మితం మేలు అమితం
- Gadwala Somanna
- May 2
- 2 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #MithamMeluAmitham, #మితంమేలుఅమితం, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 71
Mitham Melu Amitham - Somanna Gari Kavithalu Part 71 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 02/05/2025
మితం మేలు అమితం - సోమన్న గారి కవితలు పార్ట్ 71 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
మితం మేలు అమితం
----------------------------------------
స్థిరమైన లక్ష్యంతో
నిరంతర సాధనతో
గెలుపు సులువు అవుతుంది
సత్ఫలితాలనిస్తుంది
చంచలమైన మనసుతో
మనసు నిండా భయంతో
ఏదీ సాధించలేవు!
విజేతగా నిలువలేవు!
నిరాశ నిస్పృహలతో
చేతకానితనంతో
జీవితమగును ముక్కలు
అడుగడుగునా తిప్పలు
అసూయ ద్వేషాలతో
పగ ప్రతీకారాలతో
కలుషితమగును మనసులు
నాశనమగును బ్రతుకులు

మిత్రుల భాషణం
----------------------------------------
ఓటమి కూడా గురువే!
నేర్పునోయి పాఠాలు
గెలిచేందుకది తెరువే!
దిద్దునోయి జీవితాలు
ఓటమి చవి చూస్తేనే
గెలుపు విలువ తెలుస్తుంది
కనువిప్పు కలిగేందుకు
ఉపకారమే చేస్తుంది
బ్రతుకులో అపజయాలు
విజయానికి సోపానాలు
అన్నారోయి! ఆర్యులు
చెప్పారోయి! సూక్తులు
ఓటమి వేళ క్రుంగకు
చేతకాని వాడవుతావు!
గెలుపు వరిస్తే పొంగకు
ఇక గర్వాంధుడవుతావు!

ఇష్టమైన దైవము
----------------------------------------
వెలుగులీను దీపము
జీవితాన దైవము
మరవరాదు ఎప్పుడు
వారు గుండె చప్పుడు
ఉంచాలి నమ్మకం
కారాదు నాటకం
దేవునితో ఆటలు
మసిబారును బ్రతుకులు
దైవాన్ని నమ్మితే
కాపాడు రెప్పలా
ప్రణమిల్లి కొలిస్తే
చూసుకొనును అమ్మలా
నేకొలిచే దైవము
నాకెంతో ఇష్టము
కల్మషం లేని వాడు
నా బ్రతుకులో రేడు

ప్రేమతో పలకరించు!
----------------------------------------
కన్నవారికి సేవలు
చేస్తేనే దీవెనలు
వసుధలో వారు కదా!
కనిపించే ఇలవేల్పులు
వారు చూపే మమతలు
పంచి పెట్టే ప్రేమలు
అసమానం జగతిలో
గుర్తించుకో! గుండెలో
జన్మనిచ్చిన దాతలు
గొప్పది వారి త్యాగము
జీవితాల్లో జ్యోతులు
స్మరించుకో! నిరంతరము
రోజూ పలకరింపులు
కాసింత సంప్రదింపులు
వారికవే ఔషధము
కోరును వారి హృదయము

కోయిలమ్మ ప్రబోధం
----------------------------------------
ఎగిరెగిరి వచ్చింది
చెట్టుపై వాలింది
గొంతెత్తి కోయిలమ్మ
కమ్మగా కూసింది
రంగు చూడ నల్లన
గొంతేమో తీయన
ఆనందం నింపును
ఆలకిస్తే మనసున
పిల్లల పలుకుల్లా
కోయిలమ్మ రాగాలు
రంజింపజేయునోయ్!
విన్నవారి హృదయాలు
వద్దు వద్దు భేదము
అనైక్యతకు మార్గము
చెప్పింది కోయిలమ్మ
అమూల్యమైన సత్యము
ప్రతిభే కొలమానము
తెచ్చునది గౌరవము
రంగు కంటే గుణము
బహు శ్రేష్టం అన్నది
కోయిలమ్మ ప్రబోధము
అందరికి ఆమోదము
పాటిస్తే మాత్రము
కొండంత ప్రమోదము
-గద్వాల సోమన్న
Comments