top of page

మధ్యతరగతి సంసారం


'Madhyatharagathi Samsaram' New Telugu Story

Written By Neeraja Hari Prabhala

'మధ్యతరగతి సంసారం' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


"సుజీ! బ్రేక్ఫాస్ట్ రెడీనా? ఆఫీసుకు టైమవుతోంది." అడిగాడు రమణయ్య భార్య సుజాతను. "రెడీ! రండి!" అంది సుజాత. రమణయ్య హడావుడిగా వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. ఇంతలో "అమ్మా! కాలేజీకి టైమవుతోంది. టిఫెన్ రెడీనా?" అంటూ కేకేసినంత పని చేశారు కిరణ్, దీపలు. "అబ్బబ్బ! రెడీనేరా! రండి! నిద్ర లేచిన మొదలు ప్రతిరోజూ నాకు హడావిడి" అంది సుజాత. వాళ్లు రాగానే అందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టి తనూ తీసుకుంది. అందరూ తినేసి హడావుడిగా వాళ్లు బయటకు వెళ్లారు. వాళ్లు వెళ్లగానే మిగిలిన పనిని పూర్తి చేసింది సుజాత. ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న రమణయ్య భార్య సుజాతతో, కొడుకు కిరణ్, కూతురు దీపతో తనకు పెద్దలిచ్చిన ఇంట్లో గౌరవంగా బ్రతుకుతున్నాడు. కిరణ్ ఇంజనీరింగ్ ఆఖరి సం.., దీప డిగ్రీ మొదటి సం… చదువుతున్నారు. రోజులు గడుస్తున్నాయి. కిరణ్ కు ఆఖరి సం… కాంపస్ సెలక్సన్స్ లో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ శుభవార్త విని ఇంట్లో అందరూ సంతోషించారు. కిరణ్ చదువు పూర్తవగానే ఉద్యోగంలో చేరాడు. రెండు సం…తర్వాత కిరణ్ కు పెళ్లి సంబంధాలను చూద్దామని ప్రయత్నాలు మొదలు పెట్టగానే తన ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు కిరణ్. తను, తన సహోద్యోగి రేణుక ప్రేమించుకుంటున్నాము అని, మీ ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుంటామని అన్నాడు. ఒక రోజున రేణుకను తీసుకొచ్చి తల్లితండ్రులకు పరిచయం చేశాడు కిరణ్. రేణుక ఈ కాలపు ఆధునిక భావాలు కలిగిన పిల్ల. మర్యాద కోసం అన్నట్లుగా పలకరించి ముభావంగా ఉంది. క్రొత్త పిల్ల అని సుజాతే కలుపుగోలుగా సంభాషించింది. ఆమె వెళ్లినాక వాళ్ల తల్లిదండ్రులను సంప్రదించారు రమణయ్యా వాళ్లు. వాళ్లు పెళ్లికి సంతోషంగా అంగీకరించారు. ఒక శుభ ముహూర్తాన కిరణ్, రేణుకల పెళ్లి జరిగింది. రేణుక కాపురానికి వచ్చింది. ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం, అత్తామామలంటే గౌరవమర్యాదలు లేని రేణుక నడవడి మనసుకి కొంత బాధ కలిగించినా కొడుకు, కోడలు సంతోషంగా ఉంటే చాలని తన మనసుకు సర్దిచెప్పుకుంది సుజాత. రేణుక కూడా ఉద్యోగస్తురాలు అవడంతో సుజాతకు ఇంకా పని ఎక్కువైంది. తనకు దీప ఎంతో రేణుక కూడా అంతే అనుకుని ఆఫీసు వేళకి అన్నీ సక్రమంగా ఉండేట్లు చూసేది సుజాత. కొంత కాలానికి సుజాతకి బాగా నీరసంగా ఉండడంతో పని అలసట అనుకుంది. కానీ ఒకసారి గుండెల్లో బాగా నొప్పి అనిపించడంతో సుజాతని తీసుకుని హాస్పిటల్ కు వెళ్లాడు రమణయ్య. డాక్టర్లు సివియర్ హార్ట్ఎటాక్ అని వెంటనే చికిత్స చేసి ఆమెని కాపాడారు. అంతే కాదు ఆమెకు వాల్వు ఒకటి పాడయింది, వెంటనే స్టంట్ వేయాలని వేశారు. ఆమెకు ఈసారి హార్ట్ఎటాక్ వస్తే ప్రాణానికే ప్రమాదం. బాగా విశ్రాంతి అవసరం" అని పదిరోజులు హాస్పిటల్ లో ఉంచి మందులిచ్చి పంపారు. విషయం తెలిసి దీప కాలేజీ నుండి హుటాహుటిన వచ్చి తల్లిని చూసి బాధపడింది. ఆ పది రోజులు హాస్పిటల్ లో తల్లిని కనిపెట్టుకుని సపర్యలు‌ చేసి ఇంటికి తీసుకొచ్చింది. తల్లికి బాగాలేదని తెలిసి కిరణ్ దంపతులు హాస్పిటల్ కు వచ్చి చూసి వెళ్లారు. ఏదో మొక్కుబడిగా అన్నట్లుగా ఉన్న వాళ్ల ప్రవర్తన సుజాత మనసుకు బాధ కలిగినా మిన్నకుంది. సుజాత ఇంటికి రాగానే చాలా విశ్రాంతి అవసరమని