మిత్రుని సూచనలు
- Gadwala Somanna
- Jun 11
- 1 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #MithruniSuchanalu, #మిత్రునిసూచనలు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 87
Mithruni Suchanalu - Somanna Gari Kavithalu Part 87 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 11/06/2025
మిత్రుని సూచనలు - సోమన్న గారి కవితలు పార్ట్ 87 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
మిత్రుని సూచనలు
----------------------------------------
విరచరాదోయి!మనసులు
కఠినమైన మాటలతో
విపరీతపు చేష్టలతో
నికృష్టమైన తలపులతో
మానాలి తృణీకారం
పోవాలి వెటకారం
సున్నితమే భావాలు
నవనీతం హృదయాలు
పైశాచిక ఆనందం
చేతకాని వారితనం
ఎప్పుడూ పనికిరాదు
అది కాదు హర్షణీయం
బ్రతకాలోయ్! మనిషిగా
నిలవాలోయ్! స్ఫూర్తిగా
చేతనైతే సాయం
చేయుము మనస్ఫూర్తిగా

అన్నయ్య సుద్దులు
----------------------------------------
ఆరాటం సరిపోదు
పోరాటముండాలోయ్!
విజయం ఊరికే రాదు
శ్రమ దీపం వెలగాలోయ్!
నిరంతర సాధనతో
ఏదైనా సాధ్యమే
పట్టుదల, పరిశ్రమతో
గెలుపు పాదాక్రాంతమే
వ్యర్ధమైన మాటలతో
కాలాన్ని వృధా చేయకు
పనికిరాని పనులతో
ముప్పు గొనితెచ్చుకోకు
సమాజ శ్రేయస్సు కొరకు
పోరాడాలి తుది వరకు
జన్మ సార్థకమవ్వాలి
ఇల ఉపయోగమవ్వాలి

మేటి మేలి మాటలు
-----------------
బ్రతకాలి నీతిగా
వెలగాలి జ్యోతిగా
సభ్య సమాజంలో
ఉండాలి గొప్పగా
చూపాలోయ్! ప్రీతిని
వీడాలోయ్! భీతిని
చేసి చేసి మంచిని
తేవాలోయ్! ఖ్యాతిని
అందరికి మెప్పుగా
జీవితాన ఒప్పుగా
ఉంటే మేలు మేలు
ఈ జన్మకదే చాలు
ఓటమికి క్రుంగరాదు
గెలుపుకు పొంగరాదు
సమతుల్యం ముఖ్యం
పండాలోయ్! లౌక్యం

చెట్టు ప్రబోధ గీతి
----------------------------------------
మనిషిలోని మంచిని
చూసినచో మానవుడు
అవుతాడోయ్! తప్పక
అవనిలోన మాధవుడు
దుర్గుణాలు పెరిగితే
జనయించు దానవుడు
దిద్దుకుంటే మాత్రం
అవతరించు మహాత్ముడు
గొప్పది దైవత్వం
మంచిది మానవత్వం
హానికరం మానవా!
శత్రుత్వం మానవా!
పసిడి కన్నా ఖరీదు
ఏదీ సాటిరాదు
అమూల్యమైన స్నేహము
దానికి మించింది లేదు

జేజప్ప హితవు
----------------------------------------
ఎదుటివాని బ్రతుకులో
వెదకరాదు తప్పులు
పచ్చని కాపురంలో
పోయరాదు నిప్పులు
ఆశ్రయించిన వారికి
పొడవకు వెన్నుపోటు
అన్నిట్లో దూరితే
తప్పదు భంగపాటు
మితిలేని వెటకారం,
చెరుపు అహంకారం
అపాయం అపకారం
ఉన్నతం ఉపకారం
పనికిరాని అలవాట్లు
మిక్కిలి ప్రమాదకరం
జీవితాన చీకట్లు
తెచ్చునోయి వాస్తవం
పొరుగువారి జోలికి
పోరాదు పదే పదే
నిన్ను నీవు దిద్దుకో
మంచిది అదే అదే
-గద్వాల సోమన్న
Commentaires