top of page

మధుర స్మృతి



'Madhura Smruthi - New Telugu Story Written By Neeraja Hari Prabhala

'మధుర స్మృతి' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

వేకువనే తన గది కిటికీలోంచి వీచిన చల్లటి గాలులకు మెలుకువచ్చిన శారద కనులు తెరచి దుప్పటి తొలగించి ఆ దిశగా చూసింది. తను ఇష్టంగా పెంచుతున్న రకరకాల పువ్వులు, ఫలముల తోట రమణీయంగా కనిపిస్తోంది. నిత్యం నిద్ర లేవగానే ఆ తోటలో విహరిస్తూ ఆ రమణీయ ప్రకృతిని ఆస్వాదించడం ఆమెకు అలవాటు. కాసేపటికి కాలకృత్యాలను ముగించుకుని శిల్కు శా‌లువాని భుజాన కప్పుకుని వేడివేడిగా ఫిల్టరు కాఫీని తయారుచేసుకుని కప్పుతో తన ఇంటి ముంగిటి తోటలో ఒక బెంచి మీద కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంది.


చేతిలో పొగలు కక్కుతున్న కమ్మనికాఫీని ఆస్వాదిస్తూ తోటలోని సుందర దృశ్యాన్ని చూడటం ఆవిడకు చాలా ఇష్టం. సమీపంలోని మామిడి కొమ్మ మీద కోయిల తన కమ్మని కంఠంతో "కుహు కుహు" సరాగాలను పలుకుతుండగా మధ్య మధ్యలో తను కూడా శృతి కలిపితే అది తనను వెక్కిరిస్తున్నట్లుగా భావించి మరింత రెచ్చిపోతోంది. అలా కాసేపు కోయిలతో జతకలిపాక "నీకు నీవే సాటి కోయిలమ్మా" అని మిన్నకుండి దాని రాగాలను వింటోంది శారద.


ఈరోజు తన పుట్టినరోజు. తన భర్త ఆనంద్ బ్రతికిఉంటే ఈరోజును ఎంత ఘనంగా, వేడుకగా చేసేవాడో అనుకుంటూ గతించిన భర్తను తలచుకుంటూ లేచి తన గదిలోకి వెళ్లి ఆయన వ్రాసిన డైరీని తీసుకొచ్చుకుని, కళ్లజోడుని సవరించుకుంటూ అందులోని పేజీలను తిరగేస్తోంది. ప్రతి పేజి లోను తన మీద ప్రేమను వ్యక్తపరుస్తూ భర్త వ్రాసిన దానిని చదువుతూ గతం తాలూకు మధుర స్మృతులలోకి వెళ్లింది శారద మనసు.


తను కాలేజీలో చదువుతున్నప్పుడు పరిచయమైన ఆనంద్ తో స్నేహం క్రమంగా వాళ్లిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. డిగ్రీ పూర్తవగానే ఆనంద్ కు మంచి ఉద్యోగం రావడంతో తమ ప్రేమ విషయాన్ని ఇరువైపులా పెద్దలకు చెప్పటం జరిగింది. ఆనంద్ తల్లితండ్రులు తమ పెళ్లికి ఒప్పుకున్నారు కానీ తన తల్లితండ్రులు అభ్యంతరం చెప్పటంతో కొంత మనస్ధాపానికి గురయింది తను. తండ్రి పట్టుదలతో ఎన్ని సంబంధాలను తీసుకొచ్చినా తను ససేమిరా కాదనడంతో తన మొండిపట్టుదలను అర్థం చేసుకుని ఆనంద్ తో వివాహం జరిపించారు శారద తల్లితండ్రులు.


