top of page
Original.png

మంటలు

41 minutes ago
5 min read

మంటలు కథలో కాలిపోయిన ఇంటి ముందు విషాదంలో నిల్చున్న శీనయ్య, దర్యాప్తు చేస్తున్న పోలీసులు, గ్రామస్థుల మధ్య కుటుంబ హత్య రహస్యాన్ని ప్రతిబింబించే దృశ్యం.

Mantalu - Telugu Crime Thriller Story | Thokala Rajesham

మంటలు - తెలుగు క్రైమ్ థ్రిల్లర్ కథ | తోకల రాజేశం

Published in manatelugukathalu.com on 11/09/2026


మంటలు — తోకల రాజేశం

తెలుగు క్రైమ్ థ్రిల్లర్ కథలను ఇష్టపడే పాఠకులను ఆలోచింపజేసే కథ “మంటలు”. తోకల రాజేశం రచించిన ఈ కథలో ఒక గ్రామంలో తెల్లవారుజామున జరిగిన ఇంటి దహనం వెనుక దాగిన హత్య రహస్యం, పోలీసుల దర్యాప్తు, కుటుంబ కలహాలు, తల్లి పట్ల కొడుకు ప్రేమ వంటి అంశాలు ఆసక్తికరంగా ముడిపడి ఉంటాయి.

ఉత్కంఠతో పాటు సామాజిక ఆలోచనను కలిగించే “మంటలు” కథను చదవండి.


తెల్లవారుజామున నాలుగు గంటలవుతుంది. చలికి వశపడక లేచిండు మల్లయ్య. మూడు బజార్ల దగ్గర మంట కనిపించింది. "ఓ మల్లయ్య తాత! మెల్లగ రా. ఇగో ఈ పీట మీద గూసో" చేతిలో కర్ర సాయంతో నెగడు దగ్గరకు వస్తున్న పెద్దమనిషికి పీట చూపిస్తూ అన్నాడు రాకేష్.


చలికి పెయిల నెత్తురు గడ్డ కట్టేటట్టు ఉన్నదోయ్ అనుకుంటూ కూర్చున్నాడు పెద్దమనిషి. అప్పటికే రాకేష్, నరేశ్తోని ఏదో ముచ్చటలో మునిగిపోయిండు. రాకేష్, నరేష్ స్నేహితులు. పక్కపక్కనే ఉంటారు. ఆ పక్క ఇల్లే మల్లయ్యది. ఇద్దరికీ వరుసకు తాత అవుతాడు ఈ మల్లయ్య. నెగడు దగ్గరికి చేరేలోపే వాళ్ళ మాటలు రెండు మూడు విన్నట్టున్నాడు పెద్దమనిషి. "గా పద్మ గురించేనా పిలగా!" అనటంతోనే ఔనన్నారు ఇద్దరూ ఒకేసారి.


"గీ ఈడుకు దానికి గిదేం పాడుబుద్ధి పుట్టిందోయ్! ఇసొంటోళ్లను జూసి మీలాంటి పొల్లగళ్లు చెడిపోకటే గదా" దుర్జెట్ట కాలం అనుకుంటూ సుట్ట ముట్టించుకున్నాడు. రాకేష్ ఏదో చెప్పబోతుండగానే నరేష్ ఆ మాటలకు అంతరాయం కలిగిస్తూ, "గా సారయ్య వాళ్ల ఇంటిదిక్కు పెద్ద మంట కనవడుతంది" అనేసరికి ముగ్గురు లేసి నిల్చున్నారు. అంతలోనే మంటలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏమీ అర్థంకాక మంటలవైపు పరుగుతీశారు స్నేహితులు. జెర పైలం పిలగండ్లు అనుకుంటూ నెగడు దగ్గరే ఉండిపోయాడు మల్లయ్య.


దాదాపు ఊరికి చివర ఉంది మంటలు కనిపిస్తున్న ఇల్లు. సారయ్య ఇళ్లనుకున్నారు కానీ తగలబడుతున్నది ఆ పక్కనే ఉన్న పద్మ ఇల్లు. వీళ్లిద్దరూ వెళ్లేసరికి ఇరుగుపొరుగు వాళ్ళందరూ లేచారు. కొందరు అటూఇటూ పరుగెత్తుతున్నారు.


