top of page

మా ఇంటి మహాలక్ష్మి


'Ma Inti Mahalakshmi' New Telugu Story



(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

"ఒరేయ్ కృష్ణా… ఒకసారి ఇలా వస్తావూ! నీతో మాట్లాడాలి" లోపలనుండి కొడుకును పిలిచింది కాంతమ్మ. ఇంట్లోనే కిరాణం కొట్టుపెట్టుకుని మంచి గిరాకితో వ్యాపారం చేస్తున్నాడు కృష్ణమూర్తి.


"ఆ వస్తున్నానమ్మా… కొట్టులో గిరాకి ఉంది. వాళ్ళు వెళ్ళిపోయాక వస్తాను" అక్కడనుండే

సమాధానం ఇచ్చాడు.


"అబ్బా.. వాళ్ళను కాసేపు ఆగమని చెప్పు నీతో కొంచెం మాట్లాడాలి. బయటకు వెళ్ళిన కోడలు వస్తుంది. ఒక్కసారి వచ్చిపోరా" అంది దబాయింపుగా.


"అబ్బబ్బా… ఏంటమ్మా? ఏం కొంపలంటుకుపోతున్నాయని ఒకటే పిలుస్తున్నావు? కొట్లో మనం లేకపోతే డబ్బులు పోతాయి. సరుకుకూడా చాటుగా లోపల వేసుకుంటారు.

ఆ.. ఏమిటో తొందరగా చెప్పు. ఏదో చెప్పాలనుకున్నావు కదా" విసుక్కుంటూ అడిగాడు.


"అంతకోపం అయితే ఎలాగరా? నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినరా! మీ అక్కాలను బావలను ఈ దసరా పండుగకు పిలుద్దాము. చాలా ఏళ్ళైంది వాళ్ళు పండుగకు మనింటికి వచ్చి. నీ భార్యను అడుగుదామంటే ఏమంటుందోనని ముందుగా నీ చెవిలో వేస్తున్నాను” అంది.


"అమ్మా … నేనింకేంటో అనుకున్నాను. ఈ విషయం మనం తీరికగా మాట్లాడుకోవచ్చు. అవతల నాకు చాలా పని ఉంది. తరువాత ఆలోచిద్దాము" అంటూ గబగబా వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి.


ఉసూరమనిపించింది కాంతమ్మకు. ఈయన సంపాదన ఉన్నప్పుడు నా పెత్తనం నడిచినన్ని రోజులు పండుగలకు పబ్బాలకు ఆడపిల్లలను పిలిచేదాన్ని. ఇప్పుడేమో ఎవరి హడావుడి వాళ్ళకే సరిపోతుంది. కనీసం ఐదేళ్ళకోసారన్నా ఆడపిల్లలను దసరా దీపావళికి పిలుచుకోవాలి. ఏమిటో కోడలితో ఎన్ని సార్లు చెప్పినా ఈచెవితో వింటుంది ఆచెవితో వదిలేస్తుంది. పోని మేమన్నా వెళదామంటే ఈయనకు ఒంట్లో బాగుండదు. మేమున్నన్ని రోజులు మాకోసం రండి అంటే వాళ్ళు పిలవకుండా ఎలా వస్తాము అంటారు. ఈ కాలం మనుషులు అర్థంకారు అనుకుంది తనలో తానే బాధపడుతూ. రాత్రి భోజనాల దగ్గర, ఉదయం తల్లి అన్నమాటలను గుర్తుపెట్టుకోని భార్యతో అడిగాడు కృష్ణమూర్తి.


"లావణ్యా… దసరా పండుగ వస్తుంది కదా! ఈసారి అక్కావాళ్ళను, చెల్లెలు వాళ్ళను పండుగకు పిలుద్దాం. చాలా సంవత్సరాలైంది వాళ్ళను పండుగకు పిలిచి. ఎప్పుడు ఏదో

అవాంతరాలు రావడం వలన పిలువలేకపోయాము. ఈసారి పండుగకు అందరిని రమ్మని చెబుదాము. ఏమంటావు" అడిగాడు అన్నంలోకి కూర కలుపుతూ.


