మార్జాల మాయ
- Yasoda Gottiparthi
- Jun 26
- 6 min read
Updated: Jun 27
#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #MarjalaMaya, #మార్జాలమాయ, #పిల్లలకథలు, #TeluguChildrenStories, #Fantacy

Marjala Maya - New Telugu Story Written By - Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 26/06/2025
మార్జాల మాయ - తెలుగు కథ
రచన: యశోద గొట్టిపర్తి
ఎడ తెగకుండా మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షం వరదలతో వీధి, వాడలన్నీ ప్రవాహాలుగా తలపిస్తున్నాయి. కారణమేంటంటే దగ్గర్లో ఉన్న చెరువు గట్టు తెగి, ఆ నీళ్లు నగరంలోని కాలనీలోకి రావడం వల్ల ఇళ్లలోనికి చేరాయి. రాత్రి నుండి ఉదయం వరకల్లా రోడ్డు మీద నుండి నీళ్లు ఇళ్లలోకి వస్తాయేమో అని వకుళ క్రిందనున్న వస్తువులన్నీ అటకల పైకి చేరుస్తూనే ఉంది.
కొడుకు రవిని బడికి పంపాలని గబగబా వంట చేసి స్టీలు డబ్బాలో పెట్టీ పంపిద్దామని బయటకు తీసుకెళ్తుంటే, అప్పటికి బడికి వెళ్ళిన పిల్లలు తిరుగు ముఖం పట్టి వస్తున్నారు. బడి లేదు సెలవులు ఇచ్చారు అని గట్టిగా అరుస్తుంటే..
రవి “భలే భలే అమ్మా! బడి లేదంట” అని వేసుకున్న చెప్పులను విడిచి వస్తుంటే, “ఒరే.. వాళ్ళు చిన్న తరగతి వాళ్ళు. నీవు పెద్ద తరగతిలో చదువుకుంటున్నావూ..” అంది వకుళ.
పక్కింటి పంతులమ్మ ఇంట్లోకి అడుగుపెడుతూనే,
“అమ్మా! బడికిసెలవులు ఇచ్చారు రెండు రోజులు. బయట వీధులన్నీ జలమయాలయ్యాయి. ప్రమాద హెచ్చరిక జారీ చేశారు".. అంది.
దాంతో ఇంట్లోనే ఉన్నాడు రవి.
ఆ వరదలలో ఒక పిల్లి కొట్టుకొని వచ్చింది. రవి వెంటనే దాన్ని ఎత్తుకొని ముద్దుగా చూస్తూ టవల్తో ఒళ్లంతా తుడిచి, ‘కాస్త ఎండ వస్తే బాగుండు’ అనుకున్నాడు. రాదని తెలిసి వెచ్చటి దుప్పటిలో పడుకోపెట్టాడు.
“ఒరేయ్ రవి! మనకే నీడ లేక నీళ్లలో ఎలా! అనుకుంటుంటే ‘తానుదూర సందు లేదు మెడకో డోలు’ అన్నట్లు ఈ పిల్లిని చంకన పెట్టుకొని ఎలా తిరుగుతావురా?"
“అమ్మా! అది మూగ జీవి. దానికి మాటలు రావు. అంతే కదా! మనలాగే ప్రాణి. "
“ఇలా వచ్చిన వాటి నల్ల ఇంట్లో పెట్టుకో. ఇల్లు జంతుప్రదర్శనశాల అవుతుంది” కోపంగా అంది వకుళ.
“మెల్లగా పిల్లి తల నిమురుతూ, “ఓ పిల్లి! నీకు చెట్టు ఎక్కడం వచ్చు.. కానీ ఇలా నీళ్లలో ఎలా ఈదావు, మునిగిపోతావు కదా!" అంటుంటే మౌనంగా తలూపు తుంది అనుకుంటే, "నేను ఎగరగలను రెక్కలు లేకుండా" అన్నది.
“ఓ.. అయితే నీకు మాటలు కూడా వచ్చా” అంటూ,
“అమ్మా! పిల్లి మాట్లాడుతుంది” అని చెప్పుతుంటే,
“హుష్ ! మెల్లగా.. అందరికీ చెప్పొద్దు. నేను నీతో మాత్రమే మాట్లాడుతాను. "
“ఎందుకు అలా? అందరితో మాట్లాడవచ్చు కదా!”