కొందరికి అసలు ఏమైందో అర్థంకాక అలాగే బండల వోలె నిల్చున్నారు. అంత చలికాలం అందరికీ చెమటలు పట్టాయి. జనాలు అక్కడికి వచ్చేసరికే ఇంట్లోనుంచి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. మంటలు ఇల్లంతా కమ్మేసరికి ఇంట్లోవాళ్ళు బయటికి, బయటవాళ్ళు ఇంట్లోకి పోయే పరిస్థితి లేకుండా పోయింది. చెన్న ఇల్లు. ఇంటి లోపల మొత్తం టేకు కర్రతో చేసిన దూలాలు, వాసాలు. మంటలు ప్రళయాన్ని తలపిస్తున్నాయి.


కుండలతో కొందరు, బాకీట్లతో కొందరు ఎవరికి దోచినట్టు వాళ్ళు నీళ్లు తెచ్చి చల్లుతున్నారు. ఆ మంటల ముందు నీళ్లు కన్నీళ్ళుగా మారాయి. ఐదే ఐదు నిమిషాల్లో అరుపులు ఆగిపోయాయి. నిల్చున్న ముసలివాళ్ళు గుండెల మీద కొట్టుకుంటూ లబోదిబోమంటున్నారు. ఈలోపు ఊరు ఊరంతా అక్కడికి చేరింది. అందరి కనుగుడ్లలోనూ మంటలే జ్వలిస్తున్నాయి. వాళ్ళ కళ్ళముందే గంటలో ఇల్లు కాలి కూలింది. ఎవరు కాల్చారో కానీ సరిగ్గా మంటలు ఆరేసరికి ఫైర్ ఇంజన్ వచ్చింది. మిగిలిన మంటలను ఆర్పివేశారు ఫైర్ పోలీసులు.


అప్పటికి ఐదు గంటలవుతుంది. పోలీసులు వచ్చేసరికి ఆరు గంటలయింది. ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, ఏం జరిగి ఉంటుందో ఊహిస్తూ కథలు కథలుగా మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, జరిగిన ఘోరాన్ని జీర్ణించుకోలేక బూడిద మిగిలిన ఇంటిదిక్కే చూస్తూ కొందరు నిల్చున్నారు. అందరి ముఖాల్లోనూ యుద్ధం తరువాత మిగిలిన విషాదంలాంటి విషాదం స్పష్టంగా కనిపిస్తోంది.


సీఐ, ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లు జనం మధ్యలో నుంచి కాలిన ఇంటిముందుకు వచ్చి నిలబడ్డారు. చుట్టూ జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇంట్లో ఎవరెవరుంటారని సీఐ అడిగిన ప్రశ్నకు గుంపులోనుంచి ఎవరో, "పద్దుమ, ఆమె పెనిమిటి శీనయ్య సారు! ఇగో ఇప్పుడిట్ల వాళ్ల బతుకు అగ్గిపాలయింది" అనుకుంటూ నెత్తికొట్టుకుంటూ ఏడుస్తున్నాడు నడీడు మనిషి.


పోలీసులు అక్కడివాళ్లను వివరాలడిగి రాసుకుంటున్నారు. అక్కడికి మెల్లమెల్లగా చుట్టుపక్కల ఊళ్ళ వారు, చిన్నాపెద్ద నాయకులూ చేరుకుంటున్నారు. ఎనిమిది గంటలకల్లా ఊరు జనసముద్రమైంది.


నిల్చున్న జనాలను దొబ్బుకుంటూ కళ్ళ నిండా నీళ్లతో పరుగులాంటి నడకతో కాలిన ఇంటి ముందుకు వచ్చాడొక యాభై ఏళ్ళుండే మనిషి. అప్పటిదాకా ఏడుస్తున్న వాళ్లంతా బండబారిపోయారు. కొందరయితే దయ్యాన్ని చూసినట్టు భయపడసాగారు.


మందిలోనుంచి సారయ్య ఉరికి వచ్చి, "ఏందిరా శీనా? ఇంట్ల నువ్వు లేవా? మరి అదెవలు రా?" అనుకుంటూ కాలిన నల్లటి మాంసం ముద్దను చూపించిండు.


