top of page

కృష్ణాచారము


'Krishnacharamu' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'కృష్ణాచారము' తెలుగు కథ

రచన: సుదర్శన రావు పోచంపల్లి


“నళినీ! మనము రేపు మన ఊరికి పోయి వస్తామా?” అని అడుగుతాడు భార్యను దినేశ్.


“ఊరికి పోక చాలా రోజులాయె! అమ్మా నాన్నలను చూడాలని పిస్తున్నది. ఎట్లున్నరో ఏమో పాపం” అంటూ “రేపటినుండి మూడు రోజులు సెలవులు గూడా అంటాడు. నా మనసులోనూ అదే మెదులుతున్నదండీ! ఈ రాత్రికే అన్ని సిద్ధము చేసి ఉంచుతాను” అంటూ “మామగారికి కావలసిన మందులు తీసుకరండి” అంటుంది నళిని. “ఆ ఇంకొక ముఖ్య విషయము. ఎల్లుండి అత్తయ్యగారి పుట్టిన దినము కూడా ఉన్నదండి. నేనుకూడా మీతో వస్తాను. మంచి చీర తీసుకోవాలి” అంటుంది నళిని.


“సరే రాణిగారు చెప్పినట్లే చేస్తాము. పద ఇంక ఆలస్యమెందుకు” అంటాడు దినేశ్.


దినేశ్ నళిని. చాలా అన్యోన్య దంపతులు. భార్య చెప్పింది భర్తకాని, భర్త చెప్పింది భార్య కాని పాటించవలసిందే. ఇంకా పిల్లలు కలుగలేదు. అదొక దుగ్ధ మాత్రం పీడిస్తుంటుంది దంపతులకు.

అనుకున్నదే తడవుగా ఇద్దరూ బజారుకు పోయి అనుకున్న వస్తువులన్ని కొనుక్కవస్తారు. ఉదయమే లేచి పనులన్ని ముగించుకొని ఫలహారము చేసి ఊరికి పయనమౌతారు దినేశ్ నళిని.


ఎదురుగా దినేశ్ బావమరిది అంటే నళిని. తమ్ముడు మేధావి ప్రత్యక్షమౌతాడు.


“పిల్లి అడ్డమొచ్చినట్టు ప్రొద్దున్నే ఎదురైనవు మహానుభావా! అంతా కుశలమేనా?” అని అడుగుతాడు దినేశ్.


“అంతా క్షేమమే బావగారు.. కాని మీరెక్కడికో పయనమైనట్టున్నది” అని ప్రశ్నిస్తాడు మేధావి.


మా ఊరికి పోయివస్తామని అంటుంది నళిని.

“సరె పోయిరండి. మళ్ళీ వెనుదిరుగుడెందుకు.. నేను నా స్నేహితుడు శంతన్ ఇంటికి పోయి వాణి చెల్లెలు వివాహ నిశ్చయ కార్యక్రమములో పాల్గొని ఎల్లుండి మా ఇంటికి వెళ్ళిపోతాను” అంటాడు మేధావి.


“సరె మేము ఎట్లైనా సిద్ధమైనముకద.. మేము పోయివస్తము. నీవు అప్పుడే వెళ్ళిపో.కు మేము వచ్చేదనుక ఉండి పోదువుగాని” అని బావమర్దితో అంటడు దినేశ్.


“వాడు చాల రోజులకు మన ఇంటికి వచ్చిండు కద! కనీసము ఇంటిలోనికి పిలిచి చాయ ఐనా త్రాగినంక పొమ్మందాము. నువ్వు రార తమ్ముడు” అంటుంది నళిని.


“ఏం చేద్దాం తప్పుతుందా” అని అనుకుంటు ఓరగంట బావమర్ది మెధావిని చూస్తూ లోనికి వారితో కూడా పోతాడు దినేశ్.


చాయ చేస్తూ తల్లిగారింటి బాగోగులన్ని తమ్మునడిగి తెలుసుకుంటూనే చాయ బిస్కిట్లు తెచ్చి తమ్ముని ముందర పెడుతది నళిని.


“నేనేమి పాపము చేసిన నళిని. నాకు చాయ కొంచమైనా తెస్తే బాగుండేది కదా” అని నవ్వుకుంటూ అంటాడు దినేశ్.


