మనసులో ప్రేమ
- Mohana Krishna Tata

- Oct 19
- 4 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #ManasuloPrema, #మనసులోప్రేమ, #TeluguStories, #తెలుగుకథలు, #కొసమెరుపు

Manasulo Prema - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 19/10/2025
మనసులో ప్రేమ - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
తెల్లవారుజామున మోగిన ఫోన్ శబ్దంతో ఒక్కసారిగా సూర్యకి మెలకువ వచ్చింది.
'ఎవరబ్బా ఇంత ఉదయం పుట.. అదీ కొత్త నెంబర్ లాగా ఉందే? ఒకవేళ తనే అయిఉండవచ్చు కదా' అని ఫోన్ తీసి 'హలో.. ' అన్నాడు.
"హలో సూర్యా.. ! ఎలా ఉన్నావు?"
"ఎవరు మీరు.. ?"
"నేను.. నీ కాలేజీ ఫ్రెండ్ సాయి. ఇన్ని సంవత్సరాలు, ఎవరితో టచ్ లో లేకుండా ఎలా ఉన్నావు రా? ఎంతో కష్టపడి నీ ఫోన్ నెంబర్ సంపాదించాను"
"సంతోషం.. ఆ రోజు తర్వాత నేను ఎవరితో టచ్ లో లేను. ఎవరితోనూ మాట్లాడట్లేదు.. "
"నువ్వు ఇంకా తనని మర్చిపోలేదా సూర్యా.. ? చాలా సంవత్సరాలు అవుతోంది"
"ఎలా మర్చిపోతాను చెప్పు.. ?"
"నీ కోసం, మన అందరి కోసం.. మన కాలేజీ ఫ్రెండ్స్ అంతా కలుస్తున్నాము.. నువ్వు కచ్చితంగా రావాలి.. "
"నేను ఎవరినీ కలవను.. "
"తను కూడా వస్తుంది.. నేనే ఇన్వైట్ చేస్తాను. ఇప్పుడు వస్తావనుకుంటాను.. మీ ఇద్దరినీ ఇప్పుడైనా కలుపుతాను" ఆనందంగా అన్నాడు సాయి
ఆ మాటలకి ఒప్పుకున్నట్టుగా.. ఒక నవ్వు నవ్వాడు సూర్య. ఆ కాలేజీ రోజులే వేరబ్బా అంటూ ఇద్దరు గుర్తుచేసుకున్నారు.
******
కాలేజీ లో అంతా కొత్త ముఖాలే. జూనియర్ స్టూడెంట్స్ ని ర్యాగింగ్ అంటూ వారిని పరిచయం చేసుకుంటున్నారు సీనియర్స్. అప్పుడే సాయిని కలిసాడు సూర్య. ఇద్దరు ర్యాగింగ్ కి బలైన కొత్త వారే. అలా ఇద్దరికీ స్నేహం బాగా కుదిరింది.
"హలో.. నేను సాయి"
"నేను సూర్య.. అలా క్యాంటిన్ కి వెళ్లి కాఫీ తాగుదామా?"
"సరే.. ఎలాగో కొన్ని రోజులవరకు క్లాసెస్ జరగవుగా.. పదా" అన్నాడు సాయి
అప్పుడే ఒక మెరుపు మెరిసినట్టు.. ఆమె కనిపించింది. ఆమె చిరునవ్వుకు దాసోహం సూర్య.
"సాయి.. ! ఆ అమ్మాయి ఎవరో తెలుస్కోవాలి.. "
"ఎందుకు?"
"నాకు బాగా నచ్చేసింది.. ప్రేమిస్తే, ఇలాంటి అమ్మాయినే ప్రేమించాలి"
"క్యాంటిన్ అన్నావుగా.. "
"అది ఎక్కడికి పోదు గానీ.. అమ్మాయితో కాఫీ తాగితే.. ఇంకా బాగుటుంది కదా.. మనం మరోసారి వెళ్దాం"
"అంతా నీ ఇష్టం.. అయితే ఇప్పుడు ఏం చేద్దాం?"
"వెళ్లి ఆ అమ్మాయి తో మాట్లాడి, వివరాలు కనుక్కో" అన్నాడు సూర్య
అనుకోకుండా.. ఆ అమ్మాయి వీరి దగ్గరకే నడచి వస్తోంది.
"కొంపదీసి మన మాటలు విన్నాదేమో?"
"ఏమో తెలియదు"
"హలో సూర్య.. " అంది ఆ అమ్మాయి.
"నా పేరు మీకు ఎలా తెలుసు.. ?"
"మన ఇద్దరం టెన్త్ ఒకే స్కూల్.. అక్కడ గర్ల్స్ సెక్షన్ వేరు కాబట్టి.. నేను మీకు తెలియదు. మీకు ఎప్పుడూ చదువే కదా.. మమల్ని చూసి ఉండరు"
"మీ పేరు.. ?"
"నేను జానకి"
"నైస్ నేమ్"
