top of page

లవ్ ఎఫెక్ట్



'Love Effect' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 29/02/2024

'లవ్ ఎఫెక్ట్' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


అఖిల్ అనే ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ఎప్పుడు బంజారా రోడ్డులో తిరుగుతూ ఆకలేస్తే ఏదో షాపుల్లో అడుక్కుని తింటు షాపు వరండాలో కానీ.. రోడ్డు డివైడర్ పైన కానీ నిద్రిస్తు ఉంటాడు. ముఖ్యంగా బంజారా రోడ్డు బ్రిడ్జి కింద పడుకుంటాడు. అతడు మతిస్థిమితం లేనోడే అయినా ఎవరికి ఏ హాని చేయడు. అఖిల్ ని చూస్తే దృఢమైన శరీరం, చింపిరి జుట్టు, మాసిన గడ్డంతో ముఖమే సరిగ్గా కనపడదు.  పూర్తిగా మాసిపోయి చిరిగిన దుస్తులు, చూడ్డానికి భయంకరంగా ఉంటాడు. 


నిషా అనే ఆందమైన అమ్మాయి ప్రతిరోజూ రాత్రి డ్యూటీ అయిపోయాక ఆ బ్రిడ్జ్ కింది నుంచే వెళ్తుంది. అయితే ఎప్పుడూ ఆ అమ్మాయిని అఖిల్ ఫాలో అవుతు ఉంటాడు. నిషా 26ఏళ్ళ అమ్మాయి. ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. బహుశా ఆమె భర్త ఆమెను వదిలి దూరంగా ఉండవచ్చు. అందుకే ఆమె పిల్లలను పోషించటానికి రాత్రి పగలు పనిచేస్తుంది కాబోలు. అఖిల్ ఫాలోయింగ్ గూర్చి ఆమె పట్టించుకోదు. పట్టించుకునే పరిస్థితుల్లో ఆమె లేదు. 


 అయితే.. ! ఈరోజుల్లో ఆడవాళ్లు రక్షణ అనేది నమ్మదగిన విషయం కాదు కదా.. అయినా చాలామంది ఆడవాళ్లు ధైర్యంగా తమ పని తాము చేసుకుంటు ముందుకు వెళ్తుంటారు. 


ఒకరోజు నిషా రాత్రి కాస్త ఆలస్యంగా వస్తుంది. ఆ సమయంలో కొందరు అకాతాయిలు రోడ్డుపై మద్యం సేవిస్తు చిందులేస్తున్నారు. ఆమె రాక చూసి ఆమెను వెంబడిస్తు అల్లరి చేస్తున్నారు. ఆ అల్లరి భరించలేనిదిగా మారటంతో ఆమె పరుగు తీయల్సి వచ్చింది. ఇంతలో సడెన్ గా అఖిల్ వచ్చి అకాతాయిలును కొట్టి తరుముతాడు. అది చూసిన నిషా అఖిల్ కి దండం పెడుతు పరుగున వెళ్ళిపోతుంది. అఖిల్ మాత్రం ఆమెనే చూస్తూ నవ్వుతు అలా ఉండిపోతాడు. 


ఇంకోరోజు నిషా కాలి పట్టి పడిపోయిందని మరో కాలి పట్టి తీసేసి తన స్నేహితులుతో చెప్పగా ఆ రోజంతా అఖిల్ ఆ పట్టిని వెతికి రాత్రి నిషా వచ్చినప్పుడు ఇస్తాడు. ఆమె అది తీసుకుని అఖిల్ ని చూస్తూ వెళ్ళిపోతుంది. 


ఇంకోరోజు నిషా పెద్ద కూతురు స్కూల్ నుండి వస్తు ప్రమాదవశాత్తు పడిపోయిందని తెలిసి నిషా ఆసుపత్రికి వెళ్ళింది. ఆసుపత్రిలో నుండి బయటకు వస్తున్న అఖిల్ ని చూసింది అఖిల్ మాత్రం ఆమెను చూడలేదు. 


"అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సిన టైంలో ఎవరో గుర్తు పట్టలేని ఓ వ్యక్తి నా కూతురే అని చెప్తే అతనికి పరీక్షలు చేశాం పాప బ్లడ్ గ్రూపు అతని గ్రూపు ఒకటే కావటంతో రక్తం ఇచ్చి వెళ్ళాడు. పైగా అతనికి ఏ వ్యాధులు లేవు ఆరోగ్యంగా ఉన్నా”డని చెప్పారు వైద్యులు. 


మరుసటి రోజు అతను ఎవరో తెలుసుకుందామని వెళ్ళింది నిషా. తిండి కోసం షాపు వద్ద చెయ్యి చాస్తుండటం చూసి తానే టిఫిన్ కొని తెచ్చి అతడి చెయ్యి పట్టుకుని రోడ్డు పక్కనే కూర్చుంది. అఖిల్ చేతులు మురికిగా ఉండటంతో తానే తినిపించింది. అఖిల్ కళ్ళలో నీళ్ళు రావటం చూసింది. కూతురిని బతికించినందుకుగానో లేదా తనకు కాపలాదారుగా ఉంటున్నాడని అనుమానమో ఏమో.. కానీ.. 

స్వచ్ఛంద సంస్థ వారిని పిలిపించి అఖిల్ పరిస్థితి చూపించింది. వాళ్ళు అఖిల్ ని స్నానం చేయించి, మంచి దుస్తులు వేశారు. నిషా కోరిక మెరకు అఖిల్ జుట్టును, గడ్డాన్ని కత్తిరించగా ఒక్కసారిగా నిషా షాక్ అయి గోడకు అలా ప్రాణం లేని బొమ్మలా ఉండిపోయింది. 


తర్వాత తేరుకుని "అ.. ఖి.. ల్ " అంటూ అఖిల్ ని గట్టిగా హత్తుకుని బిగ్గరగా ఏడుస్తుంది. ఊహించని ఈ పరిణామం సంస్థ సభ్యులుకు ఏమీ అర్థంకాక ఆశ్చర్యంతో ఆమెను సముదాయించి అడగగా..  ఏడుస్తూనే..


" నా..  నా బాయ్ ఫ్రెండ్ అఖిల్ "అని జరిగింది చెప్తుంది. 


 "అఖిల్, నేను ఒకే స్కూల్, ఒకే కాలేజ్ లో చదుకున్నాం. అఖిల్ ఎప్పుడు టాపర్ నే. చదువులో, ఆటల్లో ఎప్పుడు ముందు ఉండే అఖిల్ తరగతి గదిలో ఎప్పుడు చిట్టచివరన కూర్చుంటాడు. అందరితో కలిసి బోజనం చేయడు. ఇలాంటివి అఖిల్ కి ఇష్టం లేకపోయినా అఖిల్ కులం తెచ్చిన తంటా ఇది. అవును అఖిల్ ఒక దళిత కుటుంబంలో పుట్టాడు. అందరి కంటే అఖిల్ ఎప్పుడు సరదాగా, కలివిడిగా ఉండటంతో అతడిని ప్రేమించాను. ఆ ప్రేమ స్కూల్, కాలేజ్ వయసు అయిపోయినా.. కొనసాగింది. అఖిల్ తన కుటుంబం బాధ్యతలు నెరవేర్చటానికి పోలీసు ఉద్యోగ శిక్షణ తీసుకుండగా నేను ఇంటర్ తో చదువు ఆపేశాను. అయినా సరే తల్లిదండ్రులుకు తెలియకుండా అఖిల్ తో చెట్టాపట్టాలేసుకుని తిరగని చోటు అంటు లేకుండా తిరగాను. 


