top of page

మహా వృక్ష ఛాయ


'Maha Vruksha Chaya' - New Telugu Story Written By Poorna Kameswari vadapalli

Published In manatelugukathalu.com On 27/12/2020

'మహా వృక్ష ఛాయ' తెలుగు కథ

రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి


“హలో ఎవరండీ? ఎక్కడనుంచి మాట్లాడుతున్నారు?” నెంబరు కొత్తదవ్వడంతో అడిగింది అప్పుడే ఆఫీసుకు చేరుకున్న మాలిక.


“నేను కిరణ్ ను, ఈపీ సెక్షనులో పని చేస్తున్నాను. జ్ఞాపకమొచ్చిందా?”


“మన ఆఫీసులోనా? నేనెప్పుడూ చూడలేదే? ఓహో ఈపీ సెక్షనా, ఎప్పటినుంచి మీరు యీ డిపార్ట్మెంట్లో వున్నారు, కొత్తగా వచ్చారా?”


“మీరు ఈ డిపార్టుమెంటులో జాయిన్ అవ్వకముందు నుంచే నేను ఇక్కడ పనిచేస్తున్నాను. మీరు నాకు తెలుసు. పరిచయం చేసుకుందామని ఫోన్ చేశాను” అన్నాడు కిరణ్.


“ఓహ్, అలాగా. నైస్ టాకింగ్ టూ యు. వాట్ కెన్ ఐ డు ఫర్ యు?” గంభీర స్వరంతో అడిగింది ఫైల్లోకి చూస్తూనే.


“ఏమీ లేదండీ. ఊరికే పరిచయం చేసుకుని స్నేహంగా వుందామనీ. మొన్న ఫేస్-బుక్ లో కూడా ఫ్రెండ్ రిక్వెస్టు పంపాను” ఓ పక్క నసుగుతూనే మరో వైపు ఉత్సాహ భరిత స్వరంతో అన్నాడు.


“ఓ షూర్, వై నాట్. ఇప్పుడు ఒకే డిపార్ట్మెంట్, అని తెలిసింది కదా. ఎప్పుడైనా కలుద్దాం లెండి. ఫేసు-బుక్ లో నాకు తెలియని వారితో నేను మాట్లాడడానికి ఇష్టపడను. అంచేత ఆమోదించి వుండనులెండి. ఓకే.సి యూ లేటర్” అంటూ సంభాషణ ముగించేసి ఫోను పెట్టేసింది.

******


“మా అమ్మాయి పెళ్లి సర్ , ఆఫీసులో అందరకీ పంచుదామని తెచ్చాను. ఇదిగో గీతా” అందిస్తూ అంది మైథిలి. అసలు పెళ్ళికి రాని గీతకు, రాలేక పోయానని కూడా చెప్పని సుజనకూ ఇచ్చి, పక్కనే ఉన్న మాలికను చూసి మొహం తిప్పుకుని వెళ్ళిపోయింది.


“మీకు ఆవిడ తెలియదా, మీకు ఇవ్వలేదేమిటీ? పెళ్ళికి కూడా పిలవలేదా?” స్వీట్ అందుకున్న సుజన ఆరాలు తీస్తూ వ్యంగ్యంగా అడిగింది మాలికను.


మైథిలి వైఖరి బోధ పడ లేదు. సుజన వ్యంగ్యం వెనుక కారణమూ అర్ధంకాలేదు మాలికకు.

“ఇవ్వన్నీ ఆవిడని అడగవలసిన ప్రశ్నలు సుజనా. ఆవిడ వెళ్ళేదాకా ఊరుకుని ఇప్పుడు నన్ను అడుగుతావేంటోయ్?” చురక పెడుతూ బదులిచ్చిందేకానీ, మాలిక మనసు బాధ పడకమానలేదు.