“నేను ఇలా ఎవరి ఇంటికి వెళ్లినా చేరదీయకుండా తరిమి కొట్టారు. నీవు ఒక్కడివి మాత్రమే నన్ను దగ్గరకు తీసుకొని ముద్దు చేస్తున్నావు. చూడు.. ఇంతకుముందు మీ అమ్మ కూడా చీదరించుకుంది. నేను ఎంతో బాధపడ్డాను. నన్ను బాధ పెట్టిన వాళ్ళని సంతోష పెట్టాలా చెప్పు. ?” అంటూ.. “కానీ నేను వాళ్లకు హాని చేయను.” అంది.
“నువ్వు ఎగురుతూ వస్తూ ఉంటే ఎవరూ చూడలేదా?” అన్నాడు రవి.
“ఆకాశంలో ఎగురుతున్నాను. పైగా వర్షము, అందరూ కిందనే నీళ్లలో జాగ్రత్తగా నడుస్తున్నారు. ఇంక నన్ను ఎక్కడ చూస్తారు?”
“అలసిపోయావు, అయితే నీకు పాలు తెస్తాను” అని, అలాగే ఫ్రిజ్లో ఉన్న ఐస్ క్రీములు అన్ని తెచ్చి కప్పులో పోసి త్రాగమన్నాడు.
కాసేపట్లో వరదలు ఎక్కువైనాయి. అందరూ ఇళ్ళు ఖాళీ చేసి వెళ్తున్నారు. రేడియో పాటల మధ్యలో వార్తలు వినవచ్చాయి. మరికొద్ది గంటల్లో భారీ వర్షాల సూచన.
ఇప్పటికే నీళ్లు ఇంట్లోకి రావడం ఎక్కువైంది, రాత్రి వరకల్లా ఇల్లంతా నిడుతాయేమో? ఇదంతా లోతట్టు ప్రాంతం అంటూ ఇంటికి తాళం వేసి ఏదైనా హోటల్ గదుల్లో ఉందామని తల్లి తండ్రి మాట్లాడుకుంటుంటే విన్నాడు రవి.
‘అయ్యో! పిల్లిని తీసుకపోనిస్తారో లేదో’ లోలోపల ఆలోచిస్తున్నాడు.
పాలు తాగిన పిల్లి మూతి అంతా నాక్కుoటూ ఇల్లంతా హుషారుగా తిరగసాగింది. రవి సంతోషంతో కేరింతలు కొట్టాడు.. పిల్లికి బలం వచ్చిందని.
రోడ్డుమీద నడుస్తుంటే ఆకాశం లో ఎగిరే విమానం ఎక్కాలని భలే సరదాగా ఉంటుంది రవికి. ఈ వరదల్లో అలా ఆకాశంలో ఎగిరితే ఎంత బాగుంటుందో అనుకున్నాడు.
వెంటనే పిల్లి "నేను నిన్ను ఆకాశంలో తీసుకుపోతాను " అన్నది.
“నా మనసులో మాటలు నీకెలా తెలిసాయి. వినిపించాయా? నీకు ముద్దు పేరు పెట్టాను” అని "చిక్లూ" అని పిలిచాడు.
“నాకు పేరు కూడా పెట్టావా!” అంది. “నాకు ఫ్రెండ్ అయ్యావు. నాలాగా అన్ని చేయాలనుకుంటున్నావు. అందుకే అడిగాను. థాంక్యూ!
"నిజంగానా నన్ను ఆకాశంలో తిప్పుతావా!” అంటూ చాలా సంతోషపడ్డాడు.
“అయినా నువ్వేమో చిన్నగా ఉన్నావు. నన్నెలా మోస్తావు.. క్రింద పడిపోతాను” అన్నాడు రవి.
“భయం వద్దు రవి, నువ్వే నా చెవులు పట్టుకుని కూర్చో. మీ నాయనమ్మ నీకు కథలు చెప్పలేదా! వాటిలో వినాయకుని కథ గుర్తుకు తెచ్చుకో! చిన్ని ఎలుక మీద కూర్చొని పెద్ద బొజ్జ ఉన్న వినాయకుడు ఎలా భూమండలం అంతా తిరిగి వస్తుంటాడు.. అలాగే నేను నిన్ను తిప్పుతాను. ఓం గణేశాయ నమః ! అంటూ రా” అన్నది.