“మీకు తేకుండా ఉంటానా” అంటూ భర్తకు కూడా చాయ తెచ్చి ఇస్తూ తనూ కప్పులో కొంత పోయమంటుంది” భర్తను ఖాళీ కప్పు చూపిస్తూ, నళిని.


భార్యతో చాయ పంచుకొని “నువ్వు కొంచెము త్వరగా తాగవయ్య మేధా. ఉడుకుంటె కొన్ని నీళ్ళు కలుపుకో. చాయ చల్లగా ఐతది. ఎక్కువకూడా కనిపిస్తది” అని పరిహాసమాడుతాడు దినేశ్.


చాయ కార్యక్రమము ముగిసినంక అందరూ బయటికి వచ్చి ఇంటికి తాళము వేసి “పద మేధావీ! నిన్ను మీ శంతన్ ఇంటిదగ్గర దింపి మేము వెళ్ళి పోతాము” అంటడు దినేశ్. “సరె బావగారూ” అంటూ వాళ్ళను అనుసరిస్తాడు మేధావి. మేధావిని దించేసి ఊరికి పయనమౌతారు దంపతులు.

దినేశ్ చాలా సౌమ్యుడు. భార్య పట్ల అనురాగము ప్రేమయే గాక అత్త మామలన్నా గౌరవము మర్యాద చూపు వ్యక్తి.


దారిలో పయనించుచు “నళినీ- మనము వచ్చే వారము మీ అమ్మగారింటికి కూడా పోయి వస్తాము. పోక చాలా రోజులయ్యింది. మన మర్యాద కాదు” అంటాడు దినేశ్ భార్యతో.


“మీకు సెలవులు లేవుకద” అంటుంది నళిని- కారు నడుపుతున్న భర్తవైపు చూస్తూ.


“దానిదేముంది? నా ఖాతాలో బోలెడు సెలవులున్నయి. వారము రోజులు సెలవులు తీసుకొని పోయివస్తాము. సరేనా” అంటాడు దినేశ్.


“సరె మీరు పోదామంటే మా తల్లిగారింటికి నేను రానంటానా.. మీకు సెలవు దొరకడమే పది వేలు” అంటుంది నళిని-

సంతోషము వ్యక్తపరుస్తు.


“వారము రోజులు సెలవు పెట్టుకొని పోయేటంత ముఖ్యమైన పనులు ఏమున్నవి అక్కడ” అని ప్రశ్నార్థకంగా భర్తవైపు చూస్తుంది నళిని.


“నా ఆలోచన వేరే వున్నది నళినీ” అంటుంటూనే అదేమిటో ఎప్పుడూ మూడు రోజులైనా సరిగా ఉండలేని భర్తకు అని తనూ ఆలోచనలో పడిపోతుంది నళిని- భర్తను ప్రశ్నించకుండానే.


నళిని ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ “మన దేశ ద్రిమ్మరి ముప్పది ఏండ్లకు వస్తున్నడు. ఇంకా పెండ్లి చేసుకోకుండా ఉన్నాడు గదా” అంటడు దినేశ్ భార్యవైపు చూస్తూ.


“వాణ్ణి మీరు పట్టించుకోకండి. ఆ తిరుగుడు వానికి అలవాటైపోయింది. అమ్మ నాన్నలను కూడా కాంతులేడు దుర్మార్గుడు” అంటూ కొంత వ్యాకులత చెందుతుంది నళిని.


“అందుకేకద మన వారము రోజుల పయనపు ప్రతిపాదన. మా స్నేహితుడు రణధీర్ బిడ్డ ఉన్నది. మంచి చదువుకున్న అమ్మాయి. రూపవతి కూడా. ఆ అమ్మాయి పేరు మహాదేవి” అంటాడు కారు నడుపుతూనే –


అది వినగానే ఆత్రతగా అడుగుగుతుంది నళిని.

“మరి వారి చరిత్ర ఏమిటి?” అని కుల గోత్రాల ప్రసక్తి తేకుండా.


అది ఊహించుకున్న దినేశ్ “కాలము మారింది నళిని. మనము ఆ కృష్ణాచారము. ఇంకా తల్వగూడదు” అంటాడు భార్యతో.


“మరి మా అమ్మ నాన్నలేమంటరో” అంటుండగానే “నేను పిచ్చోణ్ణేమి కాదు వారము రోజులు సెలవు పెట్టి రావడానికి. పెద్దమనుషుల మనసు నొవ్వకుండా పాత పద్ధతులు వదిలి కొత్త దారులు వెదకితేనే సమాజములో గౌరవము దక్కుతుందని వాళ్ళకు ఓపికగా చెప్పి ఒప్పించాలె మనము” అంటాడు దినేశ్.