"బావుందండి మీ వరసా… మీరు నిర్ణయం చేసుకుని నన్ను అడుగుతున్నారు. ఆడపిల్లలను పండుగకు పిలుస్తానంటే నేను మాత్రం వద్దంటానా? అయినా వాళ్ళేం చిన్నవాళ్ళు కాదుకదా ఇంకా పండుగలకు పుట్టినింటికి రావడానికి! వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి మనవలు, మనవారాళ్ళతో ఆడుకుంటున్నారు. సరే మీ ఇష్టం.. అలానే పిలవండి. ఎలాగు మన అమ్మాయి, అల్లుడు, పిల్లలు వస్తారు. అబ్బాయిని, కోడలిని, పిల్లలతో ఇక్కడికే రమ్మని చెప్పండి. ముందుగానే చెబితే కోడలు వాళ్ళమ్మ వాళ్ళింటికి

వెళ్ళకుండా ఉంటుంది" అంది.


అత్తగారి వైపు చూస్తూ ఇదంతా మీ ఫ్లానే అయింటుంది

అనుకుంది మనసులో. అప్పుడే కోడలివైపు చూసిన కాంతమ్మ దొరికిపోయానే అన్నట్టుగా ముసిముసిగా నవ్వుతూ తలదించుకుంది.


"అత్తయ్యా… నాకు తెలుసులెండి ఈయనకు ఎవరు చెప్పారో.. ఏమి ఎరగనట్టు అటు వైపు తిరిగి మీరు ముసిముసి నవ్వుతున్నారంటేనే నాకు అర్ధమైంది" లావణ్య నవ్వింది అత్తగారిని చూసి.


"ఆ.. నేనెందుకు చెప్పాను? వాడికి అనిపించిందేమో" అంది పెదవి విరుస్తూ.


"చూడండత్తయ్యా… మీరు నాతో చెబితే నేను వద్దంటానా చెప్పండి? నేను డ్యూటీకి వెళ్ళిపోతాను.. పనంతా మీ మీదనే పడుతుందని నా బాధ తప్పితే ఇంకేంలేదు. ఇప్పటికే

సగం పని మీరు చేస్తున్నారు, నేను వెళ్ళిపోయాక.


అయినా ఎవ్వరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. ఇదివరకు మల్లే పిలవగానే రావడానికి ఎవరు ఖాళీగాలేరు కదత్తయ్యా"


"ఆ.. ఏం పనులో ఏమో.. తల్లిగారింటికి రావడానికి కూడా కుదరనంత పనులుంటున్నాయి ఈ కాలంలో. ఒకప్పుడు ఏ పండుగ అయినా వారంరోజుల నుండే సందడిగా ఉండేది. ఇప్పుడంతా తూతూ మంత్రంలాగా జరుపుకుంటున్నారు పండుగలన్ని" బాధపడుతూ అంది.


"చూడండత్తయ్యా … మీరిలా బాధపడకండి. ఈసారి మీరనుకున్నట్టుగానే దసరాపండుగకు అందరిని పిలుచుకుందాం. అంతేకాదు దసరాపండుగకు వచ్చిన వాళ్ళంతా ఖచ్చితంగా దీపావళి పండుగ చేసుకునే వెళ్ళాలి అని చెబుదాం. అందరు సెలవులు పెట్టుకుని రావాలిసిందేనని గట్టిగా చెబుదాం. సరేనా"అడిగింది అత్త చుబుకం పట్టుకుని.


"అవునమ్మా! ఈసారి పండుగ బ్రహ్మాండంగా జరుపుకోవాలి. నాచిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో అలా జరగాలిసిందే” అన్నాడు కృష్ణమూర్తి.


"అదేమిట్రా.. దాని మాటలు పట్టుకుని మీరు హడావిడి చేస్తున్నారు? ఈ మధ్య దానికి చాదస్తం ఎక్కువయింది. అంతమందిని పిలిస్తే మాములు ఖర్చవుతుందా ? దాని సొమ్మేం పోతుంది? కష్టపడుతున్నది మీరు. మంచిచెడులు మీకన్నీ తెలుసు. ఎలా చెయ్యాలో చూసుకుని చెయ్యండి. లేనిపోని ఆర్భాటాలకు పోకండి" అంటూ భార్యమీదకు గుర్రుగా చూసాడు కృష్ణమూర్తి తండ్రి రాజయ్య.