ఆ శవం మగవారిదేనని ఆనవాలు తెలుస్తుంది. కానీ గుర్తుపట్టేవిధంగా లేదు. శీనయ్య బతికే ఉన్నాడన్న సంగతి అందరికీ అర్థమైంది. అప్పటిదాకా ఏడుపులు, అర్థంకాని మాటలతో గజిబిజిగా ఉన్న ప్రదేశం కాస్త నిశ్శబ్దం ఒడిలోకి జారుకుంది. శీనయ్య ముఖంలో కవళికలు మారిపోయాయి. పోలీసులకు ఐదు నిమిషాలదాకా అక్కడ ఏం జరుగుతున్నదో అర్థం కాలేదు. కాసేపటికి తేరుకొని శీనయ్యకు తాగటానికి నీళ్లిచ్చి సీఐ ప్రశ్నల వర్షం కురిపించాడు.


లోపలి నుంచి పొంగుకొస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ సమాధానాలిచ్చాడు శీనయ్య. ఇదంతా నడుస్తున్న క్రమంలోనే తేజ ఏడుపు ముఖంతో అక్కడికి చేరుకున్నాడు. శీనయ్యను పట్టుకొని ఏడవసాగాడు. తేజ పద్మ శీనయ్యలకు ఏకైక సంతానం. హైదరాబాద్‌లో చదివి అక్కడే ఓ ప్రైవేటు ఉద్యోగం సంపాదించుకున్నాడు. మెల్లగా తేజ దగ్గరికి చేరుకున్నారు రాకేష్, నరేశ్. ఓదార్పుగా భుజం మీద చెయ్యి వేసారు.


వీళ్లు ముగ్గురూ ఐదవ తరగతి దాకా క్లాస్‌మేట్స్. ఒక కుర్చీ వేసి తేజను కూర్చుండబెట్టి ఇళ్ళు కాలిన దగ్గరి నుంచి వివరాలు చెప్పటం ప్రారంభించారు ఇద్దరు మిత్రులు. పోలీసులు కూడా వీళ్లు చెప్పేదంతా విన్నారు. పోలీసులకు లీలగా ఏదో అర్థమైంది. అక్కడ జరగవలసిన తంతు పూర్తిచేసుకొని వెళ్లారు. దర్యాప్తు ప్రారంభించారు. స్టేషన్‌లో ఎస్ఐతో సమావేశమయ్యాడు సీఐ.


"చంద్రకుమార్! ఈ కేసులో మీకేమన్న పాయింట్ దొరికిందా? మొదట ఇది అనుకోకుండా ఫైర్ ఆక్సిడెంట్ అయి ఇల్లు కాలిపోయి ఇంట్లోవాళ్ళు చనిపోయారనుకున్నాం.


కానీ చనిపోయింది భార్యాభర్తలు కాదు. ఇంతకుముందే వచ్చిన పోస్ట్మార్టం రిపోర్ట్ చూశావు కదా! అది పక్కూరు సర్పంచ్ శాంతయ్యది. వీళ్లిద్దరి మధ్య సంబంధం గురించి మన ఎంక్వయిరీలో సారయ్య ఇంట్లోవాళ్ళు చెప్పారు కదా! సో ఖచ్చితంగా ప్రీప్లాన్డ్గా ఎవరో ఒకరు ఇంటికి నిప్పు పెట్టి వాళ్ళను చంపేశారు. ఆ అవసరం వేరే ఎవరికో ఎందుకుంటుంది? భర్తకు తప్ప!" అంటూ ముగించాడు కేసు దాదాపు సాల్వ్ అయిందన్న సంతోషం ముఖంలో వెలుగుతుండగా.


రెండవరోజు ఎస్ఐ చంద్రకుమార్ ఇద్దరు కానిస్టేబుళ్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చుట్టూ అరకిలోమీటరు వరకు జల్లెడ పట్టారు. కాలిన ఇంటికి కాస్త దూరంలో తాగి పారేసిన నాలుగు బీర్లు, ఒక క్యాన్ కనిపించింది. క్యాన్ పెట్రోల్ వాసన కొడుతుంది. సీఐ చెప్పినట్టు ఇది పక్కా మర్డర్ ప్లాన్ అని నమ్మకం కుదిరింది. వాటిని జాగ్రత్తగా సేకరించారు. మరోసారి ఊరి పెద్దలవి, పద్మ ఇంటి చుట్టుపక్కల వాళ్ళవి వాంగ్మూలాలు తీసుకున్నారు.


