top of page
Writer's pictureSrinivasarao Jeedigunta

మా నాన్నకు సన్మానం


'Ma Nannaku Sanmanam' New Telugu Story



(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)



“యిదిగో, యిటు రావోయ్! మా నాన్నకి ఈ నెల 30 వ తేదీన రవీంద్రభారతి లో సన్మానమట, తప్పకుండా రమ్మని ఫోన్ చేసారు” అన్నాడు కిరణ్, వంటింట్లో వున్న భార్య వినత తో.


“పదేళ్ల క్రితం చేశారుగా, మళ్ళీ యిప్పుడు ఎందుకు?” అంది అక్కడ నుంచే.

“అది మా నాన్న రిటైర్ అయినప్పుడు ఆఫీస్ వాళ్ళు చేసింది. యిప్పుడు ఒక పెద్ద పత్రిక వాళ్ళు చేస్తున్నారు, కొంతమంది ప్రముఖ రచయితలకు” అన్నాడు సంతోషంతో కిరణ్.

“ప్రముఖ రచయితలకా, మరి మామయ్యగారి కి ఎందుకు?” అంది, సన్నాయి రాగం తీస్తో వినత.


“అవునులే.. నీకు మా నాన్న రాసిన కథలు చదవటానికి తీరిక ఎక్కడా పాపం, ఎంతసేపు ఆ టివీలో ‘అత్తగారి హత్య, మామగారి వింత రోగం’ లాంటి సీరియల్స్ చూడటానికి టైం చాలదు” అన్నాడు కోపంగా కిరణ్.


“అబ్బా.. ఊరుకోండి నాన్నా! మీ యిద్దరి పొట్లాటలతో నాకు చదువు సాగడం లేదు. నేను చెపుతున్నా.. మనం తాతయ్య సన్మానానికి వెళ్తున్నాం, అంతే” అంటున్న కూతురు వంక ఆనందంగా కిరణ్, కోపంగా వినత ఒకేసారి చూసారు.


మొత్తానికి హైదరాబాద్ వెళ్లడం మానేసి., తండ్రికి తనకి ఆఫీసులో ఇన్స్పెక్షన్ వుంది రాలేను అనిచెప్పి తప్పించుకున్నాడు. ఆ విషయం తెలిసిన కూతురు, తండ్రితో, “నువ్వు అమ్మ ఏమంటే దానికి ‘అంతేగా… అంతేగా… ‘ అని తాత సన్మానానికి వెళ్లకుండా చేసావు. యింట్లో అమ్మ చేత నీకు జరిగే సన్మానం తప్పా, యింతవరకు నేను నిజమైన సన్మానం చూడలేదు. అంతా చెడగొట్టారు” అంది.


‘చివరికి నీకు కూడా లోకువ అయ్యాను’ అనుకుంటూ ఆఫీస్ కి వెళిపోయాడు కిరణ్.

యింకో గంటలో ఆఫీస్ అవుతుంది అనగా, వినత ఫోన్ చేసి కిరణ్ కి, “ఏమండోయ్! మా అమ్మ కాలు జారిందిట, మనం వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి. పనిలో పని, మామయ్యగారి సన్మానం కూడా చూసినట్టు వుంటుంది. మా అమ్మకి సహాయం చేసినట్టు వుంటుంది. పాపం నాన్న ఎంత బాధ పడుతున్నారో..” అంది.


“అదేంటి, మీ అమ్మ యిప్పుడు కాలు జారడం ఏమిటి, మీ నాన్న వుండగా, ఛీ ఛీ” అన్నాడు.


“అయ్యో రాత! తెలుగు సినిమాలు చూసి పాడైపోయారు. బాత్రూం లో కాలు జారి పడిపోయింది. లేవలేకపోతోందిట. త్వరగా రండి” అంది.


“పూర్తిగా వినరు. వీలుంటే ఫ్లైట్ లో వెళ్దాం” అని కంగారు పెట్టేసింది వినత.

“ఆ.. వస్తాను” అని ఫోన్ పెట్టేసాడు కిరణ్.


మొత్తానికి రెండవ రోజు అంటే గురువారం ఫ్లైట్ లో బయలుదేరారు హైదరాబాద్. యిద్దరి అత్తగారి ఇళ్ళు హైదరాబాద్ అవడం తో కొంత సుఖం గా వుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో నుంచి బయటకు వచ్చి క్యాబ్ లో డైరెక్టుగా అత్తగారి ఇంటికి బయలుదేరారు.


క్యాబ్ లో వినత, వాళ్ల అమ్మకి ఎలా వుందో అని ఒకటే కంగారు పడుతోనే వుంది. గంట ప్రయాణం తరువాత బీరంగూడ చేరుకున్నారు. క్యాబ్ లో నుంచి దిగి, అక్కడ దృశ్యం చూసి కొయ్యబారి పోయాడు కిరణ్.


