top of page

కొత్త వెలుగు


'Kotha Velugu' - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy

'కొత్త వెలుగు' తెలుగు కథ

రచన: M R V సత్యనారాయణ మూర్తి

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

“సుధాకర్, ఈ పని నీవల్లే అవుతుంది. నువ్వే చేయాలి”.

బ్రాంచ్ మేనేజర్ తన ఛాంబర్ లోకి పిలిచి అన్న మాటలకు సుధాకర్ ఆశ్చర్యపోయాడు.


“నాకంటే ఎంతోమంది సీనియర్లు ఉన్నారు మన బ్రాంచ్ లో. నేను ఈ బ్రాంచ్ కి వచ్చి సంవత్సరమే అయ్యింది. వారి వాళ్ళ కానిది నా వలన ఎలా అవుతుంది సార్ ?” చాలా పొలైట్ గా అడిగాడు సుధాకర్.


“ఇదిగో, ఈ విధేయతే నాకు నచ్చింది. నువ్వు స్టాఫ్ తోనే కాదు, బ్యాంకు కి వచ్చే అందరితో చాలా మర్యాదగా మాట్లాడతావు. వారికి కావాల్సిన పని కూడా ఏమాత్రం విసుక్కోకుండా చేస్తావు. ఈ ఏడాది అంతా నిన్ను గమనించే, నేను ఈ నిర్ణయానికి వచ్చాను. కార్యసాధకుడికి కావాల్సింది సహనం, సమస్య పట్ల పూర్తి అవగాహన, దాన్ని అధిగమించే ఆలోచన, పట్టుదల. ఇవన్నీ నీలో ఉన్నాయి. అందుకే ఈ పని నీకు అప్పగించాలనుకున్నాను” అన్నారు బ్రాంచ్ మేనేజర్ దక్షిణామూర్తి.


ఆయన మాటలకు చిరునవ్వు నవ్వాడు సుధాకర్. “అదంతా మీకు నాపై ఉన్న అభిమానం సార్. అది సరే సార్, ఇంతకీ నేను చేయాల్సిన పని ఏమిటి?” ఆసక్తిగా అడిగాడు సుధాకర్.


“ఇక్కడికి ముప్ఫై కిలోమీటర్ల దూరంలో బలభద్రపురం అనే ఊరు ఉంది. అక్కడ ఒక వ్యక్తికి ఇంటిమీద అప్పు ఇచ్చారు చాలా క్రితం, అప్పటి మన మేనేజర్ శ్యాం సుందర్ గారు. రెండు వాయిదాలు కట్టారు. కానీ తర్వాత ఏమీ జమ చేయలేదు ఆ వ్యక్తి. ఆ ఊరు కొంచెం లోపలకు ఉంటుంది. వెళ్ళడం ఇబ్బంది, అని మన వాళ్ళు ఎవరూ అక్కడికి వెళ్ళలేదు. నువ్వు ఓ సారి బలభద్రపురం వెళ్లి, ఆ లోను రికవరీ గురించి గట్టిగా ప్రయత్నించాలి. ఈ పనిలో విజయం సాధిస్తావని నా నమ్మకం. ఇదిగో ఫైల్” అని ఒక ఫైల్ సుధాకర్ కి ఇచ్చారు మేనేజర్.


సుధాకర్ తన సీట్లోకి వచ్చి ఫైల్ చూసాడు. ఇంటి దస్తావేజులు తనఖా పెట్టి, ఇరవై వేలు అప్పు తీసుకున్నాడు ఇంటి యజమాని రాఘవ. రెండు వాయిదాలు మాత్రమే బ్యాంకు కి కట్ట్టాడు. తర్వాత ఏమీ కట్టలేదు. సుధాకర్ కి రెండు విషయాలు అర్ధమయ్యాయి. ఒకటి, అప్పు చిన్నది. రెండు ఆ ఊరు వెళ్ళడం కష్టం కనుక, సిబ్బంది బద్దకించి ఉండవచ్చు.