“మీ ఆలోచన బాగానే ఉన్నది. నాకూ సమ్మతమే కాని ఈ మహానుభావుడు దారికొస్తాడంటరా” అని సందేహము వెలిబుచ్చుతది నళిని.


“అదేనమ్మా నా వారము రోజుల సెలవు సఫలీకృతానికి ప్రయత్నము. నయాన భయాన ఒప్పించితే ఇంకా పెద్దమనుషులౌతున్న మీ అమ్మ నాన్నలకు ఓ మనిషి తోడుంటదని నా తపన” అంటాడు దినేశ్.


‘ఇంత విశాల హృదయుడా నా భర్త’ అని లోలోపలే పొంగి పోతూ “సరెనండి మన ప్రయత్నము మనము చేసి చూతాము” అంటుంది నళిని.


“చూతాము చేతాము కాదు, ఏతీరుగానైన మనము కార్యము సాధించాలె. మీ తమ్మునికి ముకుతాడెయ్యాలె” అంటూ “మన ఊరు దగ్గరికి చేరువలో ఉన్నాము. ఇక తరువాత ముచ్చటిస్తాము” అని కారు నడుపుతుంటాడు దినేశ్.


ఊరు చేరి ఇంట్లోకి ప్రవేశించి పెద్దవారికి పాదాభివందనము చేస్తారు దంపతులిద్దరు.


కుశల ప్రశ్నలు వేస్తూ తల్లి వకుళా దేవి “పొద్దున్నే ఎప్పుడు తినివచ్చిన్రో మొదట కాళ్ళు చేతులు కడుక్కొని రండి. నేను భోజనానికి ఏర్పాటు చేస్తా”నంటుంది కొడుకు కోడలుతో.


“అదేమిటత్తయ్యా! మీరు కష్టపడటమేమిటి? మేము ఫలహారము షుస్టుగానే భోంచేసి వచ్చినము. ఇప్పుడు తొందరేమిటి.. ఐనా నేను సిద్ధము చేస్తాను” అంటుంది నళిని.


“చూసినవా నా కోడలు నిన్ను కష్టపడొద్దంటున్నది. నాకైతె ఆకలి తీరిపోయింది” అంటాడు దినేశ్ తండ్రి సంజీవరాయుడు.


“అమ్మో మామ గారు.. ఐతె మీరు ఇంత పొద్దెక్కినా తినలేదన్నమాట. ఉండండి. వటింట్లోకి పోయి నేనే త్వరగా భోజనము సిద్ధము చేస్తాను. అట్లా ఇంత సేపు తినకుండా మీ వయసు వారు ఉండకూడదు మామయ్యా” అంటుంది నళిని.


పైగా అంటుంది “ఐనా మీరిద్దరే ఇక్కడ ఉండడమేమిటి? మాతో పట్నము రండి. అందరము కలిసి హాయిగా ఉండొచ్చు” అనుకుంటూ వంటింట్లోకి పోయి నలుగురికి చాయ చేసి తీసుక వస్తుంది నళిని.


ఓహో ఇది మధ్యంతర భృతా అని చాయ తీసుకుంటూ నవ్వుతాడు దినేశ్.


సంజీవరాయుడు ఆ ఊళ్ళో పెద్దమనిషిగా చలామణి ఔతుంటాడు. తమ స్వంత భూమిలో వ్యవసాయము చేసుకుంటూ ఉంటారు ఊరిలోనే. కొడుకుకు ఉద్యోగము దొరికి పెళ్ళి కాగానే పట్నవాసం తప్పదంటూ పట్నానికి పంపిస్తారు కొడుకు ఎంత బుద్ధిమంతుడో కోడలు కూడా అంతే సుగుణవతి దొరకడము వారి అదృష్టంగా భావిస్తారు సంజీవరాయుడు. వకుళాదేవి.


వంటింట్లోకి పోయిన నళిని- త్వరత్వరగా వంట తయారు చేసి అత్త మామలకు భర్తకు వడ్డిస్తుంటె అత్త వకుళాదేవి “నీవు కూడా పెట్టుకో నళిని. మనందరము కలిసే తిందాము” అంటుంది కోడలుతో ఆప్యాయంగా.


