top of page

మాతృదేవోభవ


'Mathrudevobhava' - New Telugu Story Written By Kolla Pushpa

Published In manatelugukathalu.com On 16/10/2023

'మాతృదేవోభవ' తెలుగు కథ

రచన: కొల్లా పుష్ప

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

"అక్కాఉండవే నీలా వేగంగా మెట్లు ఎక్కలేకపోతున్నాను కాసేపు ఆగుదాం" అంది పార్వతి వగరుస్తూ.


"అలాగే కానీ ఇంకా నాలుగు మెట్లు ఎక్కితే అయిపోతుంది నువ్వు ఎక్క లేకపోతే కాసేపు పక్కగా కూర్చుందాం" అంది మీనాక్షి.


ఇద్దరూ కాశీలోని మానస సరోవర్ ఘాట్ మెట్ల మీద కూర్చున్నారు. "చూడక్క ఆ దృశ్యం ఎంత బాగుందో నిండుగా ప్రవహిస్తున్న గంగమ్మ, ఉదయిస్తున్న సూర్యుడు, అక్కడక్కడ నదిలో పడవలు, నది మీద ఎగురుతున్న తెల్లటి పావురాలు" అన్నది తన్మయత్వంతో పార్వతి.


"అవునే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడే జీవితాంతం గడిపిస్తే ఎంత బాగుంటుంది" అన్నది మీనాక్షి.

"బాగుంటుంది అప్పుడు నీ మొగుడు నీకు, నా మొగుడు నాకు విడాకులు ఇచ్చి మళ్లీ ఎవరినో కట్టుకుంటారు" అన్నది సరదాగా నవ్వుతూ పార్వతి. "అది నిజమేలే" అన్నది తను నవ్వుతూ మీనాక్షి.


@@@


ఇంతలో వీల్ చైర్ తోసుకుంటూ ఒకామెను తీసుకొచ్చారు ఇద్దరు యువకులు. అందులో ఉన్న ఆమెను అమాంతం వీపు మీద వేసుకొని మెట్లు దిగుతున్నాడు ఒక్క కుర్రాడు.

ఇంకొక కుర్రాడు వీల్ చైర్ పట్టుకుని దిగుతున్నాడు. తక్కిన వాళ్ళు అందరూ వాళ్ళ వెనకాతలే దిగి స్నానానికి వెళ్లారు.

గంగానది ఒడ్డున ఆమెను కూర్చోబెట్టాడు, వాళ్ళ వెనక దిగిన ఒక ఆమె, ఆమెకు స్నానం చేయడంలో సహాయం చేసింది.


వాళ్లిద్దరూ స్నానాలు చేసి నదిలో దీపాలు వదిలారు. తర్వాత అందులో ఒక అబ్బాయి ఆమెను భుజాల మీద ఎత్తుకొని మెట్లెక్కి పైకి వస్తున్నాడు.


చూస్తున్న వీళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఆమెకు రెండు కాళ్లు లేవు ఆమెను చిన్నపిల్లలా ఎత్తుకొని వడివడిగా మెట్ల ఎక్కాడు ఆ అబ్బాయి. వాళ్లతో వచ్చిన ఒక ఆమె వీళ్ళ పక్కనే కూర్చుంది ఆయాస పడుతూ.


"ఏమండీ మీరు వాళ్ళతో వచ్చినట్లున్నారు, ఆమెకు పుట్టుకతోనే కాళ్లు లేవా? అంతగా ఆమెకు సేవలు చేస్తున్న వాళ్ళిద్దరూ ఎవరు" అని అడిగారు అక్క, చెల్లెలు ఇద్దరూ ఆమెను. "ఆమె మా అక్క వాళ్ళిద్దరూ ఆమె పిల్లలు" అంటూ ఏదో ఆలోచనలో మునిగిపోయింది ఆమె.

@@@


అనంతలక్ష్మి, ఆదినారాయణ దంపతులు చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అన్నట్లు వారిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. వాళ్లకు ఇద్దరు పిల్లలు సురేంద్ర, నరేంద్ర హాయిగా సాగిపోతుంది వాళ్లు సంసారం.


అనుకోకుండా ఒక రోజు స్కూటర్ మీద వస్తున్న ఆదినారాయణ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు.