‘మరి పిల్లితో కలిసివెళ్లడం ఎలా?’ అనుకుంటుంటే తల్లి, “మనం మెల్లగా ఆ నీళ్లు లేని చోట చూస్తూ నడుస్తూ వెళ్లాలి. ఆ పిల్లిని వదిలిపెట్టు. దాన్ని ఎక్కడ మోస్తావు?” అన్నది.
‘నన్నే అది మోస్తుంది అమ్మా! చూస్తావుగా’ అని లోలోపల అనుకున్నాడు రవి.
“నీవు మా ఇద్దరి చేయి పట్టుకుని నడవాలి కొంత దూరం వరకు. ఆ తర్వాత ఏదైనా వాహనంపై వెళ్దాము.”
“చిక్లు పిల్లి తోవెళ్ళాలి కదా. ఎలా..” అనుకుని నడుస్తు న్నాడు.
“నాన్న.. నా కాళ్లు నొప్పులు పెడుతున్నాయి. "
“నడవాలి రవి.. మరి ఆ పిల్లిని ఎత్తుకుంటే కాళ్లు నొప్పి పెట్టకపోతే ఏమవుతుంది?” అన్నాడు తండ్రి.
“అయితే కాసేపు కూర్చో” అనగానే “మా స్నేహితులు రిక్షాలో పోతున్నారు. నన్ను రమ్మంటున్నారు.సైగలు చేస్తున్నారు. నేను, పిల్లి వెళ్లి అందులో కూర్చుంటాము.”
“సరే వెళ్ళు రవి మళ్ళీ మరొక రిక్షా వస్తే మేము వస్తాము.”
“సరే అమ్మ” అంటూ రిక్షాలో కూర్చోగానే కొద్దిసేపటికి పిల్లి 'మియ్యావ్' అంటూ అరుస్తూ వాళ్ళ మీదికి దుమకడం మొదలుపెట్టింది. వాళ్ళు చీదరించుకోవడం రవికి ఇష్టం కాలేదు.
రిక్షావాలాను కొంచెం పక్కకు ఆపమని చెప్పి కిందకు దిగాడు పిల్లి తో..
రిక్షా కొంచెం ముందుకు కదలగానే పిల్లి నేల మీద నిలబడి “నా మీద కూర్చో” అని చెప్పింది.
చెప్పినట్టు చేయగానే వెంటనే అమాంతంగా ఆకాశంలోకి ఎగిరింది. తన కోరిక తీర పోతూంది. ఆకాశంలో విమానంలో వెళుతున్నట్టు ఊహించుకుంటూ పిల్లి రెండు చెవులు గట్టిగా పట్టుకున్నాడు. తల్లి తండ్రి దగ్గరికి చేర్చింది. అందరూ కలిసి వరదలు తగ్గుముఖం వరకు హోటల్ లో ఉన్నారు.
**********
రెండురోజుల తర్వాత తమ ఇంటికి చేరారు. ఇల్లంతా శుభ్రం చేసుకున్నారు. వీధిలో కలకలం చూసి బయటకు వచ్చి “ఏం జరిగింది? అందరూ ఇలా చకచకా నడుస్తూ ఎటువైపు వెళుతున్నారు ? అని అడిగింది వెళ్లే వాళ్లను.
అందులో కొందరు “అమ్మా! అక్కడ దేవుళ్ళ ప్రతిమల ఆరాధన జరుగుతుందట చూడడానికి వెళుతున్నాము" అని చెప్పారు.
“అవునా! అదేమిటో నేను చూస్తాను” అంటూ వెళ్ళింది.
చిన్న ఇల్లుm దాని ముందు ఒక బల్లపై పరిశుభ్రమైన వస్త్రం పరచి, పూలు, పళ్ళూ, అగరవత్తులు దీపాలంకరణలతో "సీతా రామ లక్ష్మణ" విగ్రహములు పెట్టి పూజలు చేస్తున్నారు.
