top of page
Original.png

మొదటి అడుగు నాదే

May 4
4 min read

 “ఒక పరీక్ష… ఒక నిర్ణయం… ఒక టీచర్ జీవితాన్ని కాదు, విద్యా విధానాన్ని మార్చాలనుకున్నాడు!”
 “ఒక పరీక్ష… ఒక నిర్ణయం… ఒక టీచర్ జీవితాన్ని కాదు, విద్యా విధానాన్ని మార్చాలనుకున్నాడు!”

Modati adugu Nade - Telugu Emotional Story | Chilakamarri Rajeswari

మొదటి అడుగు నాదే - తెలుగు భావోద్వేగ కథ | చిలకమర్రి రాజేశ్వరి

Published in manatelugukathalu.com on 04/05/2026 


మార్కుల కోసం పిల్లలపై పెరుగుతున్న ఒత్తిడి మధ్య, ఒక ఉపాధ్యాయుడు మార్పు కోసం ముందడుగు వేస్తాడు.

“మొదటి అడుగు నాదే” – ఇది ప్రతి తల్లిదండ్రి, టీచర్, విద్యార్థి ఆలోచించాల్సిన కథ.


రవీంద్ర 'చేతన కళాశాల'లో లెక్కల ఉపాధ్యాయునిగా చేరి మూడు నెలలైంది. 'చేతన కళాశాల' సిటీలో ప్రారంభించి అప్పటికి రెండేళ్లు మాత్రమే అయింది. ఇంటర్వ్యూలో కాలేజీ మేనేజ్‌మెంట్ వాళ్లు తమ కళాశాలలో పాటించే పద్ధతులు వివరించినప్పుడు, తన ఆశయాలకు, అభిప్రాయాలకు సరి తూగేచోటికే వచ్చానని సంతోషపడ్డాడు. 


విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా, వారిలో ఉన్న తెలివితేటలకు మెరుగులు దిద్ది, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించటమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక మంచి కాలేజీలో ఉద్యోగం వచ్చినందుకు పొంగిపోయాడు.

రవీంద్ర పిల్లలందరితో చక్కగా కలిసిపోయి, చనువుగా మెలుగుతూ, వాళ్లకు వచ్చే సందేహాలు తీరుస్తూండటంతో విద్యార్థులకు అతనంటే అభిమానం ఏర్పడింది. ఇంతలో వేసవి సెలవులు ఇవ్వడం జరిగింది.


నిన్ననే ఇంటరు రెండవ సంవత్సరం కాలేజీ తరగతులు మొదలయ్యాయి. మొదటిరోజే ఎం.పి.సి. విద్యార్థులకు ప్రథమ సంవత్సరం లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 11 గంటల నుంచి 2 గంటల వరకు పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలలో వచ్చిన మార్కులు ఆధారంగా తరగతుల విభజన జరుగుతుందని, అది తరువాతి రోజు చెబుతామని చెప్పారు.


సాయంత్రం తరగతులు అయిన తర్వాత పిల్లలతో మాట్లాడుతున్నపుడు వాళ్లందరిలో ఒక రకమైన భయం కనిపించింది. దానికి కారణం ఏమిటో పిల్లల మాటలు విన్న తరువాత అర్థమైంది. "ఏమోరా, ఇవాళ పరీక్ష సరిగా రాయలేదు, సెక్షన్లు మారి, మనం వేరైపోతామేమో! ఈ సంగతి తెలిస్తే, మా అమ్మ, నాన్న నన్ను ఇంక ఎక్కడికీ పంపరు, కనీసం ఆడుకోవడానికి కూడా పంపించరు. చదువుకోమంటారు" అనుకోకుండా పిల్లలు మాట్లాడుకుంటున్న మాటలు విని ఆశ్చర్యపోయాడు.


నిన్న సాయంత్రం రవీంద్రకు ఉప ప్రధానోపాధ్యాయులు అయిన వెంకటేశ్వర్లు గారు పిల్లలు రాసిన జవాబుపత్రాలు ఇచ్చి, వాటిలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను విభజించి తరగతుల సెక్షన్లను తయారు చేయమని చెప్పారు. దాని ప్రకారం విద్యార్థులకు ఈ రోజు ఉదయం తెలియజేసి తరగతుల విభజన చేస్తామని చెప్పారు. అది విన్న రవీంద్ర నివ్వెరపోయాడు. 