"పదా.. కాఫీ తాగుదాం" అన్నాడు సూర్య.
"సరే"
"వీడు సాయి.. నా కొత్త ఫ్రెండ్" అంటూ పరిచయం చేసాడు సూర్య.
రోజులు అలా గడిచిపోతున్నాయి..
"ఎప్పుడూ జానకితో మాట్లాడడమే గానీ.. నీ మనసులోమాట ఎప్పుడు చెప్పేది? నెక్స్ట్ మంత్ నుంచి ఫైనల్ ఎగ్జామ్స్, ఆ తర్వాత మనం కాలేజీ నుంచి వెళ్లిపోతాము" అన్నాడు సాయి.
"చెప్తాను.. మంచి టైం కోసం చూస్తున్నాను"
మొత్తానికి కాలేజీ అయిపోయింది. జానకి మళ్ళీ కలవలేదు.. ఫేర్ వెల్ పార్టీకీ రాలేదు. సూర్య అప్పటినుంచి ఎవరినీ కలవలేదు.. ఎవరితో టచ్ లో లేడు..
******
ఇప్పుడు ప్రస్తుతంలో..
అందరూ కలిసే ఆ రోజు రానే వచ్చింది. సూర్య మంచి డ్రెస్ వేసుకుని, రెడీ అయి లొకేషన్ కు చేరుకున్నాడు. కార్ లో దిగింది జానకి. ఎన్నో సంవత్సరాల తర్వాత చూస్తున్నాడు సూర్య దూరంగా నిల్చొని..
"హలో జానకి " అంటూ ఎదురు వెళ్లి పలకరించాడు సాయి. మిగిలిన ఫ్రెండ్స్ అంతా పలకరించుకుని.. మాటలు కలిపారు. అప్పుడే దూరం నుంచి అంతా గమనించి వచ్చిన సూర్య..
"ఎలా ఉన్నావు జానకీ? నేను గుర్తున్నానా?"
"నిన్ను ఎలా మర్చిపోతాను సూర్యా" అంటూ బ్యాగ్ లోంచి కత్తి తీసి సూర్య కాలిమీద పొడిచింది.
"ఏంటి జానకీ నువ్వు చేసింది?"
"నొప్పిగా ఉందా? ఇంతకంటే ఎక్కువ నొప్పి మేము పడ్డాము" అంటూ ఎవరిని దగ్గరకు రాకుండా బెదిరించింది.
"సూర్య ఏం చేసాడు? నిన్ను ప్రేమించడం తను చేసిన తప్పా?"
"ప్రేమించడం తప్పు కాదు.. ఆ విషయం చెప్పకపోవడమే పెద్ద తప్పు"
"ఏదో భయంతో నేను అప్పుడు చెప్పలేకపోయాను. ఇప్పుడు చెబుతున్నా.. 'ఐ లవ్ యు జానకి' "
"నువ్వు జానకికి 'ఐ లవ్ యు' చెప్పాలంటే, నీ గుండెల్లో ఇంకొకటి పొడుస్తాను" అంటూ గట్టిగా కత్తితో ఇంకొక పోటు పొడిచింది.
చుట్టూ ఉన్నవారు ఆపలేకపోయారు. "అసలు ఏమిటి ఇదంతా? ప్రేమిస్తే, పెళ్ళి చేసుకోవాలి గానీ ఇలా చేస్తారా?" గట్టిగా అడిగాడు సాయి.
"అదే విషయం నేనూ అడుగుతున్నా సూర్యా.. నీ మనసులో ప్రేమ జానకి కి ఎందుకు చెప్పలేదు? ప్రేమిస్తే భయమెందుకు? ఎంతో ఎదురు చూసింది జానకి పాపం"
"అంటే నువ్వు.. ?"
"నేను జానకి ట్విన్ సిస్టర్ పావని"
"అయితే జానకి.. ?"
"నాలాగ మా అక్క ఓపెన్ గా ఏమీ చెప్పలేదు. నువ్వంటే తనకి చాలా ఇష్టం. అక్క డైరీ చదివిన నాకు అంతా తెలిసింది. ఆ రోజు నువ్వు ప్రపోజ్ చేస్తావని ఎంతో ఎదురు చూసింది. నాన్నకు వేరే సిటీకి ట్రాన్స్ఫర్ అయి.. మేము సడన్ గా వెళ్ళిపోయాం. కొన్ని రోజులకి, ఇంట్లో వేరే సంబంధం ఫిక్స్ చేసేసారు. ఇష్టం లేని పెళ్ళి చేసుకోలేక, అక్క సూసైడ్ చేసుకుంది. కూతురికి ఇలా జరగడం తట్టుకోలేక.. అమ్మ, నాన్న కూడా సూసైడ్ చేసుకున్నారు. అప్పుడే నేను కూడా చనిపోదాం అనుకున్నాను. కానీ, నిన్ను చంపడం కోసమే ఆగాను.. ఇప్పుడు ఇక్కడకు వచ్చాను" అంటూ సూర్య గుండెల్లో ఇంకో పోటు పొడిచింది పావని.
**************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ




Comments