top of page
Original.png

ఖాళీ కుర్చీ

ఖాళీ కుర్చీ, మహిళా సాధికారత, తెలుగు కథ, మహిళా నాయకత్వం, ఆత్మవిశ్వాసం, మహిళల స్వీయ గుర్తింపు, గ్రామ మహిళా సంఘం, మహిళా సాధికార కథ, ప్రేరణాత్మక తెలుగు కథ, మహిళల హక్కులు, మహిళా స్వావలంబన, గ్రామ పాలన, మహిళా అభివృద్ధి, తెలుగు సామాజిక కథ, మహిళా చైతన్యం, నాయకత్వ నైపుణ్యాలు, గ్రామీణ మహిళలు, తెలుగు విలువల కథ, తెలుగు కథలు, Mana Telugu Kathalu

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'ఖాళీ కుర్చీ' కథలో గ్రామ మహిళా సమావేశంలో ఆత్మవిశ్వాసంతో ప్రసంగిస్తున్న మహిళా అధ్యక్షురాలు – మహిళా సాధికారత, నాయకత్వం మరియు స్వీయ విశ్వాసాన్ని ప్రతిబింబించే దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'ఖాళీ కుర్చీ' కథలో గ్రామ మహిళా సమావేశంలో ఆత్మవిశ్వాసంతో ప్రసంగిస్తున్న మహిళా అధ్యక్షురాలు – మహిళా సాధికారత, నాయకత్వం మరియు స్వీయ విశ్వాసాన్ని ప్రతిబింబించే దృశ్యం.

Khalee Kurchee - Telugu Emotional family Story | Ramana Bandhakavi

ఖాళీ కుర్చీ తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | రమణ బంధకవి

Published in manatelugukathalu.com on 01/07/2026


"ఖాళీ కుర్చీ" ఒక మహిళ జీవితంలో నాయకత్వం, ఆత్మవిశ్వాసం, స్వీయ గుర్తింపు ఎంత ముఖ్యమో హృదయానికి హత్తుకునేలా చెప్పే ఆలోచనాత్మక తెలుగు కథ. అవకాశం లేకపోవడం వల్ల కాదు, ఉన్న అవకాశాన్ని మనమే ఉపయోగించుకోకపోవడం వల్ల ఎన్నో ఖాళీ కుర్చీలు అలాగే మిగిలిపోతాయని ఈ కథ అద్భుతంగా గుర్తుచేస్తుంది. ప్రతి మహిళలో దాగి ఉన్న నాయకత్వాన్ని మేల్కొలిపే ఈ కథ కుటుంబాలు, మహిళా సంఘాలు, యువత తప్పక చదవాల్సిన ప్రేరణాత్మక రచన.


"ఈ సభకు అధ్యక్షురాలు ఎవరు?" అని మండల పరిషత్ సమావేశ మందిరంలో కొత్తగా వచ్చిన ఎంపీడీవో శైలజ అడిగిన ప్రశ్నతో సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ముందు వరుసలో కూర్చున్న సుజాత నెమ్మదిగా లేచింది.


"నేనే మేడమ్."


"అయితే... సమావేశాన్ని ఇంకెవరు నిర్వహిస్తున్నారు?"


సుజాతనోట వెంటనే సమాధానం రాలేదు. అప్పటికే మైకు దగ్గర నిలబడి ఉన్నాడు గ్రామసభ్యుడు వెంకటరెడ్డి. అది అతని పదవి కాదు- అలవాటు మాత్రమే.


శైలజ ఒకసారి తలపంకించి చిరునవ్వుతో అంది.

"సరే... కొనసాగించండి."


సమావేశం మొదలైంది. కానీ సుజాత మనసు మాత్రం ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది.

పదేళ్ల సుజాత మొదటిసారి గ్రామసభకు వెళ్లింది. కొత్తగా మహిళలకు రిజర్వేషన్లు వచ్చాయి. ఊరంతా అదే చర్చ.