"ఆ ఆ బాగానే చెప్పొచ్చారు… మీగురించి నాకు తెలియదేంటి మీరు ఆరోజుల్లో మాత్రం ఒప్పుకునేవారేంటి? స్వంత తోబుట్టువులను కూడా పిలువనిచ్చే వాళ్ళుకాదు. మీతో పోట్లాట వేసుకుని మరీ పిలిచేదాన్ని నేను. వాళ్ళెంత సంబరపడిపోయేవాళ్ళో.. మా అన్నయ్య పండుగలకు పిలుస్తున్నాడని! మీ గుట్టు తెలిసికూడా నేను నోరు మెదిపేదాన్ని కాదు. ‘లోగుట్టు పెరమాండ్లకెరుక’ అని మీ పిసినారి తనం నాకు తెలియదూ" అంది భర్తను

ధూంధాం దులిపేస్తూ.


"అవునవును … ‘అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు’నేను రేయింబవలు కష్టపడి సంపాదిస్తే నువ్వు విరివిగా ఖర్చు పెడుతుంటే కళ్ళుమూసుకుని కూర్చోవడం నావల్లకాదు.

నీకేం.. నీడపట్టున కూర్చొని ఎన్ని మాటలైనా చెబుతా.వు ఒళ్ళు వంచి పనిచేస్తే తెలుస్తుంది” అంటూ గొడవకు దిగాడు రాజయ్య.


"అయ్యో మామయ్యా… ఇప్పుడు మీరిద్దరు అనవసరంగా గొడవలు పడకండి. మాకు కూడా అందరితో కలిసి సరదా పండుగలు చేసుకోవాలి అనుకున్నాము. అయినా చాలా సంవత్సరాలైంది కవితను… లలితను పండుగలకు పిలిచి. వాళ్ళకేం లేక కాదు కదా మామయ్యా… అత్తయ్య చెప్పకున్నా ఈసారి మేమే పిలిచేవాళ్ళం" అంది అత్తకు మామకు సర్ధిచెబుతూ.


"సరే మీ ఇష్టం! ఏమన్న చేసుకోండి. నాకేంటి" అనుకుంటూ బయట అరుగుమీద కూర్చోవడానికి వెళ్లాడు. కాంతమ్మ ఆనందానికి హద్దేలేదు. ఎప్పుడెప్పుడు వారం రోజులుగడుస్తాయా అని ఎదురు చూస్తుంది. ఆమె ప్రేమంతా బిడ్డలమీదనో అల్లుళ్ళ మీదనో కాదు. మనవలు, మనవరాళ్ళు.. వాళ్ళంటే ఆమెకు పంచప్రాణాలు. కొడుకు పిల్లలు, బిడ్డలపిల్లలు వచ్చారంటే ఆమెకూడా పసిపిల్ల అయిపోతుంది. వాళ్ళతో సరదా ఉంటూ కథలు చెబుతూ నవ్విస్తూ ఆటలాడిస్తూ వాళ్ళ వెనకాలే ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోతారు అన్నప్పటినుండి దిగాలు పడుతుంటది. ఆమె ఎదిరిచూసే రోజు రానే వచ్చింది. ఒకరు ఒకరు మొత్తం కుటుంబాలు దిగిపోయినాయి. ఇల్లంతా గోలగోలగా ఉంది. కాంతమ్మైతే చిన్నపిల్లలా కేరింతలు కొడుతూ వాళ్ళందరిని చూస్తూ పొంగిపోయింది. రాజయ్యకు ఇంతమందిని చూస్తే మింగుడు పడడంలేదు. కానీ ఒకవైపు సంతోషంగానే ఉన్నాడు.


పెద్దకూతురు, అల్లుడు, వాళ్ళ కూతుర్లు, పిల్లలు చిన్న కూతురు, అల్లుడు, వాళ్ళ కొడుకుపిల్లలు. ఇక కొడుకు పిల్లలు, వాళ్ళ పిల్లలు.. అబ్బో పెద్ద జాతరనే ఇంట్లో.


"ఏమిటే అమ్మమ్మా … ఈసారి ఏముంది స్పెషల్ మా అందరిని రమ్మని పిలిచావట? మాకేమైనా గుప్తధనం ఇస్తున్నావా ఏంటి" ఆరోజు రాత్రి భోజనాలయ్యాక కాంతమ్మ చుట్టూచేరి పిల్లలంతా సందడి చెయ్యసాగారు.


"ఇంకా నాదగ్గర ఏముందిరా మీకివ్వడానికి? అదిగో మీ తాతను అడగండి. ఆయన దాచుకున్న దానిలో నుండి మీకేమైనా ఇస్తాడేమో" భర్తవైపు చూపిస్తూ అంది కాంతమ్మ.


