవీ హక్కుల పోరాట దృశ్యం

Gondula Ragal Jenda - Telugu Inspirational Story | AyyalaSomayajula Subrahmanyam 

గోండుల రగల్ జెండా - తెలుగు ప్రేరణాత్మక కథ | అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత   

Published In manatelugukathalu.com On 15/07/2026


"అడవిలో పుట్టి... అడవినే జీవనాధారంగా మార్చుకున్న గోండులు... తమ సొంత భూమిలోనే పరాయివారయ్యారు. ఆ అన్యాయానికి ఎదురు నిలిచిన ఒక యువకుడు 'జల్-జమీన్-జంగిల్' అనే నినాదంతో చరిత్రను మార్చాడు. ఆ మహావీరుడే... కొమరం భీమ్!" 


అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము గారి గోండుల రగల్ జెండా కథను చదవండి. 

వాళ్ళు అడవితల్లి బిడ్డలు. ఎటు చూసినా పచ్చదనమే. స్వచ్ఛమైన నీళ్ళు, ఎత్తైన కొండలు. వీటి మధ్య స్వేచ్ఛగా జీవితం గడుపుతారు. అలాంటిది అడవి మీది కాదంటూ పరిమితులు విధించి, పన్నులు బాదితే ఎలా ఉంటుంది…? పచ్చటి అడవిపై ఎర్ర రంగు పులుముకుంటుంది. 


నిజాం రాజుకు వ్యతిరేకంగా జరిపిన గోండుల పోరాటం ఇలాంటిదే. గోండులు తరతరాలుగా తెలుగుగడ్డపై నివసిస్తున్న ఆదివాసులు. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. దండకారణ్యం వీరి కేంద్రస్థానం. మాతృభాష గోండీ. అయినా తెలుగు కూడా చక్కగా మాట్లాడుతారు. 


భారతదేశంలో బ్రిటిష్ పాలన స్థిరపడేవరకూ గోండులు అడవిలో స్వేచ్ఛగా జీవించారు. పాలన తమ ఇష్టానుసారంగా సాగేందుకు బ్రిటిష్ వాళ్ళు తోచిన చట్టాలు చేశారు. వాటిపై అవగాహన లేని నిరక్షరాస్యులైన ప్రజలు ఎన్నో ఇబ్బందులకు లోనయ్యారు. అలాంటిదే అటవీ చట్టం. 

ఇది అడవుల నరికివేతపై ఆంక్షలు విధించేందుకు ఉద్దేశించినది. ఇంకా గడ్డి మేపితే, కట్టెలు కొడితే, కష్టపడి పండిస్తే  పన్నులు విధించేది ప్రభుత్వం. దీనికి తోడు అడవి నరికి సాగుయోగ్యం చేశాక, భూమికి మేం పట్టాదారులమని వచ్చే మైదాన ప్రాంతాలవారు, వడ్డీ వ్యాపారుల ఆగడాలు, పోలీసులు, రెవెన్యూ అధికారుల  జులుం - ఇలాంటివన్నీ ఆదివాసుల పట్ల ద్వేషాన్ని పెంచాయి. 


అలాంటి ఓ సంఘర్షణను, ఓ ఉద్యమానికి ముందుండి నడిపించిన పోరాట యోధుడే కొమరం భీమ్. ఆ గిరిజన వీరుడి జీవిత అక్షరీకరణే ఈ “కొమరం భీమ్” కథ. 


“జల్-జమీన్-జంగిల్”


అటవీ హక్కుల కోసం నిజాం రాజుపై గోండుల తిరుగుబాటు ఉదంతాలే ఈ కథలోని అంశాలు. ఆదిలాబాద్ జిల్లాలో గోండులు, కొలామీలు పక్కపక్కనే జీవనం సాగిస్తుంటారు. గోండులు భీముణ్ణి తమ మూలపురుషుడిగా నమ్ముతారు. భీముడికి హిడింబి వల్ల ఘటోత్కచుడు కాక  మరో కొడుకు జన్మించాడని, ఘటోత్కచుడి సంతతి గోండులని, మరో కొడుకు సంతతి కొలామీలని చరిత్ర మరియు పౌరాణిక కథనం. 


కొమరం భీముడు పదిహేనేళ్ళ వయసున్నప్పటి నుంచి పరిస్థితుల ప్రభావంతో ఈ కథనం మొదలవుతుంది. భీము తండ్రి చిన్ని, సంకెపల్లి గూడెం పటేలు. అడవిని నమ్ముకుని జీవనం సాగించే గోండులకు నిజాం ప్రభుత్వం అడవి చట్టాలు చేయడంతో కష్టాలు మొదలయ్యాయి. వారికి చట్టాలు, కోర్టు వ్యవహారాల్లోని మతలబులు తెలియవు. 