"ఇక ఆడవాళ్ల పాలన!" అని అందరూ చెప్పుకుంటున్నారు. సుజాత ఎంతో ఉత్సాహంగా వెళ్లింది. అక్కడ చూసింది మాత్రం వేరే దృశ్యం. ముందు వరుసలో మహిళలు కూర్చున్నారు. వెనక వాళ్ల భర్తలు నిలబడ్డారు.


"చెన్నమ్మ..." అని పిలవగానే చెన్నమ్మ తన భర్త వైపు చూసింది.


"నువ్వే చెప్పు" అంది. భర్త ఆమె పేరు చెప్పాడు. అదేవిధంగా అందరూ మహిళా సభ్యుల బదులు వాళ్ళ భర్తలే మాట్లాడారు.


"సంతకం పెట్టండి..." అన్నమాట వినగానే, “ఎక్కడ?" అని ఆమె భర్తను అడిగింది. అతను చూపించాడు.

సభ ముగిసింది. ఇంటికి వస్తూ సుజాత తల్లిని అడిగింది.

"అమ్మా... వాళ్లే సభ్యులు కదా! మరి మాట్లాడలేదే?"


"అయ్యో... అందరి ముందు మాట్లాడటం అంత సులభమా? మగాళ్లకే అలవాటు." అంది.


"అంటే ఆ మహిళా సభ్యులకు హక్కు లేదా?" అని సందేహం వెలిబుచ్చింది సుజాత.


తల్లి నవ్వింది. "హక్కు ఉంది. కానీ... వాడేది వాళ్లు కాదు." 


ఆ సమాధానం సుజాతకు అర్థం కాలేదు.

మరుసటి రోజు స్కూల్లో సోషల్ టీచర్ శారదను అడిగింది. టీచర్ ఏమీ మాట్లాడలేదు.

తరగతి మధ్యలో ఉన్న ఒక ఖాళీ కుర్చీని చూపించింది.

"ఇది ఎవరిది?" అని అడిగింది.


"ఎవరు కూర్చుంటే వాళ్లది." అంది సుజాత.


"అయితే ఎందుకు ఖాళీగా ఉంది?" అడిగినది టీచర్.


సుజాత మాట్లాడలేదు. టీచర్ నవ్వింది.


"కుర్చీ ఖాళీగా ఉండడానికి కారణం... కూర్చోవడానికి హక్కు లేకపోవడం కాదు. కూర్చోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం." ఆమె సుజాత వైపు చూసింది.


"జీవితంలో కూడా ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి." అంది.


ఆ మాటలు సుజాత మనసులో ఎక్కడో నిలిచిపోయాయి.


కాలేజీలో మాత్రం సుజాత పూర్తిగా వేరే మనిషి. డిబేట్ పోటీలూ, ఎన్.ఎస్.ఎస్. శిబిరాలూ, కాలేజీ డే నిర్వహణ అన్నీ సుజాత ఆద్వర్యంలోనే జరిగేవి. ఒకసారి సాంస్కృతిక కార్యదర్శి ఎన్నికల్లో నామినేషన్లు రాలేదు.


"ఎవరు ఈ బాధ్యత తీసుకుంటారు?" అని ప్రిన్సిపాల్ అడిగాడు.


హాలు మొత్తం ఒకేసారి అరిచింది, "సుజాత!"


ఆమె నవ్వుతూ లేచి వెళ్లి నామినేషన్ వేసింది. ఏకగ్రీవంగా ఎన్నికైంది.

***

జీవితం మాత్రం పుస్తకాల్లో రాసినట్టు నడవదు. సుజాతకు పెళ్లయింది. భర్త రాఘవ మంచి మనిషి. ఆమెను గౌరవిస్తాడు, అభిమానిస్తాడు. కానీ, ఎక్కడికెళ్లినా భార్య తరుఫున తానే మాట్లాడతాడు. ఒకసారి బ్యాంకులో లోను గురించి వెళ్ళినప్పుడు మేనేజర్ అడిగాడు.

"మేడమ్... మీ అభిప్రాయం చెబుతారా?