“ఇక్కడ ఇంతకుముందు దేవాలయం లేదు. ఈ పూజలు ఏంటి?” అని అడిగితే “ఇవి మొన్నటి పరదల్లో కొట్టుకొని వచ్చిన విగ్రహాలు. అక్కడ పూజ చేసే అతని ఇంటి ముందు కనిపించాయట. పూజలు చేయడం మొదలుపెట్టారు.. అందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు.”
వివరాలు తెలుసుకొని వచ్చి భర్తతో చెబుతుండగా, రవి విని పిల్లితో కలిసి బయలుదేరాడు.
******
దారిలో కుక్కల గుంపు, రెండు మూడు కలిసి ఎక్కడో దూరంగా చెట్టు చాటునుండి చూసి రవి వెంబడి పడ్డాయి.
ఎందుకో అర్థం కాలేదు.
రవిని చూడగానే “రా రవి! రారా! ఏమీ తోచక పిచ్చెత్తినట్లు ఉంటుంది. మా శత్రువు నీ చేతిలో ఉంది. పోట్లాట లేక చాలా కాలమైంది” అని పిల్లి పైకి జంప్ చేస్తున్నాయి.
వాటి లోపలి భావాలు పిల్లికి అర్థమైంది.
“ఏం చేద్దాము చిక్లూ! నాకు భయమేస్తుంది" అన్నాడు రవి.
“నువ్వేమీ భయపడకు! నేను నిన్ను మోసుకుని ఎగురు తాను కదా! " అన్నది పిల్లి.
“అందుకేనా భయపడకు అంటున్నావు” అన్నాడు రవి.
పైకి ఎగిరిన వారిద్దరినీ చూసి చేసేది లేక తోకలు ముడుచుకొని వెళ్లిపోయాయి కుక్కలు. మళ్ళీ ఎప్పుడైనా దారిలో పిల్లులు కనిపిస్తే బెదిరించకుండా స్నేహంగా చూస్తున్నాయి.
“భూమి మీద కోడి పిల్లలు బెదురుతున్నాయి. పాపం రెక్కలు టపటప మంటూ తమ పిల్లల్ని దాచుకోమని చెప్తున్నాయి. చిక్లూ.. నిన్ను చూసి భయపడుతున్నాయి. మరి ఇప్పుడు మనం కిందికి దిగితే బెదిరిపోతాయేమో? ఎలా?”
“అవి మనల్ని చూడకుండా ఉండాలంటే నీ జేబులో ఏమన్నా ఉన్నాయేమో చూడు..” అని అన్నది పిల్లి.
“నా జేబులోనా? అని తడిమి చూసుకొని.. ఆ..ఆ.. ఉన్నాయి కొన్ని పుట్నాలు, పేలాలు. అమ్మ కొన్ని జేబులో పోసింది” అన్నాడు.
“అయితే అవి దూరంగా కిందికి చల్లుతుండు. వాటి కోసం వెళ్లి అవి తింటూ అవి మనల్ని చూడవు.”
భలే భలే అంటూ అంతా అక్కడక్కడ చల్లాడు. “నువ్వు ఎంత మంచి దానివో.. నీ తోటి జంతువులను, పక్షులను ప్రేమిస్తున్నావు. నేను నీలాగే చేస్తాను” అన్నాడు.
“రద్దీ ప్రాంతంలో ఎలా కిందికి దిగుతామో? అందరూ క్యూ కట్టి దర్శనం కోసం అని నిలబడి ఉన్నారు.”
“అయినా సరే మనము వెళ్లి చూద్దాము. చాలా దూరం నుండి
ఈ ట్రాఫిక్ కి జామ్ ఉంది. దాటి పోవడానికి వీలు లేదు.”
“రవి! వీళ్ళందరూ రసపిచ్చి వాళ్ళు. విగ్రహాలు దొరికితే ఇంట్లో పెట్టుకోవాలి, లేదా దేవాలయంలో పెట్టాలి.. కానీ ఇలా నడిరోడ్డు పైన ఇలా చేయడం బాగాలేదు. నేను ఒక ఉపాయం చెప్తాను విను.”