"ఆహా … నీ దయా గుణం వలన మనకు ఏమి మిగులకుండా పోయింది. ఇంకా ఏముందనుకున్నావు నాదగ్గర" అన్నాడు వెక్కిరింపుగా.


"అదేంటి తాతయ్యా! అమ్మమ్మను అలా అంటావు? మా అమ్మ చెప్పింది, మీరు చాలా డబ్బు కూడబెట్టారని. అయినా ఈ వయసులో ఏం చేసుకుంటావు ? మనవలు మనవరాళ్ళకు ఇచ్చావనుకో.. మా తాతయ్య కానుకగా మా జీవితాంతం గుర్తుగా పెట్టుకుంటాం. ఏమంటావు తాతయ్య?" అడిగింది చిన్న బిడ్డ కూతురు నీరజ.


"అనుకుంటూనే ఉన్నాను, మీ అందరి కళ్ళు నామీదనే ఉంటాయని! మీ అమ్మమ్మ మిమ్మల్ని అందరిని పిలిచిందంటేనే ఇలాంటి పని ఏదో చేస్తుంది అనుకున్నాను. ఉన్నచోట కుదురుగా కూర్చునే రకం కాదు ఈ మనిషి. ఏం.. మీరందరు బాగానే సంపాదిస్తున్నారు కదా! మళ్ళి నాదగ్గర ఏమో ఉందని ఆశపడడం ఏంటి? ఉన్నదంతా

ఇదివరకే అందరికి పంచి ఇచ్చాను. మాకంటూ ఏమి మిగుల్చుకోకుండా మీకిస్తే రేపు మాకు రోగమో నొప్పో వస్తే మాకంటూ ఏమైనా ఉండాలా వద్దా? మొత్తం మీ తాతయ్య

మీదనే విరగబడితే ఎలాగా.. ఇలాంటి పప్పులేం నాదగ్గర ఉడకవని మీ అమ్మమ్మకు చెప్పుకోండి" అంటూ అందరిమీదకు గట్టిగా అరిచాడు రాజయ్య.


పిల్లలంతా భయపడిపోయారు. తాతయ్యను ఎన్నడు అంత కోపంగా చూడలేదు వాళ్ళు. అంతా గప్ చుప్ గా అక్కడనుండి వెళ్ళిపోయారు. కాంతమ్మ కూడా భర్తతో మాట్లాడకుండా అక్కడ నుండి మెల్లెగా జారుకుంది. అందరు భయపడి అలా వెళ్ళిపోయేసరికి తనలో తానే నవ్వుకున్నాడు రాజయ్య.


బతుకమ్మ పండుగ సందడి మొదలైంది. తంగేడు, గునగు, గుమ్మడి పువ్వులు, గుమ్మడిఆకులు, బంతిపువ్వులు అన్ని ముందర వేసుకుని పిల్లలందరిని చుట్టూ కూర్చొపెట్టుకుని పెద్దపళ్ళెంలో బతుకమ్మను పేర్చసాగింది కాంతమ్మ. ఇదంతా చోద్యంగా చూడసాగారు పిల్లలంతా.


"తాతమ్మా… ఇన్ని పువ్వులతో చెయ్యాలా బతుకమ్మను" అడిగింది పెద్దకూతురి మనవరాలు లక్కీ.


"అయ్యో నీకు తెలియదా లక్కీ…”


“ మా అమ్మమ్మ వాళ్ళింట్లో చూసాను నేను. మా అత్తవాళ్ళు అందరు కలిసి ఎంతబాగా ఆడుతారో.. మా అమ్మకు ఏమి రాదు. ఎప్పుడు ఆఫీసు మీటింగులు తప్పా! మనము అలా అందరిలాగా చేసుకుందాము అంటే అక్కర్లేదు మీ నానమ్మ అక్కడ చేస్తుంది కాబట్టి మనం చేసేపనిలేదు అంటుంది. పోని ఇక్కడకు వద్దాము అంటే మాకు సెలవులు ఉంటే మా అమ్మ నాన్నలకు సెలవులు ఉండవు" ఆరిందలా చేతులు తిప్పుతూ చెప్పింది కృష్ణమూర్తి మనవరాలు పది సంవత్సరాల భానుజ.