శివపురం చుట్టుపక్కల ప్రాంతాలు బాగా తెలిసిన, బ్యాంకు సబ్ స్టాఫ్ కేశవని తీసుకుని, మర్నాడు బలభద్రపురం బయల్దేరాడు సుదాకర్. పది కిలోమీటర్లు వెళ్ళాక, తారు రోడ్డు నుంచి, కంకరరోడ్డు కి మళ్ళారు. రోడ్డు కి పక్కనే పెద్ద పెద్ద నిద్రగన్నేరు చెట్లు, చింతచెట్లు ఉండడం వలన చల్లగా ఉంది. కానీ రోడ్డు మీద గోతులు ఎక్కువగా ఉన్నాయి.


“ఈ రోడ్డు మీద బైకు వెళ్ళడమే కష్టంగా ఉంది. బస్సులు ఎలా వెళ్తున్నాయి?” ఆశ్చర్యంగా అడిగాడు సుధాకర్, కేశవని.


“భలేవారే, ఈ రూటులో బస్సులు తిరగడం మానేసి పదేళ్ళు అయ్యింది. ఆటోలే తిరుగుతాయి. వాళ్ళు ఎంత అడిగితే అంతా ఇవ్వాలి. ఇంకో దారి లేదు కదా సార్. అలాగే ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆటోల మీదే వెళ్తున్నారు జనం” చెప్పాడు కేశవ.


“మరి ఇన్ని సంవత్సరాల నుండీ ఈ దారిలో బస్సు నడవడం లేదని, తాము చాలా ఇబ్బంది పడుతున్నామని, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, సర్పంచ్ లు, ఎం. ఎల్. ఏ. గారికి, ఆర్. టి. సి. వారికి దరఖాస్తు చేసుకోలేదా?” అన్నాడు సుధాకర్, బైకు గోతులలో పడకుండా జాగ్రత్తగా నడుపుతూ.

“పూర్వం రోజులు అయితే, మీరు చెప్పినట్టు జరిగేవి. కానీ జనం ఆలోచనా విధానం లో మార్పు వచ్చింది సార్. పంచాయితీ ఎన్నికలు వచ్చినా, మండల పరిషత్ ఎన్నికలు వచ్చినా, ఎం. ఎల్. ఏ. ఎన్నికలు వచ్చినా, మా ఓటుకి ఎంత డబ్బు ఇస్తారని అడుగుతున్నారు గానీ, మాకు రోడ్డు వేయించండి, మా ఊరికి బస్సు వేయించండని అడిగే వారు తగ్గిపోయారు సార్” విచారంగా అన్నాడు కేశవ.


ఈలోగా వెంకటాయపురం వచ్చింది. ‘సార్, నాకు ఇంత వరకే తెలుసు. ఆ కిళ్ళీ కొట్టు దగ్గర ఆపండి. బలభద్రపురం గురించి అడుగుదాం” అన్నాడు కేశవ. అప్పటికి శివపురం నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు వచ్చినట్టు మీటర్ చూసి తెలుసుకున్నాడు సుధాకర్.


కిళ్ళీ కొట్టు దగ్గర ఆగి, కొట్టు అతన్ని అడగ్గానే, “ముందుకు వెళితే కుడిపక్క చిన్న రామాలయం వస్తుంది. ఆ రామాలయం వీధిలోంచి సరాసరి వెళ్ళండి, బలభద్రపురం వస్తుంది” అని చెప్పాడు.

సుధాకర్ బైకు మీద కొంచెం ముందుకు వెళ్ళగానే చిన్న రామాలయం కనిపించింది. బైకు కుడిపక్కకు తిప్పి ఆ వీధిలోంచి పోనిచ్చాడు. రెండు ఫర్లాంగుల దూరం వెళ్లేసరికి మరీ సన్నని కంకర రోడ్డు కనిపించింది.


రోడ్డుకి రెండు వైపులా పొదలూ, దొంకలూ ఉన్నాయి. వెంకటాపురం వరకూ వచ్చిన దారి కన్నా, ఈ దారి మరీ అధ్వాన్నంగా ఉంది. ఒకో చోట మరీ లోతుగా గోతులు ఉండడంతో, ఇద్దరూ బైకు దిగి నడిచారు. చెట్ల నీడ కూడా లేకపోవడంతో ఇద్దరూ చెమటలు కక్కుతున్నారు.