దాంతో ఎక్కడికక్కడ మోసానికి గురయ్యేవారు. పండిన పంట అంతా వ్యాపారుల పరం అయ్యేది. ఇదంతా అన్యాయంగా కనపడుతుంది భీముకు. పశువుల మేత కోసం చెట్టుకొమ్మలు నరికినందుకు జంగ్లాత్ (అటవీ) శాఖ వాళ్ళు భీము అనుచరుడి చేతివేళ్ళు నరుకుతారు. ఇది భీము హృదయాన్ని కలచివేస్తుంది. 


అడవిలో ఉన్నవాళ్ళు అడవిని నరకకుండా ఎలా ఉంటారని తండ్రిని ప్రశ్నిస్తాడు భీము. అప్పుడు అదే గూడేనికి చెందిన మోతీరాం, గోండులు ఎలా మోసపోతున్నారో వివరిస్తాడు. అంతేకాదు, 1850లలో ఆంగ్లేయులతో జరిగిన పోరాటంలో గోండు రాజు రాంజీ అమరుడైన విషయాన్ని చెబుతాడు. 


దాని నుంచి స్ఫూర్తి పొందుతాడు భీము. భూసారం తగ్గిపోవడంతో భీము వాళ్ళు సంకెపల్లి వదిలి సుర్దాపురం వలస వెళతారు. మళ్ళీ అడవి నరికి భూమిని సాగుయోగ్యం చేసుకుంటారు. పంట చేతికొచ్చే సమయానికి మళ్ళీ మామూలే. 


ఈ ప్రాంతానికి నేను పట్టాదారునని సిద్దిక్ అనే నిజాం మనిషి వస్తాడు. గోండులకు, సిద్దిక్ అనుచరులకు జరిగిన ఘర్షణలో భీము సిద్దిక్కును లట్టూతో (ఒకరకమైన కర్ర) కొడతాడు. దెబ్బ బలంగా తగిలి సిద్దిక్కు మరణిస్తాడు. భయపడ్డ భీము పారిపోతాడు. 


అప్పుడు సర్కార్ అసలు ఎలా ఉంటుంది? పట్టా అంటే ఏమిటి? వాటిని ఎవరు ఇస్తారు? లంచం ఇస్తే పట్టాలిస్తారా? అని అనుకుంటాడు. కొండల్ అనే యువకునితో కలిసి తమ గూడేలన్నిటికీ పెద్ద ముఖాసీని కలిసి జరిగినదంతా వివరిస్తాడు భీము. ముఖాసీ, భీముతో ఉద్రేకం పనికిరాదంటాడు. 


ముఖాసీలు, పటేళ్ళు ప్రభుత్వంతో రాజీపడటంతో వారి నుంచి సాయం అందదని అర్థమవుతుంది. 


ప్రయాణాన్ని కొనసాగించి మహారాష్ట్రలోని చాందాకు చేరతాడు. విటోబా అనే స్వాతంత్ర్య  సమరయోధుడి దగ్గర కొంతకాలం పనిచేస్తాడు. ఆయనని పోలీసులు అరెస్టు చేస్తారు. అక్కడి నుండి ఓ దళారి వెంట చాయ్ పత్తి దేశం (అస్సాం) వెళ్తాడు. ఆంగ్లేయుల యాజమాన్యంలో ఉండే తేయాకు తోటలో కూలీగా చేరతాడు. 


దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. అక్కడ యజమానులు కూలీలకు సరైన వేతనాలు ఇవ్వరు. పైగా మేస్త్రీలు కూలీలను కొరడాలతో కొడుతూ, తిడుతూ హింసిస్తుంటారు. ఓ రోజు ఓ మేస్త్రీ భీమును కొరడాతో కొడతాడు. భీము తిరగబడతాడు. యజమానులు నిర్బంధిస్తే తప్పించుకొని బయటపడతాడు. 


చివరకు తన అన్నలను కలుసుకుంటాడు. లచ్చుపటేల్ దగ్గర పాలేరుగా చేరతాడు. పటేల్ కోమితో భీముకు పెళ్ళి జరిపిస్తాడు. తరువాత మరో రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు భీము. 


లచ్చుపటేల్ వ్యవసాయం లాభాల్లో సాగుతుంది. భీము తెలివికి ఆశ్చర్యపడ్డ పటేల్, తాను భూమిని సాగు చేస్తున్న విషయాన్ని చూసిచూడకుండా ఉండేందుకు అమీన్ దగ్గరకు పంపిస్తాడు. భీము, వ్యవహారాన్ని సాధిస్తాడు. ఇది తనవల్లే జరిగిందని భీము భ్రమిస్తాడు. 