అనంతలక్ష్మి జీవితం అంధకారమైపోయింది. 'ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళని ఎలా పెంచాలి అనుకుంది. తల్లి, తండ్రి దగ్గరికి వెళ్దామంటే వాళ్లు కూడా ఉన్నత స్థాయిలో లేరు. వాళ్లది మధ్యతరగతి కుటుంబం. పైగా తమ్ముడి చదువు, చెల్లి పెళ్లి ఏం చేయాలి' అని ఆలోచించింది.

@@@


భర్త ఆదినారాయణ పనిచేసే ఆఫీసుకు వెళ్లింది అక్కడి యజమానిని కలిసి "నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి సార్ నా పిల్లలను, నన్ను బతికించిన వారవుతారు" అంటూ బ్రతిమలాడింది.


"మా ఆఫీసులో ఏమీ కాళీ లేవమ్మా! కానీ నా ఫ్రెండ్ కు రెడీమేడ్ బట్టల ఫ్యాక్టరీ ఉంది. అక్కడ వాళ్ళందరికీ టీ, కాఫీలు అందివ్వాలి. ఆ ఉద్యోగం చేస్తావా" అన్నాడు అతను అనంతలక్ష్మితో.


" చేస్తాను సార్ నా పిల్లలను బతికించుకోవడానికి ఏ పనైనా చేస్తాను సార్" అన్నది అనంతలక్ష్మి కృతజ్ఞతగా.


వారం పోయాక ఆ పనిలో చేరింది. అక్కడ చాలామంది ఆడవాళ్లు, మగవాళ్ళు చిన్నపిల్లల బట్టలు కుడుతున్నారు. వాటిని షాపులకు పంపుతున్నాడు యజమాని. ఆ పని చేసే వాళ్ళందరికీ టీలు, మంచినీళ్లు అందివ్వడం అనంతలక్ష్మి పని.


ఆ పని చేస్తూ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చింది వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు. ఒకరోజు అక్కడ పనిచేస్తున్న సీతమ్మ అనే ఆమెను "నాకు కూడా కుట్టడం నేర్పక్క"అన్నది టీ అందిస్తూ.


" లంచ్ టైం లో నేర్పిస్తాను" అన్నది సీతమ్మ తన పనిలో నిమగ్నం అవుతూ.

అలా రోజూ లంచ్ టైం లో ఆమె దగ్గర కుట్టడం నేర్చుకుంది. మేనేజర్ ను పర్మిషన్ అడిగి తను కూడా కుట్టడం ఆరంభించింది.


అలాగే వాయిదాల పద్ధతిలో మిషన్ కొన్నది. ఇంటి చుట్టుపక్కల వారికి జాకెట్లు, చిన్నపిల్లలు బట్టలు కుడుతుండేది. కష్టపడి పిల్లల్ని చదివిస్తుంది.

@@@


పెద్ద కొడుకు సురేంద్ర ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. క్యాంపస్ లో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి సురేంద్రకు ఉద్యోగం వచ్చింది.


ప్రిన్సిపాల్, స్నేహితులు అందరూ సురేంద్రను అభినందిస్తున్నారు. ఇంతలో తమ్ముడు నరేంద్ర పరిగెడుతూ వచ్చాడు. "అన్నయ్యా అమ్మను హాస్పిటల్ లో చేర్చారట తొందరగా రా" అన్నాడు. "ఏమైంది" అన్నాడు సురేంద్ర తమ్ముడితో. "తెలియదన్నయ్య అమ్మతో పని చేసే పెద్దమ్మ కొడుకు వచ్చి నాకు చెప్పాడు వెంటనే నీ దగ్గరకు వచ్చాను" అన్నాడు ఏడుస్తూ నరేంద్ర.


" ఏ హాస్పిటల్" అన్నాడు సురేంద్ర.

ఇదంతా వింటున్న ప్రిన్సిపల్ సుందరం గారు "నేను కారులో తీసుకెళ్తాను రండి" అన్నాడు కారువైపు నడుస్తూ.

@@@


తల్లిని ఐ.సీ.యూలో ఉంచారు.

" ఏమైంది పెద్దమ్మ" అన్నాడు సీతమ్మను చూస్తూ.

"ఏమో తెలీదు నాయన మిషన్ కుడుతూ, కుడుతూ ఒకసారిగా కుప్పకూలిపోయింది. ఎంత లేపిన లేవలేదు, పెద్ద సారు గారు కారులోనే ఇక్కడికి తీసుకుని వచ్చాము, డాక్టరు చూస్తున్నారు" అన్నది సీతమ్మ కళ్ళు తుడుచుకుంటూ.