మైథిలి కూతురి పెళ్లి శుభలేఖ ఇచ్చాక, అదే ముహూర్తానికి మా బావగారి అబ్బాయి పెళ్ళికి ఊరు వెళుతున్నాను కనుక రాలేనని, నా ఆశీశ్శులు అంటూ ఆవిడ సీటుకు వెళ్లి మరీ గిఫ్ట్ కవర్ ఇచ్చినప్పుడు కూడా బాగానే మాట్లాడిందే. ఏమో, ఆవిడకేమి ఇబ్బందో అనుకుని పెద్ద

పట్టించుకోలేదు.

******

“మాలికా, నీ గురించి చాలా తప్పుగా మాట్లాడుకుంటున్నారు. ఆఫీసంతా గుసగుసలు. నువ్వు, ఆ కిరణుతో చనువుగా మాట్లాడుతున్నావుట, రోజూ బండిమీద షికార్లకెళుతున్నావుట. మీ మధ్య ఏవేవో జరుగుతున్నాయంటూ అందరూ చాలా రకాలుగా అసభ్యకరమైన మాటలు మాట్లాడుకుంటున్నారు. కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. నీ శ్రేయోభిలాషులుగా చెపుతున్నాము. వాడు ఒట్టి దుర్మార్గుడు. వాడితో ఎలాంటి మాటలూ వద్దు. వాడితో జాగ్రత్తగా ఉండమ్మా” అని సున్నితంగా హెచ్చరించారు ఆఫీస్ సూపరింటెండెంట్ నవనీతంగారూ మరియు టైపిస్టు చంద్రకళ.


“అసలు మీరేమంటున్నారో అర్ధంకావట్లేదు మేడం!!” అంటూనే ఆలోచనలో పడింది. వాళ్ళు చెప్పినది కొంత మాత్రమే. అంతకు మించిన ఘాటైన పుకార్లే దొర్లుతున్నట్టు వాళ్ళని చూస్తే అర్ధంకాక పోలేదు మాలికకి. ఉదయం మైథిలి వైఖరికి కూడా ఇదే కారణమన్నమాట అని ఇప్పుడు అర్ధమయ్యింది.


ఒక్క క్షణం చలనం కోల్పోయినట్టు తలూపి, బేలగా నడవ సాగింది. కాళ్ళ కింద భూమి లాగేసినట్టైయింది. అందుకే కాబోలు రోజూ మాట్లాడే సుజాత తప్పించుకుంటూ వెళ్లిపోతోందనుకుంది.


“నేనేదైనా తప్పు చేసానని నమ్మితే, అది నిజమోకాదోనని తెలుసుకోవద్దూ? అందులో అధారాలు ఉన్నాయో లేవో తెలుసుకోకుండా నిన్నటి దాకా స్నేహంగా ఉంటున్న వ్యక్తిని ఇలా అవమానించడం సాటి స్త్రీలకు సంస్కారమా?” మనసులోనే తర్కించింది. బాధపడి ఉప్పొంగుతున్న కన్నీళ్లను బలవంతంగా ఆపేస్తూ, మరు నిముషమే తన సహజ గుణమైన ధైర్యాన్ని కూడగట్టుకుని, దీనికి ఫుల్స్టాప్ పెట్టాలి అని గట్టిగా అనుకుంది.

******

ఒక స్త్రీని వేధించి ఎదుర్కోలేనివాడు, వాడి అహాన్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఆమె గౌరవాన్ని దెబ్బతీయడమే ధ్యేయంగా పెట్టుకుని కుతంత్రాన్నే ఆయుధంగా ఉపయోగిస్తాడు. అలాంటి పరిస్థితి తనకు ఎవరితో తారసపడిందా అని ఆలోచిస్తే, వెంటనే తళుక్కుమని ఆ అవాంఛనీయ

సంఘటన జ్ఞాపకం వచ్చింది. ఐదేళ్ల ఆడపిల్లైనా, మూడేళ్ళ మొగ పిల్లాడికి లోకువేనన్నట్టు, ఇదంతా ఆ కిరణ్ పన్నాగం కాబోలు అనుకుంది.


ఒక్కసారి వెన్నక్కి వెళ్లి కిరణ్ తనతో జరిపిన సంభాషణను పొల్లు పోకుండా జ్ఞాపకం చేసుకుంది.


