top of page

కస్తూరి రంగ రంగా!! 2

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Youtube Video link

'Kasthuri Ranga Ranga Episode 2' New Telugu Web series


Written By Ch. C. S. Sarma


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


సిహెచ్. సీఎస్. శర్మ గారి ధారావాహిక కస్తూరి రంగ రంగా రెండవ భాగం


గత ఎపిసోడ్ లో

బ్రహ్మయ్య మనవడు శాలివాహనను కిడ్నాప్ చేసినట్లు అగంతకులు ఫోన్ చేసి చెబుతారు.

భయపడ్డ బ్రహ్మయ్యకు ధైర్యం చెబుతారు అతని స్నేహితులు పుండరీకయ్య, సయ్యద్ లు.

కిడ్నాపర్లు అడిగిన సొమ్ము సమకూర్చుకోవడంలో బ్రహ్మయ్యకు సహకరిస్తారు.ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 2 చదవండి...ఉత్తరం సాంతం చదివేసరికి, కుసుమ కళ్లల్లో నీళ్లు నిండాయి. చెక్కిళ్లపైకి జారాయి.


"ఏమ్మా కుమమా! జాబు వ్రాసింది శశాంకేనా!” అడిగాడు పుండరీకయ్య.


"ఆ. అవునన్నా!” కన్నీటితో దీనంగా పలికింది కుసుమ. క్షణం తర్వాత “తన కొడుకు శాలివాహన మా దగ్గర క్షేమంగా ఉన్నాడని వాడు, కోడలు అనుకుంటున్నారు. ఇక్కడ పరిస్థితి…" భోరున ఏడ్చింది కుసుమ.

"అమ్మా..! ఏడవకు. మనం అంతా సిద్ధం చేసుకొన్నాముగా! డబ్బు వాడి ముఖాన కొట్టి బిడ్డని రేపు తెచ్చుకొంటాం కదమ్మా. బాధపడకు.. భయపడకు." ఓదార్చాడు పుండరీకయ్య. అతని మాటలకు కుసుమకు కొంత వూరట కలిగింది.

* * * * *

బ్రహ్మయ్యగారు సుల్తాన్ సాయంతో బ్యాంకునుంచి పదిలక్షలను తీసుకొన్నాడు. ఇంటికి వచ్చి ఇరవై లక్షలను ఒక జిప్ బ్యాగ్లో భద్రంగా వుంచి, ఆ రాత్రంతా అతను, భార్య కుసుమ, పుండరీకయ్య బ్యాగ్ ముందు కూర్చొని జాగరణ చేశారు. సుల్తాన్ రెండు పర్యాయాలు వచ్చి వారిని చూచి ధైర్యం చెప్పి వెళ్లిపోయాడు. భారంగా ఆ ముగ్గురి మధ్యన ఆ రాత్రి గడిచింది.


బ్రహ్మయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్దబ్బాయి శశాంక్ ఢిల్లీలో మిలటరీలో ఉద్యోగం. చిన్న అబ్బాయి చంద్రహాస్ అమెరికాలో సైంటిస్ట్. అతని భార్య వినోదిని. డిగ్రీ ఇన్ టెలీకమ్యూనికేషన్.. పనిచేస్తూ వుంది. శశాంక్ వివాహం చాలా ఆలస్యంగా జరిగింది. చంద్రహాస్ కు కొడుకు రఘునాథ్.. కూతురు ప్రగతి. ఇరువురి మధ్యన వయస్సు వ్యత్యాసం రెండు సంవత్సరాలు. వివాహం అయిన మరుసటి సంవత్సరంలో రఘునాధ్ పుట్టాడు.


