top of page
Original.png

దసరా పండుగ వైశిష్ట్యం

4 hours ago
3 min read

దసరా పండుగ వైశిష్ట్యం – దుర్గాదేవి ఆరాధన, విజయదశమి వేడుకలు, బతుకమ్మ, దుర్గాపూజ మరియు భారతీయ సంప్రదాయాల చిత్రణ

Dasara Panduga Vaivistyam - Telugu Devotional Article | Sudhavishwam Akondi

దసరా పండుగ వైశిష్ట్యం - తెలుగు ఆధ్యాత్మిక వ్యాసం | సుధావిశ్వం ఆకొండి

Published in manatelugukathalu.com on 10/10/2026


దసరా పండుగ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విశ్వాసాలు, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. మహిషాసురుడిపై దుర్గాదేవి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పర్వదినాన్ని విజయదశమి అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో దుర్గాపూజ, రావణ దహనం, కులు దసరా, బొమ్మల కొలువు, బతుకమ్మ వంటి ప్రత్యేక ఆచారాలతో ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. దసరా పండుగ ప్రాముఖ్యతను, ప్రాంతీయ వేడుకల విశిష్టతను సుధావిశ్వం రచనలో తెలుసుకుందాం.


దసరా పండుగ వైశిష్ట్యం


మహాశక్తి అయిన అమ్మవారు రాక్షస సంహారం చేసి, లోకాలను రక్షించినందుకు ప్రతీకగా దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగ దసరా పండుగ. ఈ దశమి రోజున మనస్పూర్తిగా అమ్మవారికి నమస్కరిస్తే తలపెట్టిన కార్యాల్లో విజయం లభిస్తుందని, దీనిని విజయదశమిగా కూడా చెబుతారు.


పండుగ జరుపుకోవడానికి మూల సూత్రం ఒక్కటే అయినప్పటికీ, ప్రాంతీయ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను బట్టి వేడుకగా జరుపుకుంటారు. ఈ పవిత్ర పర్వదినాన ఒక్కో రాష్ట్రం తన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని తమ ప్రత్యేకమైన పూజా విధానాల ద్వారా చాటి చెబుతుంది.


  • పశ్చిమ బెంగాల్:

    పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దసరా అనేది 'దుర్గా పూజ'తో ముడిపడి ఉంది. ముఖ్యంగా కలకత్తాలో కొలువైన కాళీ మాత ఆలయంలో విశేషంగా వేడుకలు జరుగుతాయి.

    లోకాలను పీడిస్తున్న మహిషాసురునిపై దుర్గాదేవిగా అవతరించిన అమ్మవారు సాధించిన విజయానికి గుర్తుగా ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ రాష్ట్రంలో వినూత్నమైన రీతిలో అందంగా అలంకరించిన మండపాలతో నగరాలు కళకళలాడుతాయి.


    భక్తులు సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ నృత్యాలు నిర్వహిస్తారు, నృత్యాలు చేసి విందుల్లో పాల్గొంటారు. చివరి రోజున అమ్మవారి విగ్రహ నిమజ్జనంతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఇందులో భాగంగా ఒక ముఖ్యమైన ఆచారాన్ని పాటిస్తారు. దానిని 'సిందూర్ ఖేలా' అంటారు. విజయదశమి రోజున వివాహిత మహిళలు ఒకరి ముఖానికి మరొకరు సింధూరం పూసుకుంటూ సంతోషంగా ఈ ఆచారాన్ని పాటిస్తారు.


  • గుజరాత్:

    గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రాంతంలో 'రావణ దహనం' అత్యంత ప్రధానమైన వేడుకగా సాగుతుంది. రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడి భారీ దిష్టిబొమ్మలను తయారుచేసి ఇక్కడ దగ్ధం చేస్తారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీతం, నృత్యాల మధ్య సాగే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీగా జనం తరలివస్తారు. ఈ దిష్టిబొమ్మల దహనం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది.


  • ఢిల్లీ:

    ఢిల్లీలో దసరా అనగానే రామాయణ ఘట్టాలను కళ్లకు కట్టే 'రామ్‌లీలా' నాటక ప్రదర్శనలు గుర్తుకు వస్తాయి. ఈ నాటకాల ముగింపుగా రావణాసురుడి భారీ దిష్టిబొమ్మలను తగులబెడతారు. బాణసంచా వెలుగులు, సాంస్కృతిక కార్యక్రమాలు, మేళాల నడుమ వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో ఈ ఉత్సవాలు అట్టహాసంగా సాగుతాయి. ఇందుకోసం ఢిల్లీలో చాలాచోట్ల రామ్‌లీలా మైదానాలు ఉన్నాయి.


  • ఉత్తర ప్రదేశ్:

    ఉత్తర ప్రదేశ్ ప్రాంతంలో కూడా 'రామ్‌లీలా' పేరుతో రామాయణ ఘట్టాలు ప్రదర్శన చేస్తారు. చివరి రోజు సీతారామ, లక్ష్మణ పాత్రధారులు, ఇంకా ఆంజనేయ స్వామి మొదలైన పాత్రధారులను ఊరేగిస్తూ నృత్యాలు చేస్తూ ఆనందిస్తారు. చివరగా రావణ దహనం చేస్తారు.