“మాలికా, మొన్న మీరు ప్యూను రాజన్న సమస్యకు యిచ్చిన పరిష్కారం ప్రత్యక్షంగా విన్నాను. నాకూ మీ సలహా కావాలి. నా వ్యక్తిగత సమస్యలు మీతో చెప్పి తగిన గైడెన్స్ పొందాలి. కేన్ ఐ?” అన్నాడు.


“వైనాట్? ఎవరికి సహాయపడానికైనా ఎప్పుడూ నేను సిద్ధమే. మనం ఒకే ఆఫీసులో పని చేస్తున్నాము. ఒకరికొకరు సహాయపడడంలో తప్పేముంది? ప్లీస్ టెల్ మీ” తన సహజ ధోరణితో అంది.


“నా కథ మీకు చెప్పాలి. నేను ఆఫీసులో చేరినప్పటి నుంచి ఎంతో మందిని చూసాను. ఇన్నేళ్ల నా జీవితంలో ఎవ్వరితోనూ ఇలా మాట్లాడాలనిపించలేదు. భర్తకు దూరమైన విజయ నా సాన్నిధ్యాన్ని కోరి నన్ను పెళ్లి చేసుకోమని కోరింది. నాకు అలాంటి వుద్దేశ్యంలేక, ఖచ్చితంగా

నా అయిష్టం తెలిపాను. ఎందుకో మీతో నా మనసులోని మాటను పంచుకోవాలనిపిస్తోంది”.


“పరుల గుంరించి వద్దు, మీ వ్యక్తిగత విషయం అన్నారు, దాని గురించి చెప్పండి, మీ సమస్య చెప్పండి” అంది మాలిక.


“ఐ యామ్ ఎ డైవొర్సీ. నాకు తోడు కావాలి. నేను ఒంటరిని, నాకు మీరు తోడవుతే.... మీరు వివాహితులని తెలుసు, అయినా నా మనసు నిన్నే అనబోయి గొంతు సవరించుకుంటూ మిమ్మల్నే కోరుతోంది. మిమ్మల్ని చూసినప్పటినుంచి నా మనసు మనసులో లేదు. ఐ ఆల్వేస్

వాంట్ ది బెస్ట్. వి షాల్ కీప్ ఇట్ డిస్క్రీట్” అన్నాడు.


కళ్ళు చింతనిప్పులవ్వగా “జస్ట్ మైండ్ యువర్ టంగ్. మీకు వ్యక్తిగత సమస్యలు ఉంటే సలహా అన్నారు. సరేనని మాట్లాడుతుంటే, ఇలా అసభ్యంగా మాట్లాడే మీ (కు)సంస్కారం అర్ధమయ్యింది. మరొక సారి ఇటువంటి మాటలకు నా వద్ద తావులేదని గ్రహించ గలరు. మరొకసారి ఇలాంటి ప్రస్తావనలతో నా జోలిక వచ్చే ధైర్యం చెయ్యవద్దని హెచ్చరిస్తున్నాను. టేక్ దిస్ యాస్ మై స్ట్రిక్ట్ వార్నింగ్ బిఫోర్ ఐ టేక్ ఇట్ టు ది అడ్మినిస్ట్రేషన్” అని విసవిసా వెళ్ళిపోయింది.


ఫోన్ చేసాడు, పరిచయమన్నాడు, స్నేహం అంటూ సమస్యకు సలహా కోరాడు. సాటి మనిషిగా, న్యాయ నిపుణురాలిగా, నిజాయితీ గల అభ్యర్ధన అని నమ్మి జాలిపడి వినదలచితే, వక్రించిన దుష్ప్రవర్తన ఎదురయ్యింది.