ఇంతలో డాక్టర్.. "ఈ పేషెంట్ మనుషులు నాతో రండి" అని తన రూంలోకి తీసుకెళ్లాడు సురేంద్రను, నరేంద్రను "నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీ అమ్మగారి కాళ్లు రెండు చచ్చుబడిపోయాయి. వెంటనే రెండు కాళ్లు తీసేయకపోతే ఆమె ప్రాణానికి ప్రమాదం... ఇటువంటి జబ్బు లక్షల్లో ఒకరికి వస్తుంది. అందుచేత నిర్ణయం మీదే ఈ ఆపరేషన్కు రెండు లక్షల దాకా ఖర్చవుతుంది"అన్నాడు డాక్టర్ కుర్చీలోంచి లేస్తూ.


వెంటనే ఇద్దరు అన్నదమ్ములు ఒక నిశ్చయానికి వచ్చారు. నరేంద్ర ను తల్లి పని చేసే ఆఫీస్కు పంపి అక్కడ వారందరినీ బ్రతిమలాడి ఎంతో కొంత డబ్బు తెమ్మని పంపాడు తమ్ముడిని.


సురేంద్ర తన చదువుతున్న కాలేజీకి వెళ్లి విద్యార్థులతో, లెక్చరర్స్ తో తన తల్లి పరిస్థితిని వివరించి చెప్పాడు. "తనకు సాయం చేయమని తనకు ఉద్యోగం రాగానే ఆ డబ్బు మరలా తిరిగి ఇచ్చేస్తానంటూ" దీనంగా అందరి దగ్గర చేయి చాపాడు.


వారందరూ కూడా "తమ వలన ఒక ప్రాణం నిలబడుతుంది అంటే తప్పకుండా సాయం చేస్తాం" అని ముందుకు వచ్చారు. తల్లికి ఆపరేషన్ జరిగింది. ఇద్దరు కొడుకులు ఆమెను చంటిపాపలా చూసుకుంటున్నారు. కొన్నాళ్ళకు సురేంద్రకు ఉద్యోగం వచ్చింది.


@@@


అనంతలక్ష్మి చెల్లెలు, భర్త అందరూ కాశీకి వెళ్తున్నాం అని చెప్పారు. అనంతలక్ష్మీ తన కొడుకులతో "నాకు కూడా కాశీ చూడాలని ఉంది" అని ఒక మాట అనగానే ఇద్దరు కూడా తల్లిని జాగ్రత్తగా కాశీకి తీసుకొచ్చారు.


" పిన్ని రావా అవతల దర్శనానికి టైం అవుతుంది, ఇంకా అమ్మకు టిఫిన్ పెట్టాలి" అన్నాడు సురేంద్ర తల్లి వీల్ చైర్ తిప్పుతూ.


" ఆ వస్తున్న" అంటూ ఆలోచన నుంచి బయటకు వచ్చి వాళ్లతో బయలుదేరింది అనంతలక్ష్మి చెల్లెలు శ్రావణి.


తల్లిని అంత జాగ్రత్తగా చూసుకుంటున్న ఆ కొడుకుల్ని చూసిన పార్వతి "ఆమె చాలా అదృష్టవంతురాలు ఈరోజుల్లో ఇలాంటి కొడుకులెక్కడ ఉన్నారు" అన్నది మీనాక్షి తో.


ఆ మాట విన్న సురేంద్ర వాళ్ల దగ్గరకి వచ్చి "మా అమ్మ చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకొని మా ఇద్దరిని చక్కగా చదివిస్తూ తన కష్టాల్ని మాకు తెలియనీకుండా పెంచింది. అటువంటి తల్లికి మేము చేసే సేవ ఏమాత్రం ఆంటీ...


"జీవితంలో మనం నడిచి వచ్చిన దారిని ఎక్కి వచ్చిన మెట్లని ఎప్పటికీ మరవకూడదు. *అమ్మ కన్నా మిన్న ఎవరు* అమ్మకు సాటి లేరు ఎవరు? అమ్మను మించిన దైవం లేదు మాకు... అమ్మ కోరిక మీద కాశి తీసుకొచ్చాం ఆంటీ" అంటూ తల్లి వైపు నడిచాడు సురేంద్ర.


అటువంటి బిడ్డలను కన్న ఆమె ధన్యురాలు అనుకున్నారు పార్వతి, మీనాక్షి.


శుభం

***

కొల్లా పుష్ప గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొల్లా పుష్ప







66 views0 comments

コメント


bottom of page