కొత్త ఐడియా
- Addanki Lakshmi

- 2 hours ago
- 4 min read

Kottha Idea - Telugu Comedy Story | Addanki Lakshmi
కొత్త ఐడియా - తెలుగు హాస్య కథ | అద్దంకి లక్ష్మి
Published In manatelugukathalu.com On 16/04/2026
సెల్ ఫోన్ మెసేజీలు…👉 వాటిని క్లియర్ చేయడానికి అసిస్టెంట్ పెట్టుకోవడం…
ఇంతకంటే ఫన్నీ ఐడియా ఉండదు! 😂
ఈ కథ మీకు ఖచ్చితంగా నవ్వులు తెప్పిస్తుంది.
"హలో మంగమ్మ! ఏం చేస్తున్నావే?" అంటూ వచ్చింది రంగమ్మ కాలక్షేపానికి.
"రావే రా! వచ్చి కూర్చో," అంటూ సోఫాలో కూర్చోబెట్టింది మంగమ్మ.
ఎదురుగా ఒక అమ్మాయి కూర్చుని పని చేసుకుంటోంది. ఆ పిల్లని ఎప్పుడూ చూడలేదు రంగమ్మ.
"ఏంటి మీ ఆయన ఆఫీసుకి వెళ్లాడా?" అని అడిగింది రంగమ్మ. "అవును. ఈ అమ్మాయి ఎవరు? ఎప్పుడూ చూడలేదు. టిప్‌టాప్‌గా తయారై వచ్చింది, ఏం పని చేస్తోంది?" అంటూ ఆరా తీసింది.
"ఉండవే, ఒక్క నిమిషం వస్తాను!" అంటూ వంటింట్లోకి వెళ్లింది మంగమ్మ.
వేడివేడిగా కాఫీ కలుపుకుని మూడు కప్పులు తీసుకొచ్చింది.
"ఇదిగో పింకీ! రెండు గంటల నుంచి పని చేస్తున్నావు. ఈ వేడి వేడిగా కాఫీ తాగు, మళ్లీ చూద్దువుగానిలే!" అంటూ కాఫీ అందించింది.
ఆ అమ్మాయి దగ్గర రెండు సెల్ ఫోన్లు ఉన్నాయి. కింద పెట్టి వేడివేడిగా కాఫీ తాగుతోంది.
ఒక కప్పు తీసుకొచ్చి రంగమ్మకు ఇచ్చింది.
"ఎవరే ఈ అమ్మాయి? ఎంత బాగుంది! మీ ఇంట్లో ఈ అమ్మాయిని ఎప్పుడూ చూడలేదే?" అని అడిగింది.
"అవునే, ఈ మధ్యనే నా అసిస్టెంట్‌గా పెట్టుకున్నాను."
"నీకెందుకే అసిస్టెంట్? నువ్వేమన్నా ఆఫీసులో పని చేస్తున్నావా? మీ ఇల్లు ఏమన్నా ఆఫీసా? అసలు నీవు టెన్త్ క్లాస్ కూడా పాస్ అవ్వలేదు కదా!" అని అడిగింది రంగమ్మ ఉత్సాహంగా.
"ఏమీ లేదే. నా దగ్గర రెండు సెల్ ఫోన్లు ఉన్నాయి కదా. ఆ రెండు సెల్ ఫోన్ల నిండా రోజుకు 4000 మెసేజ్‌లు వస్తాయి, 2000 వీడియోలు వస్తాయి. ఇంక దేవుడి బొమ్మలు సరేసరి. శుభోదయం అయితే చెప్పనే అక్కర్లేదు. ఇవన్నీ క్లియర్ చేసేందుకు నా దగ్గర టైం ఎక్కడుంది?"
"మరైతే ఈ అమ్మాయి ఏం చేయగలదే?" అంది రంగమ్మ ఆశ్చర్యంగా.
"అదే చెప్తున్నా విను. ఈ అమ్మాయిని అందుకే పెట్టాను. నా సెల్ ఫోన్ అంతా నిండిపోకుండా, రోజు వచ్చి ఇవన్నీ క్లియర్ చేయమని చెప్తున్నాను. నేను ఎక్కడ చేసుకోగలను? నా చెయ్యి అంతా నొప్పి పెడుతుంది కదా!" అంది విసుగ్గా.
"మెసేజీలన్నీ మెల్లిగా చదివి వినిపిస్తుంది. దానికి ఆన్సర్ చెబితే రాస్తుంది. వీడియోలన్నీ పెట్టి వినిపిస్తుంది. బొమ్మలు ఒకసారి చూపించి చెరిపేస్తుంది.
ఇంక దేవుడి బొమ్మలు అంటావా... నువ్వే దండం పెట్టుకో తల్లి అంటాను.
