top of page
Original.png

మధుమేహమా ! మజాకా!?


మధుమేహమా మజాకా తెలుగు కథలో ఇద్దరు రోగుల బ్లడ్ షుగర్ రిపోర్టులు తారుమారైన ల్యాబ్ ఘటన

Madhumehama ! Majaka!? - Telugu Social Story | Written By Kandarpa Murthy

మధుమేహమా ! మజాకా!? - తెలుగు సామాజిక కథ | రచన: కందర్ప మూర్తి

Published In manatelugukathalu.com On 16/10/2026


మధుమేహం గురించి అవగాహనతో పాటు వైద్య పరీక్షల్లో జాగ్రత్తల ప్రాముఖ్యతను తెలియజేసే ఆసక్తికరమైన తెలుగు కథ “మధుమేహమా! మజాకా!?” రచయిత కందర్ప మూర్తి. ఒక చిన్న ల్యాబ్ పొరపాటు ఇద్దరి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందో ఈ కథలో తెలుసుకుందాం.


సాయంకాలమైంది. మాధవీ నర్సింగ్ హోమ్ వద్ద పేషెంట్ల హడావుడి మొదలై, రిసెప్షన్ వద్ద పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు.


వరుసక్రమంలో రంగారావు పేరువచ్చి డాక్టరు గారి దగ్గర కూర్చున్నారు.


“రంగారావు గారూ, వయసు 62 సంవత్సరాలు అన్నారు కదా. మీ శరీర సమస్యలు, బ్లడ్ రిపోర్టులను బట్టి షుగర్ లెవెల్స్ ఎక్కువగానే అనిపిస్తున్నాయి.


నేను రాసిన ట్రీట్మెంట్ ప్రకారం, ఆహార నియమాలను పాటిస్తూ మందులు రెగ్యులర్‌గా వాడాలి.


ఉదయం సాయంకాలం వీలైనంత వాకింగ్ చేయండి. టైమ్ టు టైమ్ నా దగ్గరకు వస్తే చెకప్ చేసి పరిస్థితి వివరిస్తాను” డాక్టర్ వేణుగోపాల్ రంగారావు గారికి వివరిస్తున్నారు.


“ఈరోజు పుట్టినరోజని మీకు ఇష్టమైన సేమ్యా పాయసం జీడిపప్పు, కిస్‌మిస్ వేసి తయారు చేశానండి” రంగారావు గారిని శ్రీమతి వేడుకోలు.


“డాక్టరు గారు పూర్తిగా తీపి వదిలేయమన్నారే!”

“ఈ ఒక్కసారికి ఏం పర్వాలేదు. కొంచెం గ్లాసులో పోసిస్తాను, తాగండి.”


“డాక్టరు గారు షుగర్ నార్మల్‌కి వచ్చిందనే వరకు తీపి ముట్టను.”

“మీరు లేకుండా సేమ్యా పాయసం తాగాలంటే బాధగా ఉందండీ!”


“ఏం చేస్తాను, ఖర్మ!”


“మోహన్, పవర్ లేదురా. ఎనలైజర్ పనిచేయడం లేదు. డయాబెటిక్ పేషెంట్‌కి బ్లడ్ రిపోర్ట్ ఇవ్వాలి” కంగారు పడుతూ అడిగాడు ల్యాబ్ టెక్నీషియన్ మధు.


“కొంచెం వెయిట్ చేయి రా, పవర్ వస్తుంది” అన్నాడు సీనియర్ టెక్నీషియన్ మోహన్.


“డాక్టర్ వేణు ఫోన్ చేశార్రా, షుగర్ బ్లడ్ రిపోర్ట్ తొందరగా పంపమని” విషయం తెలియజేశాడు.


“మరిప్పుడు ఏం చేద్దాం! ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏమిటో?”

“ఒక పని చేయి. బ్లడ్ శాంపిల్ నుంచి ఒక డ్రాప్ గ్లూకోమీటర్ మీద వేసి రిజల్ట్స్ తీసుకో.


తర్వాత ఎనలైజర్ మీద ఒరిజినల్ రిపోర్ట్ తీసుకుందాం” అన్నాడు మోహన్.

“సర్లే, అలాగే చేద్దాం.”


టేబుల్ మీద ఉన్న ల్యాబ్ రిక్విజిషన్స్ నుంచి R. రంగారావు పేపర్‌తో పాటు బ్లడ్ శాంపిల్ పైకి తీసి ప్రాసెస్ మొదలెట్టాడు.


