కుటుంబ బంథం - ఇంటింటి వెలుగు
- Neeraja Prabhala

- Oct 15
- 9 min read
#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #KutumbaBandhamIntintiVelugu, #కుటుంబబంథంఇంటింటివెలుగు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Kutumba Bandham Intinti Velugu - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 15/10/2025
కుటుంబ బంథం - ఇంటింటి వెలుగు - తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజు తన భార్య సరోజ, కూతురు నేహతో సంతోషంగా జీవిస్తున్నాడు.
ఆ కుటుంబం చిన్నదైనా ఉన్నతమైన విలువలతో, ప్రేమతో నిండిపోయింది.
చిన్నప్పటి నుంచి నేహ చదువులో చాలా తెలివైన అమ్మాయి. చురుకైనది. తన తల్లిదండ్రుల ఆశల బాటలో ముందుకు సాగుతోంది.
ఒకరోజున తన కూతురితో “నేహా! జీవితంలో మనం ఎంత పెద్ద విజయాలు సాధించినా, మంచితనం - మానవత్వం మాత్రం కోల్పోవద్దు” అన్నాడు రాజు.
“ సరే! నాన్నా! మీరు చెప్పిన మాటలు నా భవిష్యత్తు జీవితానికి దారిచూపే మార్గం. ” అంది నేహ.
నేహ రోజూ కాలేజీకి వెళ్తోంది. చిన్ననాటి నుంచి సరోజ తన కూతురికి ఎప్పుడూ ఓర్పు, సహనం నేర్పేది.
“ నేహా! ఎవరైనా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా నీవు కోపం తెచ్చుకోకు. వాళ్లకి ప్రేమతో సమాధానం చెబితే తాము చేసిన పనికి వాళ్లు తమంతట తామే సిగ్గుపడతారు” అంది సరోజ.
“అమ్మా! నీ మాటలు నాకు ఎప్పుడూ బలాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి” అనేది నేహ.
కొంత కాలానికి నేహ కాలేజీ చదువు పూర్తిచేసి త్వరలోనే మంచి కంపెనీలో ఉద్యోగం పొందింది.
అతి త్వరలోనే తన పట్టుదల, నిజాయితీతో నేహ ఉద్యోగంలో అభివృద్ధి పథంలో త్వరగానే ఎదుగుతోంది.
“నీవు మా పేరు నిలబెట్టావు నేహా!” అన్నాడు రాజు ఒకరోజున.
“నాన్నా! ఇది మీ ఆశీర్వాదం వల్లే. ”
నేహ క్రమక్రమంగా ఆర్ధిక పరంగా తన కాళ్లపై తాను నిలబడుతోంది. వేడినీళ్లకు చన్నీళ్లుగా తన కుటుంబానికి సహాయం చేస్తోంది. క్రమేణా తన కుటుంబానికి సంతోషం, గౌరవం రెండూ పెరిగాయి.
కాలం హాయిగా సాగుతోంది. కొంతకాలానికి నేహకి తన ఆఫీస్‌లో కొత్తగా వచ్చిన సహోద్యోగి అరవింద్ పరిచయం అయాడు.
సింపుల్‌గా, వినయంగా ఉండే అతనితో నేహ సహజంగానే స్నేహం పెంచుకుంది. త్వరలోనే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.
“ నేహా! వృత్తి పట్ల నీ నిబద్ధత చూసి నిజంగా నేను ఇంప్రెస్ అయ్యాను. అన్నాడు అరవింద్.
“ వృత్తినే దైవంగా, ప్రేమగా చూసే వాళ్లకి ఫలితం తప్పకుండా ఉంటుంది” అన్నది నేహ.
కొద్ది రోజులలో వారిద్దరి స్నేహం మరింత లోతుగా మారి ఇద్దరూ తమ మనసులు ఇచ్చిపుచ్చుకునే స్ధాయికి వచ్చింది.
ఒక సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూండగా హఠాత్తుగా కురిసిన వర్షంలో తన రైన్ జాకెట్ నేహాకి ఇచ్చాడు. ఆ క్షణంలో నేహ తన మనసులో అరవింద్ పట్ల ప్రేమని మరింత పెంచింది.
“ ప్రేమంటే ఇదేనేమో! అనుకుంది” తన మనసులో నేహ.
రోజూ ఆఫీస్ నుంచి వచ్చాక ఇద్దరి మధ్యన తరచూ ఫోన్ సంభాషణలు జరుగుతున్నాయి.
కొద్ది రోజుల నుంచి సరోజ నేహని గమనిస్తోంది. తరచూ కూతురు ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతోంది.
ఒకరోజున “నేహా! ఎవరో ప్రత్యేకమైనవారా? రోజూ ఎవరితో ఫోన్ లో సంభాషిస్తున్నావు?చెప్పమ్మా!” అంది అనునయంగా సరోజ.
