మరణం

Maranam - Telugu Emotional Social Story | VVS Prasad
మరణం - తెలుగు భావోద్వేగ సామాజిక కథ | VVS ప్రసాద్
Published in manatelugukathalu.com on 14/10/2026
అందరి సమస్యలకు పరిష్కారం చూపిస్తూ, తన బాధను మాత్రం మౌనంగా దాచుకున్న రాఘవ జీవితంలో జరిగిన భావోద్వేగ ప్రయాణమే “మరణం…” తెలుగు కథ. బంధాలు, గుర్తింపు, ఆత్మగౌరవం, మనల్ని మనం ప్రేమించుకోవాల్సిన అవసరాన్ని ఈ కథ హృదయానికి హత్తుకునేలా వివరిస్తుంది.
ఆహ్వాన పత్రిక చాలా అందంగా ఉంది.
తెల్లటి నేపథ్యం. నల్లటి అక్షరాలు. మధ్యలో రాఘవ ఫోటో. ఫోటో కింద రెండు తేదీలు ఉండాల్సిన చోట ఒక్కటే ఉంది.
జననం: 17 ఆగస్టు 1971 మరణం: ___________ దాని కింద: “నా శ్రద్ధాంజలి సభకు మీరు తప్పక రావాలి.” తేదీ, సమయం, ఒక చిన్న ఫంక్షన్ హాల్ చిరునామా.
చివర్లో ఒక్క వాక్యం. “నేను బ్రతికుండగా మీకు చెప్పలేకపోయిన కొన్ని మాటలు… కనీసం నేను చనిపోయాననుకున్నప్పుడైనా వినండి.”
మొదట అందరూ అది ఏదో విచిత్రమైన జోక్ అనుకున్నారు. రాఘవ జోక్ చేసే మనిషే. తన మీద తానే జోక్ వేసుకుని అందరినీ నవ్వించగలడు. కానీ ఇలాంటి జోక్ చేయడు.
అతని చిన్ననాటి స్నేహితుడు మధు వెంటనే ఫోన్ చేశాడు. రింగ్ అయింది. ఎత్తలేదు. మళ్లీ చేశాడు. ఎత్తలేదు. “ఏంట్రా ఈ పిచ్చి? ఫోన్ ఎత్తు.” వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాడు.
రెండు టిక్కులు వచ్చాయి. నీలం కాలేదు. అరగంటలో కుటుంబ గ్రూపులు, స్నేహితుల గ్రూపులు ఒక్కసారిగా మేల్కొన్నాయి. “ఎవరైనా రాఘవతో మాట్లాడారా?” “నిన్న సాయంత్రం నాకు మెసేజ్ చేశాడు.”
“ఏమైనా ఆరోగ్య సమస్య ఉందా?” “లేదు కదా!” “ఇంట్లో ఏమైనా జరిగిందా?” కొన్ని నెలలుగా రాఘవ పెట్టిన మెసేజ్‌లకు రెండు రోజులు గడిచినా స్పందించని వాళ్లు కూడా ఆ రోజు ప్రతి ఐదు నిమిషాలకు అతని గురించి అడుగుతున్నారు.
రాఘవ ఫోన్ మాత్రం మౌనంగా ఉంది.
రాఘవను ఒక్క మాటలో చెప్పాలంటే.... ‘నేను ఉన్నాను’ అనే మనిషి. ఎవరైనా సమస్య చెప్పడం మొదలుపెడితే, వాళ్లు చెప్పడం పూర్తయ్యేలోపే అతని మెదడు పరిష్కారం కోసం పరుగెత్తేది. స్నేహితుడి కొడుక్కి కాలేజీ అడ్మిషన్ కావాలా? ఎవరికి ఫోన్ చేయాలో వెతికేవాడు.
బంధువుకి ఆసుపత్రిలో బెడ్ దొరకడం లేదా? రాత్రి పన్నెండు అయినా నాలుగు ఫోన్లు చేసేవాడు. ఆఫీసులో తనకు సంబంధం లేని జూనియర్‌కు అన్యాయం జరిగిందా? అధికారులతో వాదించేవాడు.