  • పంజాబ్:

    పంజాబ్ రాష్ట్రంలో దసరా వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. భక్తులు తొమ్మిది రోజులు ఉపవాసాలు ఉంటారు. రాత్రి జాగరణలలో భక్తి గీతాలు ఆలపిస్తారు; 'భండారాలు' పేరిట సమాజ విందులు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో శక్తిమాత ఆరాధన, ఊరేగింపులు, ప్రత్యేక ప్రార్థనలతో ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు.


  • ఛత్తీస్‌గఢ్:

    ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 75 రోజుల పాటు సాగే 'బస్తర్ దసరా' ఎంతో విశిష్టమైనది. ఈ వేడుకలు దంతేశ్వరి దేవి ముంగిట నిర్వహిస్తారు. ఊరేగింపులు, సంప్రదాయ నృత్యాలు, పురాతన ఆయుధాల పూజలతో పాటు పాట్ జాతర, భారీ రథయాత్ర వంటి ఘట్టాలు ఇందులో విశేషం. గిరిజన సంస్కృతి, స్థానిక దేవతలతో పాటు ప్రకృతిని, భూమిని ఆరాధించే జీవన విధానం ఇక్కడ కనిపిస్తుంది.


  • తమిళనాడు:

    తమిళనాడులో దసరా సందర్భంగా 'బొమ్మల కొలువు' ఏర్పాటు చేయడం ప్రధాన సంప్రదాయంగా కొనసాగుతున్నది. మెట్ల వరుసల పైన పురాణ ఘట్టాల నుండి నిత్య జీవిత సన్నివేశాల వరకు తెలిపే వివిధ రకాల బొమ్మలను ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు, కథలు చెప్పడం, ప్రసాదాల పంపిణీ వంటివి జరుగుతాయి.


  • హిమాచల్ ప్రదేశ్:

    హిమాచల్ ప్రదేశ్‌లో జరుపుకునే 'కులు దసరా' వారం రోజుల పాటు సాగే సుప్రసిద్ధ ఉత్సవం. ఊరేగింపులు, సంప్రదాయ సంగీతం, నృత్యాలకు ఇది పెట్టింది పేరు. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇది భిన్నంగా విజయదశమి నాడే మొదలై ఆ తర్వాత కొనసాగుతుంది. స్థానిక ఆరాధ్య దైవమైన రఘునాథుడిని ఘనంగా ఊరేగిస్తారు. ఈ వేడుకను వీక్షించడానికి దేశవ్యాప్తంగా పర్యాటకులు, భక్తులు తరలివస్తారు.


  • తెలుగు రాష్ట్రాలు:

    ఇక మన తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాల్లో 'నవదుర్గ ఆరాధన' కన్నుల పండుగగా జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో 'బతుకమ్మ పండుగ'ను విశేషంగా జరుపుకుంటారు. విజయదశమి నాడు రైతులు, ఇతర వృత్తుల వారు తమ పనిముట్లను శుభ్రపరిచి ఆరాధన చేసే సంప్రదాయం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆరోజు సాయంత్రం పాలపిట్టను దర్శించుకోవడం, జమ్మి చెట్టును పూజించి, ఆకులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం శుభసూచకంగా భావిస్తారు. ఆకులను పెద్దలకు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు.


రెండు తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు ముఖ్యంగా అమ్మవారి ఆరాధనతో ముడిపడి ఉంటాయి. ఇక వైష్ణవ ఆలయాల్లో స్వామివారికి బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతాయి; ఈ సందర్భంగా వాహన సేవలు జరుగుతాయి.


ఇలా భారతదేశంలో జరిగే విభిన్న దసరా వేడుకలు మన దేశ సంస్కృతికి అద్దం పడతాయి. చెడుపై మంచి సాధించే విజయం అనే సందేశం ఒక్కటే అయినా, భౌగోళిక ఆచారాలు ఈ పండుగకు కొత్త శోభను కలిగిస్తాయి.

  • దుర్గాదేవి సమాజంలోని మహిషాసురులను మర్ధించి అందరినీ రక్షించుగాక! 🙏🙏🙏

  • ఆ శ్రీహరి మనుషుల్లోని మనసును ప్రేరేపించే చెడు లక్షణాలను హరించి జ్ఞానాన్ని కలిగించుగాక! 🙏🙏🙏

  • ఆ హరుడు మనుషుల్లో తలెత్తే పశు ప్రవృత్తిని హరించివేసి సద్బుద్ధిని ప్రసాదించుగాక! 🙏🙏🙏

  • ఆ సృష్టికర్త మనుషుల్లో అడుగంటిపోతున్న యుక్తాయుక్త విచక్షణను ప్రేరేపించి బుద్ధిని వెలిగించుగాక! 🙏🙏🙏

సమస్త దేవతలు మానవాళిని క్షమించి తమ అనుగ్రహాన్ని కురిపించాలని ప్రార్థన చేద్దాం! 🙏🙏🙏


అందరికీ విజయదశమి శుభాకాంక్షలు! 💐 💐 💐 💐 💐

- సుధావిశ్వం



***

సుధావిశ్వం గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):










సుధావిశ్వం

-సుధావిశ్వం






Recent Posts

See All
నాన్న కోరిక

భర్త చివరి కోరికను నెరవేర్చేందుకు రంగి పడిన కష్టాలు, కొడుకు శేఖర్‌ను ఉన్నత విద్యావంతుడిగా తీర్చిదిద్దిన తల్లి త్యాగం ఈ కథలో హృదయాన్ని హత్తుకునేలా కనిపిస్తాయి. తల్లిదండ్రుల ప్రేమ, త్యాగం, విద్య విలువను

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page