'Mathrudevobhava' New Telugu Article
Written By Neeraja Hari Prabhala
'మాతృదేవోభవ' తెలుగు వ్యాసం
రచన: నీరజ హరి ప్రభల
(పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
మాతృదినోత్సవము" అంటూ ప్రత్యేకంగా ఈ ఒక్క రోజు మాత్రమే కాదు. ప్రతి రోజూ మననం చేసుకుంటూ తల్లిని పూజించాలి. పూజించకపోయినా ఫరవాలేదు ఆమెనీ, ఆమె మనసుని నొప్పించకుండా ప్రేమానురాగాలను అందిస్తూ కడదాకా కంటికిరెప్పలా చూసుకుంటే అంతకన్నా అమ్మకు ఇంకేం కావాలి ? దేవతే మరో రూపంలో అమ్మగా మనకు దర్శనమిస్తున్నది. దేవుడు తనకు మారుగా అమ్మను సృష్టించాడు. కనిపించే, కని పెంచే ప్రత్యక్ష దైవం అమ్మ. అనిర్వచనీయమైన రూపం అమ్మ. "అమ్మ" అన్నది అమృతము. అమ్మతనము లోనే ఉంది ఆ కమ్మదనము. అప్పుడే స్త్రీ జన్మకు పరిపూర్ణత సిధ్ధిస్తుంది. అమ్మను గురించి ఏం చెప్పగలము ? ఎంత చెప్పినా తక్కువే. అసలు చెప్పనలవికాదు. అది అనంతం. ఎన్ని జన్మలెత్తినా తల్లి ఋణమును తీర్చుకోలేము.🙏 తీర్చనలవి కాదు. నవమాసాలు మోసి, తను మరో జన్మ (ప్రసవం అంటే మరో జన్మ) ఎత్తి, మనల్ని ఈ భూమి మీదకు తెచ్చి, తన పొత్తిళ్ళ లో పదిలంగా పొదుపుకుని, గుండెలకు హత్తుకుని, తనివితీరా ముద్దాడి, అప్పటిదాకా తను అనుభవించిన ప్రసవ వేదనను మర్చిపోయి ఈ ప్రపంచాన్నే గెలిచినంత సంతోషంతో బిడ్డను చూసి మురిసిపోతుంది అమ్మ. అంత అల్ప సంతోషి అమ్మ. అమ్మ పొత్తిళ్లలోని ఆ వెచ్చదనము, ఆ హాయిని కడదాకా మనం మర్చిపోలేము. అమ్మ ప్రేమకు కొలమానం లేదు. అది అమూల్యము. అనితరసాధ్యం. ఆకాశమంత విశాలమైన హృదయము, భూదేవి అంత ఓర్పు, సహనం కల ప్రేమానురాగ దేవత అమ్మ. బిడ్డకు చనుపాలిచ్చి, లాలించి, పోషించి, గోరుముద్దలను తినిపిస్తూ వాడి ఆటపాటలను చూసి మురిసిపోతూ, తప్పటడుగులు వేయకుండా, పడిపోకుండా వాడి చిటికిన వేలును పట్టుకుని నడిపించే మార్గదర్శి అమ్మ. నిద్రాహారాలు మాని తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా అహర్నిశలు బిడ్డ ఆరోగ్యం కోసం తపిస్తూ వాడి ఆకలిని తీర్చే అన్నపూర్ణ అమ్మ. బిడ్డను ప్రేమగా తన ఒడిలో కూర్చోబెట్టుకుని పలక మీద "ఓంనమశ్శివాయ" అంటూ వాడి చేత నోటితో పలికిస్తూ బలపం చేత తొలిపలుకులను వ్రాయించే సరస్వతి అమ్మ. బిడ్డ ప్రయోజకుడై వృధ్ధిలోకి రావాలని ముక్కోటి దేవతలను ప్రార్ధిస్తుంది అమ్మ. వాడి అభ్యున్నతిని చూసి సంతోషంతో ఉప్పొంగిపోతూ మనసారా దీవిస్తుంది. అమ్మ. అమ్మ దీవెన తప్పక ఫలిస్తుంది. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు, ఒడిదుడుకులు ఎదురైనా ధైర్యంగా వాటినన్నిటినీ అధిగమించి తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా కంటికి రెప్పలా బిడ్డను కాపాడుకుంటూ తుది దాకా బిడ్డ కోసమే బ్రతుకుతూ తనువు చాలిస్తుంది అమ్మ. దేవతే మరో రూపంలో అమ్మగా మనకు దర్శనమిస్తున్నది. "మాతృదేవోభవ" అని మనం తొలిగా నమస్కరించేది అమ్మకే. అటు వంటి అమ్మను గూర్చి ఎంత చెప్పినా తక్కువే. అద్వితీయము, అనిర్వచనీయమైన రూపం అమ్మ. అమ్మను మరిచి పోతే మనకు ఉనికే ఉండదు. ఈ సృష్టిలో తన కోసం ఏప్రతిఫలము ఆశించని ప్రాణి ఏదైనా ఉందంటే అమ్మ ఒక్కత్తే. అటువంటి అమ్మకు మనం ఎప్పుడూ ఋణపడి ఉంటాము. ఎన్ని జన్మలెత్తినా అమ్మ ఋణం తీర్చుకోలేము. తీర్చనలవి కాదు. అది జన్మజన్మల బంధం. దేహం ఒడలి వృధ్ధాప్య దశ వచ్చి, అనారోగ్యం దాపురించి, మృత్యువు దరి చేర బోతోందని తెలుస్తున్నా, బిడ్డ యోగక్షేమాలకై పరితపించే అనురాగ దేవత అమ్మ. బిడ్డ ఆస్తి అంతస్తులను అమ్మ ఆశించదు. కడదాకా చిటికెడు ప్రేమ, కూసింత ఆదరణను కోరుకుంటుంది. నేటి యాంత్రిక జీవన విధానంలో అవి కనుమరుగై వృధ్ధాశ్రమాలు, అనాధాశ్రమాలలో అమ్మలు చేరబడుతున్నారు. నిజంగా అది చాలా బాధాకరం. దురదృష్టకరం. ఆ స్ధితిని తలుచుకుంటుంటే గుండె బరువెక్కుతోంది. పిల్లలు 'అమ్మా' అని ప్రేమగా పిలుస్తూ గుప్పెడు మెతుకులు అమ్మకు పెడితే కొండంత సంతోషంతో నిండునూరేళ్లు ఆరోగ్యంగా బ్రతుకుతుంది అమ్మ. సంతోషం సగం బలం. ఇంక ప్రపంచంలో వృధ్ధాశ్రమాలు, అనాధాశ్రమాలకు తావుండదు. హిమవత్పర్వతమంత చల్లని మనసు కలది అమ్మ. ఆ మేరునగరి నీడలో మనమంతా ఎప్పటికీ పిల్లలమే. మన మదిలో దేవతలా కొలువై ఎల్లవేళలా పూజలందుకుని మనల్ని ఆశీర్వదిస్తూ ప్రగతి పధాన ముందుకు నడిపిస్తుంది అమ్మ.🙏🙏 మాతృదినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ వందనం - పాదాభివందనం.🙏🙏🌷🌷 *** |
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు
"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
Comments