“అవును అమ్మా! ఆఫీస్‌లో నా సహోద్యోగి అరవింద్ అనే మంచి మనసున్న అబ్బాయి తో స్నేహం కలిసి అది క్రమేణా ప్రేమగా మారిందమ్మా. ” అంది నేహ కొంత భయంతో, కొంచెం సిగ్గుతో.
“ప్రేమలో భయం ఎందుకు నేహ? జీవితం పట్ల నీ అవగాహన, పెళ్లి విషయంలో నీ ఎంపిక మీద మాకు నమ్మకం ఉంది. ” అంది సరోజ కూతురితో.
అంతక్రితమే ఆఫీస్ నుంచి వచ్చిన రాజు ఇదంతా విని “చూడమ్మా! నేహా! నీ నిర్ణయం మంచి దారిలో ఉంటే మేము తప్పకుండా అంగీకరిస్తాం. ” అన్నాడు.
తేలికపడిన మనసుతో అరవింద్ ని గురించి, తమ ఇద్దరి ప్రేమ గురించి చెప్పి వాళ్ల కుటుంబ వివరాలను తల్లిదండ్రులకు చెప్పింది నేహ.
ఆ మరురోజున అరవింద్ ని తమ ఇంటికి పిలిచారు రాజు దంపతులు. పెద్దల ఎడల అతని వినయ విధేయత, గౌరవం వాళ్లకు బాగా నచ్చింది.
అలాగే అరవింద్ మరో వారం రోజుల తర్వాత నేహని తన ఇంటికి తీసికెళ్లి తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు వివరించాడు. కొడుకు మనసు తెలిసిన వాళ్లకు నేహ బాగా నచ్చింది.
ఒక మంచిరోజున ఇరు కుటుంబాలు కలిశాయి. అందరూ కూర్చొని చక్కగా మాట్లాడుకుని తాంబూలాలు పుచ్చుకోవడం, వివాహ నిశ్చితార్థం జరిగింది. నేహ, అరవింద్ లు చాలా సంతోషంగా ఉన్నారు.
ప్రేమ అంటే ఇరు మనసుల కలయిక. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకటిగా జీవించడం. అలా చేస్తే మీ ఇద్దరి జీవితం సంతోషంగా ఉంటుంది. అన్నాడు రాజు నేహ, అరవింద్ లతో. అందరూ సంతోషంగా నవ్వారు.
ఒక శుభముహూర్తాన పల్లెటూరి వాతావరణంలో నేహా, అరవింద్ ల పెళ్లి ఘనంగా జరిగింది. నేహని అత్తారింటికి పంపుతూ “మన కంటి పాప ఇప్పుడు మరో ఇంటి దీపం అయింది” అంది దిగులుతో కూడిన స్వరంతో తన చెమర్చిన కనులను పైట కొంగుతో తుడుచుకుంటూ భర్తతో సరోజ.
కూతురి గురించిన బాధతో రాజు కనులు పూర్తిగా తడిసి అవునన్నట్లు తలూపుతూ భార్య భుజంమీద ఓదార్పుగా చేయి వేశాడు.
“అమ్మా! నాన్నా! నేను ఎక్కడున్నా మీ ప్రేమానురాగాలు, మీ పెంపకం లోని అనుభవాలు, మీతో కూడిన మధురానుభూతులు ఎప్పుడూ నాతోనే ఉన్నాయి. కడదాకా ఉంటాయి. ” అంది నేహ తల్లి తండ్రుల పాదాలకు భర్తతో కలిసి నమస్కరిస్తూ.
నేహని ప్రేమగా దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు రాజు, సరోజలు. అరవింద్ వాళ్లకి ధైర్యం చెప్పి, ఓదార్చి తరచూ వస్తూ ఉంటామని చెప్పి నేహతో తనింటికి వెళ్లాడు.
బెరుకు, సిగ్గుతో అత్తారింటికి వెళ్లిన నేహకి మంచి స్వాగతం లభించింది. అత్తగారు శాంత పేరుకు తగ్గట్లుగా మంచి ఆవిడ. ఘనమైన హారతులతో నవ్వుతూ కొడుకు, కోడలిని లోపలకి తీసికెళ్లింది. పెళ్లికి వచ్చిన బంధువులు కొందరు ఇంట్లో ఉన్నారు.
“మా కోడలు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఈ ఇల్లంతా దీపావళి వెలుగులా మారిపోయింది. ” అంది శాంత తమ బంధువులతో.
“తల్లి లాంటి మీ ఆశీర్వాదం ఉంటే ఈ వెలుగు ఎప్పుడూ ఉంటుంది అత్తయ్యా!” అంది అత్తగారి పాదాలకి నమస్కరిస్తూ నేహ.
