Land Phone New Telugu Story
Written By Lakshmi Chivukula
రచన: లక్ష్మి చివుకుల
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"లాండ్ ఫోన్ ఎవరూ వాడటం లేదు. కనక్షన్ తీయించేవచ్చు కదా." సుధ భర్తకు ఎప్పటి నుంచో చెపుతోంది.
"ఉండనీ ఆ ఫోన్ ఆ టేబుల్ మీద ఉండడం వలన నీకేమీ కష్టం" చిరాకు పడ్డాడు మూర్తి.
"ఆ ఫోన్ అలంకారానికి మాత్రమే. ఎవరి సెల్ ఫోన్ లు వాళ్లకి వున్నాయి కదండీ." సుధ నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది భర్తకు.
"అవుననుకో.. ఇదివరకు ఇంట్లో లాండ్ ఫోన్ వుంటే అదొక స్టేటస్ సింబల్. ఇప్పుడు ఎవరూ ఉపయోగించక పోయినా అలా వుంచుదాం. అప్పట్లో ఆ ఫోన్ కనక్షన్ కోసం నేను ఎన్ని తిప్పలు పడ్డాను." భార్యకు సమాధానం చెప్పి అక్కడ నుంచి వెళ్లి పోయాడు మూర్తి.
కొన్ని నెలలు తరువాత ఒక రోజు వచ్చిన లాండ్ ఫోన్ బిల్లు చూసి అదిరి పడ్డాడు మూర్తి.
"ఇదేమిటీ ఇంత ఘనంగా లాండ్ ఫోన్ వాడింది ఎవరూ? ఎప్పుడూ రాని బిల్ వచ్చింది?" అని ఇంట్లో వాళ్లందరినీ పేరు పేరునా అడిగాడు.
కొడుకును అడిగితే "నేను ఆఫీసు వాళ్లు ఇచ్చిన ఫోన్ వాడుకుంటున్నాను. నేను అసలు లాండ్ ఫోన్ ఉపయోగించలేదు" అన్నాడు.
కూతురిని అడిగితే ఆ అమ్మాయి కూడా అదే సమాధానం చెప్పింది.
సుధను అడిగితే "నేనూ వాడలేదు. అయినా చక్కగా సోఫాలో కూర్చుని గంటలు గంటలు మాట్లాడుకోవడానికి చేతిలో సెల్ ఫోన్ వుండగా నిలబడి లాండ్ ఫోన్ ఎవరు మాట్లాడతారు?" ఎదురు ప్రశ్నించింది సుధ.
ఇంట్లో వున్న నలుగురు నేను కాదంటే నేను కాదని అంటుంటే ఎవరు వాడితే లాండ్ ఫోన్ అంత బిల్ వచ్చిందో అర్థం కాక జుట్టు పీక్కున్నాడు మూర్తి.
"అయ్యగారూ! నేనే లాండ్ ఫోన్ వాడాను అండీ. నేను వంటలు బాగా చేస్తానని మా బంధువులలో నాకు చాలా పేరు వుందండీ.
'చికెన్ కూర ఎలా చేయాలి? చేపల పులుసు ఎలా పెట్టాలి'? అని మా బంధువులు అందరికీ ఫోన్ లో విడమరిచి చెప్పానండీ.
'నువ్వు చెప్పినట్టు చేస్తే చికెన్ కూర, చేపల పులుసు చాలా బాగా వచ్చింది. ఎంతైనా ఏ వంట చేసినా నువ్వు చేసినట్టు ఎవరూ చేయలేరు' అని అంతా నన్ను మెచ్చుకున్నారు అండీ. నేను చాలా సంతోషించాను అయ్యగారూ." ముసి ముసిగా నవ్వు కుంటూ చెప్పింది పనిమనిషి రంగి.
"ఏమిటీ లాండ్ ఫోన్ వాడింది నువ్వా?" ఆశ్చర్యంగా అడిగాడు మూర్తి.
"అవును అయ్యగారూ! మీరందరూ ఆఫీసులలో పని చేస్తున్నారు. ఆఫీసు ఫోన్ లు వాడుకుంటున్నారు. నేను మీ ఇంట్లో పని చేస్తున్నాను నాకు ఇది ఆఫీసే కదా.."
రంగి చెప్పిన లాజిక్ కు ఎవరికీ నోటివెంట మాట రాలేదు.
##---------##
లక్ష్మి చివుకుల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు - లక్ష్మి చివుకుల
నా మొదటి కథ 1984 వ సంవత్సరంలో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక లో ప్రచురించారు. ఆనాటి వార, మాస పత్రికలలో నా కథలు దాదాపు ప్రచురితం అయ్యాయి. సంసార సాగరంలో కొట్టుకు పోయి కొంత కాలం విరామం తీసుకుని పిల్లల బాధ్యతలు నెరవేర్చుకుని ఈమధ్యనే మళ్లీ రచనలు మొదలు పెట్టాను.
నేను నివసించేది హైదరాబాద్ లో.
Commentaires