నలుగురూ ఆ ముచ్చట ఈ ముచ్చటా చెప్పుకుంటూ సంతోషంగా భోజనము చేస్తారు చాలా కాలానికి.

భోజనము చేసి ఒక గంట తరువాత దినేశ్, నళిని.

వాళ్ళ పొలానికి పోయి అంతా కలయదిరిగి సాయంత్రానికి ఇంటికి చేరుతారు. దారిలో ఊర్లోని స్నేహితులను పెద్దమనుషులను పలుకరించి వారి యోగ క్షేమాలను తెలుసుకుంటాడు దినేశ్.


నళినికి- పొలము చూడబోవడము అదే కొత్త. ఏమీ మాట్లాడకుండా భర్తను అనుసరిస్తుంటాది దారి పొడవునా.

ఆనాడు, తెల్లవారి, మరునాడు ఊళ్ళో తలిదండ్రులతో ఎంతో సంతోషంగా గడిపి సాయంత్రము పట్నం పయనమౌతారు భార్యా భర్తలు. పోయే ముందర తలిదండ్రులను తమతో పట్నము వచ్చి ఉండమని మరీ మరీ అడుగుతారు.


“లేదు నాయనా! నాకు ఇంకా సత్తువ ఉన్నది. ఈ ఊరు నమ్ముకొని బ్రతికిన. ఇంక కొన్నాళ్ళు ఇక్కడనే ఉంటాము” అంటాడు సంజీవరాయుడు కొడుకు మనసు నొచ్చుకొనకూడదను తలంపుతో లేచి భుజము తడుతూ.


“సరే జాగ్రత్తగా ఉండండి. అర్థరాత్రి అవసరమొచ్చినా ఇక్కడికి వాలిపోతాము” అంటుంది నళిని.


సంజీవరాయుడు కలుగజేసుకుంటు- “చేతకానినాడు మీరుకాక మాకెవరున్నరు? సరె బయలు దేరండి, ఇప్పటికే పొద్దు గృంకే వేళ ఐతున్నది. జాగ్రత్తగా ఇల్లు చేరి మాకు తెలుపండి”అంటారు వకుళాదేవి సంజీవరాయుడు ముక్తకంఠంతో.


పోయే ముందర దినేశ్, నళిని. పెద్దమనుషులకు దండంబెట్టి బయలుదేరుతారు. ఇల్లు చేరుతుంటేనే మేధావి దారిలో కలిసి కారెక్కి వీళ్ళతో పాటే ముగ్గురు ఇల్లు జేరుతారు.

ఇంట్లోకి చేరిన వెంటనే ఇల్లంతా శుభ్రము చేస్తూ కూరగాయలు, పాలు, పెరుగు తెమ్మంటుంది భర్తను నళిని..


సరె అంటూ స్కూటర్ తీసుకొని బజారుకు పోతాడు దినేశ్.


“ఆ ఇక చెప్పుర మనవాళ్ళ సంగతి. అమ్మా నాన్న ఆరోగ్యంగానే ఉన్నారా? నీవైతే తోవకొచ్చేటట్లు లేవు చెప్పి చెప్పి విసుగొస్తున్నది” అంటూ- “అడ్డెడు తినేవాడికి ఆలెందుకు- ఇద్దుము తినే వాడికి ఎద్దెందుకు” అన్న చందాన ఉన్నది నీ వ్యవహారం” అంటూ ఇల్లంతా శుభ్రము చేస్తది నళిని.


“లేదక్కా! అంత కోపమెందుకు? చూతాము లే” అని మాట దాటవేసే ప్రయత్నము చేస్తాడు మేధావి.


“నీ వాలకము నాకర్థము కాదా! ఓరేయ్.. నేను నీకు అక్కనురా. నేను నిన్ను అర్థము చేసుకోలేను అనుకోకు” అంటుంది నళిని.. “వచ్చే వారము సెలవు పెట్టి మీ బావగారు నేను అమ్మ నాన్నలను చూతామని వస్తామనుకుంటున్నము. నీవు కూడా అంతదనుక ఇక్కడే ఉంటే కలిసిపోదాము” అంటుంది నళిని. తమ్మునితో.


“మీరొస్తనంటె సరే అక్కా! అసలు అది నిజమా లేక నేను ఉండాలని అంటున్నవా” అంటాడు మేధావి సందేహము వ్యక్తపరుస్తూ.