అత్తగారు చెంగు చెంగు న ఎగురుతో గేటు పక్కన వున్న సన్నజాజి చెట్టు నుంచి పువ్వులు కోస్తోంది.

“అదిగో అటు చూడు, మీ అమ్మగారు ఎలా ఎగురుతున్నారో, యింతోటి దానికి నువ్వు నన్ను కంగారు పెట్టేసావు అనవసరం గా” అన్నాడు.


“అనవసరం అంటే మా అమ్మ బాగుండటం మంచిది కాదా? ఏదో నా కోసమే హైదరాబాద్ ప్రయాణం అయినట్టు మాట్లాడుతున్నారు. లోపల మీ నాన్నగారి సన్మానానికి వచ్చినందుకు ఆనందంగా వుంది గా” అంది వినత.


“రండి, రండి అల్లుడు గారు, మా అమ్మాయి కంగారు పెట్టేసింది అనుకుంటా, కాలు కొద్దిగా బెణికింది అన్నారు డాక్టర్ గారు. ఈ రోజు ఉదయం పాపం మీ మామయ్యగారు వంట చేసారు. అది తినలేక నేను రెస్ట్ లేదు, గిస్ట్ లేదు అని లేచి తిరగడం మొదలు పెట్టాను. అంతే.. కాలు నొప్పి యిట్టే తగ్గిపోయింది” అంది అత్తగారు.


“ఎలాగో వచ్చేసాం, యిప్పుడు మీ కాలు నొప్పి లేదని వెనక్కి వెళ్ళిపోలేము కదా” అన్నాడు కిరణ్.

కిరణ్ మామగారు ఏదో రాసుకుంటో కనిపిస్తే, “ఏమిటి మామయ్యగారు, రామకోటి రాస్తున్నారా?” అని ఆడిగాడు కిరణ్.


“అయ్యో! ఏం చెప్పమంటావు నాయనా, మీ నాన్నగారికి సన్మానం అని తెలిసిన దగ్గర నుంచి ఆ రామూర్తి గారేనా కథలు రాయగలిగేది, నేనూ రాస్తాను” అంటూ ఒకటే రాస్తున్నారు మీ మామయ్య” అంది నవ్వుతూ అత్తగారు.


మొత్తానికి ఆరోజు రాత్రి గడిపి, ఉదయమే తన తండ్రి వుంటున్న రాజీవనగర్ బయలుదేరాడు కిరణ్. వినత తన తల్లి తండ్రులతో బయలుదేరి, డైరెక్టుగా సన్మానం జరిగే చోటుకి వస్తామంది. సరే అని కిరణ్ తల్లిదండ్రులు వున్న ఇంటికి వెళ్ళాడు.

దొడ్లో మొక్కలకి నీళ్లు పోస్తున్న రామూర్తి గారు, కొడుకు ని చూసి, “వచ్చావా! నాకు సన్మానం అంటే రాకుండా ఎలా వుంటావులే” అంటూ “కోడలు, మనవరాలు రాలేదా” అన్నాడు.


“మీ కోడలు ‘అక్కడ మామయ్యగారికి సన్మానం జరుగుతోవుంటే, మీరు సెలవు లేదంటే ఎలా’ అని మొత్తానికి నన్ను తీసుకొని వచ్చింది. తనని వాళ్ల అమ్మ దగ్గర దింపి నేను వచ్చాను. వాళ్ళు సన్మానానికి వచ్చి, అక్కడ నుంచి ఇక్కడకి వస్తారు నాన్నా. నేను వచ్చాగా” అన్నాడు కిరణ్.


మొత్తానికి సన్మానం జరిగే రోజు రానే వచ్చింది. రచయితలతో హాలు నిండిపోయింది. సన్మాన కర్తలు వున్నంతలో రచయితలను బాగా సత్కారించి గౌరవం గా సన్మానం చేసారు.


తన వియ్యంకుడిని స్టేజి మీదకు పిలిచి, పూలదండ వేసి, శాలువా కప్పి,, ఆయన కధల గురించి పొగుడుతూ వుంటే కిరణ్ మామగారికి టీ కూడా కారంగా అనిపించింది. తను కూడా ఎలాగైనా మంచి కథ రాసి యింతకు యింత సన్మానం తో గౌరవం సంపాదించాలి అనుకున్నాడు. అప్పటికే తను రాసిన కథ ఒకటి ఎందుకైనా మంచిది అని తీసుకొని వచ్చాడు.