అలా దారి బాగున్నచోట బైకు మీద, గోతులు ఉన్నచోట దిగి నడిచి అరగంటకు బలభద్రపురం వచ్చ్హారు, సుధాకర్, కేశవ. బ్యాంకు స్టాఫ్ లోన్ రికవరీ కోసం ఎందుకు ఇక్కడకు రాలేదో సుధాకర్ కి అర్ధం అయ్యింది.


రచ్చబండ దగ్గరకు వెళ్లి, “నడకుదుటి రాఘవ ఇల్లు ఎక్కడ?” అని ఒక పెద్దాయన్ని అడిగాడు సుధాకర్.


“రాఘవ చనిపోయి చాలా కాలం అయ్యింది సారూ. సర్లెండి. ఆ ఇల్లు చూపిస్తాను రండి” అని రెండు వీధులు తిప్పి ఒక పడిపోయిన, పెంకుటిల్లు దగ్గరకు తీసుకువచ్చాడు వాళ్ళు ఇద్దరినీ. పెంకుటిల్లు వసారాకు చేర్చి తాటాకులతో వేసిన వసారా ఉంది.


“బిడ్డా ఎంకట లక్ష్మీ, ఎవరో వచ్చారు. ఒ సారి బయటకు రా’ అని పిలిచాడు పెద్దాయన. వెంకట లక్ష్మి బయటకు వచ్చి పెద్దాయన పక్కనే ఉన్న సుధాకర్, కేశవ ని చూసి ‘దండాలు సారూ’ అంది చేతులు జోడించి.


ఆ పెంకుటిల్లుని, వసారాని, అందులోంచి వచ్చిన వెంకటలక్ష్మి ని చూసి సుధాకర్ మనసు కరిగిపోయింది. అయినా తన ధర్మం తను నెరవేర్చాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే వెంకటలక్ష్మి కేసి తిరిగి “చూడమ్మా, మేము శివపురం బ్యాంకు నుండి వచ్చాం. మీ నాన్న పది సంవత్సరాల క్రితం ఈ ఇల్లు తనఖా పెట్టి, మా బ్యాంకు లో ఇరవై వేలు అప్పు తీసుకున్నాడు. రెండు వాయిదాలు మాత్రమె కట్టాడు. వడ్డీతో కలిపి అప్పు ఏభై వేలు వరకూ అయ్యింది. మరి ఆ డబ్బు నువ్వే కట్టాలి” అన్నాడు సౌమ్యంగా.


వెంకటలక్ష్మి, సుధాకర్ తో “సారూ, మా నాన్న మా అమ్మ కి జబ్బు చేస్తే వైద్యం చేయించడానికి మీ బ్యాంకు లో అప్పు తీసుకున్నాడు. ఏడాది తిరిగేసరి ఆ డబ్బూ ఖర్చై పోనాది, మా అమ్మా పోనాది. ఆ దిగులుతో బెంగేట్టుకుని మా నాన్నా చనిపోనాడు. తల్లీ తండ్రీ పోవడంతో, అనాధలమైన నన్నూ, నా తమ్ముడినీ ఈ వెంకన్న తాత, మల్లన్న తాత ఆదుకుని తిన్దేట్టి బతికించారు. అప్పుడు నాకు పదేళ్ళు, మా తమ్ముడికి ఆరేళ్ళు”అని ఒక్క క్షణం ఆగి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కేసి జాలిగా చూసాడు సుధాకర్.


కన్నీళ్లు తుడుచుకుని ‘ఒరేయ్ రమణా, ఓ పాలి బయటకు రారా’ అని పిలిచింది. చంకలో కర్ర సాయంతో వసారా లోంచి బయటకు వచ్చాడు రమణ. ఒక కాలు బాగానే ఉంది. రెండో కాలు పోలియో వలన వేలాడుతోంది. ఆ దృశ్యం చూసి సుధాకర్ కదిలిపోయాడు. అతని కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర కదలాడింది.