ప్రతిరోజూ దేవుడి బొమ్మలే. ఏ రోజు దేవుడు ఆ రోజు! సోమవారం నాడు వెయ్యి మంది శివుళ్లు, మంగళవారం నాడు 500 ఆంజనేయస్వామి, సాయిబాబాకైతే చెప్పనే అక్కర్లేదు, శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి, శనివారం వెంకటేశ్వర స్వామికి... అబ్బో అబ్బో! ఎన్నో రకాల ఫోటోలు..."
"ఈ దేవుళ్లందరికీ నువ్వే దండం పెట్టుకో తల్లి అని చెప్తాను. నాకు చూపకు, నా చేతులు నొప్పి పెడతాయి."
"ఇవన్నీ డిలీట్ చేస్తుంది సాయంత్రం వరకు కూర్చుని. అదే ఈ పిల్ల చేసే పని," అంటూ చెప్పింది హుషారుగా మంగమ్మ.
రంగమ్మకు ఆవిడ తెలివి చూసి నోట మాట రాలేదు.
"మరైతే ఆ అమ్మాయికి పనిపాట ఉండదా? ఊరికే వచ్చి చేసి పోతుందా? ఈ అమ్మాయి నీకేమన్నా తెలుసా? నీకు స్నేహితురాలా?" అంటూ ఎంక్వయిరీ చేసింది రంగమ్మ.
"ఈ పిల్ల నాకు పరిచయం లేదే! ఊరికే ఎందుకు చేస్తారే? పొద్దున్నుంచి సాయంకాలం వరకు చాకిరీ. రోజూ ఉదయం వచ్చి మధ్యాహ్నం వరకు అన్ని క్లియర్ చేసి వెళ్తుంది. రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తాను," అంటూ గొప్పగా చెప్పింది మంగమ్మ.
"అమ్మో! నెలకు 30,000!" అంటూ ఆశ్చర్యపోయింది రంగమ్మ.
"మరి మీ ఆయన ఏమీ అనడా?" అంటూ అడిగింది.
"అడిగాడు. ఇది చాలా ముఖ్యం కదా. రోజూ సెల్ ఫోన్ నిండిపోతే ఎలాగా? మళ్లీ పాడైపోతే లక్షలు పెట్టి కొత్తది కొనాలి కదా!"
"నేను ఇవన్నీ డిలీట్ చేస్తుంటే నా చెయ్యి నొప్పి పుడుతోంది. అందుకనే ఈ ఐడియా వేశాను. మీ ఖర్చులు తగ్గించుకోండి అని ఆయనతో చెప్పాను."
"మరి మీ ఆయన ఏమీ అనలేదా?"
"ఏమంటాడు? ఒకసారి 'ఎందుకు డబ్బు ఖర్చు?' అన్నాడు. అయితే చూడండి అంటూ ఆయన సెల్ నేల మీద గట్టిగా కొట్టాను. రెండు ముక్కలైంది. లక్ష రూపాయల కొత్త సెల్! అంతే, భయపడి నా సెల్ జోలికి రావడం మానేశాడు," అంటూ గొప్పగా చెబుతోంది మంగమ్మ.
"బావుందే నీ తెలివి!" అంటూ మెచ్చుకుంది రంగమ్మ. "మా ఆయనైతే నా ఫోన్ తీసి అవతల విసిరేస్తాడు."
"అలాంటి వేషాలు నా దగ్గర ఏమీ కుదరవు. అలాగే మనం కావాల్సిన వాటిని సాధించుకోవాలి," అంటూ గొప్పగా చెప్పింది మంగమ్మ.
"ఎలాగైనా మంగమ్మ చాలా తెలివైనది. దీని దగ్గర కొన్ని సంసారపు కిటుకులు నేర్చుకోవాలి. మరీ నోట్లో నాలుక లేకుండా పడుంటే భార్యలకు విలువ ఉండదు. నేను కూడా రేపటి నుంచి నా తడాఖా చూపిస్తాను మా ఆయనకి. పండక్కి చీర కొనమంటే డబ్బు లేదంటాడు, సెల్ పాడైంది కొత్తది కొనమంటే వినిపించుకోడు. తెలివి తక్కువగా పడుంటే రోజులు కావు ఆడవాళ్లకి," అని మనసులో అప్పుడే నిర్ణయం తీసుకుంది రంగమ్మ.
మంచి మార్గాలు ఎవరికీ బుర్రకెక్కవు గానీ, అతి తెలివి తొందరగా వంట పడుతుంది...
***
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,




Comments