ఆ తరువాత పలుసార్లు ఆమె వంటరిగా వున్నప్పుడు ఫైలు ఇస్తున్న నెపంతోనో, మరోవిధంగానో అసభ్యకరంగా వ్యవహరించడం, పలు రకాలుగా వేధించడం జరిగింది. ఐతే, ఇలాంటి విషయాలు పైకి మాట్లాడడానికి ఇష్టపడని సగటు స్త్రీగా, పట్టించుకోకుండా వదిలేసింది,


వీలున్నప్పుడల్లా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనేవుంది. భాగోద్వేగ ప్రతిచర్య కంటే సానుకూల ఆలోచనలే ఎప్పుడూ ఆశించిన ఫలితాలనిస్తాయని మాలిక నమ్మకం. అంచేత, రభస చేయడమో, గట్టిగా మాట్లాడడమో చేయలేదు.

******


తెలివితేటలతో బాటు సమయస్ఫూర్తి గల మాలికకు, ఆపై ఏమి జరిగుంటుందో ఊహించుకోవడం పెద్ద కష్టమేమి కాలేదు. తీగ లాగితే డొంకంతా కదుల్తుంది. సమస్య ఎక్కడ మొదలయ్యిందో తెలిసింది కాబట్టి, రాయి విసరాల్సింది అక్కడికే. ఒక రోజంతా అలోచించగా, చక్కటి పరిష్కారం చిక్కింది. వెంటనే తక్షణ కర్తవ్యంలోకి దిగింది. హుషారుగా రోజు ప్రారంభించింది.


“ఏవండోయ్. ఒక కొత్త చిక్కుముడిని విప్పడానికి మంచి అవకాశం వచ్చింది” నవ్వుతూ భర్త కార్తీక్ కు కాఫీ ఇస్తూ అంది.


“వంద చిక్కుముడులు విప్పే సమర్ధత నీకుంది డియర్, దానికి తోడు లా డిగ్రీ ధర్మమాని న్యాయశాస్త్ర నైపుణ్యం, గో ఎహెడ్” అన్నాడు నవ్వుతూ. ఆఫీసు సమస్యలు ఇంటికి మోయడం అలవాటులేదు మాలికకు. అలాగే అనవసర విషయాలు ఆరాలు తీయడు కార్తీక్ . ఎట్టి

సమస్యనైనా చాకచక్యంతో ఎదుర్కోగలదనే నమ్మకమే దానికి కారణం కాబోలు. వారి స్నేహమే ఆ దాంపత్యానికి బలం.


ఉద్యోగానికి ఏమాత్రమూ అవసరము లేకపోయినా, తనకెంతో ఇష్టమైన కారణంగా కష్టపడి లా చదివింది మాలిక. ఆ విద్యాబలంతో , ఇప్పుడు అందులోని మెళకువలను అనునయించుకుని తెలివితేటలతో తనపై ఆరోపించబడిన నిందలను ఎదుర్కోవాలనుకుంది. కార్యాలయంలో అట్టి

అసహ్యకరమైన వాతావరణం సృష్టించిన అపరాధులైనవారికి తగిన శాస్తి చెప్పాలనుకుందే కానీ వాళ్ళ ప్రవర్తనలకు కుంగి పోయి మనసు పాడు చేసుకునే తత్వంకాదు మాలికది. ఈ పుకార్లకు మూలం కనిపెట్టి ఆ తరువాత తగిన చర్య తీసుకోవాలని గట్టిగా నిశ్చయించుకుంది.


కార్యాలయంలో మహిళల లైంగిక వేధింపులు (నివారణ, నిషేధం మరియు పరిష్కార)చట్టం,2013 చట్టాన్ని తీసి అందులోని ముఖ్యాంశాలను చదివి మననం చేసుకుంది.


సుప్రీం కోర్టు 13/8/1997న ఇచ్చిన విశాఖ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ అనే కేసు తీర్పులో సూచించిన సూచనల మేరకు ఈ చట్టాన్ని 2013లో తీసుకు వచ్చారు. ఈ చట్ట ముఖ్య ఉద్దేశ్యమేమిటంటే మహిళను గౌరవనీయంగా పనిచేసుకోనివ్వకుండా అంతరాయం కలిగించడం రాజ్యాంగంలోని 14, 15, 21 అధికరణాలకు విఘాతం అని, రాజ్యాంగ హక్కులు ఉల్లంఘన కలగకుండా వారిని సంరక్షించాల్సిన భాధ్యత ప్రభుత్వం పై వుందని తెలియజేస్తుంది.