సేకరించిన సమాచారాన్ని విశ్లేషించటం కోసం సీఐ గదిలోకి వెళ్ళాడు చంద్రకుమార్. "ఏమయ్యా! కేసులో ఏమన్నా పురోగతి ఉందా? త్వరగా సాల్వ్ చేయమని పై నుంచి ఒత్తిడి" అంటూ ఫైలు కోసం చేయి చాచాడు సీఐ.


"మనమనుకున్నట్టు పద్మ భర్త ఈ పని చేసి ఉండడు సార్!" అంటూ ఫైల్ అందించాడు.


ఆశ్చర్యంతో కూడిన ఆవేదనతో సీఐ ముఖంలో రంగులు మారిపోయాయి. దాదాపు కేసు సాల్వ్ అయిందనుకున్న దశలో ఈ మాటలు ఆయనలో చిన్నపాటి ఆందోళనను రేపాయి. "అంటే?" ఏమి అర్థంకాని మొహం పెట్టి సీఐ.


"నేను చేసిన ఎంక్వయిరీలో తేలిందేమిటంటే పద్మతో శీనయ్య సరిగా ఉండటం లేదు. గుడిపల్లిలో ఉండకుండా శ్రీరాంపూర్లో ఉన్న తన తల్లితో ఉంటున్నాడు. వాళ్లది ప్రేమ వివాహమట. మొదట్లో చిలకాగోరింకల్లా ఉండేవారట. ఈ మధ్యనే వాళ్ళ మధ్యకు శాంతయ్య వచ్చాడట. ఎంత చెప్పినా పద్మ గుణం మారకపోయేసరికి తానే దూరంగా ఉండటం ప్రారంభించాడు. ఆమె మీద ప్రేమ చావక అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాడట.


తన కొడుకు కూడా ఇందుకే రావటం మనేశాడట. తండ్రీకొడుకులను ఇద్దరినీ విచారించాను. ఇది వాళ్ళు చేసిన పని కాదు. పెట్రోల్ క్యాన్ మీద కానీ బీర్ సీసాల మీద కానీ ఉన్న వేలిముద్రలు వీళ్లతో మ్యాచ్ కాలేదు. సో, నిందితులు వేరే ఉన్నారు సార్" అంటూ ముగించాడు చంద్రకుమార్.


ఆ సాయంత్రం ఇంటికెళ్లిన సీఐ తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. ఏసీపీ గారు తనమీద పొలిటికల్ ప్రెషర్ ఉందని తొందరగా కేసు విషయం తేల్చాలని ఆర్డర్ వేశాడు. ఒంటరిగా తన గదిలోని టేబుల్ ముందు ఉన్న సోఫాలో ఒరిగి కళ్లుమూసుకున్నాడు. జరిగిందంతా ఒకసారి గుర్తుచేసుకున్నాడు.


సంఘటనలన్నీ ఒకదానివెంట ఒకటి సినిమా రీళ్లలా అలాఅలా పరుగెత్తుతున్నాయి. శాంతయ్య గురించి వివరాలు సేకరిస్తున్న సన్నివేశం దగ్గర టక్కున ఆగాడు. కళ్ళు తెరిచాడు. "యెస్! ఈ కేసుకు సంబంధించిన తాళం చెవి దొరికింది" చంద్రకుమార్కి వెంటనే కాల్ చేసి వివరాలు చెప్పాడు.


మరుసటి రోజు ఇద్దరూ సాయంత్రం గుడిపల్లి పక్కనే ఉన్న పొన్నారం బయలుదేరారు. శాంతయ్య ఇంటిదగ్గర వేసిన టెంటు కింద నలుగురైదుగురు కూర్చున్నారు. వాళ్ళ మధ్య ఆయన శాంతయ్య కొడుకు సంతోష్ నిర్వికారంగా కూర్చొని ఉన్నాడు.