ఇలా ఉండగానే అఖిల్ కి ఉద్యోగం కూడా వచ్చింది. తన కలలు పోలీసు ఉద్యోగం కొట్టి నిషాని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. ఉద్యోగంలో స్థిరపడి రెండేళ్ళు గడిచాక నిషా తల్లిదండ్రులుకు అడిగాడు. నిషా-అఖిల్ ప్రేమకు కుల గోడలు అడ్డుపడ్డాయి. దీంతో నిషా మెడలో మరొకడు మూడు ముళ్ళు వేశాడు. అలా నిషా వేరొకరితో కాపురానికి వెళ్ళగా.. అఖిల్ మానసిక వేదనకు గురై ఇలా పిచ్చోడిలా మారిపోయాడు ఇష్టంలేని పెళ్లి చేసుకుని ఇష్టంలేకపోయినా వాడితో కాపురం చేస్తే.. . ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక ముఖం చాటేశాడు. దీంతో పిల్లలు కోసం ఒక షాపింగ్ మాల్ లో పనిచేస్తు పోషిస్తున్నాను. ఇతడికి చాలాసార్లు చూశాను కానీ.. ! నా బాయ్ ఫ్రెండ్ అని నేను ఊహించుకోలేదు " ఏడుస్తూ గతాన్ని వివరించింది. 


"అంటే లవ్ ఎఫెక్ట్ వలనే ఇలా పిచ్చోడైపోయారంటావ్ అంతేనా మేడం"సభ్యుడు ఒకరు అడగగా. 


"నేను పిచ్చోడిని కాదండి. పిచ్చోళ్ళకి మాత్రమే పిచ్చోళ్ళగా కనపడే ఒక పోలీసు ఆఫిసర్ ని " అంటాడు అఖిల్. 


ఆ మాటలకు నిషాతో సహ అందరూ కంగుతింటారు. 

"నన్ను, నా నిజ రూపంను ఈమెకు చూపించినందుకు మీకు ధన్యవాదాలు. 


ఈమె చెప్పింది వందశాతం నిజమే కానీ.. . ! ఇంకా ఉంది, అది తాను చెప్పలేదు. నిషా తల్లిదండ్రులు మా పెళ్ళికి ఒప్పుకోలేదు నిజమే కానీ.. ! ఉద్యోగం కూడా ఉన్న నాతో రావటం కంటే తల్లిదండ్రులు చెప్పిన వాడినే చేసుకోవటంలోనే ఈమెకు ఎక్కువ ఆనందం అయి ఉంటుంది. అందుకే ఉద్యోగం ఉంది. అయినా నా వెంట రావటానికి వ్యతిరేకించింది. అందరిని వదిలేసి నా కోసం వస్తానని చెప్పింది. చివరకు నన్నే వదిలేసి అందరితో కలిసి ఉంది. నా ప్రేమను నిషానే ఓడించి తాను కూడా ఓడిపోయింది. "అన్నాడు అఖిల్. 


"లేదండి, నా ప్రేమను నేను ఓడిపోలేదు. ఒక తండ్రి పరువు అనే పాపానికి తలవంచి పోరాడకుండానే పడిపోయింది నా ప్రేమ. లేకపోతే ఇన్నాళ్లు అతని గుండెల్లో జ్ణాపకాలుగా కాకుండా తన జీవిత భాగస్వామిగా ఉండేదాన్ని " అని ఏడుస్తుంది. 


ఆ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిషాని చూడని భర్త కి విడాకులు ఇప్పించి అఖిల్ పెళ్ళి చేసుకున్నాడు. లవ్ ఫెయిల్యూర్ వలన విధులకు వెళ్ళని అఖిల్ మరలా లాఠీ పట్టాడు. ఇప్పుడు అఖిల్-నిషా దంపతులే కానీ.. ! నిషాని తప్పా ఇంకెవరిని పెళ్ళి చేసుకోని అఖిల్, నిషా పిల్లలని తన పిల్లలుగా భావించిన అఖిల్ నిజంగా గొప్పవాడు అతడి ప్రేమ ఇంకా గొప్పది. 

**** **** **** **** **** ****

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం 





38 views0 comments
bottom of page