పెళ్లయి ఆనంద్, శారదలు క్రొత్త జీవితాన్ని మొదలుపెట్టి సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. తమ ప్రేమకు గుర్తుగా చిన్నారి ప్రవీణ్ పుట్టాడు. అల్లారుముద్దుగా వాడిని పెంచుకుంటున్నారు. శారదకు సంగీతం అంటే ఇష్టమని సంగీతం నేర్పిస్తున్నాడు ఆనంద్. ప్రతిరోజూ సంగీతం మాస్టారు ఇంటికొచ్చి సంగీతం చెప్పటంతో బాబుని చూసుకోవటానికి శారదకు ఇబ్బంది కలగలేదు. ఒకరోజు సాయంత్రం సంగీతసాధన చేస్తున్న శారద ఆనంద్ రాకను గమనించలేదు.


అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన ఆనంద్ శారద వద్దకు వచ్చి "శారదవీణా మధుగీతం..మన సంసారం సంగీతం.." అంటూ రాగయుక్తంగా పాడుతూ శారదను దగ్గరకు తీసుకున్నాడు. సంతోషంతో అతని కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయింది శారద. ప్రతిసం.. శారద పుట్టినరోజునాడు మంచి చీరను కొని భార్యకు కానుకగా ఇచ్చేవాడు ఆనంద్. ఆ తర్వాత భార్యను, ప్రవీణ్ ను తీసుకుని గుడి కి వెళ్లి గుడిలో పూజ చేయించి దారిలో అనాధాశ్రమంలో పిల్లలకు బట్టలు, పండ్లు పంచేవాడు ఆనంద్. ఆరోజంతా పండుగలా గడిచిపోయేది శారదకు.


కాలం సంతోషంగా సాగిపోతోంది. ప్రవీణ్ పెరిగి పెద్దవతున్నాడు. అతను స్కూలులో చేరి చక్కగా చదువుతున్నాడు. శారదాఆనంద్ లు మంచి ఇల్లు కట్టుకున్నారు. ప్రవీణ్ స్కూలు ఫస్ట్ వచ్చాడు. కాలేజీలో చేరి మంచిగా చదువుతూ స్కాలర్షిప్ తెచ్చుకుని ఇంజనీరింగ్ లో కూడా చేరాడు. రోజులు హాయిగా గడుస్తున్నాయి.


సంతోషంగా సాగిపోతున్న వీళ్ల సంసారాన్ని చూసి 'విధికి కన్నుకుట్టిందా' అన్నట్లుగా ఒక రోజున ఆఫీసు నుంచి వస్తున్న ఆనంద్ కు రోడ్ యాక్సిడెంట్ అయింది. ఎవరో చూసి అంబులెన్స్ కు, పోలీసులకు ఫోన్ చేయగా వాళ్లు వచ్చి కేసు నమోదుచేసుకుని ఆనంద్ ని హాస్పిటల్ లో చేర్చారు. అతని ఫోన్ లో నెంబర్ ఆధారంగా పోలీసులు శారదకు కూడా ఫోన్ చేసి విషయాన్ని తెలిపారు. ఫోన్ అందుకున్న శారదకు ఒక్కసారిగా తన కాళ్లక్రింద భూమి కదులుతున్నట్టనిపించింది. వెంటనే తనను తాను నిబ్బరించుకుని ప్రవీణ్ ను తీసుకుని హాస్పిటల్ కు వచ్చింది శారద.


స్పృహ లేకుండా పడి ఉన్న భర్తను చూసి తల్లడిల్లిపోయారు శారద, ప్రవీణ్ లు. ఆనంద్ ను బ్రతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నం శూన్యమై ఆనంద్ శాశ్వతంగా కన్నుమూశాడు. జరిగిన దారుణానికి గుండెలవిసేలా ఏడ్చింది శారద. ప్రవీణ్ పరిస్థితి కూడా అంతే. నెమ్మదిగా తమకు తామే మనసును నిబ్బరించుకుని ఆనంద్ భౌతికకాయాన్ని ఇంటికి తెచ్చి జరగవలసిన కార్యక్రమాలను జరిపించింది శారద. తనకు చేతనైనంతలో ధైర్యం చెబుతూ తల్లిని ఓదారుస్తున్నాడు ప్రవీణ్. రోజూ కాలేజీకి వెళ్లి వస్తున్నాడు ప్రవీణ్.