ఎవరికైనా హక్కుగా రావాల్సినది రాకపోతే, వాళ్లు అలసిపోయి వదిలేసినా రాఘవ వదిలేవాడు కాదు. “నీకు ఎందుకురా ఇవన్నీ?” చాలామంది అడిగేవారు. అతను నవ్వేవాడు. “మనకు జరిగినప్పుడు ఎవరో ఒకడు మన పక్కన నిలబడాలని కోరుకుంటాం కదా! మరి ఇంకొకరికి జరిగినప్పుడు మనం ఎందుకు నిలబడకూడదు?” అదే రాఘవ.
కానీ చాలా ఆలస్యంగా అతనికి ఒక నిజం అర్థమైంది. ప్రపంచంతో పోరాడుతున్నప్పుడు అతని వెనుక చాలామంది కనిపించేవారు. తనతో తాను పోరాడాల్సి వచ్చినప్పుడు మాత్రం వెనక్కి తిరిగి చూస్తే..... ఎవరూ ఉండేవారు కాదు.
రాఘవకు ఏ పనినీ సగంలో వదిలేయడం తెలియదు. ఏదైనా సాధించాలని అనుకుంటే అది అతనికి కోరిక కాదు... ఒక ప్రయాణం. మళ్లీ చదవాలనుకున్నాడు. “ఈ వయసులోనా?” అని నవ్వారు. చదివాడు. సాధించాడు. ఒక పోటీలో నిలబడాలనుకున్నాడు.
“ఇప్పుడు నీకెందుకు?” అన్నారు. గెలిచాడు. తన రంగంలో గుర్తింపు కావాలనుకున్నాడు. రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. పురస్కారాలు వచ్చాయి. సర్టిఫికెట్లు వచ్చాయి. వేదికల మీద అతని పేరు వినిపించింది. ఒకసారి అతను ఎన్నాళ్లుగానో ఆశించిన ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం అందుకున్నాడు.
ఆ రోజు ఇంటికి వస్తూ చిన్నపిల్లాడిలా ఉత్సాహపడ్డాడు. ఫోటో తీసి కుటుంబ గ్రూపులో పెట్టాడు. “Finally… achieved it.” ఒక గంట గడిచింది. రెండు గంటలు. ఒకరు 👍 పెట్టారు.
మరొకరు..... “Congrats.” అంతే. అదే సాయంత్రం ఒక బంధువు కొడుకు చిన్న కార్యక్రమంలో పాల్గొని ఒక మెమెంటో అందుకున్నాడు. గ్రూప్ ఒక్కసారిగా సందడిగా మారిపోయింది.
“Wow!” “Proud of you!” “Superstar!” “మన కుటుంబానికే గర్వకారణం!” రాఘవ ఒక్కో మెసేజ్ చదివాడు. ఆ పిల్లవాడి మీద అతనికి అసూయ లేదు. నిజానికి అందరికంటే ముందుగా..... “Congratulations champ! Keep going!” అని పెట్టింది అతనే.
తర్వాత ఫోన్ పక్కన పెట్టాడు. కొన్ని క్షణాలు మౌనంగా కూర్చున్నాడు. “బహుశా… నా విజయాలు వీళ్లకు అలవాటైపోయాయేమో.” అని తనకు తానే చెప్పుకున్నాడు. ఆ వాక్యం అతనికి ఓదార్పునిచ్చింది. నిజం కాదని తెలిసినా.
ప్రేమలోనూ రాఘవ అంతే. లెక్కలు వేసుకోలేదు. “నేను ఇంత చేశాను. నువ్వు నాకేం చేశావు?” అని ఎప్పుడూ అడగలేదు. తనకు ఇష్టమైన మనిషి సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాడు. వాళ్ల బాధలో తన నిద్రను వదులుకున్నాడు.
వాళ్ల భయాల్లో ధైర్యంగా నిలబడ్డాడు. వాళ్ల కలలను తన కలల్లాగే ప్రోత్సహించాడు. కానీ ఒక రోజు అతనికే ఒక మనిషి అవసరమయ్యాడు. పరిష్కారం కోసం కాదు. డబ్బు కోసం కాదు.