"ఏమిటే నీ ఒయ్యారం… బలే చెప్పావే నా ముద్దుల ముని మనవరాలా.. మీ అమ్మకే కాదే, ఇక్కడ మీ నానమ్మకు కూడా క్షణం తీరక ఉండదంటే నమ్ము. ఏమిటో ఈ మధ్యల మరి నామోషీ అయిపోయింది బతుకమ్మ ఆడడం. మొదటి రోజు మాములుగా బతుకమ్మను పేర్చి రెండు చుట్లు తిరగడమే గగనమైపోయింది ఇప్పటివాళ్ళకు. అది కూడా ఎలా అనుకుంటున్నావు.. గెంతులు వేస్తున్నట్టు లేదా కోలాటం ఆడుతున్నట్టు.. అందులో ఏ ఒక్కరికి బతుకమ్మ పాటలేరావు. మా అప్పుడైతేనా.."


"నానమ్మా.. మీ చిన్నప్పుడు రోజు బతుకమ్మ ఆడేవాళ్ళట కదా! నీకు ఇప్పుడు వచ్చా ఆడడం" అడిగింది కృష్ణమూర్తి కూతురు ఇంద్రజ.


"అవును అమ్మమ్మ … నువ్వు పాడుతూ ఆడుతుంటే చూడాలని ఉంది. ఫ్లీజ్.. మా కోసం ఆడవా అమ్మమ్మ" కాంతమ్మ చుబుకం పట్టుకుని బ్రతిమాలారు పిల్లలు.


"ఏమిటర్రా … ఈ వయసులో నేనాడడం ఏంటీ? మీ అమ్మలను మీ అత్తను వాళ్ళతో పాటుగా మీరు ఆడండి నేను కూర్చోని పాట చెబుతాను”అంది నవ్వుతూ.


"అదేం కుదరదు నువ్వు మాతోపాటుగా ఆడాల్సిందే" పట్టుబట్టారు.


"సరె సరె … ముందు పని కానివ్వండి మీరందరు ఈ పువ్వుల్ని ఏరి ఇవ్వండి. నేను పేరుస్తాను. మా చిన్నప్పుడైతే మా అక్క, నేను, మా దోస్తులు పొద్దుటే లేచి అడవికిపోయి సంచుల నిండా తంగేడు పువ్వు, గునుగుపువ్వు ఏరుకొని, వస్తు వస్తూ

పొలాల దగ్గర బంతిపూలు దొంగతనంగా తెంపుకుని, ఇంకా గన్నేరు పువ్వులు, సడాక్ మల్లెపువ్వులు, గుమ్మడిపువ్వులు, ఆకులు.. ఇవన్ని సంచుల నిండా నింపుకుని ఇంటికి వచ్చేవాళ్ళం. గబగబా పనులన్నీ చేసుకుని మా అమ్మకు సహాయంగా అన్ని ఏరి ఇచ్చేవాళ్ళం.


ఇక చూడు.. సాయంత్రం అవుతూనే లంగాజాకెట్టు వేసుకుని చకచకా తయారై, మా అమ్మ చేసిన మురుకులుగానీ, ఓడప్పలు గాని తీసుకుని ఒకరికంటే ముందు ఒకరం మా దోస్తులందరం బతుకమ్మ ఆటకు ఉరికేవాళ్ళం. ఎంత కోలాహలంగా ఉండేదనుకున్నావు.. రెండుకళ్ళచాలవు చూడడానికి" ఆనందపరవశంతో చెప్పుకుపోతుంది

బతుకమ్మను పేరుస్తూనే.


"అబ్బా అమ్మమ్మా… నువ్వు చెబుతుంటే మా కళ్ళముందట జరుగుతున్నట్టుగానే ఉంది. ఏమిటో అమ్మమ్మ.. పట్నంలో ఇంతమంచిగా జరుగనే జరుగవు. ఎంతసేపు పుస్తకాలతో కుస్తీ పడడం.. లేదంటే టీవీలకు అతుక్కపోవడమో చేస్తుంటారు. పండగలంటే పల్లెటూర్లలోనే బలే జరుగుతాయి. నేను నా చిన్నప్పుడు చూసానంతే.. ఎప్పుడు వెళదామన్నా మా చదువులు పాడైపోతాయని మా అమ్మా నాన్నలు మమ్మల్ని ఎక్కడకు పంపలేదు. పెద్ద చదువులు చదవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలన్న పట్టుదలలు..

మా కోసం వాళ్ళు వెళ్ళలేదు. పైగా మా నానమ్మ వాళ్ళ సైడు ఈ పండుగలు కొన్నిలేవట. పండగలకోసమైనా ఇక్కడకు రావాలి" అంది నీరజ.