కాలమే అన్ని గాయాలను మానుస్తుంది. క్రమంగా శారద, ప్రవీణ్ లు తమ మనసులను నిబ్బరించుకుంటూ మామూలు మనుషులవుతున్నారు. శారద చుట్టుప్రక్కల పిల్లలకు సంగీతం ప్రైవేట్లు చెబుతోంది. ప్రవీణ్ చదువు పూర్తయి మంచి కంపెనీలో ఉద్యోగాన్ని కూడా పొందాడు. శారద ప్రవీణ్ కు మంచి సంబంధం చూసి రేణుకతో వివాహం జరిపించింది. ప్రవీణ్, రేణుకలు అన్యోన్యంగా సంసారం చేసుకుంటున్నారు. రెండేళ్ల తర్వాత ప్రవీణ్ కు కొడుకు పుట్టాడు. తన భర్తే మరలా మనవడి రూపంలో వచ్చాడని మురిసిపోయింది శారద. ఆ పిల్లవాడికి 'ఆనంద్ శాయి' అని పేరుపెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు రేణుకాప్రవీణ్ లు. వాడు క్రమేపీ పెరుగుతూ తన ముద్దుముద్దు మాటలతో అందరినీ అలరిస్తున్నాడు.


శారదకైతే మనవడే లోకం. వాడి ఆటపాటలు‌, వచ్చీరాని ముద్దు ముద్దు మాటలతో తనను తాను మైమరచిపోతుంది. వాడు కూడా "నానమ్మా" అంటూ ఆవిడ చేయి పట్టుకుని తిరుగుతూ కధలు చెప్పమని గోలచేస్తాడు. శారద వాడిని మురిపెంగా ఎత్తుకుని రకరకాల కధలు చెబుతూ ఉంటుంది. తన భర్త ఉంటే ఇవన్నీ చూసి సంతోషంతో పొంగిపోయేవాడుకదా! అనుకుంటూ ఉంటుంది రోజూ శారద.


ఎవరో వస్తున్న చప్పుడైతే తృళ్లిపడింది శారద. ఎదురుగా పరిగెత్తుకొస్తున్న ఆనంద్ శాయి, వాడి వెనకాలే ప్రవీణ్, రేణుకలు. "నానమ్మా! పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ వాడు వచ్చి ఆవిడను హత్తుకున్నాడు. వాడిని ఎత్తుకుని ముద్దిచ్చింది శారద. ప్రవీణ్, రేణుకలు కూడా శారదకు నమస్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమగా వాళ్లని దగ్గరకు తీసుకొంది శారద.


"అమ్మా! నీ పుట్టినరోజు సందర్భంగా ఎప్పటిలాగే గుడికి వెళ్లి పూజ చేయిద్దాం. వస్తూ దారిలో అనాధాశ్రమంలో పిల్లలకు బట్టలు, పండ్లు పంచుదాం. అన్ని ఏర్పాట్లు చేశాను. గుడికి రెడీ అవ్వమ్మా! వెళ్లొద్దాం" అన్న ప్రవీణ్ మాటలకు నెమ్మదిగా లేచి భర్త డైరీని తీసుకుని ఇంట్లోకి వెళ్లి దాన్ని పదిలంగా దాచి పదినిమిషాలలో తను తయారై కొడుకు, కోడలు, మనవడితో సంతోషంగా గుడికి వెళ్లి పూజలు చేయించింది శారద. దారిలో అనాధాశ్రమంలోని పిల్లలకు బట్టలను, పండ్లను పంచింది శారద. చిన్నారి ఆనంద్ శాయి కూడా కొన్నిటిని పంచాడు. అది చూసి చాలా సంతోషించింది శారద.


ఆనందంగా అందరూ ఇంటికి చేరి హాయిగా గడిపారు.


.. సమాప్తం.

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏



70 views0 comments
bottom of page