“ఇంక అత్తాకోడళ్లు కబుర్లేనా? మాకు కాఫీ ఇచ్చేదేమైనా ఉందా?” అన్నాడు అరవింద్ తండ్రి రామయ్య. నవ్వుతూ అరవింద్ వారి వంక చూశాడు. నేహ సిగ్గుతో తన గదిలోకి వెళ్లింది.
స్వతహాగా కలివిడిగా ఉండే నేహ త్వరలోనే అందరితో చక్కగా కలిసిపోయి ఇంటి పనులు, ఉద్యోగం రెండింటినీ సమతుల్యం చేస్తోంది.
నేహ, అరవింద్ లు అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
కొన్ని రోజులుగా ఆఫీస్‌లో పని ఎక్కువగా ఉండటంతో నేహ ఆలస్యంగా ఇంటికి వస్తోంది. బాగా చీకటి పడుతోంది కూడా. ఈ విషయం శాంతకి నచ్చలేదు. ఆఫీసులో పని ఒత్తిడి వలన ఆలశ్యమవుతోందని తన మనసుకి సర్దిచెప్పుకుంది ఆవిడ. కానీ తన కోడలి గురించి ఇరుగుపొరుగు వాళ్ల గుసగుసలు వినబడుతున్నాయి.
తన కోడలు రాత్రి బయట ఉండడం మంచిది కాదన్న భావంతో నేహని నిలదీసి కారణమడిగింది.
“అత్తయ్యా! మీరు అనుకున్నదానికి విరుద్ధంగా నేను ఎప్పుడూ వ్యవహరించను. ఈ ఇల్లు నా ఇల్లే!” ఈ ఇంటి గౌరవ మర్యాదలను కాపాడటం నా బాధ్యత. ఆఫీసులో పని ఒత్తిడి వలన ఇంటికి రావడం. ఆలశ్యమవుతోంది అత్తయ్యా!” అంది నేహ.
“నీ మనసేంటో నాకు తెలుసు నేహ. ఇరుగుపొరుగు వాళ్ల నోర్లకు, అపార్ధాలకు మనం తావివ్వకుండా ఉండాలని నేను నిన్ను కారణం నిలదీశాను. అపార్ధం చేసుకోవద్దు. లోకులు కాకులమ్మా!” అంది శాంత.
వారాంతంలో రాజు – సరోజలు కూతురిని చూసేందుకు వచ్చారు. రెండు కుటుంబాలు కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశాయి.
“దీపం వెలిగించేది ఆడపిల్ల మాత్రమే కాదు, ఆమె మంచి మనసుని గెలిచిన అని నీవని నిరూపించావు అరవింద్”. అన్నాడు అల్లుడితో రాజు.
“సరిగ్గా చెప్పారు అన్నయ్యా! మా నేహ అనే వెలుగు మా ఇంట్లో ఎప్పుడూ వెలుగుతుంది. ” అంది శాంత సంతోషంగా.
నేహ, అరవింద్ ల నవ్వులు, పూల వర్షంతో ఆ కుటుంబలో ఆనందం తరంగాలు ఉవ్వెత్తున లేచాయి.
సంతోషం పెద్ద పెద్ద వాళ్ల ఇళ్లల్లోనే కాదు, ఒకళ్లనొకళ్లని అర్థం చేసుకునే మనసులలో ఉంటుంది.
ప్రేమ, గౌరవం, విలువలతో కూడిన ఇల్లు అదే నిజమైన ఇంటింటి వెలుగు.
రెండు సంవత్సరాల తర్వాత నేహ, అరవింద్ లకి పండంటి కొడుకు పుట్టాడు. ఇరు కుటుంబాలలో ఆనందం తాండవించింది.
“మా ఇంటి కొత్త వెలుగు వచ్చేశాడు. దేవుడి ఇచ్చిన వరంలా ఉన్నాడు ఈ బిడ్డ”. అంది శాంత.
“మా నేహ తల్లి అయ్యిందంటే మన కుటుంబాల చల్లని దీవెనలు, ఆ భగవంతుని ఆశీస్సులు ఫలించాయి” అంది సరోజ ఆనందభాష్పాలతో మనవడిని తన చేతిలో పట్టుకుని ప్రేమగా చూసి మురిపెంగా ముద్దుపెట్టుకుంటూ.
“అమ్మా! ఈ చిన్ని చేతుల్లో నా ప్రపంచం మొత్తం దాగుంది” అంది ఆనందంగా నేహ.
“నేహా! మనం ఇద్దరం కలిసి ఈ చిన్నారి భవిష్యత్తును అఖండ వెలుగులా తీర్చుదాం” అన్నాడు కొడుకు వంక ప్రేమతో అరవింద్.
మంచిరోజున బాబుకి బారసాల బంధుమిత్రులందరి సమక్షంలో చాలా ఘనంగా జరిగింది. “అద్వయ్” అని పేరుపెట్టి గారాబంగా పెంచుతున్నారు.