కానీ లచ్చుపటేల్ గోండుల్లో స్థితిమంతుడు, ఎప్పటికైనా పనికివస్తాడనే ఉద్దేశంతో సమ్మతిస్తాడు అమీన్. ఈ వార్త అన్ని గూడేల్లోకీ పాకుతుంది. గోండులు తమ నాయకుడిగా భీమును ఆహ్వానిస్తారు. భూమిపై హక్కు కోసం కోర్టుల చుట్టూ తిరగడం, గెలవకపోవడంతో పాటు జంగ్లాత్ వాళ్ళతో ఘర్షణ పడటం, వాళ్ళేమో పంటలు, గూడేలు తగులబెట్టడం, స్త్రీలను చెరచడం సాధారణంగా జరిగిపోయేవి. 


గూడేలకు వచ్చిన జంగ్లాత్ వాళ్ళు లంచాలిస్తే, మీ దగ్గరికి మేం రామంటారు. దాంతో ఇదంతా ప్రభుత్వానికి తెలియదేమోనని అనుకుంటారు గోండులు. 

అధికారులతో ‘గోండులు నిజాయితీపరులు. లంచాలు అడిగి మమ్మల్ని దొంగలని చేయకండి, మీరు దొంగలు కాకండి’ అంటారు. 


తుడుందెబ్బ:


 ఓమారు భీము అటవీ భూములపై హక్కు కోసం నిజాం నవాబును కలిసేందుకు హైదరాబాద్ వస్తాడు. అక్కడ చుక్కెదురవుతుంది. గోండు రాజ్య స్థాపన కోసం తిరుగుబాటు చేయాలని నిశ్చయించుకుంటాడు. గోండు దళాన్ని ఏర్పాటు చేస్తాడు. లడాయికి (పోరుకు) సిద్ధం కావలసిందిగా తుడుం (నగారా) మోగిస్తాడు. 


రగల్ ఝండా ఎగురవేస్తాడు. వడిసెలు, ఈటెలు, గొడ్డళ్ళు, నాటు తుపాకులు (బర్మార్లు) వంటి వాటితో ఆధునిక ఆయుధాలున్న నిజాం సేనతో యుద్ధ సన్నాహాలు చేస్తుంటారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వం సైన్యాన్ని పంపుతుంది. 


కొన్ని రోజులు యుద్ధం జరిగిన తరువాత, అధికారులు రాజ్యాధికారం ఇవ్వం కానీ ఈ భూమిపై పట్టాలిస్తామంటారు. అందుకే మధ్యవర్తిగా వచ్చిన నాజం (డిప్యూటీ కలెక్టర్) తో భీము, “మేము సేద్యయోగ్యం చేసిన భూములను గుంజుకున్నారు. ఆకలితో మేము చస్తూంటే, మమ్మల్ని దోచిన సొమ్ముతో మీరు విందులు, వినోదాలు, విలాసాలు, జల్సాలు చేసుకోవడం కోసం మారణహోమం చేశారు. పంట తీసే మా చేతులను, బంగ్లాలు కట్టే మా చేతులను నరికారు. 


మా చెమట నెత్తురును జలగల్లా తాగారు. మా జీవన సంస్కృతిని నాశనం చేశారు. మీ సర్కార్ పెట్టే బిచ్చం మాకక్కరలేదు” అంటాడు. 


పన్నెండు గూడేల గోండులు, కొలామీలతో కలిసి జోడేఘాట్‌లో ఏడు నెలల పాటు పోరాటం సాగిస్తాడు భీము. చివరికి 1940 సెప్టెంబర్ ఒకటిన వీరమరణం పొందాడు. తమ హక్కుల కోసం, నిరంకుశ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన భీము, గోండుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. 


అడవిని నరికి సాగుయోగ్యం చేసి, అడవి పందులతో పోరాడి, పంటను, క్రూరమృగాల బారి నుంచి పశువులను కాపాడుకుంటారు గోండులు. అయితేనేం, అధికారం పేరుతో దాడికి వచ్చే సాటి మనుషుల నుంచి మాత్రం వాళ్ళు ఓటమి, అవమానాలు పాలయ్యే విషయం ఈ కథ ప్రధాన వృత్తాంతం. 


గోండుల జీవితాన్ని, నమ్మకాల్ని, పోరాటాల్ని కళ్ళకు కట్టే విధంగా చెప్పే ప్రయత్నమే ఈ కథ వృత్తాంతం. 


ఈ భీముడే “కొమరం భీము”. 

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ కట్టపై భీము విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం ఆ విగ్రహం ఉంది.


జైహింద్


అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము
అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము

 రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.


అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.


ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,


ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి


మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్‌ వాణి, మన తెలుగు కథలు.కామ్‌.


బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక


ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్‌.


కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.


ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్‌ మరియు


త‌పస్విమనోహరము.


ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్‌


చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.


సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్‌ బహుమతులు.


ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.


కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







bottom of page