మనసుల మధ్య బంధం
- Neeraja Prabhala

- 2 hours ago
- 3 min read
#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #ManasulaMadhyaBandham, #మనసులమధ్యబంధం, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Manasula Madhya Bandham - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 23/11/2025
మనసుల మధ్య బంధం - తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
పశ్చిమ హిమాలయ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న గ్రామం ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్నా, శబ్దాలు మాత్రం ఎక్కువగా తుపాకులదే. అదే గ్రామానికి అటుగా ఒక డెడ్‌లీ టెర్రరిస్టు గ్రూప్ తమ శిబిరం వేసుకుంది. ఆ గ్రూప్‌లో అత్యంత కఠినంగా, హింసాత్మకంగా ప్రవర్తించే వ్యక్తి పేరు రహీమ్.
చిన్ననాటి నుండి హింసే తన జీవితంగా అతను పెరిగాడు. తండ్రి మరణం, కుటుంబ పరిస్థితులు వీటన్నింటికీ కారణం.తన పరిస్ధితికి సమాజమే కారణమని అనుకుని, దానికి తుపాకీతో సమాధానం చెప్పడమే సరైంది అనుకునే వాడు. కానీ అతడి జీవితాన్ని మార్చినది ఒక చిన్న సంఘటన.
ఒకసారి అతడు తీవ్ర గాయాలతో పడి ఉండగా, జాతీయ సైన్యం అతన్ని పట్టుకుని స్థానిక ఆశ్రమంలో చికిత్సకు తరలించారు. అక్కడ ఆధ్యాత్మిక ఆశ్రమం, యోగా కేంద్రం, ధ్యానం. ఇవన్నీ అతడికి కొత్త అనుభవం. ఇవన్నీ అతనికి మొదట చాలా అవమానంగా అనిపించింది. కానీ శరీర నొప్పులు తగ్గేందుకు ప్రాణాయామం చేయమన్న యోగాచార్యుల మాట వినాల్సి వచ్చింది.తన స్వార్థం కోసం ఆయన మాటలు విన్నాడు రహీమ్.
ఆ నిశ్శబ్దంలో, ఆ లోతైన శ్వాసలో — ఏదో మంచి అనుభూతి అనిపించింది. రోజూ యోగా చేస్తున్న కొద్దీ, ఆయన మనసు ప్రశాంతంగా ఉంటోంది. “హింసలో శాంతి ఉండదని” ఆచార్యులు అన్న మాటలు మొదట అతడికి నవ్వు పుట్టించాయి, కానీ రానురానూ అర్థం అవుతుండగా అతనికి కన్నీళ్లు వచ్చాయి.
ఒంటరిగా కూర్చున్న అతడికి తన గతం గుర్తొచ్చింది. చిన్ననాటి నవ్వులు, తల్లి చేతి వంటలు, స్నేహితుల ఆటలు. తుపాకీకి బదులు కలం పట్టిన జీవితం ఎలా ఉండేదో ఊహించాడు. భవిష్యత్తులో ఏదైనా ఉద్యోగం చూసుకుని గౌరవంగా బతకాలనుకున్నాడు.
ఆశ్రమం నుండి కోలుకొని బయటికి వచ్చిన రహీమ్ జీవితంలో మళ్లీ తుపాకీ పట్టదలచుకోలేదు. ఆయన ఇప్పుడు యోగా ఉపాధ్యాయుడు. హింస బాటలో ఉన్న యువకుల్ని మారుస్తూ, "మన మనసు మార్పే ప్రపంచ దిశా మార్పు" అనే సందేశం పంచుతున్నాడు.
అతను పిల్లలందరకీ “హింస ఎవ్వరినీ శాశ్వతంగా సంతోషంగా ఉంచదు. మంచి మనస్సు, మంచి మార్పుకు ధ్యానం, యోగా శక్తివంతమైన మార్గాలు. ప్రేమ, క్షమ, శాంతి ఇవే జీవితానికి నిజమైన విజయ పధం” అనే సూక్తులు చెబుతున్నాడు.
ఇలా కాలం గడుస్తోంది. ఒకరోజున ఆ ఊరిలో ఒక సంఘటన జరిగింది. నరసింహం అనే బాగా పేరొందిన రైతు ఆ ఊరివాళ్లకు తల్లిదండ్రులా, పెద్దమనిషిలా ఉండడంతో ఊరంతా ఆయనను గౌరవించే వ్యక్తి. తన భార్య విజయతో కలిసి నలుగురు పిల్లలను చక్కగా పెంచాడు.
పట్టణంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా వేణు ఉంటున్నాడు. కూతురు సిరి పెళ్లయి హైదరాబాద్‌కి వెళ్లిపోయింది.
మూడోది రేణు ఇంటి దగ్గరే ఉంటోంది. చిన్నవాడు కుమార్ కాలేజీలో చదువుతున్నాడు.
వేణు పెళ్లయిన తర్వాత మామూలుగానే ఇంటికి దూరమయ్యాడు. భార్య సునీతకి ఆ గ్రామం అంటే ఇష్టం లేదు. "అక్కడికి వెళ్లి వ్యక్తిత్వం లేకుండా వాళ్లందరితో అనుకూలంగా మెలగాలి?" అనే భావనతో ఉంది.
నరసింహం, విజయ చాలాసార్లు పట్టణానికి వెళ్లినా వాళ్లకు కోడలి వద్ద అంతగా ఆప్యాయత లభించేది కాదు.వేణుకి ఉద్యోగంలో ఒత్తిడులు అంటూ ఇంటి విషయాలు పట్టించుకోవడం మానేశాడు. అంతా సునీతదే పెత్తనం. అందువలన వాళ్ళు కొడుకు ఇంటికి వెళ్లడం చాలా తక్కువ.