******

ఎన్ని చట్టాలున్నా, సమాజంలో స్త్రీకి జరిగే అగౌరవాన్ని పూర్తిగా నిరోధంచలేవు. కావున, అధికారిక ఫిర్యాదు చేయడం కంటే, మొట్టమొదటి అడుగుగా, స్వయంగానే డీల్ చెయ్యాలనుకుంది. రభస కాకుండా తగిన బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుంది. ఒక వార్నింగ్ మెసేజ్ తయారు చేసి పంపింది.


"మిస్టర్ కిరణ్, గౌరవంగా ఆఫీసులో ఉద్యోగం చేసుకుంటున్న నాపై అసభ్యకరమైన అభియోగాలు మోపి, పుకార్లు పుట్టించి నా గౌరవానికి భంగం కలుగచేస్తున్నారు. అందుకు మూలకారణమైన మీ మీద క్రమశిక్షణ చర్య తీసుకోమని యాజమాన్యాన్నిఅభ్యర్ధించవలసిన పరిస్థితి రాకుండా

మీరు సరి చేయగలరని హెచ్చరిస్తున్నాను. 15 రోజులలో, సమస్య మొదలైన చోటనే అంతం కాని పక్షంలో, ఎంక్వయిరీని పెట్టి వారినే నిర్ణయం తీసుకోమని అభ్యర్ధన పత్రం ఇచ్చుటకు నిశ్చయించుకున్నాను. చదువుకుని బాధ్యత గల ఉద్యోగంలోనున్న, మీకు చట్టాలను వివరించవలసి అవసరం లేదని భావిస్తున్నాను. నా వ్యక్తిగత విచారణలో దొరికిన సాక్ష్యాలు నేను మేనేజ్మెంట్ కు అందజేయ వలసిన పరిస్థితి రానివ్వరని భావిస్తున్నాను. ఇది కేవలం సంబంధితులకు నేనిచ్చే చివర అవకాశమే తప్ప, నా అసమర్ధతకు సంకేతం కాదని అర్ధంచేసుకుంటే అందరికీ మంచిది. గడువులోపు పరిస్థితి అదుపులోకి రాని పక్షాన, యాజమాన్యానికి సాక్ష్యాధారాలతో సహా లిఖితపూర్వమైన ఫిర్యాదు అందడం ఖాయం. అట్టి పరిస్థితి వస్తే, వాళ్ళ ఎంక్వయిరీలో మరిన్ని విషయాలు బయటపడి మీ ఉద్యోగానికే ముప్పు వస్తుందని నేను చెప్పక్కర్లేదనుకుంటాను."

*****

దొంగకు తేలుకుట్టినట్టై, మాలిక ఊహించినట్టే జరిగింది.


మాలిక దగ్గరకు వచ్చిన విజయ, “మేడం, నన్ను క్షమించండి. కిరణ్ ద్వారా సృష్టించబడ్డ అబద్ధాలతో మీపై మరిన్ని తప్పుడు పుకారులు ఆఫీసులో అందరికీ చేరవేసి, చర్చించి మీ గౌరవాన్ని భంగపరిచేలా ప్రవర్తించాను. మీ గురించి అందరు పరుషంగా మాట్లాడే విధంగా నేనే

చేసాను. నన్ను క్షమించండి. జరిగినది సరిదిద్దే పూచీ నాది మేడం. నాకు పిల్లలు వున్నారు, నా ఉద్యోగానికి ఇప్పుడు ముప్పు వస్తే మా కుటుంబం రోడ్డున పడుతుంది, దయచేసి మీరు ఫిర్యాదు చెయ్యద్దు. ఒంటరినైన నన్ను పెళ్ళి చేసుకుంటానని ఆశ పెడితే, సాటి స్త్రీ అని కూడా

ఆలోచించకుండా, బలహీన క్షణాల్లో మీకు హాని తలపెట్టడానికి కూడా సిద్ధపడ్డాను. నాకో తోడు పిల్లలకు ఒక తండ్రి, నీడ దక్కుతుందని ఆశ పడ్డాను. నేనూ మోసపోయాను. మిమ్మల్నీ బాధ పెట్టాను. నన్ను మన్నించండి” అంటూ ప్రాధేయపడింది.