అద్వయ్ తన ముద్దు మురిపాలతో అందరినీ అలరిస్తున్నాడు.
కొన్ని నెలల తర్వాత నేహకి శెలవు గడువు తీరి మరలా ఆఫీసుకు వెళుతోంది. క్రమక్రమంగా తన ఉద్యోగం, బిడ్డ సంరక్షణ రెండిటినీ సమతుల్యం చేస్తోంది నేహ.
“నేహా! పిల్లవాడి ఎదుగుదలలో నీ మాటలు అతని మనసులో నిలుస్తాయి. ప్రేమవిలువలను వాడికి నేర్పు, ఒత్తిడితో బలవంతంగా కాదు”. అంది సరోజ తన కూతురితో.
“అవును అమ్మా! చిన్ననాటి నుంచి మీరు నేర్పిన బోధనలే ఇప్పుడు నాకు మార్గం చూపుతున్నాయి. ” అంది నేహ.
మూడవ సంవత్సరం రాగానే అద్వయ్ ని స్కూలుకు పంపించారు నేహ దంపతులు. అద్వయ్ చక్కగా చదువుకోవడం ప్రారంభించాడు.
ఒక రోజు అద్వయ్ పాఠశాల నుండి ఏడుస్తూ వచ్చాడు. అందరూ కంగారు పడ్డారు.
“అమ్మా! నా స్నేహితుడు పవన్ నన్ను, నా బట్టలని చూసి నేను పేదవాడినంటూ చాలా అవమానంగా మాట్లాడాడు. అందరూ పెద్దగా నవ్వారమ్మా!”. అన్నాడు అద్వయ్ ఏడుస్తూ.
“చూడు అద్వయ్! పేదరికం మనం వేసుకునే దుస్తులలో కాదు, మన మనసులో ఉంటుంది. నీ మనసు బంగారమైతే నీవు వాళ్లందరికంటే అత్యంత ధనవంతుడివి. మంచి మనసు ముఖ్యం. వాళ్ల మాటలకి బాధపడద్దు” అంది కొడుకుని గుండెలకి ప్రేమగా హత్తుకునితన పైటకొంగుతో వాడి కళ్ళు తుడుస్తూ.
చల్లని ఆతల్లి మాటలతో అద్వయ్ మనసు ఊరటచెంది చిరునవ్వు నవ్వుతూ అందరివైపూ చూశాడు. అందరూ అద్వయ్ ని ప్రేమగా దగ్గరకు తీసుకుని అతనికి ధైర్యం చెప్పారు.
రోజులు హాయిగా గడుస్తున్నాయి.
ఒక రోజు అరవింద్ ఆఫీస్‌లో ఉద్యోగ సమస్యలు వచ్చాయి. తను పనిచేసే కంపెనీ ప్రాజెక్ట్ పని ఆగిపోయింది. అరవింద్ అలసత్వం చేత అతనికి చేతికి చిక్కిన ప్రాజెక్టు దక్కలేదు సరికదా, బాస్ చేత చివాట్లు తినాల్సివచ్చింది. అతను బాధతో, ఆందోళనలో ఉండడం గమనించిన నేహ అతన్ని నిలదీసి కారణమేంటో అడిగింది.
“నేహా! నా ఉద్యోగం పోతుందేమో అనే భయం వేస్తోంది” అని తన ఆఫీసులో జరిగినదంతా చెప్పాడు అరవింద్.
అంతా ఓర్పుతో విన్న నేహ “మనం కష్టపడి సంపాదించిన ప్రతిదానికి విలువ ఉంటుంది. నీ ధైర్యం నీకు మరో అవకాశం తెస్తుంది. బాధపడద్ధు. ” అని ధైర్యం చెప్పింది.
కొన్ని రోజులకు అరవింద్‌కి మరో కొత్త ఆఫర్ వచ్చింది. సంతోషంగా ఇంటికి వచ్చిన అరవింద్ నేహతో
“ఆరోజున నీవు నమ్మకం, ధైర్యం చెప్పకపోతే నేనిది సాధించలేకపోయేవాడిని నేహా!” అని భార్యని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు.
“మన ప్రేమ బంథం, నమ్మకం, విశ్వాసం పైనే మన జీవితం ఆనందమయం అవుతుంది అరవింద్”. అంది నేహ భర్త కౌగిలిలో ఒదిగిపోతూ.
కాలం హాయిగా సాగుతోంది.
కాలక్రమేణా వృధ్ధప్యంలో వయో భార సమస్యలు తలెత్తిన శాంతమ్మ దంపతులకు నేహ ఓర్పుతో సేవలు చేసింది. నేహని చూసి వాళ్లు చాలా సంతోషించారు. రెండేళ్ల వ్యవధిలో వాళ్లద్దరూ తనువు చాలించారు. జరిగిన దారుణానికి నేహ, అరవింద్ లు చాలా బాధపడ్డారు. రాజు, బరోజలు వాళ్లని ఓదార్చి ధైర్యం చెప్పారు.
