top of page

మంచి


'Manchi' New Telugu Story

Written By Dr. Lakshmi Raghava Kamakoti 'మంచి' తెలుగు కథ

రచన: డా. లక్ష్మీ రాఘవ కామకోటి



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


“సరే శంకరా, నేను కనుక్కుoటాను. రెండురోజుల్లో చెబుతా. నీవు వాడిని ఇక్కడకు పంపేసేయ్. ఇక్కడ కొంచెం అలవాటై పోతుంది. సరేనా..” అని ఫోను పెట్టేసరికి ఎదురుగా ప్రశ్నార్థకంగా చూస్తున్న భార్య సుభద్ర కనిపించింది కమలాకరానికి. “ఊరి నుండీ తమ్ముడు శంకర ఫోను చేశాడు. తన కొడుకు సురేష్ మంచి మార్కులతో ఇంటరు పాసయ్యాడు కదా. ఇక్కడ ఎంసెట్ కోసం కోచింగ్ సెంటర్ చూడమన్నాడు. నా ఫ్రెండు భాస్కరం ఉన్నాడు. ఒకసారి అడిగి చూస్తాను..” “అడగ్గానే చేర్పించేస్తాను అని ఇక్కడకు రమ్మనేస్తారా? మనం ఇప్పుడిప్పుడే మన వాడి చదువులు పూర్తయ్యి, అమెరికాలో ఉద్యోగo వచ్చి ఊపిరి పీల్చుకుంటున్నాము. మళ్ళీ సురేష్ ను పిలుచుకుని బాధ్యత నెత్తి మీదకు వేసుకుంటారా?” “సుభద్రా, నీకు చాలాసార్లు చెప్పాను... నాన్న మా ఇద్దరినీ ఇంజనీరింగ్ చదివించే శక్తి లేదని అనుకుంటుంటే దానికి శంకర.. ‘అన్న చదువుకొనీ నాన్నా! నేను టీచర్ ట్రైనింగ్ చేస్తాను’ అన్నాడుట..” మాట పూర్తి కాకుండానే సుభద్ర “ఈ కథ ఇప్పటికీ సవాలక్ష సార్లు చెప్పారు. శంకర త్యాగం చేశాడని మీ ఫీలింగు. అయినా ఎన్ని సార్లు మీరు వాళ్ళకి డబ్బు సాయం చేయలేదు?” మూతి విరిచింది. “నీకెప్పుడూ డబ్బు గోడవే.. వాడు మొదటిసారి కొడుకు విషయం లో సాయం చేయమన్నాడు. నేను చేస్తాను. అంతే!” కచ్చితం గా అని అక్కడనుండీ కదిలాడు కమలాకరం. “ఇంట్లో ఇంకోమనిషి ఉంటే పని ఎవరికి ఎక్కువయ్యేది నాకే గదా..” నిరసనగా అంటూ వంటింటి లోకి వెళ్ళింది సుభద్ర. *******. సాయంకాలం అమెరికానుండి కొడుకు రాహుల్ ఫోను చేస్తే సంతోషం గా మాట్లాడుతూ చివరగా సురేష్ రావడాన్ని చెప్పింది సుభద్ర. “నేను ఎలాగూ ఉద్యోగం అని అమెరికా వచ్చేశా కదా. పోనీ ఇప్పుడు సురేష్ వస్తే సందడిగా ఉంటుంది.”అన్నాడు. “నీవు మొదటనుండీ హాస్టల్ లో చదువుకున్నావు కదా. ఇప్పుడే వీడిని నేను భరించాలి..” “పరవాలేదులే.. తోడు ఉంటాడు”. రాహుల్ సమాధానం నచ్చలేదు సుభద్రకు. కమలాకరం రిటైర్ అవగానే ఇద్దరమే హాయిగా ఉండవచ్చు అనుకున్న సుభద్రకు సురేష్ రాక అస్సలు ఇష్టం లేకపోయింది. *******. శనివారం వచ్చాడు సురేష్. “బాగున్నారా పెద్దమ్మా.. ఇవి ఊరిలో పండిన అరటి కాయలు, మామిడి కాయలు. కొత్తిమీర ఫ్రెష్ గా ఉంటుందని తెచ్చాను’ అంటూ అన్నీ తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు. “అరె.. అక్కడ పెట్టకు.. కిచన్ కౌంటర్ మీద పెట్టాలి’ అని చెబుతూ ‘అమ్మా నాన్నా బాగున్నారు కదా. చెల్లి సునీత ఎలాఉంది ?” అని పలకరించింది సుభద్ర. అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చిన కమలాకరం “బాగున్నారా సురేష్, అందరూ..” అనగానే “అందరూ బాగున్నారు పెదనాన్నా. నీ దగ్గర ఐతేనే కోచింగ్.. లేకపోతే డిగ్రీ చేరమన్నాడు నాన్న. మీరు రమ్మన్నారని పంపారు పెదనాన్నా” “డిగ్రీ మాట ఎందుకు. కోచింగ్ చేరి మంచి రాంకు తెచ్చుకోవాలి. ఇదేమి పరాయి ఇల్లు కాదు సురేష్’ అని భుజం తట్టాడు. ఇంకా నయం ‘నేను చదివిస్తాను’ అనలేదు.. అని సణుక్కుంది సుభద్ర. రెండు రోజుల్లోనే సురేష్ ను తీసుకుని కోచింగ్ సెంటర్ లు తిరిగి ఇంటికి దగ్గరగా ఉన్నదే మెరుగు అనుకుని అందులో చేర్చడానికి నిర్ణయం జరిగినది. “సెంటర్ కు డబ్బు మీరే కడతారా?’” అడిగినది సుభద్ర ఆరాత్రి. “అది నా ఫ్రెండుకు తెలిసిన సెంటర్. వీడి మార్కులు చూసి ఫీజు తగ్గించుకుంటానన్నాడు.. తగ్గించక పోయినా నేనే కడతాను” అని చెప్పి భార్యను మారు మాట్లాడనీయలేదు కమలాకరం. రెండు రోజుల్లోనే సురేష్ అన్నిపనులకూ తోడు రావటం నచ్చింది సుభద్రకు. చిన్నప్పటినుండీ రాహుల్ తో పని చేయనిచ్చేది కాదు. రాహుల్ చదువులకు హాస్టల్ లో చేర్చాక ఎప్పుడూ ఇంటి పనులకు సాయం రాలేదు. సురేష్ ఇంట్లో పనులే కాదు, బయట బజారు పనులకీ వెంటనే వెళ్ళేవాడు. ‘పోనీ.. ఇంట్లో పెట్టుకు పోషిస్తుననందుకు పని చేయించుకోవచ్చు’ అనుకుంది సుభద్ర స్వగతం గా. చదువు కుంటున్నప్పుడు కూడా ’పెరుగు పాకెట్ తెస్తావా’ అనగానే లేచి వెళ్ళి తెచ్చేవాడు. ఇది గమనించిన కమలాకరం ఒక్కోసారి ‘వాడిని డిస్టర్బ్ చేయద్దు’ అని కోప్పడేవాడు. కోచింగ్ సెంటర్ లో పెడుతున్న టెస్టులు బాగా చేస్తున్నాడని రిపోర్ట్ రావడం కమలాకరానికి బాగా అనిపించింది. సురేష్ ఒకటి రెండుసార్లు ఊరికి వెళ్ళినా వెంటనే వచ్చేవాడు. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకుని వచ్చేవాడు. ఒకరోజు సెంటర్ నడుపుతున్న గురునాధం “ఇక మీదట కోచింగ్ ఇంకా సీరియస్ అవుతుంది. ఇంతలో ఒక చిన్న పిక్నిక్ పెట్టుకుంటున్నా పిల్లలు రిలాక్స్ అవ్వాలని. ఒక్కరోజే.. రిఫ్రెష్ అవుతారు. సురేష్ చెప్పే ఉంటాడు. పంపుతారు కదా.. ఛార్జస్ కూడా ఎక్కువలేదు.”అన్నాడు. “తప్పకుండా పంపుతాను” అన్నాడాయనతో. ఇంటికి వచ్చాక సురేష్ ను అడిగాడు పిక్నిక్ గురించి. “లేదు పెదనాన్నా, నేను వెళ్లకూడదనుకుని మీకు చెప్పలేదు” “ఎందుకు వెళ్ళవు? నేను డబ్బు కడతాను. వెళ్ళు” “డబ్బు కోసం కాదు పెదనాన్నా, ఆ ఒక్క రోజూ నేను ఊరికి వెళ్ళి వస్తాను...పొలం కలుపులు తీయిస్తున్నారట. పనికి నాన్నకు సాయంగా కూడా ఉండవచ్చు. పిక్నిక్ లు మళ్ళీ కూడా వెళ్ళవచ్చు. సెలవు ఇలా పనికి కలిసి వచ్చింది కదా ” అంటూన్న అతని వైపు ప్రేమగా చూశాడు కమలాకరం. ఇంత వయసు పిల్లవాడు ఎవరైనా ఇలా ఆలోచించగలడా... టీనేజీ లోనే తమ గురించి తప్ప ఆలోచించని తరం లో సురేష్ వ్యక్తిత్వం ప్రత్యేకంగా అనిపించింది. సురేష్ సమాధానం విని సుభద్ర మాత్రం ‘పోనీ.. డబ్బు మిగిలింది’ అని సంతోషించింది. అన్నట్టుగానే ఆరోజు ఊరికి వెళ్ళి మరురోజు పొద్దున వచ్చాడు సురేష్. *****. ఒక రోజు అమెరికానుండీ వచ్చిన కొడుకు ఫోనుతో చాలా బాధ పడ్డారు కమలాకరం దంపతులు. రాహుల్ చెప్పిన విషయం ఏమిటంటే చాలా కంపెనీలు స్టాఫ్ ను తగ్గిస్తూన్నరనీ, తన ఉద్యోగమూ ఉంటుందని గ్యారెంటీ లేదు, వేరే ఉద్యోగం టెంపరరీగా దొరుకుతే సరి.. లేదా వెనక్కి వచ్చేయాల్సివుంటున్నది