సలహా కోసం కాదు. కేవలం..... మాట్లాడటానికి. ఫోన్ చేశాడు. “కొంచెం మాట్లాడాలి…” అటువైపు నుంచి సమాధానం వచ్చింది. “ఇప్పుడా? కొంచెం బిజీగా ఉన్నాను.
రేపు మాట్లాడదాం.” “సరే.” అన్నాడు. రేపు రాలేదు. రాఘవ మళ్లీ అడగలేదు. అతనికి బాధ కలిగించింది ఆ రోజు ఫోన్ పెట్టేయడం కాదు. ‘కొంచెం మాట్లాడాలి’ అన్నప్పుడు తన గొంతులోని భారాన్ని కూడా గుర్తించలేనంత దూరం ఆ మనిషి వెళ్లిపోయాడన్న నిజం.
ఇలాంటి సంఘటనలు అతని జీవితంలో చాలా ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూస్తే చిన్నవే. అన్నీ కలిస్తే..... ఒక మనిషిని లోపల నుంచి ఖాళీ చేయగలిగినంత పెద్దవి. ఒకసారి స్నేహితుల సమావేశంలో ఎవరో రాఘవను చూపిస్తూ నవ్వారు.
“వీడికి ఒక ప్రాబ్లమ్ ఉందిరా.... ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా తానే పరిష్కరించాలి అనుకుంటాడు!” అందరూ నవ్వారు. రాఘవ కూడా నవ్వాడు. ఆ జోక్ వేసిన వ్యక్తి జీవితంలో అత్యంత కష్టమైన మూడు నెలలు అతని పక్కన తిరిగింది రాఘవే.
అది అతనికి గుర్తుంది. కానీ చెప్పలేదు. మరోసారి రాఘవ సాధించిన ఒక విజయాన్ని ఎవరో ప్రస్తావిస్తే ఒక బంధువు వెంటనే మాట మార్చాడు. “అదేముంది! ఈ రోజుల్లో చాలామంది చేస్తున్నారు.
మన శ్రీను కొడుకు తెలుసా? వాడు మాత్రం నిజంగా అద్భుతం…” రాఘవ నవ్వుతూ విన్నాడు. ఎప్పటిలాగే.
ఆ రాత్రి ఇంటికి వచ్చాక మాత్రం అద్దం ముందు కొద్దిసేపు నిలబడ్డాడు. “నాకు నిజంగా గుర్తింపు కావాలా? లేక… నా వాళ్ల నుంచి ఒక్కసారి ‘నిన్ను చూసి గర్వంగా ఉంది’ అనే మాట కావాలా?” సమాధానం అతనికి తెలుసు.
రెండోది. అది తెలుసుకున్నప్పుడు తన మీద తనకే కోపం వచ్చింది. జీవితంలో ఎన్నో పెద్ద పోరాటాలు గెలిచిన మనిషి..... నాలుగు ప్రేమపూర్వకమైన మాటల కోసం ఇంకా ఎదురుచూస్తున్నాడు.
అయినా అతను మారలేదు. ఫోన్ వస్తే ఎత్తేవాడు. “రాఘవా… చిన్న సహాయం.” “చెప్పు.” ఎవరో ఏడుస్తూ ఫోన్ చేస్తే గంటసేపు వినేవాడు. ఎవరికైనా ధైర్యం తగ్గితే..... “నువ్వు చేయగలవు. నేను ఉన్నాను.” అనేవాడు.
నేను ఉన్నాను. ఆ మూడు మాటలు జీవితంలో ఎంతోమందికి చెప్పాడు. ఒక రాత్రి మాత్రం..... అవే మూడు మాటలు తనకు ఎవరైనా చెబితే బాగుండుననిపించింది.
రాత్రి రెండు దాటింది. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. రాఘవ బాల్కనీలో ఒంటరిగా కూర్చున్నాడు.
అది ఏ ఒక్క సంఘటన వల్ల వచ్చిన బాధ కాదు. ఏళ్ల తరబడి బలంగా ఉండటం వల్ల వచ్చిన అలసట. ఏళ్ల తరబడి పేరుకుపోయిన మౌనం. ఫోన్ తీసుకున్నాడు. Contacts తెరిచాడు.