“చెప్పు చిక్లు! నీవు అన్నీ మంచి పనులే చేస్తావు, "
“చెబుతాను విను. ప్రక్కన పంచాయతీ ఆఫీస్ ఉంది. అందులో దించుతాను. అక్కడ పనిచేసే వాళ్ళు ఇళ్లకు వెళ్లిపోయి అక్కడ మైకు ఉంటుంది.
నువ్వు వెళ్లి మైకులో ఇక్కడ ఎవరో బాంబు పెట్టారు. కొద్ది క్షణాల్లో పేలి పోతుంది. అందరూ వెళ్లిపోండి అని గట్టిగా చెప్పు.. మళ్ళీ ఎవరూ రారు, ఉన్న వాళ్ళందరూ వెళ్లిపోతారు అని సలహా ఇచ్చింది.
రవిచెప్పినట్టుచేయగానే, ,
కాసేపట్లో నిర్మానుష్యం అయి,
పూజలు ఆపేసి యజమాని విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని పూజలు చేయడం మొదలు పెట్టాడు.
*********
ఇంటికి వచ్చి రవి తల్లిదండ్రులతో జరిగినదంతా చెప్పాడు.
“మంచి పని జరిగింది. ఎవరో ముందు జాగ్రత్తగా చాలా మేలు చేశారు. లేకపోతే ఎంత ప్రాణ నష్టం జరిగేదో? ఆ రామయ్య తండ్రి అందరినీ కాపాడాడు” అని మొక్కుకుంది.
గుమ్మం ముందు అలికిడి కావడం తో “ఎవరో వచ్చారు చూడు” అంది.
ఈ వేళప్పుడు ఎవరు వచ్చి ఉంటారు అని బయటికి వచ్చాడు రవి.
చేతిలో పెద్ద బల్లెం, పెద్ద మీసాలు, ముసక దోతి కట్టుకొని ఇల్లంతా కలియ చూస్తున్నాడు. ఆ మనిషి భయంకరంగా ఉన్నాడు.
“ఏమిటయ్యా! నీకు ఇక్కడ ఏం పని? ఎందుకొచ్చావు అనగానే
"అమ్మా! మేము పిల్లుల్ని పట్టుకుపోయే వాళ్ళం. ఇక్కడ పిల్లులు ఉన్నాయని తెలిసింది. అందుకే వచ్చాము. మీ ఇంట్లో ఉంటే చెప్పండి. పట్టుకుపోతా”మని అనగానే,
“ఇదిగో.. ఇక్కడే మూలకు ఉంది తీసుకపోవయ్యా.
దీనివల్ల మా రవి అల్లరి ఎక్కువైపోయింది, చదువు తగ్గింది. ప్రతి విషయంలో నన్ను హేళన చేసి మాట్లాడు తున్నాడు” అంటూ “తీసుకుపోయి నీవు పెంచుకో”అంది.
ఆ మనిషి వెంటనే, “అమ్మా! మేం పెంచుకొని ఏం చేసుకుంటాం! మేము పిల్లుల్ని చంపి తింటాం” అని తాపీగా చెప్పాడు.
ఆ మాటలు విన్న రవి “వద్దూ.. ఆపని చేయొద్దు..” అంటూ ఒక్క తోపు తోశాడు అతనిని,
బొక్క బోర్లా పడ్డాడు అతను..
“వెళ్ళు.. ఇక్కడి నుండీ వెళ్ళిపో, వెళ్ళిపో..” అంటూ గట్టిగా అరుస్తూ దుప్పటిలో కాళ్ళతో తన్నుతున్నాడు రవి.
ఆ అరుపులు విన్న తల్లి వకుళ వచ్చి, “రవి! బారెడు పొద్దెక్కింది లేరా! సెలవులని రాత్రంతా సినిమా చూడడం, కలలు కంటూ అరవడం..” అంది.
‘ఓ ఇదంతా కలా? ఎంత బాగుంది, నిజమైతే ఎంత బాగుండో’ అనుకుని, వచ్చిన కలనoతా తల్లికి వివరించి చెప్పాడు.
“సరేరా! నీ కలను నిజం చేస్తా, రేపే ఒకే పిల్లిని తెచ్చుకుందాం” అనగానే, రవి ముఖం వికసించింది.
శుభం.
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం
コメント