వెంటనే రాఘవ అందుకున్నాడు, “తనకేమీ అభ్యంతరం ఉండదు సర్”


ఆమె ఏమీ అనలేదు. పిల్లల స్కూల్లో టీచర్ అడిగిన ప్రశ్నలకు రాఘవే సమాధానం చెప్పాడు. సుజాత మౌనంగానే కూర్చుంది. గ్యాస్ కనెక్షన్, ఇంటి రిజిస్ట్రేషన్, ఆసుపత్రి, అన్ని సందర్భాలలోనూ రాఘవే మాట్లాడేవాడు.


ఎవరూ "నువ్వు మాట్లాడకు" అనలేదు. ఎవరూ ఆమెను అణచివేయలేదు. కానీ ప్రతి సందర్భంలో ఆమె తన మాటను ఇంకొకరికి అప్పగించింది.


ఒకసారి కూతురు నిఖిత అడిగింది.

"అమ్మా... నాన్న లేని సమయంలో నువ్వు బాగా మాట్లాడుతావు. బయట ఎందుకు మాట్లాడవు?"


సుజాత నవ్వి తప్పించుకుంది. కానీ ఆ ప్రశ్న వెంటాడింది.

కొన్నేళ్లకు మహిళా సంఘానికి అధ్యక్షురాలైంది. అందరూ ఇష్టపడి ఎన్నుకున్నారు.


"చదువుకుంది."

"నిజాయితీ ఉంది."

"అందరితో కలిసిపోతుంది."

అందుకే అధ్యక్షురాలుగా చేసింది గ్రామం.


 కానీ సమావేశాల్లో ఎప్పటిలాగే పురుషులే మాట్లాడేవారు. ఆమెకు అది సహజంగానే అనిపించింది. ఎందుకంటే...ఆమె కూడా అలాగే అలవాటు పడిపోయింది.


ఈరోజు ఎంపీడీవో అడిగిన "అధ్యక్షురాలు ఎవరు?" అన్న ప్రశ్న మాత్రం ఆ అలవాటును కదిలించింది. సమావేశం ముగిసింది. ఆ ప్రశ్న సుజాతతో పాటు ఇంటివరకూ వచ్చింది.


ఇంటికి వచ్చాక రాఘవ అన్నాడు.

"రేపు బ్యాంక్‌కి వెళ్లి సంఘం రుణం పత్రాలు పూర్తి చేద్దాం. నేను వస్తాను."


సుజాత సహజంగానే "సరే" అనబోయింది. అప్పుడే, గ్రామసభలో మౌనంగా కూర్చున్న చెన్నమ్మ గుర్తొచ్చింది, శారద టీచర్ చూపించిన ఖాళీ కుర్చీ గుర్తొచ్చింది, కూతురు నిఖిత అడిగిన ప్రశ్న గుర్తొచ్చింది.

ఆమె మెల్లగా అంది. "వద్దు... నేనే వెళ్తాను."


రాఘవ ఆశ్చర్యంగా చూశాడు. "ఒంటరిగానా?"


"అధ్యక్షురాలు నేనే కదా" అంది.


రాఘవ చిరునవ్వు నవ్వాడు. "అలాగే వెళ్లు." అన్నాడు.


అంతే. ఎలాంటి వాదన లేదు, ఎలాంటి నిరాకరణ లేదు. సుజాత ఒక్కసారిగా తననే తాను ప్రశ్నించుకుంది.

"అయితే... ఇన్నాళ్లు నన్నెవరు ఆపారు?"


జవాబు చెప్పడానికి ఇంట్లో ఎవరూ లేరు. ఎందుకంటే...జవాబు ఆమెకే తెలుసు.

ఆ రాత్రి అందరూ నిద్రపోయాక, సుజాత పాత బీరువా తెరిచింది. లోపల సర్టిఫికెట్లు, పాత ఫోటోలు, డైరీలు ఉన్నాయి. ఒక ఫోటో చేతిలోకి తీసుకుంది. కాలేజీ డిబేట్ పోటీ. మైక్ పట్టుకుని స్టేజ్ మీద నిలబడి నవ్వుతోంది ఆమె. ఆ రోజున ఆమె మాట్లాడితే ఆడిటోరియం మొత్తం చప్పట్లు కొట్టింది.