శశాంక్ కాలేజీ రోజుల్లో ఓ లవ్ అఫైర్లో పడ్డాడు. ఆమె పేరు మహిమ. తన మహిమతో శశాంక్ ను పిచ్చివాణ్ణి చేసింది. తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని శశాంక్ సంబంధంకన్నా గొప్ప కలవారి కొడుకును పెండ్లి చేసికొని ఆస్ట్రేలియా వెళ్లిపోయింది. ఆ షాక్ నుండి తేరుకొనేదానికి శశాంక కు చాలా కాలం పట్టింది. తల్లిదండ్రులు, హితుల మంచి మాటలతో మనస్సును మార్చుకొని ముఫ్పైమూడవ ఏట మధ్యతరగతి కుటుంబానికి చెందిన నిర్మలను.. తల్లిలేని పిల్లను తన తండ్రి, తల్లి ఇష్టానుసారంగా వివాహం చేసుకొన్నాడు.


వివాహం అయిన మూడు సంవత్సరాలకు కవలలు కవిత కమల, ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు శాలివాహన జన్మించారు.

బ్రహ్మయ్యగారి అన్నయ్య గోపాలయ్య. వారి భార్య కాత్యాయని. వారికీ వివాహం అయిన చాలా కాలం సంతానం లేదు. ఎన్నో గుళ్లు గోపురాలు, నదీస్నానాలు పూజలు పునస్కారాలు చేశారు. ఫలితంగా పాతిక సంవత్సరాల తర్వాత బంగారు బొమ్మలాంటి ఆడపిల్ల పుట్టింది. ఎంతో ఆనందంగా ఆ దంపతులు బ్రహ్మయ్య కుసుమల.. బంధుమిత్రుల సమక్షంలో ఆ బిడ్డకు కస్తూరి అని నామకరణం చేశారు.


అందరికీ ఎంతో ఆనందాన్ని పంచింది ఆ చిన్నారి కస్తూరి. ఆమెకు శశాంక్ కు వయస్సు వ్యత్యాసం ఇరవై సంవత్సరాలు. హైదరాబాద్ లో గోపాలయ్య, బ్రహ్మయ్యల అక్కగారు దుర్గాదేవి. కలవారి ఇంటి పెద్దకోడలు.

ఆమెకు ఇరువురు సంతానం. భూషణ్ కుమార్, శ్యామ్ కుమార్. భర్త భూపతిగారు, పిల్లల వయస్సు పద్దెనిమిది ఏళ్ల ప్రాయంలో గుండెపోటుతో మరణించారు. శ్యామ్ కుమార్ కు కొంచం చపలం.


అంతవరకు అత్తమామలకు భయపడి అణకువగా వుండిన దుర్గాదేవి, భర్త గతించిన తర్వాత ఆ ఇంటి సర్వాధికారాన్ని తన చేతులలోకి తీసుకొంది. పిల్లలను అతిగా గారాబం చేసింది. ఫలితంగా పిల్లలు భూషణ్ కుమార్, శ్యామ్ కుమార్ చాలా పెంకిగా విచక్షణారహితంగా అనుకొన్నదాన్ని సాధించే మొండి తత్వంతో ఎదిగారు.


విచక్షణారహితంగా ఆదరాభిమాన రహితంగా స్వార్థంతో, పాపపుణ్య విచక్షణ లేకుండా ఏవిధంగానైనా డబ్బు సంపాదించాలనే తత్వాలతో పెరిగారు. యదార్థంగా గోపాలయ్య సగోత్రులకు, దాయాదులకు దత్తు. వారు గోపాలయ్య, బ్రహ్మయ్యల పెదనాన్నగారు లక్ష్మీపతి, సుగుణాంబ. వారు గతించి చాలాకాలమయింది.


గోపాలయ్యగారు గతించి పదహారు సంవత్సరాలు. ఆ కారణంగా దుర్గాదేవి తన పెద్దకొడుకు భూషణ్ కుమార్ కు గోపాలయ్య కుమార్తె కస్తూరితో వివాహం జరిపించాలనే నిర్ణయించుకొంది. వారిరువురి మధ్యనా వయస్సు వ్యత్యాసం పన్నెండు సంవత్సరాలు. భూషణ్ కుమార్ కు కస్తూరి పట్ల చిన్న వయస్సు నుంచి ఆశ. కస్తూరి కన్నా గోపాలయ్య ఆస్థి.. కస్తూరి తనదైతే ఆ యావదాస్థికి తనే నాయకుడైపోతాననే దురాశ.