రీడింగ్ తీసుకుని రిపోర్ట్ ఫారం మీద నోట్ చేశాడు. ఇంతలో ఒక యువకుడు వచ్చి “బ్లడ్ షుగర్ రిపోర్ట్ రెడీ అయిందా?” అన్నాడు.


“మాధవీ నర్సింగ్ హోమ్ డాక్టర్ వేణు గారు ఫోన్ చేసింది మీ గురించా?”

“అవునండి.”


“మీ పేరు?”

“R. రంగారావు.”


“ఇదిగో, మీ బ్లడ్ రిపోర్ట్” అని ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చాడు మధు.


“ఏమిటి రంగారావు, మీకు వయసు 26 సంవత్సరాలే. ఇంత చిన్న వయసులో మీకు హై షుగర్ రావడం ఆశ్చర్యంగా ఉంది! మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే షుగర్ అనిపించడం లేదు.


మీ ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉందా?” అనుమానం వ్యక్తం చేశారు డాక్టర్ వేణు.

“నాకు తెలిసినంతవరకు ఎవరికీ లేదు డాక్టరు గారు. మా తాతయ్యకి ఉన్నదీ లేనిదీ తెలియదు.”


“పాత రోజుల్లో అరవై దాటిన వయోవృద్ధులకే మధుమేహం ఉండేది. మారుతున్న కాలంలో కొత్త జనరేషన్‌లో సరైన ఆహార నియమాలు, శరీర శ్రమ లేక మానసిక సమస్యలతో చిన్న వయసులోనే డయాబెటిక్ పేషెంట్లుగా తయారవుతున్నారు.


కొద్ది రోజులు అబ్జర్వేషన్‌లో పెడదాం. తర్వాత కండిషన్ బట్టి ఫర్దర్ టెస్టులు చేయిద్దాం. నేను రాసిచ్చిన మందులు వాడుతూ తీపిని కంట్రోల్ చేయండి.”


“అలాగే, డాక్టరు గారు.”

“నీకు ఇష్టమని నెయ్యేసి సున్నుండలు చేశానురా, ఇంద తినూ.”

“వద్దే అమ్మా, డాక్టరు చెప్పారు షుగర్ కంట్రోల్ చేయమని.”


“డాక్టర్లు అలాగే చెబుతారురా! వయసులో తినకపోతే పళ్లూడిన తర్వాత ఏం తింటారురా? మా అమ్మ 70 దాటినా చేగోడీలు కరకర నమిలేసేది.”

“మీ తరం వేరే, అప్పటి తిండి ఇప్పుడు ఉంటోందా?”

“వెర్రి నాయనా, ఈ వయసులో తింటేనే వంటికి వంటపడుతుంది.”


“షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోకపోతే భవిష్యత్తులో గుండెజబ్బులు, కిడ్నీ మూత్ర సంబంధ వ్యాధులు వస్తాయట.”


“ఏమిటోరా ఈ జబ్బులు? కుర్రాళ్లు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయే వయసు. ఇలా అనుమానాలు, రోగాలతో సతమతమవుతున్నారు. రేపు పెళ్లైతే కాపురం ఎలా చేస్తారో!”

“జరగబోయేది తర్వాత ఆలోచిద్దామే. ముందు డాక్టరు చెప్పినట్టు నడుచుకోవాలి.”


“అమ్మాయి తరపువారికి జాతకాలు, నక్షత్రం బాగానే కుదిరాయట. కానీ అబ్బాయికి షుగర్ జబ్బు ఉందని తెలిసి సంశయపడుతున్నారు. పోనీ మందులు వాడి షుగర్ కంట్రోల్ అయిన తర్వాత పెళ్లి ఖాయం చేసుకోమని చెబుదాం. ఏమంటారు అన్నపూర్ణమ్మ గారు?” అన్నారు పెళ్లిళ్ల పేరయ్య అవధాన్లు గారు.


“చెప్పి చూడండి” అంది అన్నపూర్ణమ్మ.


“ఏమిటి రంగారావు గారూ, వండర్! మీ షుగర్ లెవెల్స్ ఇంత నార్మల్ లెవెల్‌కి వచ్చేశాయి. నా ట్రీట్మెంట్ బాగా పనిచేస్తున్నట్టుంది. మీరు డైట్ కంట్రోల్‌తో పాటు వాకింగ్ చేస్తున్నట్టున్నారు.”


“మీరు రాసిన మందులు వాడుతూ తిండిలో తీపి తగ్గించాను. కానీ మూత్ర విసర్జన కంట్రోల్ అవ్వడం లేదు డాక్టరు గారు.”


“పెద్ద వయసు కదండీ, మెల్లిగా సర్దుకుంటాయి.”