వెంకన్న తాత సుధాకర్ కేసి తిరిగి “సారూ, వాళ్ళ పరిస్థితి చూసారుగా. వాళ్ళు అప్పు ఏం కట్టగలరు? రోజు గడవడమే కష్టంగా ఉంది వాళ్లకు. వెంకట లక్ష్మి, వెంకటాయపురం లో ఒక షావుకారు గారి ఇంట్లో వంట చేసి వస్తుంది రోజూ. ఆల్లిచ్చే జీతంతో, రేషన్ బియ్యంతో బతుకుతున్నారు వాళ్ళు ఇద్దరూ. పదేళ్ళ క్రితం రాఘవ కి అప్పు ఇచ్చినప్పుడు వచ్చేడు ఓ పెద్దాయన. మళ్ళీ ఇన్నాళ్ళకి మీరు వచ్చారు, అప్పు కట్టమని. మీరే దయ చూడాలా, ఆళ్ళని” అన్నాడు చేతులు జోడించి.


“అయ్యయ్యో, పెద్దవారు మీరు నాకు దణ్ణం పెట్టకండి” అని ఆయన చేతులు పట్టుకున్నాడు సుధాకర్.


“మీ నాన్న ఎం చేసేవాడు?”అడిగాడు సుధాకర్, వెంకట లక్ష్మి ని.


“మట్టితో బొమ్మలు చేసి, వాటికి రంగులు వేసి, ఊరూరా సైకిల్ మీద తిరుగుతూ, అమ్ముతూ ఉండేవాడు” చెప్పింది వెంకటలక్ష్మి. ఆమె మాట వినగానే, సుధాకర్ కి విషయం బోధపడింది. బహుశా రాఘవ బొమ్మలు అమ్మడానికి శివపురం వచ్చినపుడు, అతని కష్టం చూసి జాలిపడి, శ్యాం సుందర్ గారు అతనికి బ్యాంకు లోన్ ఇచ్చి ఉండవచ్చు. కానీ భార్య అనారోగ్యానికి, ఆ డబ్బు ఖర్చు చేసి, వాయిదాలు చెల్లించలేక పోయి ఉండవచ్చు రాఘవ.


‘నువ్వు కష్టం లో ఉన్న పేదవాళ్ళకు, అభాగ్యులకు అండగా ఉండి, వారిని ఆదుకుంటానని, నాకు మాట ఇయ్యి’ అని తల్లి చనిపోయే ముందు అన్న మాటలు, సుధాకర్ కి గుర్తుకు వచ్చాయి. ఐదు నిముషాలు దీర్ఘంగా ఆలోచించి, తన మనసులోని మాట వెంకన్న తాత కి చెప్పాడు. ఆ మాట వినగానే వెంకన్న తాత చాలా ఆనందించాడు.


‘సారూ, మా రాఘవ గొప్ప కళాకారుడు. విధి బాగుండక అతని కుటుంబం రోడ్డున పడింది. వీళ్ళని మీరు ఆదుకుంటే, ఆ పల్లె అంతా మీకు రుణపడిఉంటుంది’ అన్నాడుసంతోషంగా.


సుధాకర్, వెంకటలక్ష్మి తో పదినిముషాలు మాట్లాడి వెనుదిరిగాడు.


******


వారం గడిచేసరికి వెంకటలక్ష్మి ని శివపురం తీసుకువచ్చి, రామమూర్తి మాస్టారి ఇంట్లో ఉంచడం, ఆమె తమ్ముడు రమణ ని సాంఘిక సంక్షేమ హాస్టల్ లో పెట్టి, ఆరవ తరగతి లో జాయిన్ చేయడం చాలా స్పీడ్ గా జరిగిపోయాయి.


వెంకటలక్ష్మి ని రామమూర్తి మాస్టారు పదవతరగతి పరీక్షలకు ప్రైవేటు గా హాజరు అవడానికి సిద్ధం చేస్తున్నారు. అక్కా, తమ్ముడూ శివపురం లో చీకూ, చింతా లేకుండా ఉన్నారు.