మెడలో పూలదండ తో మురిసిపోతున్న రామూర్తి ని, “యిదిగో బావగారు, నేను కూడా ఒక మంచి కధ రాసాను. కొద్దిగా మీకు తెలిసిన ఈ పత్రిక వాళ్ళకి యిచ్చి, నా గురించి చెప్పి, నా కథ ని వాళ్ళ పత్రిక లో వేసుకోమని చెప్పండి” అన్నాడు కిరణ్ మామగారు.

“యిక్కడ యిస్తే బాగుండదు అనుకుంటా. మీకు పత్రిక అడ్రస్ యిస్తా. ఆన్లైన్ లో పంపండి” అన్నాడు రామూర్తి.


“లైన్ లో నుంచుని కథలు యివ్వడం కష్టం అన్నయ్య గారు, మీరే నా కధని పర్సనల్ గా యిస్తే, వచ్చే నెల సన్మానం లిస్ట్ లో నా పేరు వుంటుంది” అంటున్న వియ్యంకుడి ని చూసి, “సరే.. మీరు రాసిన కథ యిటు ఇవ్వండి, వీలు చూసుకుని వాళ్ళకి యిస్తాను” అని అన్నాడు రామూర్తి.


“అయినా బావగారు.. నేను పది సంవత్సరాలనుండి కధలు రాస్తే, యిప్పుడు సన్మానం జరిగింది. ఈ లేట్ వయసు లో మీరు యిప్పుడు కథలు రాయడం మొదలుపెట్టారు. సన్మానానికి పనికొచ్చే కథ రాసే సరికి మన కథ కంచికి చేరినా చేరవచ్చు. అందుకే మీకు నిజంగా సన్మానం చేయించుకోవాలి అని కోరిక వుంటే, నేను ఒక ఉపాయం చెపుతాను, ఆలా చేస్తారా?” అన్నాడు కిరణ్ తండ్రి రామూర్తి.


“చెప్పండి బావగారు, ఏమిటో దీనిని ఈర్ష్య అంటారో లేక కోరికో తెలియదు గాని, మీకు జరిగిన సన్మానం చూసిన తరువాత, నాకూ అటువంటి సన్మానం జరిగితే బాగుండును అనిపిస్తోంది. ఆ ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకోండి” అన్నాడు వినత తండ్రి.

“అయితే వినండి! మీ తాహతు కి తగ్గకుండా, బ్రహ్మాండమైన సన్మానం, ఒక పెద్ద రచయిత చేత జరుగుతుంది. సన్మానం లో మీరు ఎన్ని కథలు రాసారో, ఎక్కడ పడ్డాయో ఎవ్వరూ అడగరు. రెండు రోజులలో మీకు మొత్తం ప్రోగ్రాం యిస్తాను” అని చెప్పి ఎవరింటికి వాళ్ళు చేరుకున్నారు.


అన్నవిధంగానే రెండు రోజులు తరువాత వినత వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి, “అయ్యా బావగారూ! వచ్చే నెల లో వచ్చే మీ పుట్టినరోజు సందర్బంగా, శిల్పారామం లో మీకు సన్మానం. మీకు తెలిసిన చుట్టాల్ని, మిత్రులకు మెసేజ్ పెట్టండి మీ పుట్టినరోజు విందుకి రమ్మని. అదే రోజు మీకు ప్రముఖ రచయిత తో సన్మానం అని తెలియచేయండి” అన్నాడు రామూర్తి.


“వచ్చే నెల అంటే అల్లుడు గారు, అమ్మాయి మళ్ళీ రావాలి కదా! ఈ రెండు, మూడు రోజులలో సన్మానం జరిగితే బాగుంటుంది” అన్నాడు వినత తండ్రి.


“మీకు సన్మానం అంటే పిల్లలు మళ్ళీ వస్తారు గాని, ఏ కారణం లేకుండా సన్మానం అంటే అనేక ప్రశ్నలు పుట్టుకొస్తాయి. అందుకే మీ పుట్టినరోజున పెట్టుకుందాం. ఒక యాభై వేలతో అదరకొట్టేస్తాము” అన్నాడు రామూర్తి.


“బాబోయ్.. చాలా ఖర్చు అవుతుంది అన్నమాట” అన్నాడు వినత తండ్రి.

“సరే కానీయండి, మీ సన్మానానికి నేను రాకపోయినా బాగుండేది, నాకు ఈ సన్మానం పిచ్చి వుండేది కాదు” అంటూ డబ్బు గూగుల్ పే చేసాడు రామూర్తికి.