“ఇవిగో, అతడు మీ మీద కల్పించి నా సహాయంతో పుట్టించిన పుకార్లకు సాక్ష్యాలు. మార్ఫింగ్ చేసి మిమ్మల్ని మరింత వేధించాలని తీసిన ఫొటోలు. ఇప్పుడు మిమ్మల్ని నేరుగా ఎదుర్కునే ధైర్యంలేక, మొహం చెల్లక నాకు అందచేసాడు”, అని చేతిలో పెట్టి వెళ్ళిపోయింది.


“ఐ యాం సారీ ఫర్ మై బిహేవియర్” అనడం తప్ప మరో దారి లేకపోయింది కిరణ్ కి.

*****


“హ్యాపీ న్యూ ఇయర్ మాలికా..” ఎప్పటిలాగానే ఎంతో ఉల్లాసంగా విష్ చేసిన మైథిలిని చూసి నవ్వుకుంది మాలిక.


“నాకో సాయం చెయ్యాలి మేడం” వ్యంగ్యానికి బదులుగా అభ్యర్ధిస్తూ అడుగుతున్న సుజనను చూసి ఆశ్చర్యం వేయలేదు మాలికకు. మనుషుల నైజమంతే కదా అనుకుంది. కామంతో కళ్ళు మూసుకుపోయి, ఆడవాళ్లను ఆటవస్తువులుగా జమకట్టి అసభ్యంగా ప్రవర్తిస్తూ మోసం చెయ్యాలనుకునే కిరణ్ లాంటి కొందరు మగవాళ్ళున్న ఇదే సమాజంలో, సాటి స్త్రీ గురించి తేలిక భావనతో అభాండాలను వేసి పుకార్లను ప్రచారం చేసే స్త్రీలు వుండడం దురదృష్టకరమని బాధపడింది.


మాయమైన పుకార్లు, మారినట్టు నటిస్తున్న మనుషులను చూసి ఆశ్చర్యం కలుగలేదు. నవ్వే వచ్చింది. మనిషి నిజాయితీ కంటే మోసగాడి మోసాన్నే నమ్ముతారు ఇలాంటి వారు.

*****


అందంగా అలంకరించబడిన వేదిక. మొదటి వరుసలో ముఖ్య అతిథి పక్కనే కూర్చున్న కార్తీక్...


“విత్తనం మట్టిలో ఉండగానే చీమలూ, పురుగులూ దాన్ని తినేయాలని చూస్తాయి. వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసి గట్టి పొడిచి తినేయాలని చూస్తాయి. తరువాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాని పనిబట్టపోతాయి. ఐనా అన్ని సవాళ్లనూ ఎదుర్కుని, ఆపదలను తప్పించుకుని వృక్షంగా ఎదిగితే, ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తల దాచుకుంటాయి.


అలాగే ఆడపిల్లకు పుట్టక మునుపు నుంచీ సమస్యలే, పుట్టినప్పటి నుంచీ వేధింపులే. పుట్టగానే, 'అడపిల్లా! ' అంటూ ఐనవారు నిరాశపడతారు. బాల్యంలో సురక్షితంగా వుండవలసిన ఇంట్లోనే రక్షణ కరువై, చుట్టాలుగా-స్వంతవారిగా చెలామణీ అవుతున్న నరరూప రాక్షసుల వేధింపులకు అనేక మంది బాలికలు గురవుతున్నారు. బహిరంగ ప్రదేశాలలో అనేక రకాల లైంగిక వేధింపులకు యువతులు గురి అవుతున్నారు.