సారాంశం. అమెరికా వెళ్ళటం రాహుల్ కోరిక. వెళ్ళినప్పటినుండీ ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడిలా వింటుంటే తమ ఇంటికి సురేష్ రాక వల్లనే ఇలా జరిగిందని అనుకున్నది సుభద్ర. సురేష్ అంటే అస్సలు ఇష్టం లేకపోయింది ఆరోజు నుండీ... ఇది గ్రహించి మందలించాడు కమలాకరం. ఎందుకో పెదనాన్నా వాళ్ళు దేనికో బాధపడుతున్నట్టు అనిపించినా నేరుగా అడగలేదు సురేష్. కానీ నాన్నకు ఫోను చేసి చెప్పాడు. రెండు రోజుల్లో శంకర ఫోను చేసినప్పుడు కమలాకరం తమ్ముడితో రాహుల్ పరిస్థితి చెప్పాడు. “వచ్చేయనీయ్ అన్నయ్యా, ఇక్కడే ఏదైనా దొరక్కపోదు.. అందరూ కలిసి ఉన్న తృప్తి ఉంటుంది”అని అనునయించాడు. సురేష్ కు విషయం తెలిసి చాలా ఫీల్ అయ్యాడు. అన్నయ్య వచ్చేవరకూ అన్నిటికీ పెదనాన్నవాళ్లకు తాను తోడుండాలి అని నిర్ణయించుకున్నాడు. చిన్నప్పటినుండీ ‘ఎవరి అవసరానికైనా సాయం అడిగితే వెంటనే చేయడం మనకు వచ్చే అవకాశం. దాననెప్పుడూ వదులుకోకూడదు’ అని నేర్పించాడు శంకరం. అందుకే ఊర్లో శంకరం అంటే అంత గౌరవమూ, ఇష్టమూ అందరికీ. ఆ రాత్రి రాహుల్ ఫోను మరింత కలత రేపింది. సుభద్ర “ఒకసారి వెళ్ళి వస్తారా.. చూసి మాట్లాడితే మేలనిపిస్తుంది” అంది భర్త తో సుభద్ర. “మన మాటలకు విలువనిచ్చేటట్టయితే ఫోను లో మాట చాలు సుభద్రా. వాడు చెప్పిన తీరు వాడి నిర్ణయాన్ని తెలుపుతుంది. అందుకు మన పర్మిషన్ అవసరం లేదు..” అంటూ సుభద్ర కళ్ళల్లో నీరు చూసి “పిల్లలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకునే కాలం ఇది సుభద్రా. అక్కడకు వెళ్ళి చేసేదేమీ ఉండదు...’అని మాటలు త్రుంచేశాడు కమలాకరం. సుభద్రకు రాహుల్ చెప్పిన మాటలు మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఉద్యోగం ఊడుతుందని తెలిసిపోయాక ఏమిచెయ్యలా అనుకుంటున్న సమయంలో అక్కడ పుట్టి పెరిగిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం తనకు వచ్చిందనీ, దాని ఉపయోగించు కోవాలనుకుంటున్నాడనీ, తనకు ఇలాటి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాననీ, త్వరలో అమ్మాయి ఫామిలీ విషయాలు తెలుపుతాననీ, పెళ్లి కూడా అమెరికా అయితే బాగుంటుందని అనుకుంటున్నట్టు చెప్పడం...కమలాకరానికి కూడా షాకే. కమలాకరం, తమ్ముడు శంకరానికి కూడా చెప్పలేక పోయాడు. ఇంట్లో ఉన్న సురేష్ కూ విషయం తెలియలేదు. రెండురోజుల సుభద్ర డల్ గా ఉండటం గమనించి “పెద్దమ్మా, ఒంట్లో బాగానే ఉందా? ఒక సారి డాక్టర్ దగ్గరికి వెడదామా ?” అని అడుగుతున్న సురేష్ తో “బాగానే ఉన్నా..” అంటూ తప్పించుకుంది. కమలాకరం ఇంట్లో ఎక్కువ ఉండటం లేదు. సురేష్ కు ఎంసెట్ పరీక్ష దగ్గర పడింది. బాగా ప్రిపేర్ అవుతున్నాడు. ఇక పరీక్ష మూడు రోజులుందనగా కమలాకరo కళ్ళు తిరిగి బాత్ రూమ్ లో పడ్డాడు. సురేష్ వెంటనే వెళ్ళి పైకి లేవదీశాడు. భుజం ఆసరాగా ఇచ్చినా నిలబడలేక పోయాడు కమలాకరం. ఆయాసం ఎక్కువవడం గమనించి, సుభద్ర సాయం తో ఆంబులెన్స్ కు ఫోను చేశాడు సురేష్. అది రాగానే వెంటనే దగ్గరగా ఉన్న ఆస్పత్రిలో చేర్చారు. ఎమర్జెన్సీ లో చేర్చుకుని గంట తరువాత హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు చెబితే క్రుంగిపోయింది సుభద్ర. సురేష్ మాత్రం “పరవాలేదు పెద్దమ్మా.. ఇది మంచి హాస్పిటల్. నీవు వెంటనే అన్నయ్య కు ఫోను చేయి.. నేను నాన్నకు ఫోను చేశాను. రేపే నాన్నా వాళ్ళు వస్తారు. ఇంతలో అన్నయ్య కూడా వచ్చేస్తాడు. అన్నీ సర్దుకుంటాయి’ అని ధైర్యం చెబుతూంటే మొదటిసారిగా ఇష్టం గా చూసింది సురేష్ వైపు సుభద్ర. “పోనీ నేనే చేయనా అన్నయ్యకు?” సడన్ గా అడిగితే “వద్దు సురేష్. మీ నాన్న వాళ్ళు వస్తారు కదా” అని సమాధానం చెప్పింది. “ఇప్పుడు చెబితే అన్నయ్య ఫ్లైట్ టికెట్స్ చూసుకుంటాడు..”ఆగాడు సురేష్. “వద్దు.. సురేష్” కొంచెం గట్టిగా చెప్పింది. ఆ మాటకు ఊరుకున్నాడు. ఆ రాత్రి సుభద్రతో బాటు అక్కడే ఉండి పోయాడు. మరురోజు ఐ సి యు కు మార్చారు. శంకరం డాక్టర్ తో మాట్లాడితే స్ట్రోక్ తీవ్రంగా వచ్చిందని, జాగ్రత్తగా మందులు తీసుకుంటే కోలుకున్నాక మళ్ళీ వచ్చే అవకాశాలు తగ్గుతాయనీ చెప్పాడు. రెండో రోజు సాయంకాలం మాట్లాడిన కమలాకరం సురేష్ కు ఎంసెట్ పరీక్ష ఇక ఒక్కరోజే ఉంది కనుక ఇంటికి వెళ్ళి పొమ్మన్నాడు. “పరవాలేదు పెదనాన్నా. మీరు దాని గురించి వర్రీ కావద్దు. నేను తప్పకుండా రాస్తాను” అని బయటకు వచ్చేశాడు. సురేష్ తో బాటు బయటకు వచ్చిన సుభద్ర “ఇక్కడ తోడుగా మీ నాన్న ఉంటారు. నీవు వెంటనే ఇంటికి వెళ్లిపో సురేష్. రేపు నీవు పరీక్ష బాగా రాయాలి” అంది. “పెద్దమ్మా, ముందు పెదనాన్న ఆరోగ్యం ముఖ్యం. ఇక్కడ నేను ఉండటం అవసరం. ఎంసెట్ వచ్చే సంవత్సరం కూడా రాయచ్చు. మీరు దాని గురించి వర్రీ అవ్వద్దు..” అంటూన్న సురేష్ ని ఆశ్చర్యంగా చూసింది. ఎందుకంటే రాత్రి సుభద్ర ఉండబట్టలేక రాహుల్ కు ఫోను చేసి తండ్రి ఆరోగ్యం సంగతి చెబితే “ఇప్పుడు ఇండియా వస్తే వెనక్కి రావడం కష్టం. అందుకే రాలేను. ఎలాగూ బాబాయ్, సురేష్ వాళ్ళు ఉన్నారు కదా. అంతా సరి పోతుంది. మీరు పెళ్ళికి రాలేక పోతే పెళ్లయ్యాక మేమే వస్తాము..” అన్న మాటలు మరచి పోలేదు. ఇటు చూస్తే “పెదనాన్నకు సాయం చేయడం అవసరం” కానీ నా పరీక్షకు ఇంకో అవకాశం వస్తుంది..” అన్న సురేష్ మనస్తత్వం బంగారం లా మెరుస్తూ కనిపించింది సుభద్రకు.. ఆలోచనల్లో తన ఎదుగుదల కోసం వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవాలనుకునే కొడుకు, అత్యంత కీలకమైన పరీక్ష కూడా మానుకుని తనవారికి సాయం చేసే అవకాశాన్ని వదులు కోని సురేష్... పదే పదే గుర్తుకు వస్తూ సురేష్ పట్ల ఇన్నాళ్ల తన ప్రవర్తన సిగ్గుగా అనిపించింది సుభద్రకు శంకరం ఫామిలీ మొత్తం కమలాకరం ఇంటికి వచ్చేదాకా ఇక్కడే ఉండి పోయారు. ఆరు నెలల తరువాత ఆరోగ్యంగా తయారైన కమలాకరం, సుభద్ర అమెరికా వెడతారనుకుంటే పల్లెకు తమ్ముడి దగ్గరకు వచ్చాడు అనుకోకుండా. “నాకూ ఒక ఇల్లు కావాలిరా ఇక్కడే.. పొలం కూడా.. కౌలుకిచ్చినా కాలక్షేపమే.. ఆప్యాయతల మధ్య ఉండాలిరా.. అవసరాల బట్టి కాదు..” అన్నాడు హాయిగా. సుభద్ర మనస్పూర్తిగా నవ్వింది. ******* సమాప్తం.******