ఆ కారణంగా వచ్చిన ప్రతి సంబంధాన్ని నచ్చలేదనేవాడు. తన తల్లి ఎంతో ఆనందంగా వున్న సమయంలో తన నిర్ణయాన్ని తెలియచేశాడు.


దుర్గాదేవి రేపల్లెకు వచ్చింది. తన నిర్ణయాన్ని అన్న గోపాలయ్యకు తెలియచేసింది. వయస్సు రీత్యా పన్నెండు సంవత్సరాల వ్యత్యాసం వున్న కారణంగా దుర్గాదేవి కోర్కెను గోపాలయ్య బ్రహ్మయ్యలు అంగీకరించలేదు. నిరాకరించారు.

దుర్గాదేవి నచ్చచెప్ప ప్రయత్నించింది.


కానీ అన్నాతమ్ములు ఆ అక్క మాటను అంగీకరించలేదు. దుర్గాదేవి ఆగ్రహావేశాలతో వెళ్లిపోయింది. ఆ కారణంగా ఆ రెండు కుటుంబాల మధ్య ద్వేషం, కక్ష, పగ. ఆ మూడు గుణాలు దుర్గాదేవి, భూషణ్ లోని మానవత్వాన్ని దహించాయి.

***

సమయం సాయంత్రం ఆరుగంటలు.

బ్రహ్మయ్యగారి ఫోన్ మ్రోగింది.

"హలో!.".

"ఆ.. రడీ అయినావా?.”.

"అయినాను సార్!.”


“పూర్తిగా తెస్తున్నావా?.”

"ఆ. ఇరవై."


“ఓకే. ఏడుగంటలకు నేను చెప్పిన చోటికి నీవు ఒక్కడివే రావాలి. తోడు ఎవరినైనా తీసుకొనివస్తే. నీ కథ.. వారి కథ.. నీ మనుమడి కథ.. ముగిసిపోతుంది. జాగ్రత్త.. టార్చిలైట్ తెచ్చుకో!."


"అలాగే సార్!."

"కరెక్టుగా ఏడుగంటలకు అక్కడికి చేరాలి!."


"ఆ."

“అర్థం అయిందా!.”

“అయింది సార్ !.”


"ఓకే సార్." వికటంగా నవ్వాడు. సెల్ కట్ చేశాడు.

బ్రహ్మయ్య సుదీర్ఘమైన శ్వాసను తీసుకొన్నాడు. పుండరీకయ్య, సయ్యద్, కుసుమ.. ఆత్రంగా బ్రహ్మయ్యగారి ముఖంలోకి చూచారు.


కిడ్నాపర్స్ చెప్పిన మాటలను వారికి చెప్పాడు బ్రహ్మయ్య. ముగ్గురూ దీనంగా తలదించుకొన్నారు.

"బాధపడకండి. అంతా ఆ పైవాడి నిర్ణయం. ఆనందంగా అనుభవించాలి.” విరక్తిగా నవ్వాడు బ్రహ్మయ్య.

చేతి వాచీని చూచుకొన్నాడు.

ఆరోజు అమావాస్య.


సమయం ఆరుగంటలు. ప్రకృతిని, బ్రహ్మయ్యగారి నిలయాన్ని, మనస్సును.. కారుచీకట్లు క్రమ్ముకొన్నాయి.

తన ఇలవేల్పు ఆ భద్రాద్రి శ్రీ సీతారామచంద్రమూర్తి కళ్యాణఫొటో గోడకు తగిలించి వున్నదాన్ని దీక్షగా కొన్ని క్షణాలు చూచి.. చేతులు జోడించాడు బ్రహ్మయ్య.