మధు. చిన్ననాటి స్నేహితుడు. Call చేయబోయాడు. ఆగిపోయాడు. “నిద్రపోతుంటాడు.” మరొక పేరు. “ఇంట్లో ఉంటాడు… ఎందుకు disturb చేయడం?” ఇంకొకరు. “వాడికి రేపు meeting ఉందన్నాడు.”
మరో పేరు దగ్గర వేళ్లు ఆగిపోయాయి. కొద్దిసేపు చూస్తూ ఉండి Call నొక్కాడు. రెండు రింగులు. కట్ అయింది. కొద్దిసేపటికి మెసేజ్ వచ్చింది. “Everything okay? Can we talk tomorrow?” రాఘవ టైప్ చేశాడు. “Nothing. All good 😊” Send. ఆ నాలుగు పదాలు పంపిన తర్వాత అతని కళ్ల నుంచి నీళ్లు వచ్చాయి.
ఎన్నేళ్ల తర్వాత వచ్చాయో అతనికే గుర్తులేదు. ఈసారి తుడవలేదు. ఆ రాత్రి అతనికి మొదటిసారి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. తనకు పరిచయస్తులు చాలా మంది ఉన్నారు.
తన విజయాలు తెలిసినవాళ్లు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. తన సహాయం పొందినవాళ్లు లెక్కలేనంత మంది ఉన్నారు. కానీ రాత్రి రెండు గంటలకు..... “నేను బాగోలేను” అని ఎలాంటి సంకోచం లేకుండా చెప్పగలిగే మనిషి ఒక్కరూ లేరు. ఆ నిజం అతన్ని భయపెట్టింది.
మరుసటి ఉదయం మామూలుగానే లేచాడు. వాకింగ్ చేశాడు. కాఫీ తాగాడు. రెండు ఫోన్ కాల్స్ చేశాడు. ఒక స్నేహితుడి పని పూర్తి చేశాడు. నవ్వాడు కూడా. ఎవరికీ ఏమీ తెలియలేదు.
ఎందుకంటే..... బాగా విరిగిపోయిన వాళ్లందరూ ఏడుస్తూ కనిపించరు. కొంతమంది మరింత మామూలుగా కనిపిస్తారు. అదే రోజు సాయంత్రం ఒక ప్రింటింగ్ ప్రెస్‌కి వెళ్లాడు.
“ఒక invitation design చేయాలి.” “ఏ function సార్?” రాఘవ కొద్దిసేపు ఆలోచించాడు. చిన్నగా నవ్వాడు. “నా శ్రద్ధాంజలి.” డిజైనర్ అతని ముఖం చూశాడు. “సార్…?” “మీరు డిజైన్ చేయండి.”
ఆదివారం. ఆహ్వానంలో ఉన్న ఫంక్షన్ హాల్ ముందు కార్లు వరుసగా ఆగుతున్నాయి. లోపలికి అడుగుపెట్టిన వాళ్లు ఒక్కొక్కరుగా నిశ్శబ్దమయ్యారు.
అది సాధారణ శ్రద్ధాంజలి సభలా లేదు. హాల్ మధ్యలో రాఘవ పెద్ద ఫోటో. దానికి పూలమాల లేదు.
ఫోటో ముందు ఒక ఖాళీ కుర్చీ. పక్కన చిన్న టేబుల్. దాని మీద అతను జీవితంలో సంపాదించిన కొన్ని మెడల్స్, అవార్డులు, సర్టిఫికెట్లు. వాటి పక్కనే కొన్ని పాత ఫోటోలు.
స్నేహితులతో. బంధువులతో. కుటుంబంతో. ప్రతి ఫోటో కింద ఒక్క వాక్యం. “ఈ రోజు ఇతనికి నేను అవసరమయ్యాను.” మరో ఫోటో..... “ఆ రాత్రి మూడు గంటల వరకు ఇతనితో ఆసుపత్రిలో ఉన్నాను.” మరోటి..... “ఆమె ఏడుస్తుంటే నాలుగు గంటలు విన్నాను.”
ఇంకొకటి..... “ఇతను ఓడిపోయానన్నప్పుడు.... ‘నేను ఉన్నాను’ అన్నాను.” చివర్లో ఒక ఖాళీ ఫ్రేమ్. దాని కింద..... “నాకు ఎవరో అవసరమైన రోజు..... ?” ఎవరూ మాట్లాడలేదు.