కొంత కాలం తర్వాత రాజు, సరోజల వయసు మీద పడి క్రమేణా ఆరోగ్యం సమస్యలు మొదలయ్యాయి. నేహ వారిని తమ దగ్గరుంచుకుని ఎక్కువ సమయం కేటాయించి వాళ్లని కంటికి రెప్పలా కాపాడుతోంది.
“నేహా! నీవు భార్యగా, కోడలిగా, కూతురిగా, తల్లిగా నీ పాత్రలన్నీ న్యాయంగా, సక్రమంగా నిర్వర్తిస్తున్నావమ్మా!” అన్నాడు రాజు. మెప్పుకోలుగా కూతురి వంక చూస్తూ.
“నాన్నా! మీరు పెంచిన పెంపకం, నేర్పిన విలువలే నన్ను ఇలా నిలబెడుతున్నాయి.
నిశ్శబ్దంగా రాజు కూతురి తలమీద చేయి వేశాడు.
“నా జీవితంలోనే గొప్ప గర్వం అమ్మా, మీరూ, అరవింద్, అత్తయ్యా, మామయ్యా. !” అంది నేహ.
అద్వయ్ ఇప్పుడు టీనేజర్ అవుతున్నాడు. స్నేహితుల సాహచర్యం వలన వాళ్లతో స్మార్ట్ ఫోన్, వీడియో గేమ్స్, రమ్మీ ఆటలు వగైరా..అలవాట్లు, సోషల్ మీడియా ప్రభావం అతని పైన ఎక్కువగా ఉంటోంది. కొంతకాలంగా నేహ అతని వాలకం గమనించి అతన్ని దగ్గరకు పిలిచింది.
“అద్వయ్! నీకు టెక్నాలజీ ఇష్టం ఉండొచ్చు, కానీ జీవితం ఎప్పుడూ స్క్రీన్‌లో ఉండదు. నిజమైన అనుభవం మనిషి మనసులో ఉంటుంది. ఎ వరికైనా ఈ వయస్సే బాగుపడినా, చెడిపోయినా! నీకు మంచి స్నేహితులు ఉండడం ముఖ్యం. ఈ టెక్నాలజీ ని నీకు విద్యలో అభివృద్ధి పథంగా, నీ బంగారు భవిష్యత్తుకు పునాదిగా వాడుకో బాబూ!” అంది అనునయంగా కొడుకుతో.
“అమ్మా! నీవు చెప్పింది నిజం. నేను నెమ్మదిగా కొంచెం, కొంచెంగా మారుతానమ్మా” అన్నాడు అద్వయ్.
ఆ సంభాషణలు విన్న అరవింద్ నేహని తన మనసులోనే మెచ్చుకున్నాడు.
నేహ మాటలతో అద్వయ్ కొంచెం, కొంచెంగా మారిపోతున్నాడు. మంచి స్నేహితులనేర్పరచుకుని చదువులో ముందంజలో ఉంటున్నాడు. కొడుకు ని చూసి నేహ, అరవింద్ లు చాలా సంతోషించారు.
“నీవు ఈ కుటుంబానికి బలమైన మూలం నేహా!” అని అరవింద్ భార్యని మనస్ఫూర్తిగా అభినందించాడు.
అద్వయ్ కష్టపడి చదివి ఇంటర్ పరీక్షలో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించాడు.
మన మనవడు రాజు గారి లాగే కష్టపడే మనిషి అవుతున్నాడు. అంది భర్తతో కొంటెగా సరోజ. ముసిముసిగా నవ్వాడు రాజు.
“నేహా !నీ ప్రయత్నం, నీ అమ్మతనం ఈ విజయానికి మూలం”. అన్నాడు నవ్వుతూ.
“అమ్మా, నాన్నా! ఇదంతా మీ చల్లని ఆశీర్వాదం బలం వల్లే సాధ్యమైంది” అని తల్లి తండ్రుల పాదాలకు నమస్కరించింది. అద్వయ్ తల్లిని అనుకరించాడు.
మరో వారం రోజులకు దీపావళి పండుగ రాగా ఇల్లంతా అట్టహాసంగా దీపాలు పెట్టారు నేహ, అరవింద్, అద్వయ్ లు.
ఇంటి ముందు, లోపల దేదీప్యమానంగా దీపాల వెలుగులు విరజిమ్మాయి. అందరూ మతాబులు, చిచ్చుబుడ్డులు, ఔట్లు కాల్చారు.