"ఏమిటే అమ్మా … పిల్లలందరిని కూర్చోబెట్టుకుని నీ సరదా తీర్చుకుంటున్నావా? ఎప్పుడో మా చిన్నప్పుడు ఆడుకున్నాము. చూడండిరా పిల్లలు.. అమ్మమ్మ ఎంతకష్టపడి చేస్తుందో.. సాయంకాలం చకచకా తయారవ్వండి. అలా వెళదాము, చూద్దురుగానీ" అంది

కాంతమ్మ చిన్న కూతురు లలిత.


"ఏం చెయ్యనే తల్లి… మీకేమో ఇవన్ని పాత పద్ధతులు అనిపిస్తున్నాయి. మాబోటి వాళ్ళకేమో ఆచారాలు అనిపించే. ఎవరికి తీరుతుంది ఇంత ఓపికగా చేసుకోవడం? అందరు

నాజుకుగా తయారయ్యారు. ఏమిటో కాలం ఇలా మారిపోతుంది" అంది అందరి నుద్దేశించి.


"అమ్మా … మారుతున్న కాలంలో మనము మారాలి, తప్పదు. ఇంకా ఎవరి పాటిస్తున్నారు పాత కాలం పద్ధతులు? ఇప్పుడంతా క్యాసెట్ లు వేసుకుని డాన్స్ లు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికి రావుకూడా ఇలాంటి ఆటలు" అంది లలిత.


"నిజం చెప్పావు చిన్నొదినా… ఒకప్పుడంటే ఆడవాళ్ళందరూ ఇళ్ళల్లోనే ఉండేవాళ్ళు. ఈ ఉద్యోగాలు, ఇంతపెద్ద చదువులు ఉండకపోయేటివి. చక్కగా పండుగలన్నీ పిల్లలు పెద్దలు కలిసి సంబరంగా జరుపుకునేవారు. ఇప్పుడలాకాదు కదా! తెల్లవారి లేచింది మొదలు ఉరుకులు పరుగులతోనే సాగిపోతుంది జీవితం. ఏం చేస్తాం చెప్పండి"అంది ఆడపడుచుకు సపోర్ట్‌గా మాట్లాడుతూ.


"అంతేలేవే.. మీరే తెగ కష్టపడిపోతున్నారనుకుంటున్నావు. మాకాలంలో మేము గొడ్డు చాకిరి చేసుకునేవాళ్ళం. అయినా అన్ని పద్ధతిగా చేసుకునేవాళ్ళం. ఇలా మీకులాగా మాకేమన్న సుఖం ఉందనుకున్నావా.. పొద్దున లేచినప్పటి నుండి ఎంత కష్టపడే వాళ్ళమనుకున్నావు" అంది కాంతమ్మ చేతులు తిప్పుతూ.


"అబ్బా అమ్మా… పోని కదా! అనవసరమైన మాటలెందుకు.. నువ్వు మమ్మల్ని సరదాగా ఉండడానికి పిలిచావు అవునా? మరి ఇప్పుడావిషయాలన్ని ఎందుకు చెప్పు" అంది కాంతమ్మ పెద్దకూతురు కవిత.


"నేనేమంటున్నానే దాన్నీ… విషయం చెప్పాను అంతే. అదిసరే గానీ పదండర్రా పిల్లలు.. అందరూ వచ్చేసింటారు" అంటూ పిల్లలను కూతుళ్ళను కోడలిని తీసుకుని తను చేసిన సద్దుల బతుకమ్మను కోడలినెత్తిన పెట్టి ముందుకు కదిలింది కాంతమ్మ. పిల్లలందరికి తమాషాగా సంతోషంగా ఉంది ఇదంతా చూస్తుంటే.


ఆట మొదలుపెట్టారు. అందరూ ఆడుతున్నారు. కాంతమ్మ కూర్చొని చూస్తుంది. ఆవిడకు మనసులో ఆడాలని ఉంది.

కాకపోతే ఆయాసం వస్తుందేమోనని భయం. కానీ పిల్లలందరు కలిసి కాంతమ్మను బలవంతంగా లాక్కునిపోయారు ఆడాల్సిందేనని.


"నేనాడలేనర్రా.. నావల్లకాదు. ఆయాసం వస్తుంది"అంది కాంతమ్మ.