కొంతమందికి ఆ ఫోటోల్లో ఉన్న సంఘటనలు తమ జీవితంలో జరిగినవేనని గుర్తొచ్చాయి. తలలు నెమ్మదిగా వంగాయి.
హాల్లో లైట్లు తగ్గాయి. స్క్రీన్ వెలిగింది. రాఘవ కనిపించాడు. రికార్డ్ చేసిన వీడియో. అతను నవ్వుతున్నాడు. “వచ్చినందుకు థాంక్యూ.” కొద్దిసేపు ఆగాడు. “భయపడకండి.
నేను చనిపోలేదు.” హాల్లో ఒక్కసారిగా గుసగుసలు. “నేను బాగానే ఉన్నాను.” మళ్లీ చిన్న విరామం. “కానీ ఈ రోజు మిమ్మల్ని ఎందుకు పిలిచానో చెప్పే ముందు… ఒక ప్రశ్న.” స్క్రీన్ మీద పదాలు కనిపించాయి.
“నేను మీ జీవితంలో ఎప్పుడు గుర్తొచ్చాను?” రాఘవ స్వరం మళ్లీ వినిపించింది. “మీకు అవసరం వచ్చినప్పుడా?” మౌనం. “మీకు సమస్య వచ్చినప్పుడా?” మధు తల వంచుకున్నాడు. “ఎవరితోనైనా మాట్లాడాలని అనిపించినప్పుడా?” ఒక మహిళ కళ్లలో నీళ్లు తిరిగాయి. “మీకు అన్యాయం జరిగినప్పుడా?” వెనుక వరుసలో కూర్చున్న వ్యక్తి కళ్లద్దాలు తీసి కళ్లను తుడిచాడు.
“మీ మీద నాకు కోపం లేదు.” రాఘవ అన్నాడు. “అదే నా సమస్యేమో.” చిన్నగా నవ్వాడు. “నేను మనుషుల్ని చాలా సులభంగా క్షమిస్తాను. వాళ్ల పరిస్థితిని వాళ్లకంటే ముందే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.” “నన్ను పట్టించుకోకపోతే.. బిజీగా ఉన్నారనుకున్నాను.” “నా విజయాన్ని చిన్నది చేస్తే.. వాళ్లకు దాని విలువ అర్థం కాలేదనుకున్నాను.”
“నేను ప్రేమించినంతగా నన్ను ప్రేమించకపోతే.. ప్రేమను కొలవకూడదనుకున్నాను.” “నన్ను ఎగతాళి చేసినా.. స్నేహంలో ఇవన్నీ సహజమనుకున్నాను.” అతని ముఖంలోని చిరునవ్వు మాయమైంది. “ప్రతి ఒక్కరికీ ఒక explanation ఇచ్చాను.” కొద్దిసేపు మౌనం. “నాకు తప్ప.”
“నేను మీ నుంచి repayment అడగలేదు.” “నేను చేసిన సహాయానికి ప్రతిఫలం అడగలేదు.” “నేను ఇచ్చిన ప్రేమకు లెక్క అడగలేదు.”
“నా విజయాలకు చప్పట్లు కూడా అడగలేదు.” అతని గొంతు మొదటిసారి కొద్దిగా బరువైంది.
“నాకు కావలసింది…” ఆగాడు. “ఒక్క రోజు… నేను బలంగా ఉండాల్సిన అవసరం లేని ఒక మనిషి.” హాల్లో కొందరు తలలు వంగిపోయాయి. “ఒక్కసారి నేను ‘అలసిపోయాను’ అంటే..... ‘పర్లేదురా… ఈ రోజు నువ్వు పోరాడకు.
నేను ఉన్నాను’ అని చెప్పే ఒక గొంతు.”
వీడియో ఆగిపోయింది. లైట్లు వెలిగాయి. అందరూ ఇంకా స్క్రీన్ వైపే చూస్తున్నారు. అప్పుడే హాల్ వెనుక తలుపు తెరుచుకుంది. రాఘవ లోపలికి వచ్చాడు.