ప్రేమ పేరిట మోసపోతున్న సగటు ఆడపిల్లలు మన చుట్టూ ఎందరో వున్నారు. కొందరు ఘోరమైన అత్యాచారాలకు బలవ్వడమూ చూస్తున్నాము. సమాజంలో అనేక వేధింపులూ సాధింపులనూ ఎదుర్కుని, కష్టపడి తమ కాళ్ళమీద తాము నిలబడాలనే లక్ష్యంతో చదువులు చదివి, ఉన్నత పదవులు చేపట్టి ఉద్యోగాలు చేసుకుంటూ, స్వావలంబనతో జీవిస్తుంటే, అక్కడా లైంగిక వేధింపులు తప్పట్లేదు. అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ‘లైంగింక వేధింపుల వ్యతిరేక చట్టాలు’ వున్నాయి. దుర్మార్గుల ఆగడాలకు బలవ్వకుండా, తనను తానూ రక్షించుకోవడానికి వాటిపై సరైన అవగాహన కలిగి, సతర్కులై ఉండాలని సోదరీమణులను కోరుతున్నాను.


ప్రతి స్త్రీ ఉనికీ ఒక మహావృక్ష ఛాయగా మారాలని ఆశపడుతున్నాను. ఎన్నో ఆపదలను దాటి విత్తనం మొక్కై, మొక్క మహావృక్షమై నీడనిస్తున్నట్టు, ప్రతి సమస్యనూ ధైర్యంతో ఎదుర్కొని,

పరిష్కరించుకోవడమే కాక అవసరమైన చోట తిరగబడి, తమ కనీస హక్కులకు పోరాడి తోటి మహిళలకు కూడా అండగా బలమవ్వాలేగానీ కృంగిపోకూడదు.


ఎవరో వచ్చి మన సమస్య తీరుస్తారనుకుంటే లాభం లేదు. మన సమస్యల పరిష్కారం కోసం మనమే గొంతెత్తి పోరాడాలి. ఏ సమస్యను ఎలా ఎదుర్కోవాలో, సమయస్ఫూర్తితో ఎలా వ్యవహరించాలో అలవరచుకోవాలి. మన సమస్య పరిష్కారానికి వేసే తొలి అడుగు మనదే అవ్వాలి.

అందుకు కావలసిన ధైర్యం, సాహసం మనకుంటే, చట్ట, న్యాయ వ్యవస్థల సహకారం మనకు వుండనే వుంటుంది. ఈ దిశగా ఎలాంటి సహాయం, సలహాలు కావాలన్నా మన స్వచ్ఛంద సంస్థ ఎప్పుడూ సిద్ధమే. వ్యక్తిగా నేనెప్పుడూ సంసిద్దమే” మాలిక ప్రసంగానికి కరతాళ ధ్వనులతో అభినందలు పలికింది మహిళా దినోత్సవ వేడుకల సభ.


చిరునవ్వుకు కనుసైగను కొంటెగా జోడించి “యు డిడ్ ఇట్” అంటూ అభినందలందించాడు కార్తీక్.

*****


వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం

నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కధలకు, బహుమతులు పొందాను.


54 views1 comment

1 Comment


Maka Rajendran
Maka Rajendran
Dec 28, 2020

కామేశ్వరి గారు, అభినందనలు.

కథ ఆసాంతం చదివాను. బావుంది.

కథను మెరుగుపరిచే అవకాశం ఉంటే- చిన్న సలహా. కథ చివరి భాగంగా రాసిన ఉపన్యాస సారాంశాన్ని కథలోనే అంతర్భాగంగా ఉండేట్టు చూస్తే బావుంటుంది. అసలు ఆ భాగం లేకున్నా కూడా కథకు పూర్ణత్వం వచ్చినట్టే ఉంది. ఆ భాగం 'కొసరు' గానే ఉంది గానీ; 'అసలు'గా లేదు.


నా నిష్పాక్షిక, నిర్మోహమాట అభిప్రాయం మిమ్మల్ని నొప్పిస్తే మన్నించండి. కథలో సామాజిక విలువ స్పష్టంగా కనబరిచారు అభినందనలు.

Like
bottom of page