ఇంటర్వ్యూలో చెప్పిన దానికి, ఇప్పుడు జరుగుతున్న దానికి పోలికే లేదు. మనసులో కలిగిన సందేహాన్ని తీర్చుకోవడం కోసం వెంటనే ఆయన్ని, "ఏంటి సార్ ఇది? మన కాలేజీ పాటించే నియమ నిబంధనలకు ఇది విరుద్ధం కాదా? మనం పిల్లలను చేర్పించేటప్పుడు ఒక మాట, చేసేది ఒకటి అయితే కాలేజీ పేరు చెడిపోదా?" అని అడిగాడు. 


వెంకటేశ్వర్లు గారు: "ఓ! మీరు కొత్తగా చేరారు కదా. అందుకని ఆశ్చర్యంగా ఉండడం సహజం. తల్లిదండ్రులు పిల్లల్ని కాలేజీలో చేర్పించేముందు ఆదర్శ కళాశాల కావాలనుకుంటారు. కాబట్టి మనం అప్పుడు వారికి నచ్చే విధంగా మన కాలేజీలో పాటించే పద్ధతులను చెప్పాలి. అప్పుడే మన కాలేజీలో ఎక్కువ మంది విద్యార్థులు చేరడానికి అవకాశం ఉంటుంది. 


కానీ, చేర్పించిన తర్వాత, తొంభై శాతం మంది వాళ్ల పిల్లలకు ఎలాగైనా ఐ.ఐ.టీ.లలో సీటు వస్తే చాలనుకుంటారు. దాని కోసం పిల్లలను వీలైనంత చదివించమని చెబుతారు. అంతే కాని, వారిలోని బలాలను, బలహీనతలను అర్థం చేసుకుని, వారు ఎందులో రాణిస్తారో, దానికి తగ్గట్టుగా శిక్షణ ఇవ్వమని పొరపాటున కూడా చెప్పరు. 


మనం వాళ్లకు చెప్పినా, మనల్ని పిచ్చివాళ్ళలా చూస్తారు. ఇంకా కొంతమంది ఐతే, వాళ్ల పిల్లల్ని వెంటనే వేరే కాలేజీలో చేర్పించడానికి కూడా వెనుకాడరు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఒక్కరం వేరే పద్ధతిలో నడిస్తే, మన కాలేజీకి పుట్టగతులు ఉండవు. పైగా ఎవరూ పిల్లల్ని మన కాలేజీలో చేర్పించరు. 


మీది ఉడుకురక్తం కాబట్టి, నేను చెప్పినవన్నీ అతిశయాలుగా అనిపించవచ్చు. కానీ నాకున్న పదేళ్ల అనుభవంతో చెబుతున్నాను. రేపు తరగతి విభజనలు జరిగాక కూడా, ఏ ఒక్క పిల్లాడి తల్లిదండ్రులు కూడా వచ్చి 'ఇలా ఎందుకు జరిగింది? మీరు మాకు చెప్పినదేంటి?' అని ప్రశ్నించరు. 


అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించరు. 'ఏం చేసినా సరే, మా పిల్లలకు ఐ.ఐ.టీ., ఎన్.ఐ.టీ.లలో సీటు వచ్చేటట్టు చేయండి' అని మాత్రమే చెప్తారు. పిల్లలు చదవగలుగుతున్నారా, వాళ్లకు తాము చదివే చదువులో ఆసక్తి ఉందా, లేదా అని ఆలోచించరు. కనీసం పిల్లల మనసులో ఏముందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేయరు. అందుకే, మీరు ఇవన్నీ ఆలోచించడం మానేసి, మీకు అప్పగించిన పనిని సక్రమంగా చేస్తే, మీ ఉద్యోగం మీకు ఉంటుంది. లేదంటే వేరే దారి చూసుకోవలసి వస్తుంది. తర్వాత మీ ఇష్టం" అని నెమ్మదిగా చెప్పారు.