ఎవరూ కదల్లేదు. అతను నెమ్మదిగా ముందుకు నడిచి తన ఫోటో ముందు ఉన్న ఖాళీ కుర్చీలో కూర్చున్నాడు. మధు లేచి అతని దగ్గరకు రాబోయాడు. రాఘవ చేతితో ఆపాడు.
“ఒక్క ఐదు నిమిషాలు.” మధు ఆగిపోయాడు. రాఘవ అందరినీ చూశాడు. “మీరు ఈ రోజు వచ్చారు.” “నేను చనిపోయానేమో అన్న భయంతో.” చిన్నగా నవ్వాడు. “విచిత్రం కదా?” “బ్రతికున్న మనిషికి అరగంట ఇవ్వడం కష్టం.
చనిపోయిన మనిషి కోసం ఒక రోజు ఖాళీ చేసుకోవడం మాత్రం చాలా సులభం.” ఎవరూ అతని కళ్లలోకి చూడలేకపోయారు.
“ఇది మిమ్మల్ని అవమానించడానికి పెట్టిన సభ కాదు.” “మీకు guilt ఇవ్వడానికి కూడా కాదు.” “నాకు నేను ఒక విషయం చెప్పుకోవడానికి.” అతను తన ఫోటో వైపు చూశాడు.
“నేను ఇన్ని సంవత్సరాలు ఒక తప్పు చేశాను.” “మంచివాడిగా ఉండటం అంటే అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండటం అనుకున్నాను.”
“ప్రేమించడం అంటే మనల్ని మనం పూర్తిగా ఇచ్చేయడం అనుకున్నాను.” “స్నేహం అంటే వాళ్లు ఎన్ని సార్లు గాయపరిచినా అర్థం చేసుకోవడం అనుకున్నాను.”
“బంధం అంటే మన విలువను వాళ్లు గుర్తించకపోయినా అక్కడే ఉండటం అనుకున్నాను.” తల ఊపాడు. “కాదు.”
అతను లేచాడు. ఫోటో దగ్గరకు వెళ్లాడు. టేబుల్ మీద ఉన్న మార్కర్ తీసుకున్నాడు. ఫోటో కింద ఉన్న..... మరణం: ___________ అనే ఖాళీ దగ్గర ఏదో రాశాడు.
అందరూ చూస్తున్నారు. అతను పక్కకు తప్పుకున్నాడు. “మరణం: ఇతరుల అంగీకారం కోసం బ్రతికిన రాఘవ..... ఈ రోజు.”
దాని కింద మరో వాక్యం. “పునర్జన్మ: తన విలువ తనకు తెలిసిన రాఘవ..... ఇదే రోజు.”
అతని తల్లి ఏడుస్తూ లేచింది. ఈసారి రాఘవ ఆమెను ఆపలేదు. ఆమె దగ్గరకు వచ్చి ఏమీ మాట్లాడకుండా అతని తలను తన భుజం మీద పెట్టుకుంది.
అంతవరకు ఎంతో ధైర్యంగా నిలబడిన రాఘవ ఒక్కసారిగా కదలకుండా ఉండిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత అతని కళ్ల నుంచి నీళ్లు జారాయి. అవి ఆ రోజు వచ్చిన కన్నీళ్లు కావు.
ఏళ్లుగా రాని కన్నీళ్లు. అమ్మ అతని తల నిమురుతూ అంది..... “ఈ రోజు నువ్వేమీ చెప్పకు నాన్నా… నేను వింటాను.” అంతే. రాఘవ ఏడ్చేశాడు. అక్కడున్న చాలామంది అతన్ని మొదటిసారి అలా చూశారు. ఎప్పుడూ పరిష్కారం చెప్పే రాఘవ.
ఎప్పుడూ ధైర్యం చెప్పే రాఘవ. ఎప్పుడూ ఇంకొకరి కన్నీళ్లు తుడిచే రాఘవ. ఆ రోజు..... తన కన్నీళ్లు తుడుచుకోలేదు.
కొద్దిసేపటి తర్వాత మధు అతని దగ్గరకు వచ్చాడు. “రాఘవా…” రాఘవ చూశాడు. మధు ఏదో చెప్పబోయాడు. మాట రాలేదు. ఫోన్ తీసి స్క్రీన్ చూపించాడు. ఒక missed call.
