మన బాధ్యత
- Gadwala Somanna
- Jun 8
- 1 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ManaBadhyatha, #మనబాధ్యత, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 84
Mana Badhyatha - Somanna Gari Kavithalu Part 84 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 08/06/2025
మన బాధ్యత - సోమన్న గారి కవితలు పార్ట్ 84 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
మన బాధ్యత
----------------------------------------
మాతృభాషాభివృద్ధికై
కాస్త చేసుకో తీరిక
దాని పరిరక్షణ కొరకు
పెంచుకోవాలి కోరిక
సద్గుణాల సుమమాలిక
బ్రతుకులో ధరించుకొనుము
అవే విలువైన కానుక
పదిలంగా చూసుకొనుము
మాతృభాష చక్కదనము
నోటికదే తీయదనము
నలుదిశలా చాటాలోయ్!
తెలుగు వెలుగు గొప్పదనము
సహకరించే చేతులకు
భువిలో అన్నదాతలకు
కృతజ్ఞతతో ఉండాలి
ఇలలో తల్లిదండ్రులకు

చిన్నారి ప్రబోధం
----------------------------------------
ఇరు వర్గాల మధ్య
మేలు కాదు ఘర్షణ
మన దేశాభివృద్ధికి
సమైక్యతే రక్షణ
మహనీయుల మాటలు
కలిగించును ప్రేరణ
అభ్యాసనానికిల
అతిముఖ్యం ధారణ
తల్లిదండ్రుల సేవ
జీవితాన దీవెన
గురుదేవుల ప్రబోధం
ఎదుగుదలకు నిచ్చెన
మానుకుంటే మేలు
మితిమీరిన వేదన
పట్టుదల ఉన్న చాలు
సులువు లక్ష్య ఛేదన

పరాజయం పాఠము
-----------------
పరాజయం ఒక పాఠము
విజయానికి సోపానము
నిరాశతో క్రుంగరాదు
వెక్కి వెక్కి ఏడ్వరాదు
ప్రయత్నమే మానరాదు
వెనుతిరిగి చూడరాదు
గమ్యం చేరేదాకా!
కష్టం తీరేదాకా!
విజయాలకు పొంగిపోకు
అపజయాలకు క్రుంగిపోకు
తమతుల్యం ఉండాలోయ్!
స్థితప్రజ్ఞత చూపాలోయ్!
అపజయంలో జయముంది
ఈ సత్యం విస్మరించకు
వెనుకంజ మాత్రం వేయకు
ఆందోళన చెందబోకు

తండ్రి సద్బోధ
----------------------------------------
అలవాట్లు అదుపులో
ఉంటేనే బ్రతుకులో
ఉంటుందోయ్! క్షేమము
భవిత అగును హేమము
వ్యసనాలకు దూరము
ఉంటేనే లాభము
లేకపోతే గనుక
దరిచేరు నాశనము
అప్పులు చితిమంటలు
తగలబెట్టు బ్రతుకులు
అధికమైతే అవే
తీయునోయి! అసువులు
ముదిరితే అలవాట్లు
జీవితాన చీకట్లు
తెచ్చిపెట్టు మెండుగా
కుటుంబాన ఇక్కట్లు

అమ్మ ప్రేమ దీ(రూ)పము
----------------------------------------
కన్నతల్లి గొడుగై
పసి వారికి అడుగై
దివారాత్రులు శ్రమించు
త్యాగమే చూపించు
ఎండనక,వాననక
కడుపు నిండా తినక
కళ్ళలో పెట్టుకొని
మురిసిపోవు చూచుకొని
అమ్మ అరుణ కిరణము
అవనిలోన అద్భుతము
ఆనందవు కెరటము
సదనానికి మకుటము
అమ్మ ప్రేమ దీపము
అసమానం త్యాగము
సృష్టికి ఆధారము
మనసే బంగారము
-గద్వాల సోమన్న
Comments