top of page

లేకుంటే

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Lekunte, #లేకుంటే, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 117


Lekunte - Somanna Gari Kavithalu Part 117 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 10/09/2025

లేకుంటే - సోమన్న గారి కవితలు పార్ట్ 117 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


లేకుంటే

----------------------------

గురువులే లేకుంటే

అజ్ఞానము తొలగునా

విజ్ఞానము బ్రతుకుల్లో

పువ్వుల్లా పూయునా


నవ్వులే లేకుంటే

వదనాలే వెలుగునా

విలువలే లోపిస్తే

గౌరవమే దక్కునా


స్నేహితులే లేకుంటే

గుండె బరువు తగ్గునా

ప్రేమానురాగాలే

సెలయేరులై పారునా


కన్నవారు లేకుంటే

త్యాగము విలువ తెలియునా

బంగారు భవిష్యత్ కు

ఆధారం దొరుకునా


ree










పెద్దవారి సుద్దుల సరాలు

---------------------------------------

నొప్పించరాదు మనసులు

కత్తిపోటు మాటలతో

విసిగించరాదు ఎప్పుడు

పనికిమాలిన చేతలతో


కోల్పోరాదు సహనము

లేనిపోని విషయాలతో

పొందరాదు నైరాశ్యము

మితిలేని ఆశలతో


ఎదురించ తగదు తగదు

గురి వీడి నడవరాదు

వయసులోన పెద్దలతో

మన జన్మ దాతలతో


ఎదగాలి వినయంతో

గెలవాలి కడు ప్రేమతో

సంస్కారం చాటుకుని

నిలవాలి ఇల స్ఫూర్తితో


ree

















చెట్లను సంరక్షిద్దాం!!

--------------------------------------

మొక్కలను నాటుదాం

తరువులను పెంచుదాం

కాలుష్యం తరిమేసి

ఆరోగ్యం పంచుదాం


పచ్చదనం నింపుదాం

చక్కదనం చూపుదాం

కనువిందు చేసేద్దాం

మనసులను కదిలిద్దాం


వానలను కురిపిద్దాం

చెరువులను నింపేద్దాం

పంటలను పండించి

కరువులను పోగొడుదాం


ఎండలను తగ్గిద్దాం

చల్లంగా ఉంచుదాం

భూలోక స్వర్గంగా

మనమంతా మార్చుదాం


చేయి చేయి కలుపుదాం

చెట్లను సంరక్షిద్దాం

ప్రాణదాతలు మనకవి

నరకడం మానేద్దాం


చెట్టు విలువ తెలుసుకో

పరిరక్షణ పూనుకో

పొంచి ఉన్న ప్రమాదం

పసిగట్టి దాటుకో

ree










చెట్టు సలహాలు

-----------------------------------------

తట్టుకుని పరిస్థితులు

నెట్టుకుని రావాలోయ్!

ఎట్టి పరిస్థితిలోనూ

వట్టి మాటలు వద్దోయ్!


హద్దులోనే ఉంటూ

శ్రద్ధగా బ్రతకాలోయ్!

శుద్ధమైన హృదయంతో

బుద్ధిమంతుడు కావాలోయ్!


ఉద్దరించు పనులతో

ఉద్దీపన కావాలోయ్!

అద్దంలో రీతిలో

ముద్దుగా సాగాలోయ్!


మొక్కలా మనమంతా

మెట్టు మెట్టు ఎదగాలోయ్!

చక్కని తలంపులతో

చుక్కలా వెలగాలోయ్!

ree












ఆవేశం అనర్ధం

---------------------------------

అనర్ధం ఆవేశము

హరించును ఆనందము

ఉంచాలి బహు దూరము

లేదంటే ప్రమాదము


కడలమ్మ ఉగ్రరూపము

అంతులేని ఆవేశము

తీసుకోకు ఏమాత్రము

ఆ సమయాన నిర్ణయము


కల్లోల సాగరమే

గుండెలోని ఆవేశము

దాని మీద విజయమే

సుఖమయం జీవితము


క్షణికావేశంలోన

పొరపాట్లు జరుగునోయి

మదిలోన ఉండాలోయి

ప్రశాంత వాతావరణము

-గద్వాల సోమన్న

Comments


bottom of page