“ఛీ ఛీ అదేమి కాదురా.. మేము తప్పకుండా వస్తాము. నాన్నగారి పుట్టిన రోజు కూడా ఉనందికదా. ఆ నాడు మేము అక్కడనే ఉంటాము” అంటుంది నళిని- తమ్మునికి నమ్మకము కలుగ జేస్తు.


అక్క సహజంగ అబద్ధాలాడదు అని మనసులో అనుకుంటూ “సరే అక్కా! మీరొస్తానంటే నేను ఇక్కడనే ఉంటాను. సరేనా” అంటుండగానే దినేశ్ కూర్గాయలు, పాలు, పెరుగు తీసుకొని వస్తడు.


వారము రోజుల తరువాత అన్నట్టే దినేశ్ వారము రోజులు సెలవు పెట్టి ఇంటికొస్తాడు.

“నళిని! మనము మామగారిని అత్తయగారిని చూడ పోతున్నముగదా వట్టి చెతుల్తో పోతె మర్యాదుండదు. పైగా మామ గారి పుట్టిన రోజు అంటున్నవు” కద అంటాడు దినేశ్.


“అవునండి. మనము బజారుకు పోయి..” అంటూనే “మేధావిని కూడా తీసుకొని కొత్తబట్టలు మొదలైనవి తీసుకవస్తాము. మొదలు వంట కానీయండి, తిని వెళుదాము” అంటుంది నళిని.


“ఇప్పుడైతె నాకు ఆకలి లేదు. మేధావికీ ఆకలి కాదు. మొదట పోయి వస్తాము” అంటాడు దినేశ్.


“సరె పదండి” అని త్వరత్వరగా తయారై తమ్ముడు మేధావితో సహా బజారుకు పోయిమామ రఘునాథ్ కు, అత్త సావిత్రికి, అట్లనే మేధావికి కూడా కొత్తబట్టలు వగైరా తీసుకొని ఇంటికి వస్తారు ముగ్గురు. ఆ పూట భోజనము చేసి త్వరగా పండుకొని తెల్లవారే స్నానాదికాలు ముగించుకొని ఫలహారము చేసి కారులో పయనమౌతారు.


దారి పొడవునా ఏదేదో మాట్లాడుకుంటూ బావమర్దికి అర్థము కావాలన్నట్లు సూచనగా తన మిత్రుని కూతురున్నదని ఆమె గుణగణాలుబాగున్నవని మంచి అందగత్తె అని చెబుతుంటాడు దినేశ్.


తెలువనట్లె నటిస్తూ “వాళెవరండి.. కులగోత్రాలేమిటి.. మాతమ్మునికి జోడీ ఔతుందా” అని అడుగుతుంది నళిని.

“ముందుగా చెబుతున్న నళిని- నువ్వు కోపగించుకున్నా పర్వాలేదు. కులగోత్రాల బూజుల ఊసు మనకెందుకు. అమ్మాయి చూడడానికి బాగున్నదా, బుద్ధిమంతురాలా, చదువుకున్నదా అని తెలుసుకోవాలె కాని కృష్ణాచారము లాంటి అవలక్షణాలు మనమొదిలేయాలి” అంటాడు దినేశ్ కొంత విసుక్కున్నట్లు.


“సరెలెండి! వారెవరైతే నాకేమి? మాతమ్మునికి సరి జోడీ ఐతె చాలు” అంటూ “ఏమిరా మాట్లాడవు?” అని తమ్ముని దిక్కు చూసి అంటుంది నళిని.


“ఇప్పుడవన్ని ఎందుకక్కా! బావగారన్నదాంట్లో తప్పైతె నాకు తోచలేదు. కాలము తీరు మనమూ మారవలసిందే” అంటాడు మేధావి.


‘హమ్మయ్య వీడు తోవకొస్తున్నట్టున్నది’ అని లోలోపలే మురిసి పోతుంది నళిని.


మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇల్లు జేరుతారు ముగ్గురు. కారు దిగుతూనే మామగారికి దండం పెడుతాడు దినేశ్. వీళ్ళు హఠాత్తుగా రావడము చూసి విస్మయమొందుతారు రఘునాథ్ సావిత్రి.


“అంతా కులాసనా” అని అడుగుతాడు రఘునాథ్. అల్లుని భుజము మీద చేయి వేస్తూ కూర్చో నాయనా అంటాడు కుర్చీ చూపిస్తూ.