పోలీసులను చూసి లోపటినుంచి సంతోష్ తల్లి శకుంతల వచ్చింది. ఆమె ముఖంలో ఏ భావాలు పలకడం లేదు. "అమ్మా! మీరు బాధలో ఉన్నారు. ఈ వార్త మీకు మరింత బాధ కలిగిస్తుందని తెలుసు. కానీ తప్పటం లేదు. మీ కొడుకును అరెస్ట్ చేస్తున్నాం" అని సీఐ చెప్పేసరికి అక్కడున్నవాళ్లలో కలకలం రేగింది - ఒక్క సంతోష్‌లో తప్ప.


శకుంతల నిర్ఘాంతపోయింది. భర్త పోయాడన్న విషయం కంటే ఈ వార్త ఆమె గుండెల్లో గునపంగా తగిలింది. అప్పటిదాకా గడ్డకట్టుకుపోయిన ఆమె కన్నీళ్లు ఏకకాలంలో రెండు నదులుగా చీలి ప్రవహించసాగాయి. ఆ పద్మ భర్త చేశాడేమో అనుకున్న హత్య స్వయంగా తన కొడుకే చేసాడని చెప్పటంతో శకుంతల నమ్మలేకపోయింది.


"ఆ పని నేనే చేశానని అనటానికి మీ దగ్గర ఆధారాలేం ఉన్నాయి" అన్నాడు సంతోష్ అక్కడ నెలకొన్న మౌనాన్ని బద్దలు చేస్తూ.


తన చేతిలో ఉన్న ట్యాబ్‌లో సీసీటీవీ ఫుటేజ్ చూపించాడు సీఐ. దానిలో తాను మిత్రులతో కలిసి క్యానులో పెట్రోలు కొట్టిస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. "ఇది చాలు, ఇంకేమైనా ఆధారాలు కావాలా?" కొంచెం కఠినంగా ధ్వనించింది గొంతు. సంతోష్ లొంగిపోక తప్పలేదు.


జీపులో బేడీలతో వెళ్తున్న సంతోష్ మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. నాన్న ఇంటినీ, తనను, అమ్మను పట్టించుకోకుండా తిరగటం, రాజకీయాల నెపంతో ఆస్తులు అమ్మటం, ఆ డబ్బులు పద్మ దగ్గర తగిలెయ్యటం, ఇంట్లో తరచూ గొడవలు జరగటం, అమ్మను తిట్టడం, కొట్టడం. ఇలా ఒక్కొక్కటే గుర్తుకురాసాగాయి.


ఈ పరిస్థితికి కారణమైన నాన్నను, పద్మను చంపి అయినాసరే అమ్మ జీవితంలో ప్రశాంతత నింపుదామనుకున్నాడు. కానీ జరిగిందేమిటి?


"ఇప్పుడు నాన్న లేడు. ధైర్యం చెప్పటానికి నేనూ లేను. అమ్మ ఒంటరిగా ఎలా బతుకుతుంది? ఇన్నాళ్లు అమ్మ జీవితాన్ని ఆ పాపిష్టి పద్మ నాశనం చేసిందనుకున్నాను. ఆమెకు జీవితమే లేకుండా చేశానని ఇప్పుడర్థమైంది". సంతోష్ కళ్ళనుంచి కారుతున్న నీళ్లు బేడీల మీద ఉన్న మైలను శుభ్రం చేస్తున్నాయి.

***


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.




తోకల రాజేశం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



తోకల రాజేశం

రచయిత పరిచయం: నా పేరు తోకల రాజేశం.

తోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు.వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు.ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం(2006),చెమట చుక్కలు(నానీలు-2010),పాతాళ గరిగె(సాహిత్య వ్యాసాలు-2013),అడవి దీపాలు(వచన కవిత్వం-2017),మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర(తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020),కొబ్బరి నీరా! శతకం(పదిమందితో కలిసి-2023),మట్టి విజయం(పద్యకవిత్వం-2024),ఆట సాగుతూనే ఉంటది(వచన కవిత్వం-2026)అనే పుస్తకాలు ముద్రించారు.తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం(2012),సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012),సాహితీ శిరోమణి పురస్కారం(2015),సినారె పురస్కారం(2023),తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page