డా. లక్ష్మీ రాఘవ కామకోటి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

డా. లక్ష్మీ రాఘవ, విశ్రాంత జంతుశాస్త్ర రీడర్ రచయిత్రి మరియు ఆర్టిస్టు

సాహితీ ప్రయాణం – 1966 లో ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో మొదటి కథ.

ఇప్పటి దాకా ఏడు కథా సంపుటాలు, ఒక స్మారక సంచిక, ఒక దేవాలయ చరిత్ర ప్రచురణ.

గుర్తింపునిచ్చిన కొన్ని పురస్కారాలు.

కన్నడ భాషకు అనువదింపబడిన ”నా వాళ్ళు’, “అనుభ౦ధాల టెక్నాలజీ” అన్న రెండు కథా సంపుటులు, .

అనేక సంకలనాలలో కథలు.

కథల పోటీ నిర్వహణ, పోటీలలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం సాహిత్యపు అనుభవం.


రచనలే కాకుండా కళల పై ఆసక్తి, ఆర్టిస్టు గా "wealth out of waste “అంటూ ఎక్జిబిషన్ ల నిర్వహణ



1 Comment


ఇలాంటి కథలు మీరే రాయాలి. కథ తెలిసినట్టే ఉన్నా చదవటం ఆగదు. మధ్యలో వదలలేము. ఎందుకంటే ఇవి ప్రతి కుటుంబంలో ఉన్న కథలు, మన ఇళ్ళల్లో మనస్తత్వాలు. ఇవి ఇంటింటా జరిగే సంఘటనలు. మీరు చాలా చక్కగా ప్రెజెంట్ చేస్తారు. చాలా ముచ్చటగా ఉందమ్మా కథ. అభినందనలు. 💐💐

Like
bottom of page