“బావకు కాళ్ళకు నీళ్ళు తీసుకరార మేధావి”అని తండ్రి అనగానే కొంటెగా “ఇంకెన్నిసార్లు కడుగాలె బావకాళ్ళు” అంటూ లోనికి పోతాడు నీళ్ళు తేవడానికి.


నీళ్ళు తేగానే అంతే కొంటెగా అంటాడు దినేశ్ “బావమర్ది తోవకొచ్చేదాకా చెవులు పిండాలికదా” అని నవ్వుతాడు. వీళ్ళ మాటలకు అందరూ నవ్వుకుంటారు. ఆ రోజు వెంట తెచ్చుకున్న దిన పత్రిక తిరగేస్తూ కూర్చుంటాడు దినేశ్.

ఇల్లంతా హడావిడి బిడ్డా అల్లుడు రావడము పండుగగా భావిస్తారు.

ఇక తల్లీ బిడ్డలు వంటింట్లో కూర్చొని ముచ్చటలు పెట్టుకుంటూనే మంచి మంచి- అంటే అల్లునికి బాగా ఇష్టమయ్యే వంటకాలు చేస్తుంటారు. ఆ మాటలేమిటో విందామని రఘునాథ్ అప్పుడప్పుడు వంటింట్లోకి పోయివస్తూ అల్లుడిని పలుకరిస్తుంటాడు.. నిత్యము ఏవో వంటినొప్పులనే సావిత్రికి బిడ్డా అల్లుని చూడగానే అన్నీ మాయమై ఉత్సాహం పుట్టుకొస్తది. ముందుగా అల్లునికి చిక్కటి పాలతో చాయ చేసి పంపుతది సావిత్రి.

మధ్యాహ్నానికి వంట పూర్తయి ముందుగా మామలల్లుళ్ళకు తోడుగా మేధావికి వడ్డిస్తారు. తరువాత తల్లీ కూతుళ్ళు నిమ్మళంగా కూర్చొని ముచ్చటిస్తూ తింటుంటారు.


ఆత్రత ఆపుకోలేక తల్లితో అంటుంది నళిని తన భర్త, మేధావికి చూసిన సంబంధము తాము అందుకొరకే వచ్చిన విషయము వివరిస్తుంది. ఆ మాటకే సావిత్రి సంబరపడుతూ “మా అల్లుడు దేవుడమ్మా! ఇప్పుడైనా ఈ మొండోడు ఒప్పుకుంటె మకదే చాలు. వాడు మాకేమి పెట్టకున్నా ఒక ఇంటివాడైతె కన్నందుకు మాకదే తృప్తి” అని కండ్లు తుడుచుకుంటుంది సావిత్రి.


సాయంకాలము మామతో కలసి మామగారి పొలాలు చూడపోతాడు దినేశ్.


ఇంటికొచ్చి మామ రఘునాథ్ తో తామొచ్చిన విషయము వివరంగా తెలుపుతాడు దినేశ్–. దినేశ్ మాటలు పొడిగిస్తూ “మామగారూ! మీరేమనుకోనంటె ఒక మాట” అంటుండగానే “అదేమిటి నాయనా! నీవు మా శ్రేయోభిలాషివి. నీ మాట తప్పుబట్టేంత సాహసం చేస్తామని ఎట్ల అనుకుంటవు. నిర్మొహమాటంగా చెప్పు” అంటాడు రఘునాథ్.


తన స్నేహితుని బిడ్డ ఉన్నదని రూపానికి వంక లేదని చదువుకున్నదని సంస్కారవంతురాలని ఆమె గుణగణాలన్ని వల్లిస్తాడు దినేశ్.


“నాయనా చల్లకొచ్చి ముంత దాయటమేమిటి? ఐనా నీ ప్రయత్నము నాకు సంపూర్ణంగా అర్థమయ్యింది” అంటాడు రఘునాథ్.


“అదికాదు మామగారు.. పూర్వాచారాలకు పోకుండా వాళ్ళు అన్నింటా మనకు తగినవాళ్ళా కాదా అని బేరీజు వేసుకుంటూ పోకుండ ఒక కృత నిశ్చయానికి వస్తె నేను మాట్లాడుతాను” అంటాడు దినేశ్.


