ఆమె మళ్ళీ అలిగింది

Aame Malli Aligindhi - Telugu Comedy Story | Varalakshmi Yanamandra
ఆమె మళ్ళీ అలిగింది - తెలుగు హాస్య కథ | వరలక్ష్మి యనమండ్ర
Published in manatelugukathalu.com on 10/10/2026
“ఆమె మళ్ళీ అలిగింది” వరలక్ష్మి యనమండ్ర రచించిన సరదా భార్యాభర్తల హాస్య కుటుంబ కథ. భార్య సుజాతకు భర్త పెట్టిన ఒక చిన్న మాట పెద్ద అలకకు ఎలా దారితీసిందో ఈ కథలో నవ్వుతూ చూడొచ్చు.
మా ఆవిడ పేరు సుజాత. కానీ నేను ఆమెను 'గూగుల్' అని పిలుస్తాను. ఎందుకంటే ఆమెకు అన్నీ తెలుసు. నేను అడగకపోయినా చెబుతుంది.
సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ మొహం ఉబ్బరంగా ఉంది.
"ఏమైంది సుజా?" అన్నాను. అలిగిన ఆమెను మామూలు స్థితికి తేవాలని నా ప్రయత్నం.
"మీరేమైనా అనొచ్చా నన్ను?" అంది.
నాకు అర్థం కాలేదు. "నేనేమన్నాను?" అన్నాను బిత్తరపోయి. అంతటి సాహసం చెయ్యను. ఎందుకంటే దూదిని ఏకినట్లు ఏకిపడేస్తుంది.
"పొద్దున్న మీ అమ్మ ఫోన్ చేసినప్పుడు మీరు ఏమన్నారు?"
నాకు గుర్తొచ్చింది. మా అమ్మ ఫోన్ చేసి 'ఒరేయ్, కోడలు ఎలా ఉంది?' అని అడిగింది.
నేను "ఆ... బాగానే ఉంది, కాస్త లావైంది అంతే" అన్నాను. 'అది చిన్నమాటే కదా!' అనుకున్నాను.
కానీ, మా ఆవిడ ఆ మాట వినేసింది కాబోలు. 'మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందిక' అనుకున్నాను.
"నేను లావయ్యానా? నేను లావయ్యానా? నేను రోజూ వాకింగ్ చేస్తుంటే, జీరా వాటర్ తాగుతుంటే లావయ్యానని అంటారా?" అని మొదలుపెట్టింది. ఉరుములు, మెరుపులు; తదుపరి ఎడాపెడా దంచికొట్టింది వాన.
తడిసి ముద్దయ్యాను నేను. అయినా ధైర్యం తెచ్చుకుని, "అది చిన్నమాటేగా సుజా, అంత పెద్దగా తీసుకోకు" అన్నాను.
"చిన్నమాటా? నా బరువు మీకు చిన్నమాటా? రేపు మీ నాన్నగారు వస్తే నేను కూడా 'మీ అబ్బాయి బట్టతల ఇంకాస్త పెరిగింది' అని చిన్నమాట అననా?" అంది.
నాకు ముచ్చెమటలు పట్టాయి. "వద్దు, వద్దు" అన్నాను.
"మీ గురించి అనకూడదు, కానీ నా గురించి మీరు ఏదైనా అనొచ్చు... అంతేనా?" అన్నది. కాదుకాదు అరిచింది.
ఇక లాభం లేదని నేను ఉపవాస దీక్ష మొదలుపెట్టాను. అంటే మాట్లాడటం మానేశాను. మా ఆవిడ వంటగదిలోకి వెళ్ళి పెద్ద గిన్నెలో బియ్యం తీసింది.
"ఏం చేస్తున్నావు?" అన్నాను.
"డైటింగ్. ఇక నుండి ఒక పూటే తింటాను. మీ చిన్నమాట వల్ల నా జీవితం మారిపోయింది" అంది.
నేను భయపడ్డాను. ఆమె ఒక పూట తినకపోతే, నాకు కూడా పస్తేగా! ఎందుకంటే ఆ కోపాన్ని నా మీద చూపిస్తుంది.
వెంటనే నేను "నువ్వు లావు కాదు సుజా, నువ్వు చాలా సన్నగా ఉన్నావు. నా కళ్ళు సరిగా కనిపించడం లేదు" అన్నాను.