అది విన్న దగ్గర్నుంచీ రవీంద్రకు మనసు మనసులో లేదు. రాత్రి నిద్ర పట్టలేదు. తను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఇంకోటి.


ఈ ఆలోచనలతోనే తెల్లవారింది. తప్పదన్నట్టుగా లేచి తయారవడం మొదలుపెట్టాడు. పిల్లల సున్నితమైన మనసులు బాధపడకుండా దీనికి ఒక పరిష్కారం వెతకాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి పేరెంట్-టీచర్ సమావేశంలో తల్లిదండ్రులతో వివరంగా మాట్లాడాలి. ఒకటి, రెండు పరీక్షల్లో మార్కులు తగ్గినంతమాత్రాన తల్లిదండ్రులు చదవమని పిల్లలలో ఒత్తిడిని పెంచకూడదు. మార్కులు తక్కువ రావడానికి కారణాలేమిటో పిల్లలతో నెమ్మదిగా మాట్లాడి తెలుసుకోవాలి. అవి ఉపాధ్యాయులకు చెప్పి చక్కదిద్దడానికి ప్రయత్నం చేయాలి. 


ఉపాధ్యాయులు కూడా ప్రశ్నపత్రాలలో వచ్చిన మార్కులను బట్టి తరగతులను విభజించకుండా, విద్యార్థులు ఏ ఏ ప్రశ్నలకు సమాధానాలు రాయలేకపోయారో, ఆ ప్రశ్నలకు సమాధానాలు విపులంగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఐ.ఐ.టీ.లో సీటు రానంతమాత్రాన పిల్లల జీవితమే వృథా అనే భావనను తల్లిదండ్రులు మొదట తుడిచివేయాలి. 


తమ ఇష్టాయిష్టాలను పిల్లల మీద రుద్దడం మానేసి, వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి, ప్రోత్సహించాలి. ఇకనైనా ర్యాంకుల వెనుక పరిగెత్తే తల్లిదండ్రుల మనసులలో కొంచెమైనా మార్పు రావాలి.


.ప్రస్తుతం సాగుతున్న ఈ ర్యాంకుల సమరంలో పిల్లల మనసులు కలత పడకుండా నా వంతు ప్రయత్నం నేను చేయాలి. దాని ఫలితంగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటాను. ఈ మార్పు కోసం వేసే మొదటి అడుగు నాదే అవ్వాలి. తల్లిదండ్రుల ఆలోచనలలో మార్పు వస్తే, కళాశాలలు బోధించే విధానాలు వాటంతటవే పరివర్తన చెందుతాయి అని దృఢంగా ఒక నిర్ణయం తీసుకుని కళాశాలకు తేలికపడిన మనసుతో బయలుదేరాడు.


***

చిలకమర్రి రాజేశ్వరి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: చిలకమర్రి రాజేశ్వరి

 

నా పేరు చిలకమర్రి రాజేశ్వరి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో డిప్యూటి జనరలు మానేజర్ గా పనిచేసి, ఆగష్టు 2024లో రిటైరు,అయ్యాను.


మా కుటుంబ సభ్యులందరూ సాహితీప్రియులు కావడంతో, నా చిన్ననాటి నుంచే, తెలుగు వార,మాస పత్రికలు, నవలలు చదవం అలవాటు అయింది. అదే నాలోని పఠనాసక్తిని పెంపొందించింది. అనేక అంశాల మీద కవితలు రాయడం అభిరుచిగా మారింది. స్టీలుప్లాంట్ వారు,నిర్వహించిన వివిధ కవితల పోటీల్లో పాల్గొనడం, కొన్నిటికి బహుమతులు అందుకోవడం జరిగింది.


నీవు రాయగలవు అంటూ నన్ను అనునిత్యం ప్రోత్సహించే కుటుంబసభ్యుల మద్దతు నాకుండటం నా అదృష్టం.


పుస్తకాలు చదవడం నా హాబీ. తెలుగు, ఇంగ్లీషుభాష లలో వీలైనన్ని మంచిపుస్తకాలు చదివి నా మనోవికాసాన్ని,  నా విశ్లేషణాశక్తిని మెరుగుపరుచుకోవాలని నా ఆకాంక్ష.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page