“ఏమిటి రంగారావు, ఇంత తొందరగా షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి తెచ్చేశావు? వెరీ గుడ్! ఇలాగే ఉంటే కొద్ది రోజుల్లో నువ్వు నార్మల్ స్టేజీకి వస్తావు. కీప్ ఇట్ అప్.”


“అంతా మీ ట్రీట్మెంట్ ప్రభావం డాక్టరు గారు.”

“ఒరేయ్ మోహన్, కొంప ములిగిందిరా! నెల కిందట మాధవీ నర్సింగ్ హోమ్ నుంచి బ్లడ్ షుగర్ శాంపిల్స్ వచ్చాయి కదరా! అందులో రెండు శాంపిల్స్ ఒకే పేరుతో ఉన్నాయి.


ఆ రోజు పవర్ లేని కారణంగా ఎనలైజర్ పనిచేయనందున మ్యాన్యువల్‌గా గ్లూకోమీటర్‌తో రీడింగ్ తీశాం కదా, అక్కడే కొంప ములిగింది. ఒక R. రంగారావు వయసు 62, ఆయన డయాబెటిక్ పేషెంట్.


ఆయన బ్లడ్ షుగర్ లెవెల్స్ హైలో ఉన్నాయి. రెండవ పేషెంట్ పేరు కూడా R. రంగారావు, వయసు 26 సంవత్సరాలు. ఆ రోజు డాక్టర్ వేణు బ్లడ్ రిపోర్ట్స్ అర్జెంట్ అనగానే వివరాలు చూడకుండా బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేసినప్పుడు తారుమారై రిపోర్టులు మారిపోయాయి.


అప్పటినుంచి వాళ్లకి డయాబెటిక్ ట్రీట్మెంట్ జరుగుతోంది. ఎనలైజర్ ల్యాబ్ రిపోర్ట్స్ తర్వాత అసలు విషయం బయటపడింది.”


“జరిగిన పొరపాటు డాక్టర్ వేణు గారికి తెలియజేసి, ఇటుపైన జాగ్రత్తగా ఉండి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని వేడుకుందాం. డాక్టరు గారు తప్పక క్షమిస్తారు. పద, వెళ్దాం.”


“సార్, ఇద్దరు పేషెంట్ల పేర్లు ఒకేలా ఉన్నాయి. ఒకరు రావిపూడి రంగారావు (62), రెండవ ఆయన రాళ్లబండి రంగారావు (26). ల్యాబ్ రిక్విజిషన్స్ ఫారం మీద ఇద్దరి పేర్లు R. రంగారావులుగా రాశారు.


ఇదీ జరిగిన పొరపాటు. మన్నించండి సార్!” ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు చేతులు కట్టుకుని నిలబడ్డారు.


“భవిష్యత్తులో మళ్లీ ఇటువంటి పొరపాట్లు జరిగితే ఊరుకునేది లేదు. పని మీద ధ్యానం పెట్టి చేయండి. వెళ్లండి.”


బ్రతుకు జీవుడా అనుకుంటూ ల్యాబ్‌కి చేరుకున్నారు మిత్రులు.


“మిస్టర్ యంగ్ రంగారావు, గుడ్‌లక్. మీరు సక్రమంగా నేను చెప్పినట్టు ట్రీట్మెంట్ వాడి, డైట్ కంట్రోల్ చేయడం వల్ల మీ షుగర్ లెవెల్స్ నార్మల్‌కి వచ్చాయి. మీరు ఇదివరకటిలా నార్మల్ లైఫ్ కొనసాగించవచ్చు. వెళ్లండి.”


“థాంక్యూ, డాక్టర్!”


“రంగారావు గారూ, మీరు నేను చెప్పేవరకు రెగ్యులర్‌గా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ డైట్ కంట్రోల్ చేయండి. వాకింగ్ చేస్తుంటే మామూలు మనిషి కాగలరు. వెళ్లిరండి.”


“పంతులు గారూ, అబ్బాయి బ్లడ్ షుగర్ నార్మల్‌లో ఉందట. చెప్పండి, ఆడపిల్ల వారికి పెళ్లికి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామని” అన్నపూర్ణమ్మ పెళ్లిళ్ల పేరయ్య అవధాని గారితో ముచ్చట్లు పెట్టుకుంది.


“శుభస్య శీఘ్రమ్ అమ్మా! వచ్చేది వైశాఖ మాసమే. భేషైన ముహూర్తాలు ఉన్నాయి” సంతోషం ఒలకబోశారు బోసినోటితో అవధాన్లు గారు.


సమాప్తం



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page