"అదేంకాదు. నువ్వు ఆడుతూ పాడాలి. మేమెప్పుడు చూడలేదు. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. ఈరోజు నీ ఆటపాట చూడాలి మేము" అంటూ హడావుడి చేసారు.


పిల్లలమాట కాదనలేక చీరకొంగును నడుములోకి దోపి మొదలుపెట్టింది. ఆడుతూ పాడుతుంటే కాంతమ్మను అందుకోలేకపోయారు మిగతావాళ్ళు. వంచిన నడుము ఎత్తకుండా నోటినుండి పాటను ఆపకుండా ఆడుతుంటే పిల్లలైతే చప్పట్లు కొడుతూ ఈలలు వెయ్యసాగారు. ఆట అయిపోయాక ఆయాసంతో కూర్చుండిపోయింది కాంతమ్మ. పిల్లలంతా పరుగున వచ్చి కాంతమ్మను బిగ్గరగా పట్టుకున్నారు ఆనందంతో.


"నోరు ఎండిపోతుంది. కాసిన్ని మంచినీళ్ళవండిరా" దమ్ము తీస్తూ అడిగింది మనవరాళ్ళను చూస్తూ.


అందరు కలిసి ఫలహారాలు పంచుకుని, నవ్వుకుంటూ, పరాచికాలాడుకుంటూ, ఒకరు తెచ్చిన ఫలహారం ఒకరికి పంచుతూ, అక్కడే తిని, ఎవరిదోవన వాళ్ళు వెళ్ళిపోయారు. కాంతమ్మ మనవరాళ్ళు ఎంతో తృప్తిగా ఎన్నడు పొందని అనుభూతిని పొందుతూ కాంతమ్మను దారిపొడువునా పొగుడుతూనే ఉన్నారు, నీ వల్లనే ఇంత ఆనందం అనుభవించామని.

ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మేమందరం ఇక్కడికే వస్తామని కూడా చెప్పారు.


"ప్రతి సంవత్సరము కాదండర్రా… ప్రతి పండుగా ఇలానే జరుగుతుంది. మీకు వీలున్నప్పుడల్లా పండుగ పండుగకు వచ్చి చూడండి. మీకే తెలుస్తుంది" అంది.


"ఇంకా నయం అమ్మా… ప్రతి పండుగకు వీళ్ళందరిని వేసుకుని రావాలంటే ఎంత ఇబ్బందనుకున్నావు? మాకు సెలవులండొద్దూ.. నువ్వన్నట్టుగా వచ్చామంటే మా తమ్ముడిఇల్లు గుల్ల అయిపోవడం కాయం. విన్నావా మరదలమ్మా, మా అమ్మ మాటలు" నవ్వుతూ లావణ్య వైపు చూస్తూ అడిగింది లలిత.


"అయ్యో దానిదేముంది చిన్న వదినా… అందరం కలిస్తేనే ఏ పండుగకైనా అందం వస్తుంది

అయినా వచ్చినప్పటినుండి పనంతా మనందరం కలిసే చేసుకుంటున్నాము కదా! ఇంకా ఇబ్బందేముంది? దేవుడి దయవల్ల డబ్బులకేం ఇబ్బందిలేదు. ఆడపిల్లలకు ఎంతపెట్టుకున్నా తక్కువే కదా" నవ్వుతూ అంది లావణ్య.


"అబ్బో.. మా అమ్మ బాగానే తయారుచేసింది కోడలిని. ఏమిటో అడపాదడపా వద్దామంటే ఎవ్వరికి వీలుపడడంలేదు. అమ్మ పడే ఆరాటం చూస్తుంటే నాకు చాలా బాధేసింది. ఇన్నాళ్ళు అమ్మ పండగలకు రమ్మని పిలుస్తుంటే ‘మేమేమన్నా చిన్న పిల్లలమా ఇంకామాటిమాటికి పండగలకు పిలవగానే పరుగెత్తి రావడానికి’ అనుకున్నామే గాని ఇంత ఆప్యాయత ఇంత ఆనందం దొరుకుతుందని అనుకోలేకపోయాము.


మేము కాదు, మాకంటే పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆ ఆనందం చూస్తుంటే ప్రతి పండగకు

వాళ్ళను తీసుకుని ఇక్కడకు రావాలనుకుంటున్నాము. ఏమంటావు లావణ్య?” అడిగింది కవిత.