“సరె నాయనా! ముందా మూర్ఖుడు ఒప్పుకోవాలి” అంటుండగానే “అదేం పర్వాలేదు. మేము ముందుగానే అతని అంతరంగాన్ని పసిగట్టే మీతో ముచ్చటించుటకు సాహసిస్తున్నాను” అంటాడు దినేశ్.


“ఎంతమాట.. ఇందులో సాహసమేమున్నది.. మావాని భవిష్యంతా అక్కబావలకే వదిలేసాము. మీ ఇష్టము” అంటాడు రఘునాథ్.

“ఐతె మా కొదిలేశారన్నమాట మా బావమర్ది పెళ్ళి విషయము” అంటాడు మామతో దినేశ్.


“కాని ఒక్కటి మామగారు.. నేను మరీ మరీ చెప్పేదేమంటే కులగొత్రాల ప్రసక్తి కూడా మీరు తేమంటేనే మేము పూనుకుంటా”మంటడు దినేశ్.


“భవిష్యత్తు మీది. మా వాని ఆంతరంగం తెలుసుకున్నా మంటున్నరు, ఇక ఆ కృష్ణాచారము- బూజు మాకెందుకు అంటగడుతారు నాయనా! మీ ఇష్టమొచ్చినట్టు మా వాడు మెచ్చినట్టు చేయండి చాలు”అంటడు రఘునాథ్ అల్లునితో.


దానికి ఎగిరి గంతేసినంత పని చేస్తూ “ఏమోయ్ బామ్మర్ది! ఇక్కడికి రా.. నీతో ముఖ్యమైన విషయము మాట్లాడేది ఉన్నది” అని మేధావిని పిలుస్తాడు దినేశ్.


“వస్తున్నా బావా! ఏమిటా ముఖ్యమైన విషయము ..అదీ నాతో చర్చించేది?” అంటాడు మేధావి ఇదంతా విని విననట్టు నటిస్తూ.


“నేను ఊరకే వారము రోజులు సెలవు పెట్టి ఇక్కడికి రాలేదు. నీ పట్టు విడిపించేందుకే నా రాకడ” అంటాడు దినేశ్.

“సరె బావ! మీ ముందర నా పట్టేమి నిలుస్తది? నేను మళ్ళీ మీ వెంటనే వస్త, మీరు ప్రతిపాదించిన అమ్మాయిని ఒకసారి చూసి చెబుత” అంటడు మేధావి. అని మళ్ళీ మాట పొడిగిస్తూ “మీ మీద నమ్మకము లేక కాదు బావగారు.. నా సంతృప్తి కోసమే వస్తనంటున్న” అంటడు మేధావి బావ దినేశ్ తో.


ఇంత తొందరగా ఈ వ్యవహారము చక్కబడుతదనుకోక వారము సెలవు తీసుకుంటాడు దినేశ్. నళినిని పిలుస్తూ “ఇంకేం!మనము వచ్చిన పని సునాయాసంగా అయిపోయిందికద.. ఇక పోదామా” అంటడు దినేశ్.


“ నేనేదీ చెప్పను మీ ఇష్టము” అనుకుంటు రివ్వున లోనికి పోతుంది నళిని.

“అరెరె అంత కోపమెందుకు నళిని, నీ ఇష్టమే నాఇష్టము. వారము తరువాతనే పోదాము. కాని మన కృషి ఫలించాలంటె మా స్నేహితునితో మాట్లాడాలికదా. ముద్దొచ్చినప్పుడే చంకనెత్తుకోవాలె” అంటడు దినేశ్.


“సరె రేపో ఎల్లుండో పోదాము, ఒక కొలిక్కి వచ్చిన పనికి ఆలస్యము చేయుటకూడా తగదు” అంటుంది నళిని.

దినేశ్ తన మామగారితో “మేము వారము రోజులు ఉందామని వచ్చినము కాని మేధావి గుణము మారకముందె అతన్ని తీసుకొని పట్నము పోవాలి సెలెవియ్యండి” అంటడు.


“సరె నాయనా! మీ వల్ల మాకింత ఉపకారము జరుగుచుంటె ఇంకా ఉండమని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు” అంటడు రఘునాథ్- అల్లునితో.


“అన్నీ ఫలిస్తే మళ్ళీ తొందరలోనే కలుస్తము కదా, ఇక వెళ్ళొస్తము” అని “నళిని.. మీ తమ్ముణ్ణి కూడా త్వరగా తయారయి రమ్మను” అంటడు దినేశ్.


