top of page
Original.png

మానవత్వమే మహాలయం



Manavathvame Mahalayam - Telugu Inspirational Story | Mayukha

మానవత్వమే మహాలయం - తెలుగు ప్రేరణాత్మక కథ | మయూఖ

Published in manatelugukathalu.com on 01/04/2026


"ఏవండోయ్! ఇది విన్నారా! మీ ఫ్రెండ్ రమణయ్య లేడూ! వాడే ఆ పిసినారి రమణయ్య.. గుడి కడతాడట".


"అవునా! పిల్లికి బిచ్చం పెట్టని వాడు, వాడు గుడి కట్టడం ఏమిటి? అయినా నీకు ఎవరు చెప్పారు?" అన్నాడు ధర్మారావు భార్యతో.


"ఇంకెవరు వార్తాహరులు. మన పనిమనిషి వాళ్ళ ఇంట్లోనూ చేస్తుందిగా! అదే చెప్పింది. అయినా అయ్యగారికి ఇంకా తెలియకపోవడం ఏమిటి? ఇద్దరూ స్నేహితులేగా!" అంది, అంటూ చెప్పింది కాంతం.


రమణయ్య, ధర్మారావు ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. రమణయ్యకి చదువు అబ్బకపోతే, టెన్త్‌తో ఆపేసి వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ముందు చిన్నగా పెట్టిన వ్యాపారం ఊళ్లో వర్షాభావ పరిస్థితులను బట్టి బాగా పుంజుకుంది. అందరూ రమణయ్య దగ్గరకు వడ్డీకి డబ్బు తెచ్చుకునే వాళ్లే. నెల అయ్యేటప్పటికీ ఠంచనుగా వాళ్ళింటికి వెళ్లి డబ్బు వసూలు చేసుకొస్తాడు. ఆ నెల డబ్బులు సర్దుబాటు చేయలేకపోతే మళ్లీ నెల రెండు నెలల వడ్డీ తీసుకుంటాడు.

రమణయ్యకి కూతురు, కొడుకు ఉన్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యి సిటీలో సెటిల్ అయ్యారు. కొడుకు వడ్డీ వ్యాపారం మానేయమని చాలాసార్లు చెప్పి చెప్పి విసిగిపోయాడు


రమణయ్య లాంటి పిసినారి గుడి కడుతున్నాడు అంటే ఆశ్చర్యం కాక మరేమిటి?

కాంతం మాటలు విన్న ధర్మారావు ఆలోచనలో పడ్డాడు.


ధర్మారావు స్కూల్ టీచర్‌గా చేసి రిటైర్ అయ్యాడు. ధర్మారావుకి ఒక్కడే కొడుకు. సిటీలో జాబ్ చేస్తున్నాడు.

                                                                     *****

సాయంత్రం అయింది. ధర్మారావు: "కాంతం, నేను అలా రమణయ్యని కలవడానికి వెళుతున్నాను. తలుపు వేసుకో!" అంటూ బయలుదేరాడు కచేరి చావడి దగ్గరకి. అక్కడ ఊళ్లో పెద్దవాళ్లు అందరూ కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు. ధర్మారావుని చూడగానే అందరూ లేచి, "ఏంటి మాస్టారు!" అంటూ నమస్కరించారు. చుట్టూ పరికించి చూసి: "ఇంకా రమణయ్య రాలేదేం?" అన్నాడు ధర్మారావు.


"వస్తాడు లేండి. నెమ్మదిగా వడ్డీ లెక్కలు కట్టుకుని ఇంకా ఎవరెవరు బాకీలు ఉన్నారో అన్నీ తేల్చుకుని వస్తాడు," అన్నారు నవ్వుతూ.


ఇంతలో రమణయ్య వచ్చాడు. "రా! రమణయ్య! ఏంటి ఇంత లేటు?" అన్నాడు ధర్మారావు.

"ఏం లేదు ధర్మ, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మన ఊళ్లో రామాలయం కట్టిద్దాం అనుకుంటున్నాను. ఊరి చివర నాది పోరంబోకు స్థలం ఉంది కదా? అది ఎందుకు పనికిరాదు. దానిలో గుడి కట్టిద్దామని అనుకుంటున్నాను. స్థలం నేను ఇస్తాను. అందరం చందాలు వేసుకుని కట్టిద్దాం. గుడివల్ల కొన్ని కుటుంబాలు కూడా బతుకుతాయి కదా!" అన్నాడు రమణయ్య.


అందరూ ఆశ్చర్యపోయారు: "ఇంత మంచి బుద్ధి ఎప్పుడు పుట్టిందా అని."


సర్పంచి గురవయ్య: "రమణయ్య గారు! మీరు ఇంత మంచి పనికి పూనుకుంటే మేం అందరం సహాయం చేస్తాం. ఇది మన ఊరికి సంబంధించింది. ఊళ్లో గుడి లేదు. నేను కట్టిద్దామంటే స్థలం లేక ఆగాను. అటువంటిది మీరు పెద్ద మనసుతో స్థలం ఇస్తానంటే మీ అందరం విరాళాలు ఇస్తాం. ఏవంటారు?" అంటూ మిగిలిన వాళ్ళ వంక చూశాడు.