అదే రాత్రి. “ఆ రోజు రాత్రి రెండు గంటలకు… నువ్వు నాకు కాల్ చేశావా?” రాఘవ స్క్రీన్ వైపు చూశాడు. “ఉదయం చూశానురా. తిరిగి చేయాలనుకున్నాను… మర్చిపోయాను.” రాఘవ ఏమీ అనలేదు. మధు కళ్లలో నీళ్లు.
“ఏం చెప్పాలనుకున్నావు?” రాఘవ కొద్దిసేపు అతన్ని చూశాడు. తర్వాత చిన్నగా నవ్వాడు. “ఇప్పుడు గుర్తులేదు.” ఇద్దరికీ తెలుసు. అది అబద్ధం.
అందరూ వెళ్లడం మొదలుపెట్టారు. ఈసారి ఎవరూ..... “మేమంతా మారిపోతాం.” “ఇక నుంచి ఎప్పుడూ నీతోనే ఉంటాం.” అని వాగ్దానాలు చేయలేదు. రాఘవకు కూడా అవి అవసరం లేదు. మార్పు మాటల్లో మాత్రమే ఉంటే..... అది మళ్లీ మరో ఆహ్వాన పత్రిక దగ్గరే ముగుస్తుందని అతనికి తెలుసు.
హాల్ ఖాళీ అయింది. రాఘవ ఒక్కడే తన ఫోటో ముందు నిలబడ్డాడు. ఆహ్వాన పత్రికలోని ఒక కాపీ తీసుకున్నాడు. చింపేయబోయాడు. ఆగిపోయాడు.
మడతపెట్టి జేబులో పెట్టుకున్నాడు. తలుపు దగ్గరకు నడిచాడు. బయట సాయంత్రం వెలుతురు. ఫోన్ మోగింది. స్క్రీన్ మీద ఒక పేరు. చూశాడు. మొదటిసారి..... వెంటనే ఎత్తలేదు. రింగ్ ఆగిపోయింది. కొన్ని అడుగులు వేసిన తర్వాత ఫోన్ తీసుకున్నాడు.
Call back చేయలేదు. ఒక చిన్న మెసేజ్ టైప్ చేశాడు. “కొంచెం నా కోసం నేను ఉండాలి. తర్వాత మాట్లాడతాను.” Send. ఫోన్ జేబులో పెట్టుకున్నాడు. అతని ముఖంలో చిన్న చిరునవ్వు. అది ప్రపంచాన్ని గెలిచిన మనిషి నవ్వు కాదు.
ఎవరో తన విలువ గుర్తించినందుకు వచ్చిన నవ్వూ కాదు. తన విలువను గుర్తించడానికి ఇక ఇంకొకరి అనుమతి అవసరం లేదని తెలుసుకున్న మనిషి నవ్వు. ఆ రోజు రాఘవ చనిపోలేదు. కానీ ఒక రాఘవ నిజంగానే చనిపోయాడు.
అందరి కోసం పరుగెత్తుతూ తనను తాను వెనక్కి వదిలేసిన రాఘవ. అందరి కన్నీళ్లు తుడుస్తూ తన కన్నీళ్లకు చోటివ్వని రాఘవ.
ప్రేమను అడగకుండా ఇచ్చి, తిరిగి రాకపోయినా తనలోనే తప్పు వెతికిన రాఘవ. తన విజయాలను చిన్నవి చేసిన ప్రతిసారీ మరింత పెద్దది సాధిస్తే వాళ్లు గుర్తిస్తారని నమ్మిన రాఘవ. అతను ఆ హాల్లోనే మిగిలిపోయాడు.
బయటకు నడిచిన మనిషి కూడా..... అదే రాఘవ. కానీ మొదటిసారి… తన పక్కన తానే ఉన్న రాఘవ.
సమాప్తం -
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
VVS ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: VVS ప్రసాద్
నేను కేంద్ర ప్రభుత్వం లో పని చేసి 2024 లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి ఉన్న అభిరుచి తో రచనా వ్యాసంగం మొదలుపెట్టాను. నాకున్న ఇతర అభిరుచులు.. ఫోటోగ్రఫీ, మార్షల్ ఆర్ట్స్, సంగీతం.






Comments