కొద్ది నిముషాల తర్వాత డబ్బువున్న బ్యాగ్ ను చేతికి తీసుకొన్నాడు.

కుసుమ బ్రహ్మయ్యగారి చేతికి టార్చిలైటు అందించింది.

పుండరీకయ్య, సయ్యద్, బ్రహ్మయ్య ముఖంలోకి జాలిగా చూచారు.


"మిత్రులారా!. బయలుదేరుతున్నా." విరక్తితో కూడిన నవ్వు..

బ్రహ్మయ్యగారు వరండా దాటి గృహం ముందరి ఆవరణలో ప్రవేశించారు. భార్య. ఇరువురు స్నేహితులు వెనకాల.. బ్రహ్మయ్య వీధిలోకి ప్రవేశించి ఆగాడు.. కుసుమ వీధిగేటు ముందు నిలబడింది. మిత్రులిరువురూ బ్రహ్మయ్య గారికి చెరొక వైపున నిలబడ్డారు.


“జాగ్రత్త అండీ..” గద్గద స్వరంతో చెప్పింది కుసుమ.

"ఏడవకు. ఏం భయంలేదు. మన మనవడితో తిరిగి వస్తాను” చెప్పి ముందుకు సాగాడు బ్రహ్మయ్య,

మిత్రులు పుండరీకయ్య. సయ్యద్ లు వారిని అనుసరించారు. దార్లో ఐదారుగురు గ్రామస్తులు వీరికి ఎదురుపడ్డారు. ముగ్గురూ ఉపాధ్యాయులు కాబట్టి వారు వీరికి నమస్కరించారు.


వీరు ప్రతి నమస్కారం చేసి ముందుకు సాగారు.

కొద్ది నిముషాల్లో ముగ్గురూ వూరి చివరికి వచ్చారు.

బ్రహ్మయ్య ఆగి వారి ముఖాల్లోకి చూచాడు.

“మీరు ఇరువురూ తిరిగి వెళ్లండి. ముందుకు నేను ఒంటరిగానే సాగాలి. మాట తప్పకూడదుగా!." మెల్లగా విచారంతో చెప్పాడు బ్రహ్మయ్య.


“ఆ. అవునవును.” అన్నాడు పుండరీకయ్య.

"మిత్రమా జాగ్రత్త!." చెప్పాడు సయ్యద్.


బ్రహ్మయ్య చేతిలో బ్యాగ్ తో ముందుకు సాగాడు. పుండరీకయ్య.. సయ్యద్ లు, వెళుతున్న బ్రహ్మయ్యను చూస్తూ కొంతసేపు నిలబడ్డారు.


బ్రహ్మయ్య ఆకారం చీకటిలో కలిసిపోయింది.

మిత్రులిరువురూ వెనుదిరిగి ఇండ్లవైపు నడిచారు. కొద్ది నిముషాల్లో ఇరువురూ బ్రహ్మయ్య ఇంటికి చేరారు.


బ్రహ్మయ్య ఆ సీతారామచంద్రమూర్తి నామ జపంతో ముందుకు సాగిపోతూ వున్నాడు.


రోడ్డులో అక్కడక్కడా మిట్టపల్లాలు. వాటిని బ్రహ్మయ్య లెక్కచేయలేదు. పూనకం వచ్చిన వ్యక్తిలా ముందుకు వేగంగా సాగిపోయాడు. దాదాపు ఒక గంట తర్వాత గోదావరి నుండి పంటకాలువ బయలుదేరే ప్రాంతానికి చేరుకొన్నాడు.

గాఢాంధకారం. చుట్టూ కలియచూశాడు.


“కాలవలో దిగి ఆవలివైపుకు రా!." శాసనంలాంటి పలుకు.

“మీరు ఈ వైపుకు రాలేరా!."

“రాము….”