అరగంటలో తయారయి బయలుదేరుతూ మామగారికి దండం పెట్టి వెళ్ళి పోతరు ముగ్గురు.


ఇంటికి చేరగానే ఇల్లు శుభ్రము చేస్తూ నళిని ఉంటె దినేశ్ మేధావిని వెంటబెట్టుకొని అతని స్నేహితుని ఇంటికి పోతారు.

స్నేహితుడు రణధీర్ ఇంటికి చేరగానే అతని కూతురు మహాలక్ష్మి మల్లెపూలు తెంపుతూ వీళ్ళకు ఎదురుగానే నిలబడి ఉంటది. మేధావి ఆ అమ్మాయిని చూస్తూనే పరవసించిపోతాడు.


“మీ నాన్న లేడా అమ్మా?” అని దినేశ్ అడుగగానే “ఉన్నడు, లోనికి రండి” అని రివ్వున పూలబుట్ట అక్కడే మరచి లోనికి పోతుంది అమ్మాయి మహాలక్ష్మి.


స్నేహితుడు దినేశ్ వచ్చింది తెలుసుకొని లోనినుండి బయటికి వస్తాడు రణధీర్. స్నేహితులు ఒకరికొకరు కరచాలనం చేసుకుంటారు.


ప్రక్కనున్న మెధావిని చూపుతూ “ఇతని పేరు మేధావి. మా బావమరిది” అని పరిచయము చేస్తాడు రణధీరుకు. ఇంతకు ముందే మేధావి విషయము తెలుసుకున్న రణధీర్ లోపలికి పోయి కూతురు మహాలక్ష్మితో చాయ పంపుతాడు ఇద్దరికి.


భార్య హైందవికి మేధావిని చూపుతూ “ఇతడు మన దినేశ్ బావమరిది” అని పరిచయం చేస్తాడు. వెంటనే లోనికి పోయి కూతురు మహాలక్ష్మితో “అమ్మా! ఆ అబ్బాయిని చూసినవుకద నీ అభిప్రాయమేమిటి?” అని అడుగుతాడు రణధీర్.


“ఏమో నాన్నా నేనేమని చెప్పాలి అంతా మీ ఇష్టం” అంటుంది మహాలక్ష్మి.


“ఇంకేం మేధావి అందరికి నచ్చినట్టు” ఇక దాచుకోకుండా రణధీర్ సంతోషంతో దినేశ్ కు చెబుతాడు.


“శుభస్య శీఘ్రం అన్నారు పెద్దలు” అంటూ “మేము ఇంతకుముందే మా మామగారి ఊరినుండి వచ్చినము. ఇంటికి పోయి వాళ్ళకు కూడా తెలియబరుస్తము” అంటాడు దినేశ్ స్నేహితుడు రణధీర్తో సెలవు తీసుకుంటు.


ఇంటికి పోయి “అంతా చకచకా జరిగిపోయినవి నళినీ! ఇక లడ్డూలు తినేదే ఆలస్యం” అంటాడు దినేశ్.


“ఏమిరా మేధావీ! నీ పెళ్ళిలో నాకేమి కట్ణం పెడుతావు?” నళిని అంటుంటె “అక్కా! నీకంటె నాకెవరున్నరు చెప్పు. నువ్వు ఏది కొరుకుంటె అదే” అంటడు మేధావి సంతోషవదనుడై.


కొద్ది రోజులలోనే మేధావి మహాలక్ష్మిల పెళ్ళి ఏలాంటి ఆడంబరాలు, కట్న కానుకలు ఇత్యాదివి లేకుండా జరిగిపోతుంది.


“అయ్యా దొరవారు! ఇక తృప్తి అయ్యిందా కృష్ణాచారము..

కృష్ణాచారము.. అనుకుంటు ఏ వేడుకలు హంగు ఆర్భాటము లేకుండ బావమరిది పెండ్లి జరిపించిన్రు” అంటుంది మగనితో నళిని.


“సరెలే నీకు అల్లుడు పుట్టినంక ఆ ఆర్భాటాలు నువ్వే చెప్పి చేయింతువుగాని” అని నవ్వుతాడు దినేశ్.

దినేశ్ రణధీర్ల స్నేహము చుట్టము రూపకంగా ఇంకా బలపడుతది.


సమాప్తం.

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.37 views0 comments

Opmerkingen


bottom of page