“కుటుంబ బంథం, ఇంటింటి వెలుగు” అనే టైటిల్ తో ఒక నేమ్ బోర్డుని తయారుచేసి ఇంటిముందు తగిలించాడు అద్వయ్. ఆ వెలుగుల సందడిలో మళ్లీ అదే ఉజ్వలంగా మెరుస్తోంది. నేహ ఉద్యోగం మానేసి ఇంటి బాధ్యతలను, తల్లి తండ్రుల బాధ్యతలని నిర్వర్తిస్తోంది.
కొంతకాలానికి అద్వయ్ ఇంజనీరింగ్ లో చేరి నాలుగేళ్ల తర్వాత మంచి రాంకుని సాధిస్తాడు. అద్వయ్ కోరిక ప్రకారం ఉన్నత విద్య కోసం విదేశంలో మంచి యూనివర్సిటీ లో సిటు రావడం, అతని ప్రయాణ ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. ఇంట్లో అందరి మనసులలో మిశ్రమ భావాలు కదులుతాయి.
“మన కొడుకు అమెరికాకి వెళ్తున్నాడు. మన మనసులోని కల నిజమైంది నేహా!” అన్నాడు గర్వంగా అరవింద్.
“అవును, కానీ మన బాబు మన కంట్లో నుండి దూరమవుతున్నాడన్న ఆలోచన మాత్రం నామనసుని నొప్పిస్తోంది” అంది నవ్వుతూ నేహ.
“పిల్లలకి రెక్కలు పెట్టి ఎగరనివ్వాలి నేహా. చిన్ననాటి నుంచి నీవు వాడికి నేర్పింది అదే కదా! మన ప్రేమ పిల్లల ఎదుగుదలకు అడ్డంకి కారాదు. అది వాళ్ల బంగారు భవిష్యత్ కి ఆధారం కావాలి. ” అంది సరోజ.
అద్వయ్ వచ్చి తల్లిని ఆర్తిగా, ప్రేమగా హత్తుకున్నాడు.
“అమ్మా!నేను ఎక్కడికి వెళ్లినా, నా మనసులో మీ విలువలే ఉంటాయి. అవి నన్నెల్లప్పుడూ కాపాడుతాయి” అన్నాడు అద్వయ్.
“నీవు అక్కడ చదువుకుంటూ ఉన్నా, నీకు మేమంతా ఎప్పుడూ అండగా ఉంటాం బిడ్డా! జాగ్రత్తగా ఉండు. ” అంది నేహ.
తర్వాత వారానికి ఎయిర్‌పోర్ట్ సీన్ – వీడ్కోలు. విమానం టేకాఫ్ అవుతోందిది. నేహ కళ్ళలో తడి, కానీ హృదయంలో గర్వం పొంగిపొర్లుతోంది.
అద్వయ్ అక్కడికి వెళ్లాక ప్రతిరోజూ వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. కానీ నేహ కళ్ళలో కొడుకుని గురించి బెంగ, దిగులుతో కూడిన ఒంటరితనం కనబడుతోంది.
కొన్ని నెలలు గడిచాయి. అద్వయ్ వెళ్లాక ఇంట్లో నిశ్శబ్దంగా ఉంటోంది. నేహ కాస్త పరాకుగా ఉంటోంది.
అది గమనించిన అరవింద్ “నేహా! రానురాను నిన్ను నీవు మరచిపోతున్నావు. నీ కంటూ కలలు కూడా ఉన్నాయిగా!” అన్నాడు అనునయంగా.
“ ఇప్పుడు నా కలలన్నీ అద్వయ్ రూపంలో ఉన్నాయి అరవింద్. కానీ కొన్నిసార్లు మనసు ఖాళీగా అనిపిస్తోంది. ” అంది బాధగా నేహ.
“ఇంతకాలం నీవెప్పుడూ కుటుంబం లోని అందరికోసం బ్రతికావు. ఇప్పుడు నీ కోసం కూడా ఏదైనా చేయి. ” అన్నాడు అరవింద్ మనస్ఫూర్తిగా.
నేహ ఆలోచిస్తోంది. పదిరోజుల తర్వాత ఆమె మళ్లీ తన పాత పుస్తకాలు తెరిచి లోగడ తాను కాలేజీ సమయంలో వ్రాసిన కథలు, పద్యాలు, ఆ జ్ఞాపకాల దొంతరలను గుర్తు చేసుకుంది.
నేహ తమ సమీపంలోని పాఠశాల, విద్యార్థులకు “విలువలతో కూడిన పాఠాలు” చెప్పడం మొదలుపెడుతోంది. చిన్న పిల్లలతో కలివిడిగా ఉంటూ వాళ్లకు చక్కటి విద్యని బోధించడంతో పాటు, మంచి నీతి కధలను కూడా చెబుతోంది. క్రమేణా ఆమెలో కొత్త జీవం దొరుకుతోంది.
“ టీచర్! నిన్న మీరు చెప్పిన పాఠాలే కాక మీరు చెప్పిన అనుబంధం కథ చాలా బాగుంది” అన్నారు పిల్లలు.