“సరే. వస్తున్నా!.” పంచను ఎత్తి బొడ్లో దోపుకొని. బ్యాగ్ ను తలపై పెట్టుకొని మెల్లగా కాలువలో దిగాడు. నీళ్లు తొడలవరకు వచ్చాయి. క్రింద బురద. నడవటం కష్టం. శ్రమతో మెల్లగా బ్రహ్మయ్య ఆవలి వైపుకు చేరాడు.


"బ్యాగ్ ను క్రింద పెట్టు."

తలపైని బ్యాగ్ ను క్రిందికి దించాడు బ్రహ్మయ్య.


“నా మనవడి గొంతు."

“వినాలని వుందా!."

“అవును.”

వారు శాలివాహన నోటికి అడ్డంగా వేసిన ప్లాస్టర్ తొలగించారు.

“తాతా అని పిలు.” చెప్పారు.


శాలివాహన. “తాతయ్యా!.” బిగ్గరగా పిలిచాడు. ఆ పిలుపు వినగానే బ్రహ్మయ్య శరీరం పులకించింది. వదనంలో సంతోషం.

“నాయనా శాలీ!."


"ఆ.. తాతయ్యా.. వచ్చావా!." దీనంగా అడిగాడు శాలివాహన.

“ఆ.. వచ్చాను నాన్నా.. వచ్చాను.. సార్!. మీకు నమస్కరిస్తున్నాను. నా మనవణ్ణి నా దగ్గరకు పంపండి. ఈ డబ్బును తీసుకోండి!." దీనంగా కోరాడు.


“ఏది ముందు.” వారి ప్రశ్న.

“వచ్చి బ్యాగ్ ను తీసుకొని. డబ్బును చూచుకొని. నా మనవణ్ణి వదలిపెట్టండి సార్!." దీనంగా కోరాడు బ్రహ్మయ్య.


ఆ కాలువగట్టుపైన ఒక ఆకారం.. నల్లని దుస్తులు.. ముఖానికి నల్లటి మాస్కు ధరించిన వ్యక్తి కొద్ది క్షణాల్లో బ్రహ్మయ్యను సమీపించాడు.


“నమస్కారం సార్!.” వినయంగా చెప్పాడు బ్రహ్మయ్య. క్రిందవున్న బ్యాగ్ ను చేతికి తీసుకొని వారికి అందించాడు.

"చూచుకోండి సార్!. ఇరవై. మీరు కోరిన ప్రకారంగానే తెచ్చాను." ఎంతో వినయంగా చెప్పాడు.


ఆ వ్యక్తి బ్యాగ్ తెరచి బ్రహ్మయ్య చేతిలోని టార్చిలైటును లాక్కొని బ్యాగ్ పై వేసి తెరచి డబ్బును చూచుకొన్నాడు.

“అన్నా!. ఓకే. పిల్లోణ్ణి వదులు!." గట్టిగా అరచినట్టుగా చెప్పాడు. బ్యాగ్ తీసుకొని లైట్ వేసుకొంటూ ముందుకు వెళ్లిపోయాడు ఆ వ్యక్తి.


ఆ లైట్ వెలుతురులో తన తాతయ్యను చూచిన శాలివాహన.

"తాతయ్యా!. తాతయ్యా!. ముందుకు రా!." ఆరిచాడు.


బ్రహ్మయ్య ఆనందంతో ముందుకు నడిచాడు. గమ్యం చేరిన కిడ్నాపర్ టార్చిలైట్ ను కాలవగట్టుపై వేశాడు. ఎదురెదురుగా నడచిన బ్రహ్మయ్య. శాలివాహనలు కలసికొన్నారు.


నేలకూలబడి మనవణ్ణి చేతుల్లోకి తీసుకొని “నాయనా!. శాలివాహనా..” తన హృదయానికి హత్తుకొన్నాడు బ్రహ్మయ్య. వేగంగా ఆ ముసుగు మనిషి వారిని సమీపించి టార్చిలైట్ ఇచ్చి వెళ్లిపోయాడు.