డాక్టరు చెప్పిన విషయాన్ని ఇంట్లో అందరికీ దీప పదేపదే గుర్తుచేసింది. ఉదయం నిద్ర లేచిన మొదలూ గలగలా తిరుగుతూ తమ అందరికీ అన్నీ అమర్చిపెట్టే సుజాత ఇప్పుడు ఇలా అనారోగ్యంతో విశ్రాంతి తీసుకోవడం అంటే రమణయ్య మనసులో చాలా బాధపడ్డాడు. పెళ్లైన నాటి నుండి ఇన్నేళ్లు తమ కోసం కష్టపడిన భార్యకు ఈవిధంగానైనా కాస్త విశ్రాంతినిచ్చి ఆమె మనసుని సంతోషపెడదామనుకున్నాడు కానీ ఆఫీసులో పని ఒత్తిడి, నిత్యం హడావుడితో తను భార్యకి ఏమీ చేయలేని నిస్సహాయత. అదే మాట సుజాతతో చెప్పాడు రమణయ్య. భర్త పరిస్థితిని గమనిస్తున్న సుజాత ఆయన బాధను అర్ధం చేసుకున్నదై "అయ్యో! మీరేమీ దిగులు పడద్దు. ఇది కొన్ని రోజులు విశ్రాంతి మాత్రమే. మరలా నేను హాయిగా తిరుగుతాను. ప్రస్తుతానికి మీరు ఎవరినైనా పనిమనిషిని పెట్టండి చాలు" అంది సుజాత. దీపకు డిగ్రీ ఆఖరిసం… పరీక్షల హడావుడిలో ఆమె తనమునకలవుతూ తల్లిని పలకరిస్తోందే కానీ ఏమీ చేయలేకపోతోంది. సుజాత విశ్రాంతి కిరణ్, రేణుకలకు చేయి విరిగినట్లయింది. ఇప్పుడు ఆభావాన్ని బయట పెడితే అత్తగారికి ఎక్కడ చేయాల్సొస్తుందోనని తెలివిగా మిన్నకుంది రేణుక. టిఫెన్, భోజనం తదితరాలు వాళ్లిద్దరికీ ఆఫీసులో అమిరేట్లు ఏర్పాట్లు చేసుకున్నారు రేణుక దంపతులు. మధ్యతరగతి కుటుంబం, తన సంపాదన అంతంతమాత్రంగానే ఉన్నా కుటుంబపెద్దగా అన్నిటినీ ఇన్నేళ్లు సమర్ధవంతంగా నిర్వహించాడు రమణయ్య. ఏనాడూ కిరణ్, రేణుకలు ఒక్క రూపాయి కూడా ఇంటికిందకి వాడలేదు. తను కూడా ఏనాడూ వాళ్లని అడగలేదు. సంసారాన్ని గుంభనంగా లాక్కొచ్చారు రమణయ్య, సుజాతలు. ఇప్పుడు భార్య హస్పిటల్, అనారోగ్యం ఖర్చులు కూడా తోడయ్యాయి. పనమ్మాయిని పెట్టుకునే స్ధోమత తనకు లేదని గ్రహించి కొడుకునీ‌‌, కోడల్ని పిలిచి కూర్చోపెట్టి విషయాన్ని వివరించాడు రమణయ్య. అంతా విని కిరణ్ " నాన్నా! ఇటీవల మేమ లోను తీసుకుని ఒక ప్లాటును కొనుగోలు చేశాము. మా ఇద్దరి సంపాదన దానికి సరిపోతుంది. ఇంక మేము ఇంటికి ఏమీ ఇవ్వలేము. మీరు ఇంతగా అడుగుతున్నారు కనుక మా వలన ఇబ్బంది అయితే మేము ఏదన్నా చిన్న ఇల్లు చూసుకుని వేరే వెళ్తాము" అని నిక్కచ్చిగా చెప్పాడు కిరణ్. తనదీ అదేమాట అన్నట్టు రేణుక తలూపింది. కొడుకు మాటలను విన్న రమణయ్య ఒక్కసారిగా మ్రాన్పడిపోయాడు. వాళ్లకి ఇంటికి డబ్బులు ఇవ్వదలుచుకుంటే ఏమంత కష్టం కాదు. ఈ వంకతో అన్నా వాళ్లు వేరే కాపురం పెట్టాలనే ఆలోచన మనసుకు బాధను కలిగించింది. "అయ్యో! అదేంటిరా! అలా అన్నావు? ఇంటి పరిస్థితి వాస్తవం చెప్పాను. మాతో పాటే మీరు. మీరేం పరాయివాళ్లా? మనమంతా ఒక కుటుంబం. మీరేమీ నాకు భారం కాదురా! మీరు వెళ్లి మీపనులు చూసుకోండి." అని వాళ్లని ఆఫీసుకు పంపించాడు రమణయ్య. ప్రాణంగా పెంచుకున్న కొడుకు దూరమవడం ఇష్టం లేదు రమణయ్యకు. వీళ్ల మాటలు సుజాతకు తెలిస్తే ఆమె మనసు ఇంకా బాధపడుతుందని మిన్నకున్నాడు. తన ఆఫీసులో ఎవరి వద్దన్నా కొంత అప్పు చేసి ఇల్లు నడిపితే కొన్నాళ్లలో దీపకు ఎక్కడన్నా ఉద్యోగం వస్తుంది. అప్పుడు ఇంక ఇబ్బందులు ఉండవు అనుకున్న రమణయ్య తన సహోద్యోగి వద్ద కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాడు. సుజాతకు సాయంగా ఉండేటట్లు, ఇంట్లో పనికీ ఒక పనిమనిషిని నియమించాడు రమణయ్య. ప్రస్తుతం ఏ ఇబ్బందులు లేకుండా సంసారం సాగుతోందని, సుజాత సంపూర్ణ ఆరోగ్యవంతురాలవాలని, త్వరలో దీపకు మంచి ఉద్యోగం రావాలని మనసులోనే దేవుడికి నమస్కరించాడు రమణయ్య. …..సమాప్తం.

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసంమేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏97 views0 comments

댓글


bottom of page