“ఆ కథలో ఉన్న అనుబంధం విలువ మీ జీవితంలో కూడా ఉండాలి పిల్లలూ! ప్రతిక్షణం మీరు నీతిగా నడుచుకోవాలి” అంది నేహ.
ఒక రోజు అద్వయ్ ఫోన్‌లో మాట్లాడుతూ
“అమ్మా! నేను కూడా ఈమధ్యనే వారాంతపుదినాలలో నీలా పిల్లలకు మంచి విలువలను బోధించే ప్రాజెక్ట్‌లో వాలంటీర్‌గా చేరాను. నన్ను ఆశీర్వదించమ్మా”! అన్నాడు అద్వయ్.
“చూడు అభయ్! చిన్ననాటి నుంచి నీకు మేము నేర్పిందే మళ్లీ నీవు అదేశంలో ఆచరిస్తున్నావు బిడ్డా! ఇదే నా ఆశీస్సులు. నాకు చాలా గర్వంగా ఉంది” ఆనందంగా అంది నేహ.
ఒకరోజు రాత్రి నేహ కళ్ళలో తడి మెరిసింది. అద్వయ్ గుర్తొచ్చి పాత ఫోటో ఆల్బమ్ ని అరవింద్ కి చూపిస్తోంది. అప్పుడే అద్వయ్ వీడియో కాల్ చేశాడు.
“అమ్మా! ఈరోజు మీ పెళ్లిరోజు కదా! సర్‌ప్రైజ్‌గా వీడియో కాల్ చేశా. మీరిద్దరూ ఇటుచూడండి! అంటూ
తన వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో పెద్ద కేక్ చూపించాడు. “For My Inspiration – Amma & Nanna”). అని పెద్ద అక్షరాలతో అందంగా వ్రాసిన లోగో కనబడుతోంది. దానిని సంభ్రమాశ్చర్యాలతో చూశారిద్దరూ.
“మన కొడుకు మనసు కూడా ఎంత అందంగా ఉందో చూడు నేహా! నవ్వుతూ అన్నాడు అరవింద్.
“ ఇవే నా జీవితంలో నిజమైన ఆభరణాలు”. అంది నేహ ఆనంద భాష్పాలు నిండిన కళ్లతో.
మరో రెండు, మూడు సంవత్సరాల వ్యవధిలో అనారోగ్య బాధలతో ఒకరితర్వాత మరొకరు కాలక్రమేణా సరోజ, రాజులు కాలంచేశారు. శోకసంద్రంలో మునిగిన నేహని ఓదార్చి, ధైర్యం చెప్పి క్రమేణా మామూలు మనిషిని చేశాడు అరవింద్.
మరో ఏడాది తర్వాత అద్వయ్ ఫోన్ చేసి “తాను ఒక భారతీయ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, మీ ఇద్దరి ఆశీస్సులు కావాలని” చెప్పాడు.
కొడుకు మనసుని గ్రహించిన నేహ ఆ అమ్మాయి వివరాలనడిగింది.
“అమ్మా! ఆమె పేరు “మేఘన”. మన దేశ కుటుంబ విలువలు, సాంప్రదాయాల పట్ల చాలా గౌరవం ఉంది ఆమెకి. మా ఇద్దరి మనసులు కలిశాక తనకు మన కుటుంబం గురించి అంతా చెప్పాను. తను చాలా సంతోషించింది. వాళ్ల కుటుంబంకూడా చాలా మంచి విలువలతో కూడినది. ” అన్నాడు అద్వయ్.
“దేవుడా!మా బిడ్డ తన మనసుకు సరిపోయే తోడుని కనుగొన్నాడు వాళ్లని ఒకటిగా చేయి” అని మనసులోనే దేవునికి నమస్కరించింది నేహ. అద్వయ్ చెప్పినదంతా విన్న అరవింద్ చాలా సంతోషించాడు. ఇద్దరూ కొడుకుని ఆశీర్వదించారు. అద్వయ్ ఫోన్ పెట్టేశాడు
“నేహా! ఇప్పుడు మన ఇంటికి మరో కొత్త వెలుగు మన కోడలి రూపంలో రాబోతోంది! అన్నాడు అరవింద్.
ఆ కుటుంబం సంతోషంతో నిండిపోయింది. సరోజ కళ్ళల్లో దేవుని పట్ల కృతజ్ఞతతో కూడిన మెరుపు కనబడుతోంది.
“జీవితంలో మనం చూసే మార్గం మారవచ్చు, కానీ ప్రేమ చూపించే దిశ ఎప్పుడూ ఒకటే. బిడ్డల ఎడ అమ్మదనం వెలుగు ఎక్కడ ఉన్నా అది సరిగా మార్గం చూపుతుంది. ” మనసులో అనుకుంది నేహ.