రెండేళ్ళు గడిచాయి. వెంకటలక్ష్మి పదవతరగతి పాసయ్యింది. రమణ ఎనిమిదవ తరగతి లోకి వచ్చాడు. వెంకటలక్ష్మి కి వంటలు చేయడం చాలా ఇష్టమని గ్రహించాడు సుధాకర్. రాఘవ చేసిన అప్పుని సుధాకర్ తన స్వంత డబ్బు చెల్లించి తీర్చేసాడు.

ఒకరోజు రామమూర్తి. మాస్టారు ఇంటికి వచ్చాడు సుధాకర్. ఇద్దరూ మాట్లాడుకుంటుండగా టీ పట్టుకుని వచ్చింది వెంకటలక్ష్మి. టీ తాగుతూ ఆమెని పరిశీలనగా చూసాడు సుధాకర్. ఆర్ధిక ఇబ్బంది లేకపోవడం, నీడ పట్టున ఉండడం వలన ఆమె మొహం ఆకర్షణీయంగా తయారయ్యింది.


వెంకటలక్ష్మి చామన ఛాయ రంగు అయినా, మొహం చాలా కళగా ఉంటుంది. తీర్చి దిద్దిన అవయవ సంపదతో ఉంది. ఆమె పొడగరితనం ఆమె అందానికి అదనపు శోభనిస్తోంది.


టీ తాగి, కప్పు టీ పాయ్ మీద పెట్టి ‘పదవతరగతి అయ్యింది కదా, ఏంచదువుదామనుకుంటున్నావ్?’ అడిగాడు సుధాకర్.


“ఏదైనా చిన్న స్వీట్ కొట్టు పెట్టుకుని, నా కాళ్ళ మీద నేను నిలబడాలని అనుకుంటున్నాను సారూ” అంది వెంకటలక్ష్మి.


తణుకులో పదవతరగతి పరీక్షలు రాయడానికి వెళ్ళినపుడు చూసింది, చాలా స్వీట్ మార్ట్ లు, జనంతో కళ కళ లాడుతూ ఉండడం. వెంకటాపురం లో షావుకారిగారి భార్య స్వీట్స్ తయారీలో కొన్ని మెళకువలు నేర్పింది. ఇక్కడ రామమూర్తి మాస్టారి భార్య రాజేశ్వరి గారు, తన ఇంట్రెస్ట్ తెలుసుకుని కొత్త రకాల స్వీట్లు తయారు చేయించే వారు. ఇప్పటికే సుధాకర్ సారు కి, చాలా ఋణపడి ఉంది. ఇంకా చదువు అంటూ మరో నాలుగైదేళ్ళు ఆయనకీ భారం కాకూడదని నిర్ణయించుకుంది వెంకటలక్ష్మి.


ఆమె మనసులోని భావాల్ని గ్రహించాడు సుధాకర్. ‘“నీ చదువు, నాకు భారం అని అనుకుంటున్నావా? అటువంటిది ఏం లేదు. నువ్వు ఎంత వరకు చదువుకుంటే, అంతవరకూ చదివిస్తాను” చిన్నగా నవ్వుతూ అన్నాడు సుధాకర్.


“లేదు సారూ, నేను ఏదో ఉపాధి చూసుకుని స్థిరపడాలని అనుకుంటున్నాను. చదువు అంటారా, పదవతరగతి లాగే, డిగ్రీ కూడా ప్రైవేటు గా చదువుతాను” అంది వినయంగా ఆమె.


“సరే, ఏదైనా వ్యాపారం చేయాలంటే అందులో కొంత అనుభవం సంపాదించాలి. అప్పుడే నీకు విజయం లభిస్తుంది. అలాగే పేరున్న స్వీట్స్ తయారీ గురించి క్షుణ్ణంగా తెలుసుకో” అన్నాడుసుధాకర్. అలాగే అని తల ఊపింది వెంకటలక్ష్మి.