అందరూ సరే అని అప్పటికప్పుడు చందాలు ప్రకటించారు. ధర్మారావు అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పడింది. మంచి రోజు చూసి చందాల కోసం ఊళ్లోకి బయలుదేరారు. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చందాలు ఇచ్చారు.


ఇటుకల బట్టీ నడిపే రాములు పూర్తి ఇటుకలంతా తనే సప్లై చేస్తానన్నాడు. సిమెంటు, ఇసుక, ఐరన్ బయట ధర కంటే తక్కువ ధరకే సప్లై చేస్తానన్నాడు పట్టణంలో బిల్డింగులు కట్టించే దామోదరం.


ఏమి ఇవ్వలేని శ్రామికులు గుడి కట్టడానికి పైసా తీసుకోకుండా తమ వంతు భాగంగా శ్రమదానం చేస్తామన్నారు. "ఇంటికో పుష్పం, ఈశ్వరుడికో దండ" అన్నట్టుగా అందరూ ఉత్సాహంగా తమ ఇంటిలో కార్యంలాగా ముందుకు వచ్చారు.


పంతులుగారు మంచి ముహూర్తం చూసి శంకుస్థాపన చేయించారు.

స్థలం ఇవ్వడమే కాకుండా రమణయ్య ధూపదీపాలకి, పంతులుగారికి అయ్యే ఖర్చులన్నీ తనే భరిస్తానన్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు.


పిసినారి రమణయ్య ఇలా మారిపోయాడు అంటే నమ్మశక్యంగా లేదు ఆ ఊరి ప్రజలకు.


పనులన్నీ చకచక జరిగిపోతున్నాయి. దేవుడి విగ్రహాలన్నీ పాల రాయితో చేసినవి పెట్టాలని నిర్ణయించారు. ఊర్లో పెద్దలందరూ ముందుండి పనులన్నీ చేయిస్తున్నారు.


అందరి సహకారంతో గుడి పూర్తయింది. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఐదు రోజులు పాటు ఎంతో పవిత్రంగా జరిగింది. "దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే!" అన్నట్టుగా అందరూ తమ భుజాల మీద వేసుకొని కార్యక్రమాన్ని పూర్తి చేశారు. గుడి దగ్గర కొంతమంది బళ్ళమీద అరటి పళ్ళు, తమలపాకులు, పూలదండలు, పూజ సామాగ్రి, పిల్లల ఆట వస్తువులు మొదలైనవి అమ్ముకుంటున్నారు.


గుళ్ళో దేవుడి దగ్గర వాయించడానికి సన్నాయి మేళం కూడా కుదిరింది. గుడికి భక్తుల రాక ఎక్కువైంది. ప్రతి నెల స్వామివారి నక్షత్రమైన పునర్వసు రోజు ప్రత్యేక పూజలు, కళ్యాణాలు, ఆంజనేయ స్వామికి మంగళవారాలు తమలపాకులతో పూజ ప్రత్యేక శ్రద్ధలతో జరుగుతున్నాయి. గుళ్లో అర్చకులు రామ్ శర్మ గారు ఎంతో శ్రోత్రియంగా పూజలు చేస్తున్నారు.


"మూడు పువ్వులు ఆరు కాయలు"గా గుడి వెలిగిపోతోంది. గుడి దగ్గర దుకాణాలు పెట్టుకున్న వాళ్ళకి కూడా రాబడి పెరిగింది. రమణయ్య రోజు ఉదయం, సాయంత్రం గుడికి వచ్చి అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ చూస్తున్నాడు.

రమణయ్యని దుకాణదారులందరూ "కనిపించే దేవుడని తలుస్తున్నారు." ఆయన వల్లే తమ బతుకులు బాగుపడ్డాయని దేవుడితోపాటు రమణయ్యని కొలుస్తున్నారు.

ఇక్కడే రమణయ్య తన కుటిల బుద్ధిని బయట పెట్టాడు.

ఒకరోజు దుకాణదారులందరినీ తన ఇంటికి పిలిపించి: "నా వల్లే మీ బతుకులు బాగుపడ్డాయి. మీకు ఒక ఉపాధి కలిగించాలనే ఉద్దేశంతో గుడి కట్టడానికి స్థలం ఇచ్చాను. ఏమంటారు?" అన్నాడు అందరిని చూస్తూ.

"అవును బాబయ్యా, ఈ ఊర్లో సరైన పనులు లేక పస్తులు ఉంటుంటే తమ దయ వల్లే, మేం నాలుగు రాళ్లు వెనకేసుకోగలుగుతున్నాం. మేము అన్నం తింటున్నాం అంటే అంతా మీ దయ బాబయ్యా!" అన్నాడు అందరిలోకి పెద్దవాడైన రంగయ్య తాత. మిగిలిన వాళ్లందరూ అవును అన్నట్టుగా తలలూపారు.