“నీకు లీడర్‌షిప్ ఉంది” అని లెక్చరర్ చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుంది.


సుజాత కళ్లలో సన్నటి నీటి పొర. ఎప్పుడో తనలో ఉన్న ఆ స్వరం…ఎప్పుడు మౌనమైపోయిందో ఆమెకే తెలియలేదు. ఎవరూ తనని ఆపలేదు కూడా. మెల్లగా తానే వెనక్కి తగ్గింది.


“నువ్వు చెప్పక్కర్లేదు…”

“వాళ్లు చూసుకుంటారు…”

“ఇది మగాళ్ల పని…”

ఆ మాటలు వింటూ, చివరకు వాటిని తను కూడా నమ్మేసింది.

***

మరుసటి వారం మళ్లీ గ్రామ మహిళా సంఘ సమావేశం జరిగినది. వెంకటరెడ్డి మైకు దగ్గరకు వెళ్లబోతుండగా సుజాత లేచింది.

"ఈరోజు సమావేశం నేను నిర్వహిస్తాను." అంది.


సుజాత గొంతు కొద్దిగా వణికింది. కానీ మాట మాత్రం ఆగలేదు. ఒక్కో అంశం చర్చించింది.


మహిళలనే ప్రశ్నించింది. వాళ్ల అభిప్రాయాలు రాయించింది. మొదటిసారి ఆ సమావేశంలో మహిళల స్వరాలు వినిపించాయి.


సమావేశం అయిపోయాక ఎంపీడీవో శైలజ తన దగ్గరకు వచ్చి నవ్వుతూ అంది:

“ఇప్పుడే నిజంగా అధ్యక్షురాలిలా కనిపించారు.” సుజాత కూడా నవ్వింది.


“నేను కొత్తగా ఏమీ కాలేదు మేడమ్… ముందే ఉన్న నా కుర్చీలో నేను కూర్చున్నాను అంతే.”


ఏ గొడవా లేదు, ఏ అడ్డంకీ లేదు. సుజాతకి ఒక్కసారిగా విచిత్రంగా అనిపించింది.

ఇన్నాళ్లు తాను తలుపు బయట నిలబడి ఉన్నాననుకుంది. కానీ తలుపు అసలు మూసే లేదు. తానే లోపలికి అడుగు పెట్టలేదు.

ఇంతలో కొత్త సభ్యురాలు రమాదేవి సుజాతను కలిసి సంకోచంగా అడిగింది.

"అక్కా... వచ్చే నెల నుంచి నేను కార్యదర్శిని. నాకు భయంగా ఉంది."


సుజాత అధ్యక్షురాలి కుర్చీ నుంచి లేచింది.

"రా." అని పిలిచింది.


"వద్దు అక్కా..." అని బిడియపడింది రమ.


"కూర్చో" అంది సుజాత.


రమాదేవి సందేహంగా కూర్చుంది. సుజాత చిరునవ్వుతో అంది.

"ఎలా ఉంది?"


"కొంచెం భయంగా" అంది రమ.


"నాకూ అలాగే అనిపించింది."


“అయితే అక్కా… మీకు ఈ ధైర్యం ఎలా వచ్చింది?”


సుజాత చిరునవ్వు నవ్వింది.

“ధైర్యం కొత్తగా రాదు. అది చాలాసార్లు మన దగ్గరే ఉంటుంది.”


“అయితే?”


“మనమే ఉపయోగించం.”


సుజాత హాల్లో ఉన్న ఖాళీ కుర్చీల వైపు చూపించింది.

"మన జీవితంలో ఇలాంటి ఖాళీ కుర్చీలు చాలా ఉంటాయి రమా."


"ఎవరూ కూర్చోనివా?"


"కాదు..." ఆమె మెల్లగా తల అడ్డంగా ఊపింది.


"మన కోసం ఉంచినవే. కానీ మనమే వాటి దగ్గరకు వెళ్లం."