వారిలోని ఆ మంచితనానికి బ్రహ్మయ్య అనందించాడు. మనుమడిని భుజాలపై కూర్చొనబెట్టుకొని మెల్లగా కాలువలో దిగాడు. టార్చిలైటును శాలివాహన వేసి బ్రహ్మయ్యను ఆవలిదరి చేరేలా చేశాడు.


"తాతయ్యా!. నేను దిగి నడుస్తా!." అన్నాడు శాలివాహన.

“వద్దు.. వద్దు.. వద్దు నాన్నా. మనం త్వరగా ఇంటికి వెళ్లాలి. నానీ మనకోసం ఏడుస్తూ ఎదురు చూస్తూ వుంటుందయ్యా!." ఆనందపుటావేశంతో చెప్పాడు బ్రహ్మయ్య.. వేగంగా ముందుకు సాగాడు.


బ్రహ్మయ్య వేగాన్ని పెంచి ముందుకు వెళుతున్నాడు. త్వరగా ఇంటికి చేరాలనేది వారి సంకల్పం. పది నిముషాల తర్వాత. తుపాకి పేలిన శబ్దం. మూడుగుళ్లు. ధ్వని. వులిక్కిపడి వెనుతిరిగి చూచాడు బ్రహ్మయ్య.


"తాతయ్యా!. ఏమిటా శబ్దం ?." ఆశ్చర్యంతో అడిగాడు శాలివాహన.

“ఎవరో నక్కల్ని తరుముతున్నారు నాన్నా!.".

“ఏంటీ.. నక్కలా!.”

“అవును.”

"పొలాల్లో నక్కలకు ఏంపని తాతయ్యా?.".

"పండిన పంటను అవి తింటాయి ఆయ్యా!.

"అలాగా!"


"అవును నాన్నా. భయపడ్డావా?."

"ఆహా.. లేదు. మీరు నన్ను ఎత్తుకొని వున్నారుగా!. నాకేం భయం?.." నవ్వాడు శాలివాహన.


మనుమడి ధైర్యానికి బ్రహ్మయ్యగారికి ఆనందం.


‘కానీ.. ఆ మూడు గుళ్లు పేల్చిందెవరు.? సుల్తాన్ అతని మనుష్యులా!. అంటే కిడ్నాపర్స్ ని పోలీసులు ఫాలో చేసినట్లేనా?.. వారికి వీరికి మధ్యన పోరాటమా?.. ఏమిటో అంతా అయోమయం! ఇరవైలక్షలు పోతేపోయింది. నా వంశాంకురం.. వారసుడు.. నా మనుమడు శాలివాహన క్షేమంగా నన్ను చేరాడు. తండ్రీ!. శ్రీ సీతారామచంద్రమూర్తీ. అంతా తమయొక్క కరుణా కటాక్షం తండ్రీ!. నమస్సుమాంజలి. శతకోటి వందనాలు..” ఆనందంగా అనుకొన్నాడు మనస్సున.


"తాతయ్యా!."

"ఏం నాన్నా!."

"మాట్లాడవేం?."

“నాన్నా!. నీవు క్షేమంగా నన్ను చేరావుగా!. మనస్సులో దేవుణ్ణి ధ్యానిస్తున్నానయ్యా!.” నవ్వుతూ చెప్పాడు బ్రహ్మయ్య.


ఇంటిని సమీపించారు. ముందున్న ఆవరణలో ప్రవేశించారు.


వీధివైపే చూస్తున్న కుసుమ, పుండరీకయ్య, అతని భార్య కవిత, సయ్యద్ లు పరుగున వారిని సమీపించారు. కుసుమ బ్రహ్మయ్య భుజాలపై వున్న మనుమడిని అందుకొని తన హృదయానికి హత్తుకొంది. మంచినీళ్లు త్రాగి జరిగిన కథను వారికి వివరించాడు బ్రహ్మయ్య..

ఇంకా వుంది...సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.52 views0 comments

Comentários


bottom of page