"ఏదైనా మాట్లాడుతారు మీరు? ఏదైనా అనొచ్చు మీరు.. ఒకసారి ఇలా ఉంటారు, ఒకసారి సన్నం అంటారు, మీ మనసులో ఏముంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు?...."
ఆపకుండా విశ్రాంతి లేకుండా అరగంట వాక్ప్రవాహం. అందులో నేను కొట్టుకుపోతున్నాను.
"నాకు కళ్ళజోడు కావాలి సుజా" అన్నాను కాస్త ధైర్యం తెచ్చుకుని.
ఆమె నవ్వింది. "అయితే రేపు కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్దాం, అలాగే బట్టల షాప్‌కి కూడా.
నేను సన్నగా ఉన్నాను అన్నారు కదా... ఈ సందర్భంగా కొత్త చీరలు కొనాలి మరి" గోముగా అన్నది.
నాకు అర్థమైంది. ఈ తుపాను వెనక ఉన్న ఒక పెద్ద ప్లాన్. అది కొత్త చీరల ప్లాన్.
నేను జేబు తడుముకున్నాను. జేబులో చిన్నమాటే ఉంది. చిల్లర మాత్రమే.
"ఏమైంది?" అంది ఆవిడ.
'ఏం లేదు, నా జేబు కూడా నీలాగే సన్నగా అయిపోయింది. అదే చెబుతున్నా' అని గొణుక్కున్నాను.
ఆవిడ మళ్ళీ అలిగింది.
వరలక్ష్మి యనమండ్ర ✒️
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
వరలక్ష్మి యనమండ్ర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పరిచయం: వరలక్ష్మి యనమండ్ర
పేరు: శ్రీమతి వరలక్ష్మి యనమండ్ర
కలం పేరు: లేదు
స్వస్థలం: అద్దంకి,ప్రకాశం జిల్లా
ప్రస్తుత నివాసం: హైదరాబాద్
వృత్తి: విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని
విద్యార్హత: యం.ఏ., బి.ఎడ్.
ప్రచురిత రచనలు / పుస్తకాలు: 6 పుస్తకాలు
1. భారత వాణి (బాల సాహిత్యం, బాల పంచపదులు సంపుటి)
2. వరాల వీరితోట (వంద కవితల సంపుటి)
3. వరాల గోరుముద్దలు (బాలసాహిత్యం, బాలగేయాల సంపుటి)
తెలుగు యూనివర్సిటీ వారు ఈ పుస్తకానికి పదివేల రూపాయల నగదు పారితోషకం ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి పురస్కారం ఈ పుస్తకానికి దక్కింది.
కొనిరెడ్డి ఫౌండేషన్ వారి జాతీయ పురస్కారం
4. శ్రీ కృష్ణపదులు(200 ఇష్టపదుల సంపుటి)
5. మిఠాయి పొట్లం (బాల సాహిత్యం,బాలగేయాల సంపుటి)
6. యనమండ్ర మౌక్తికాలు (పాఠశాల విద్యార్థుల కొరకు నీతి పద్య మాలిక)
(400 ఆటవెలది పద్య సంపుటీ)
7. అమ్మమ్మ కథలు (బాల సాహిత్యం, బాలల కథలు)
అనేక సంకలనాలలో నా కవితలు ప్రచురితమయ్యాయి.
పొందిన పురస్కారాలు / సత్కారాలు: వివిధ సమూహాల నుండి పలు పురస్కారాలు, సత్కారాలు, బిరుదులు
కొన్ని సమూహాలను నిర్వహణ, కొన్ని సమూహాలలో సమీక్షణం
యనమండ్ర సాహితీ వేదిక .. వ్యవస్థాపక అధ్యక్షురాలను
నేను వ్రాయుచున్న ప్రక్రియలు: వచన కవితలు, బాల గేయాలు,బాలల కథలు , పెద్దల కథలు, పద్యాలు, రుబాయిలు, అష్టాక్షరి గీతికలు, యశోదమ్మ పదాలు(రూపకర్తను), మధురిమలు, చిమ్నీలు, హరివిల్లులు, మణిపూసలు, పంచపదులు, సున్నితాలు, అష్టాక్షరీ గీతాలు, గజల్స్, గేయాలు,పాటలు, అనేక లఘు ప్రక్రిలు వ్రాస్తున్నాను.
ఇష్టాలు: సాహిత్య పఠనం, లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్స్, తోటపని మొదలగునవి.
జీవితాశయం: చేతనైనంత సాయం చేయటం.




Comments