జనవరి 16 రానే వచ్చింది. రెండు రోజులు ముందే జుట్టుకి కలర్ వేసుకుని కొత్త పెళ్ళికొడుకు లాగా తయారు అయ్యాడు వినత తండ్రి. అల్లుడు, కూతురు, మనవరాలు కూడా వచ్చి వుండటం తో ఇల్లంతా పండుగ వాతావరణం వచ్చేసింది.


సాయంత్రం ఏడు గంటలకల్లా శిల్పరామం లో ని ఫంక్షన్ హల్ చుట్టాలతో నిండిపోవటం చూసి వినత మురిసి పోయింది, తన తండ్రి పుట్టినరోజు సన్మానం యింత పెద్ద ఎత్తున జరుగుతోంది అని.


ప్లేట్స్ ప్లేట్స్ ఖాళీ అవుతున్నాయి, బ్యాండ్ వాళ్ళు రెడీ గా వున్నారు, పురోహితులు కూడా సిద్ధం, కానీ రామూర్తి గారు, ఆ గొప్ప రచయిత రానేలేదు.

వినత తండ్రి ఒకటే కంగారు పడుతూ, అల్లుడిని ఆడిగాడు ‘మీ నాన్నగారు యింకా ఆ రచయిత ని తీసుకుని రాలేదే’ అని.


అంతలో హాలు ముందు ఒక పెద్ద కారు ఆగడం, అందులో నుంచి రామూర్తి గారు, ఆయనతో పాటు యింకో పెద్దమనిషి దిగి నవ్వుతు వచ్చారు. అప్పటి వరకు బయట తచ్చాడుతున్న సన్మాన గ్రహీత లోపలికి వెళ్లి కూర్చున్నాడు.


కిరణ్, వినత మొదలగు వాళ్ళు బ్యాండ్ మేళాలతో, పురోహితుల మంత్రాలతో రామూర్తి ని, ఆ పెద్దమనిషి ని లోపలికి తీసుకొని వచ్చారు.


“ముందు సన్మానం, తరువాత భోజనం” అన్నాడు వినత తండ్రి. అలాగే అని కిరణ్ వినత తండ్రి ని మేళాతాళలతో తీసుకొని వచ్చి ప్రత్యేక ఆసనంలో కూర్చోపెట్టి పూలదండలతో ముంచేసారు.


రామూర్తి మాత్రం కూర్చున్న చోటు నుంచి కదలకుండా కూర్చున్నాడు.

అప్పుడు రామూర్తి తో వచ్చిన పెద్దమనిషి స్టేజి మీదకి వచ్చి, “యిప్పుడు ప్రఖ్యాత రచయిత గారిచే సన్మానం కార్యక్రమం” అని, “అయ్యా రామూర్తి గారూ! తమరు పైకి వచ్చి వీరికి శాలువా కప్పి, పూలదండ వేసి, వారి గొప్పతనం గురించి రెండు ముక్కలు చెప్పండి” అని పిలిచాడు.


ఆ పిలుపు తో రామూర్తి టీవిగా నడుచుకుంటూ వచ్చి, వినత తండ్రి కి పూల దండ వేసి, శాలువా కప్పుతో వుండగా, పూలదండల లోపల నుంచి, ‘ప్రసిద్ధ రచయిత అంటే మీరా’ అన్నాడు వినత తండ్రి.


“అనేగా, ఆ రోజు నాకు సన్మానం చేసారు. యిప్పుడు నా చేత మీకు సన్మానం జరగడం మీ అదృష్టం. పేపర్ లో కూడా ఈ సన్మానం గురించి వస్తుంది” అన్నాడు రామూర్తి మెల్లిగా.

“అంటే ఈ విధంగా కూడా మీకు పేరు వచ్చేటట్లు చేసుకున్నారన్నమాట! పోయిన డబ్బు ఎలాగో పోయింది, నా గురించి రెండు మంచి మాటలేనా చెప్పండి” అన్నాడు నీరసంగా వినత తండ్రి.


“దానికేం భాగ్యం, స్పీచ్ ఆదరకొట్టేస్తా” అంటూ మైక్ పట్టుకున్నాడు.

కిరణ్, వినత తప్ప, వచ్చిన చుట్టాలందరూ, అబ్బో రామూర్తి గారు పెద్ద రచయితట అంటూ పొగడటం మొదలుపెట్టారు.

కిరణ్ మనసులో అనుకున్నాడు ‘మా నాన్నకి సన్మానం’ అని.

శుభం

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link


Twitter Link


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



100 views1 comment

1 Comment


plavanyakumari15
Dec 07, 2022

హాస్యంగా, చాలా బాగుంది సార్ కథ... రచయితగా సన్మానం పొందటమన్నది నిజంగా ఎంతో అదృష్టమైన విషయమని చాలా బాగా చెప్పారండి ఈ కథ ద్వారా.

Like
bottom of page