కొన్నాళ్ల తర్వాత విజయకు అనారోగ్యం మొదలైంది. ఆ విషయం వేణు దంపతులకు తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు. కుమార్ మాత్రమే దగ్గరుండి తల్లిని జాగ్రత్తగా చూసుకున్నాడు.
ఒక రాత్రి విజయమ్మ స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే నరసింహం తనే కారులో హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. వైద్యులు ఆవిడకి చికిత్స చేసినా ఫలితం లేక ఆవిడ కన్నుమూసింది.
తన ఇంటికి వెలుగు, జీవనసహచరి శ్వాస ఆగిపోయిందని వృధ్ధుడైన నరసింహం గుండె పగిలేలా ఏడ్చాడు.
సిరి తన భర్తతో కలిసి వచ్చింది. సిరి, రేణు, కుమార్ తమ తల్లి కోసం కుమిలిపోయారు. తల్లి అంత్యక్రియలు స్మశానవాటికలో శాస్త్రోక్తంగా జరుగుతుండగా వేణు తన భార్యతో కలిసి వచ్చాడు. కానీ అతను వచ్చి తల్లిని కడసారి చూసి తల్లి చితికి నిప్పంటించి కుమిలి కుమిలి రోదించాడు. సునీత కూడా మౌనంగా రోదించింది. వాళ్లలో వచ్చిన మార్పుని అందరూ గమనించారు.
వేణు, ఆ రోజు నుండి తన తప్పును గ్రహించాడు. “తమ ఇంటి వెలుగు తల్లి” అని అతనికి నెమ్మదిగా అర్థమైంది. తండ్రిని ఒంటరిగా వదిలిపెట్టలేను అనుకున్న అతను తన ఉద్యోగాన్ని వదిలి భార్యతో ఇక్కడే స్ధిరపడదామని నిర్ణయం తీసుకున్నాడు. ఇదంతా దగ్గరుండి గమనించిన రహీమ్ మనుషుల మధ్య బంధం ఏంటో తెలుసుకున్నాడు. వేణు, రహీమ్ ల మధ్య స్నేహం పెరిగి క్రమేణా తన మంచితనంతో ఆ ఇంటి కుటుంబ సభ్యులలో ఒకడైనాడు.
రేణు తను అవివాహితగా ఉండి తండ్రిని ప్రేమగా చూసుకుంటూ ఉండిపోతానంటే అందుకు నరశింహం ఒప్పుకోలేదు. వేణు ఆమెకి నచ్చచెప్పి పెళ్లికి ఒప్పించాడు.
తమకు బాగా తెలిసిన రహీమ్ తో రేణుకి పెళ్లి చేశాడు వేణు. రహీమ్, రేణు లు అన్యోన్యంగా ఉంటూ కాపురం చేసుకుంటున్నారు. మరో ఏడాది తర్వాత వాళ్లకి పాప పుట్టింది. రహీమ్ కి కుటుంబ బంధం, దాని విలువ బాగా తెలిసి చిన్న తనంలో లోగడ తనలోని హింస భావాన్ని గుర్తుతెచ్చకుని పశ్చాత్తాపం చెందాడు. తన మనసు మార్చిన యోగా, ఆధ్యాత్మిక భావనని అతను క్రమం తప్పకుండా అనుసరిస్తున్నాడు.
మరో రెండు సం…తర్వాత వేణుకి కొడుకు పుట్టాడు. ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది.
కాలక్రమేణా సునీత మనసు మారింది. తాను కూడా తన అత్తగారి స్థానాన్ని తీసుకుని, ఆ ఇంట్లో శాంతిని తీసుకొచ్చింది. కుమార్ కి తన బంధువులలో మంచి పిల్లని చూసి వివాహం చేసింది సునీత. సునీత లో వచ్చిన మార్పుకి అందరూ సంతోషించారు.
కాలం హాయిగా సాగుతోంది.
ప్రతిసారి శెలవులు వచ్చినప్పుడు ఆ ఇంట్లో మళ్లీ నవ్వులు విరుస్తున్నాయి. నరశింహం పిల్లలందరూ తమ కుటుంబంతో కలిసి వస్తూ సరదాగా ఉండటం పరిపాటైంది. తమ ఇంటి తోటలో తల్లి వేసిన పూలు ఇప్పటికీ పూస్తున్నాయి. నరసింహం పెదవి మీద చిరునవ్వు మెరిసి తన పిల్లలతో తనుకూడా పిల్లవాడైనట్టుగా భావిస్తున్నాడు.
“మనుషులు ఎంత దూరమైనా, వాళ్ల మనసులు కలిస్తే కుటుంబ అనుబంధాలు తిరిగి నిలబడతాయి. ఒక తల్లి ప్రేమ, ఒక తండ్రి తపన ఎప్పటికీ ఆ ఇంటికి నిత్య వెలుగులు. ప్రేమానురాగాలు మానవత్వాన్ని, తల్లితండ్రుల ప్రేమను గుర్తుతెస్తాయి” అన్నాడు రహీమ్ తన పాపని ఎత్తుకొని ఆడిస్తూ రేణుతో. అది విన్న, ఆ దృశ్యాన్ని చూస్తున్న రేణు భర్తని ప్రేమగా మరింత హత్తుకుంది. రహీమ్ భార్యని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు.
.. సమాప్తం ..

-నీరజ హరి ప్రభల
Profile Link
Youtube Playlist Link




Comments