మర్నాడే ఆత్రేయపురం బ్యాంకు లో పనిచేస్తున్న తన మిత్రుడు రామకృష్ణ దగ్గరికి పంపాడు వెంకటలక్ష్మి ని. రామకృష్ణ గారి ఇంట్లో ఉంటూ గ్రామం లోని పూతరేకుల తయారీ కంపెనీలకు వెళ్లి, పూతరేకుల తయారీ, వాటికి వినియోగించే నెయ్యీ, బెల్లం, పంచదార ల గురించి తెలుసుకుంది. తను కూడా వారితో కల్సి పూతరేకుల్ని తయారు చేసి నైపుణ్యం సంపాదించింది వెంకటలక్ష్మి. బాంక్ వారి తాలూకు మనిషి అని వాళ్ళు ఆమెకి పూర్తి సహకారం చేసారు. ఆ తర్వాత రామకృష గారి సహాయంతో, తాపేశ్వరం వెళ్లి ‘తీపి కాజా’ ల తయారీలో మెలకువల్ని కూడా తెలుసుకుంది. నెల రోజుల తర్వాత శివపురం వచ్చింది వెంకటలక్ష్మి.


ఒక వారం గడిచాక, తణుకు లోని పత్రికా విలేకరి బుచ్చిబాబు సహకారంతో, నరేంద్ర సెంటర్ లో ఉన్న పెద్ద స్వీట్ మార్ట్ లో, వెంకటలక్ష్మి ని సేల్స్ గర్ల్ గా కుదిర్చాడు సుధాకర్. ఏడాది తిరిగేసరికి స్వీట్స్ వ్యాపారం చేయడంలో యజమాని అనుసరిస్తున్న టెక్నిక్ ని గ్రహించింది వెంకటలక్ష్మి. అప్పుడప్పుడు వాళ్ళ వంట షెడ్ కి వెళ్లి రక రకాల స్వీట్స్ ఎలా తయారు చేస్తున్నారో చూసి షాపుకి వచ్చేది. ఇలా వ్యాపార మెలకువల్ని బాగా తెలుసుకుని శివపురం వచ్చింది.


తర్వాత రామమూర్తి మాస్టారి హామీతో బ్యాంకు లో లోన్ తీసుకుని, శివపురం గాంధీ బొమ్మల సెంటర్ లో ‘రాఘవ స్వీట్ మార్ట్’ ప్రారంభించింది వెంకటలక్ష్మి. రెండేళ్ళు గడిచేసరికి స్వీట్ వ్యాపారం బాగా పుంజుకుని స్థిరపడింది. ఒక రోజు బ్యాంకు కు వెళ్లి, తమ ఇల్లు విడిపించడానికి సుధాకర్ ఇచ్చిన డబ్బు అతనికి తిరిగి ఇచ్చేసింది. ఇప్పుడు వెంకటలక్ష్మి మనసు చాలా ప్రశాంతంగా ఉంది.


రామమూర్తి మాస్టారి చొరవతో వెంకటలక్ష్మి, సుధాకర్ ఇల్లాలు అయ్యింది. మాస్టారు, ఆయన భార్య పీటల మీద కూర్చుని కన్యాదానం చేసారు. ఆరు నెలలు హాయిగా గడిచాయి కొత్త జంటకి.


ఒకరోజు ఉదయం సుధాకర్ హాలులో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. టీ పాయ్ మీదున్న ఫోన్ మోగింది. ‘రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, ఏమనుకోను, నిన్నేమను కొను’ అంటూ. అది వెంకటలక్ష్మి ఫోన్ రింగ్ టోను. లోపల నుంచి వెంకటలక్ష్మి వచ్చి ఫోన్ మాట్లాడింది. అది స్వీట్స్ ఆర్డర్ గురించి వచ్చిన ఫోన్.


ఫోన్ మాట్లాడటం అయ్యాక “లక్ష్మీ, ఆ రింగ్ టోనూ మార్చకూడదా.. నాకు ఇబ్బందిగా ఉంటోంది” అన్నాడు బిడియంగా సుధాకర్.


“అది ఈ జన్మలో జరగదు సారూ” అని అతని బుగ్గ మీద ముద్దు పెట్టి, లోపలకు వెళ్ళింది వెంకటలక్ష్మి.

******

M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






74 views1 comment

1 Comment


@mrvsmurthy311 • 3 days ago

చాలా బాగా చదివారు సార్. ధన్యవాదాలు

Like
bottom of page