"చూడండి పెద్దొదినా … మీరు రావాలిగాని, పర్మిషన్ అడగకూడదు. ఎందుకంటే ఇది మీ పుట్టినిల్లు. మీరు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు. ముఖ్యంగా మీరు వస్తే అందరికంటే ఎక్కువగా సంతోషపడేది అత్తయ్య, మామయ్య. వాళ్ళ తృప్తికోసమన్నా మీరు వస్తే చాలా మంచిది. మాకు మాఇంటి మాహాలక్ష్మిలు వస్తే నిజమైన పండుగ వచ్చినట్టే కదా వదినా" అంది ఇద్దరి ఆడపడుచులను ఉద్దేశించి.


కాంతమ్మకు ఎక్కడలేని సంతోషం పొంగుకొచ్చింది కోడలిని చూస్తుంటే. పండుగకు అందరిని పిలిచి ఇల్లంతా దుబారా చేస్తున్నానని ఎక్కడ అంటుందోనని భయపడుతున్నది.

అలాంటిది ఆడపిల్లలను ఇంత ప్రేమగా చూసుకుంటుందంటే ఎంత మంచిమనసు తనది.. ‘ఈకాలంలో కూడా ఇంత ఆదరణ చూపుతుందంటే నాకోడలు నిజంగా బంగారం అనుకుంది’ మనసులో.


"చూసారా నాకోడలు ఏం చెబుతుందో… ఇక నుండి మీరందరు పండగలకు కలుసుకుంటారంటే నాకు ఎంతో తృప్తిగా ఉంది" అంటూనే. "ఏమయ్యా … ఓసారి ఇలా రండి" అంటూ కేకవేసి భర్త రాజయ్యను పిలిచింది.


భార్య కేకవినపడగానే ఆయనకు గుండెలు గుభేలుమన్నాయి. ఇది పిలిచిందంటే డబ్బులకు ఎసరుపెట్టినట్టే. పిల్లలముందు పరువు పోగుట్టుకోవడం ఎందుకనుకుంటూ పైకి నవ్వుతూ లోపల గుణుగుతూ భార్యను తిట్టుకుంటూ వచ్చాడు.


"ఏమిటి పిలిచావు… ఏదైనా మాట్లాడేది ఉందా? ఏంట్రా పిల్లలు.. మీ అమ్మమ్మతోటి బాగానే సందడి చేసారు కదా! ఇలా ప్రతిసారి రాకూడదా మీరు.. ఈపది రోజులు కళ్ళుమూసి తెరిచేలోగా ఎలా గడిచిపోయాయి చూసారా.. చాలా కాలం తరువాత ఇంత ఆనందం అనుభవించాము. అంతేనంటావా కాంతం" మనవరాళ్ళను మనవళ్లను దగ్గరకు తీసుకుంటూ

భార్యను అడిగాడు.


"ఆ.. ఆ.. అదే కదా నేను చెబుతున్నది. మనమున్నంతకాలం వీళ్ళు ఇలాగే రావాలని అంటున్నాను. ఇదిగో మన బీరువాలో నా చీరలకింద కవరుపెట్టాను. అది తీసుకవచ్చి

మీచేతులతో పిల్లలందరికి ఇవ్వండి" అంది ఆజ్ఞ జారి చేస్తున్నట్టుగా.

‘తప్పుతుందా నువ్వు చెప్పిన తరువాత’ అనుకుంటూ లోపలకు వెళ్ళి కవరు తెచ్చాడు. అందులోనుండి తీస్తుంటే

ఎవరి పేరు వాళ్ళకు రాసిపెట్టి ఉన్నాయి కవర్లు. ఒక్కొక్క కవరు తీసి అందరికి ఇవ్వసాగాడు. అందరు కవరు తీసి చూసుకుని ఒక్క ఉదుటున వెళ్ళి కాంతమ్మను కౌగిలించుకుని ముద్దులతో ముంచెత్తారు పిల్లలంతా.


తనివితీరా ప్రేమగా చూసుకుంది పిల్లలందరిని. మనసంతా పులకరించిపోయింది కాంతమ్మకు. ఆ ఆనందం చూస్తుంటే రాజయ్యకు మనసు ప్రశాంతతను పొందింది. పిచ్చిది.. ఎంత ప్రేమ పెట్టుకుంది పిల్లలమీద.. అనుకున్నాడు.

కృష్ణమూర్తి తల్లితండ్రుల ఆనందం చూసి మురిసిపోయాడు.


****** ******* ****** ****** ******

లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Twitter Link



Podcast Link



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


52 views0 comments
bottom of page