ఆ తర్వాత ఒకరోజున మేఘనని వీడియో కాల్ లో తన తల్లిదండ్రులకు పరిచయం చేయడం జరిగింది. ఆమె ద్వారా తర్వాత కొన్నాళ్లకు ఆమె తల్లి తండ్రులతో వీళ్ళు మాట్లాడడం జరిగింది.
“మా కూతురికి అమెరికాలో సెటిల్ అవ్వాలని ఉంది. మీ కుమారుడు ఇండియాలో స్థిరపడాలనుకుంటున్నాడట? మరి వీళ్ళిద్దరికీ పెళ్లి ఎలా సాధ్యం?” అన్నాడు మేఘన తండ్రి మూర్తి నేహ దంపతులతో.
“అవును, కానీ వాళ్లిద్దరూ కలిసి నిర్ణయించుకుంటే చాలు కదా! పెళ్లికి మనకేం అభ్యంతరం?” అన్నాడు అరవింద్.
“సరే!కానీ కుటుంబం విలువలు సరిపోవాలి. ”అన్నాడు మూర్తి.
నేహ మధ్యలో కల్పించుకుని
“ప్రేమ బంధం రెండు మనసులను కలుపుతుంది అన్నయ్యగారూ! పరిస్థితులనుబట్టి కాదు. మన పిల్లల మధ్య నమ్మకం ఉంటే అది పెద్ద సంపద. ప్రేమించుకొని, మనసులు కలిసిన పిల్లలను మనం నిండు మనసుతో ఆశీర్వదించాలి అన్నయ్య గారూ!” సున్నితంగా మాట్లాడింది నేహ.
“మీరు చెప్పిన మాటల్లో నిజముంది చెల్లెమ్మా!” అన్నాడు వికసించిన వదనంతో మూర్తి.
వాళ్ల పెళ్లికి సుముఖత చూపుతూ ఇరు కుటుంబాలు తాంబూలాలు పుచ్చుకోవడం చకచకా జరిగిపోయింది. వివాహం నిశ్చయమైనాక అద్వయ్, మేఘనలు ఇండియా కి వచ్చారు.
పెళ్లి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆ ఇంట్లో మళ్లీ నవ్వులు, పాటలు, మేళతాళాల శబ్దం వినిపిస్తోంది.
ఒక శుభముహూర్తాన అద్వయ్, మేఘనల పెళ్లి వైభవంగా జరిగింది. రెండు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి.
పెళ్లి వేడుకలో నేహ అద్వయ్ చేతిని పట్టుకుని మేఘన చేతిలో పెడుతూ
“అద్వయ్! ఇకనుంచి నీ జీవితం మేఘనతో కలసి పయనం అవ్వాలి. మీ ఇద్దరి ప్రేమలో గౌరవం ఎప్పుడూ ముందుండాలి. ” అంది
“అమ్మా! నీ మాటే నా జీవిత దారి” అన్నాడు అద్వయ్.
కొన్నిరోజుల తర్వాత మేఘనా, అద్వయ్ లు సంతోషంగా అమెరికా వెళ్లారు. అక్కడ ఇద్దరూ కలిసి కొత్త జీవితం మొదలుపెట్టారు. రోజూ ఫోన్ లలో మాట్లాడుతూ ఉన్నారు.
“అద్వయ్! మీ అమ్మ చాలా మంచిది. నేను కోడలిగా చాలా ధన్యురాలిని. ఆమెలా ధైర్యంగా ఉండే ప్రయత్నం చేస్తాను. ” అంది అద్వయ్ తో ఒకరోజున మేఘన.
“ అమ్మ మనకు నేర్పిందేమిటంటే — “బంధం అంటే దూరం కాదు, దృష్టి”. మనం ఎప్పుడూ వాళ్ల దృష్టిలో ఉంటాం. ” అన్నాడు అద్వయ్.
ఇదే సమయంలో నేహా, అరవింద్ లు వీడియో కాల్ చేసి ఆ దంపతులని ఇద్దరూ నవ్వుతూ ఆశీర్వదిస్తారు.
“జీవితంలో మార్పులు వస్తూనే ఉంటాయి, కానీ విలువలు నిలిచే కుటుంబమే నిజమైన సంపద.
వెలుగు తరం మారినా, దాని వెచ్చదనం మాత్రం శాశ్వతం. ” అంది నేహ.
“వెలుగు ఒక దీపం వల్ల కాదు, ఒక మంచి మనసు వల్ల వెలుగుతుంది. ఒకరిపై మరొకరు
ప్రేమ చూపడం, విలువలనిచ్చి పుచ్చుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఈ మూడే నిజమైన కుటుంబ బంథం” మనసులో అనుకున్నాడు అరవింద్.
.. సమాప్తం ..

-నీరజ హరి ప్రభల
Profile Link
Youtube Playlist Link




Comments