రమాదేవి అర్ధమైనట్లు చూసింది. సుజాత కిటికీలోంచి బయట ఆడుకుంటున్న చిన్నపిల్లలను చూస్తూ అంది;

"సాధికారతను ఎవరూ చేతిలో పెట్టి ఇవ్వరు. అది చాలాసార్లు మన ముందే ఒక ఖాళీ కుర్చీలా ఉంటుంది. మనమే వెళ్లి కూర్చోవాలి అంతే..."


సుజాత మొహంలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.


***

రమణ బంధకవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రమణ బంధకవి
రమణ బంధకవి

రచయిత పరిచయం: రమణ బంధకవి

రమణ బంధకవి, ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేసి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నారు. సాహిత్యాభిలాష, తెలుగు మరియు ఆంగ్లంలో రచనాభిలాష కలిగినవారు. కథలు, కవితలు, నవలలు, అనువాద నవలలు వ్రాయడం హాబీ. ఇప్పటివరకు ముప్పై పైచిలుకు కథలు, ఎన్నో కవితలు, రెండు అనువాద నవలలు ప్రచురింపబడ్డాయి. రెండు స్వీయ నవలలు ప్రస్తుతం ప్రచురణలో ఉన్నాయి. ఒకటి 'సంచిక' వెబ్ మాగ్జైన్ వార పత్రికలో ధారావాహికగా వస్తోంది. ఇంకోటి 'ప్రతిలిపి' లో ధారావాహికగా వస్తోంది.

9 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

మంచి ప్రేరణాత్మకమైన కథ. మహిళా సాధికారత ఒకళ్ళు ఇచ్చేది కాదు, వాళ్ళంత వాళ్లే తీసుకునేది అని చక్కగా చెప్పేరు.

Like

Rated 5 out of 5 stars.

కథ బాగుంది. లోపలి బెరుకు, మొహమాటం వదిలి ఆడవారు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పారు రచయిత. సుజాత భర్త కూడా విశాల దృక్పధం ఉన్న వ్యక్తి గా కనిపించారు. కానీ చాలా మంది భర్తలు మంచివారైనా కూడా భార్యలకు ప్రోత్సాహం ఇవ్వరు. ఆడవారికి పెద్ద ఇబ్బంది ఇంట్లో భర్తలను ఒప్పించుకోవటమే. బైట పనులే సులభంగా చేసుకోగలరు. సుజాత లాగా అందరు ఆడవారు తమ లోని చైతన్యాన్ని గుర్తించి ముందడుగు వేస్తే మహిళా సాధికారతాను గురించి వేరుగా చర్చించాల్సిన అవసరం రాదు రచయిత చక్కగా చెప్పారు

Like
Replying to

చక్కగా భావాన్ని అర్ధం చేసుకున్నారు. ధన్యవాదాలు

Like

Rated 5 out of 5 stars.

మహిళా సాధికారత సాధించాలంటే మొదటగా మహిళలు సమాజంతోనో, మగవాళ్ళతోనే కాకుండా మొదటగా they have to fight the devil within అని చెప్పేరు రచయిత రమణగారు. Powerful message. Kudos.

Like
Replying to

థాంక్స్ వెంకట గారు.

Like

Rated 5 out of 5 stars.

Chaaalaa బాగుంది కధ. మహిళలకు ప్రేరణ కలిగించే కధ.

Like
Replying to

ధన్యవాదాలు నయన గారూ

Like

Rated 5 out of 5 stars.

kadha chaala baagundi. mahila saadhikaarata gurinchi upanyaasaalu, vudyamaalu ane ye aarbhaataalu lekundaa asalu mahilaa saadhikaarata ante emito aratipandu olichi chetilo pettinatlu chepperu .

Like
Replying to

ధన్యవాదాలు రత్నగారూ. అన్ని విషయాలూ సభలు, ధర్నాలతో సాధింపబడవు. అవి ఎక్కడ ఉన్నాయో చూసి, వాటిని హక్కుభుక్తంగా తీసుకోవడమే సాధికారత నా ఉద్దేశ్యంలో. కథ నచ్చినందుకు సంతోషం.

Like
bottom of page