మళ్లీ రమణయ్య మాట్లాడుతూ: "అందుకని మీ లాభాల్లో ప్రతినెల 10% నాకు ఇవ్వాలి. ఈ విషయం మీకు, నాకు తప్ప రెండో కంటికి తెలియకూడదు. జాగ్రత్త!" అన్నాడు రమణయ్య.

అందరూ తెల్లబోయారు. కొంతమంది ఏదో చెప్పబోతుంటే, రంగయ్య తాత వారిని వారించి, "అలాగే బాబయ్యా, మీరు చెప్పినట్టే చేస్తాం" అంటూ అందరినీ తీసుకుని బయటికి వచ్చేసాడు.

బయటకు వచ్చిన వెంటనే అందరూ రంగయ్య మీద విరుచుకుపడ్డారు: "మన కష్టంలోంచి డబ్బులు ఇవ్వడం ఏంటి? అప్పుడు వడ్డీల మీద వడ్డీలు గుంజేశాడు. ఇప్పుడు ఇలా గుంజుతున్నాడు. మేము ఒప్పుకోం!" అన్నారు.

"ఒరేయ్, మీరు శాంతంగా ఆలోచించండి. అప్పుడు వడ్డీలు తీసుకున్నాడు నిజమే. కానీ ఇప్పుడు ఈయన వల్లే కదా? మనం పస్తులు లేక నాలుగు మెతుకులు తినగలుగుతున్నాం. దీనికి పెట్టుబడి కూడా ఆయనే ఇచ్చాడు కదా? వడ్డీకే అనుకో! మీరు ఇవ్వనంటే మన బాకీలు మొత్తం ఇప్పుడే కక్కమంటాడు. అందుకే నెమ్మదిగా ఉండండి. నెలకి ఎంతో కొంత ఆయనకి ఇద్దాం. సరేనా?" అన్నాడు రంగయ్య నచ్చచెప్పుతున్నట్లుగా.

ఎవరికీ ఇష్టం లేకపోయినా చచ్చినట్టు రమణయ్యకి ప్రతినెల డబ్బులు కడుతున్నారు.

రమణయ్య తన పాచిక పారినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాడు. అసలు తను గుడి కట్టించిందే ప్రతినెల డబ్బు కోసం. దేవుడి ఆదాయం కంటే రమణయ్య ఆదాయం ఎక్కువగా ఉంది. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రమణయ్య వ్యాపారం చేస్తున్నాడు.

                                                   ******

కాలం ఇలా సాగితే చెప్పుకునేదేముంది.

ఒకరోజు రమణయ్య గుడిలో కుప్పకూలిపోయాడు. అందరూ గబగబా మొహం మీద నీళ్లు చల్లి దగ్గర్లో హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. డాక్టర్ పరీక్ష చేసి హార్ట్ ఎటాక్ వచ్చిందన్నాడు. ఆపరేషన్ చేయాలన్నాడు. షాపుల వాళ్ళు అందరూ తమ దగ్గర ఉన్న డబ్బులు గుమ్మరించి: "ముందు మీరు వైద్యం చేయండి. మా అయ్యగారు బతకాలి. ఆయన్ని రక్షించండి. వాళ్ల వాళ్లకి చెప్తాం. మిగిలినవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ముందు మీరు వైద్యం చేయండి!" అంటూ ప్రాధేయపడ్డారు.


డాక్టరు ఆశ్చర్యపోతూ, "ఈయన వాళ్లకి అంత కావాల్సిన మనిషా?" అనుకుంటూ వైద్యం చేయడం మొదలెట్టాడు.


రమణయ్యకి ఆరోగ్యం చేకూరింది, డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాడు.


వారం రోజుల తర్వాత విషయం అంతా తెలుసుకున్న రమణయ్య దుకాణదారులందరినీ పిలిపించి: "మీరు ఈరోజు నుంచి నాకు డబ్బు ఇవ్వక్కర్లేదు. నేను మిమ్మల్ని డబ్బు కోసం పీడించినా, మీరు మానవత్వాన్ని చూపించారు. మీరే కనుక నా మీద కోపంతో నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లకపోతే, నేను మీ ఎదురుగుండా ఉండేవాడిని కాను. నన్ను క్షమించండి. ఇకనుంచి మీరు మీ వ్యాపారాలను స్వేచ్ఛగా చేసుకోండి. నా పాత బాకీలు కూడా మీరు ఇవ్వక్కర్లేదు!" అన్నాడు మనిషిగా మారిన రమణయ్య.


శుభ సూచకంగా గుళ్లో గంటలు మ్రోగాయి.


******శుభం *******

మయూఖ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

మయూఖ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :

63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

  పరిచయ వాక్యాలు:

నా పేరు శారద

విద్యార్హతలు: ఎమ్.ఎ

నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.

నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.

తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.

నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.

ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి

మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page