top of page

మోహపు మరకలు


'Mohapu Marakalu' - New Telugu Story Written By Dr. Kiran Jammalamadaka

Published In manatelugukathalu.com On 08/11/2023

'మోహపు మరకలు' తెలుగు కథ

రచన: డా: కిరణ్ జమ్మలమడక

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

ఒక మనిషి సగటున రోజుకు ముప్పైఐదు వేల నిర్ణయాలు తీసుకుంటాడు అని అంటారు, అలా తీసుకునే ప్రతి నిర్ణయానికీ ఒక పర్యవసానం ఉంటుంది. అది కొన్ని సార్లు పరవశించేదిగా ఉంటే మరికొన్ని సారులు పశ్చాత్తాపపడేటట్టు గా ఉంటుంది. అలాంటి పరిస్థితే అపురూపకు వొచ్చింది. స్నేహితురాలి నుంచి వొచ్చిన తన వీడియో, తన ఫోన్లో చూసిన క్షణం, తన కాళ్లు కంపించాయి, ఒక్క క్షణం భూమిలోకి తాను కూరుకుపోతే బాగుండును అని అనిపించింది, ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న అపురూపకి.


తన గదిలోనుండి బయటకు రావాలి అంటే భయం వేసింది. ఎలాగోలాగ అమ్మని తప్పించుకొని, నాన్న పలకరిస్తున్నా కాలేజీ టైం అయిపోతోందని ఇంటి నుండి బయటకు వొచ్చి తన కాలేజీ బస్సు ఎక్కి, ఒక మూలగా కూర్చుంది. ఎటు చూసినా జనాలు తననే చూస్తున్నట్టు, తన గురించే మాట్లాడుతున్నట్టు అనిపించింది, పరిచయం లేని మొహాలు కూడా తనని చూసి వెకిలిగా నవ్వుతున్నట్టు, ‘ఆ వీడియో లో వున్నది నువ్వేనా ?’ అని అడుగుతున్నట్టు అనిపించసాగింది అపురూపకి.


వెంటనే కాలేజీ లో తన స్నేహితురాలయిన సుజన కి ఫోన్ చేసి విషయం చెప్పింది, ఒక్కసారి గా హతురాలైన సుజన వెంటనే తేరుకొని ఓదార్చడంకోసం, "ఆ సైట్ కి ఎవరు వెళ్తారు?", "ఎవరు చూసి గుర్తుపడతారు?", "ఎవరు అడుగుతారు చెప్పు?" అని సర్దిచెప్పింది. ఒక్క క్షణం నిజమే కదాని ఊరట పొందినా, ఇంకా పెరిగిన గుండెవేగం అదుపులోకి రావటం లేదు, అలానే భయం భయం గా కాలేజీకి వెళ్ళింది, ఎలానో సాయంత్రం ఇంటికి వొచ్చింది.


ఏదో ముభావంగా ఇంట్లో గడిపింది కానీ, తన మనసు మనసులో లేదు, విశాల ఆకాశం లో రెక్కలు తెగిన పక్షి లాగ, నడి రేయీ లో నడి సముద్రంలో ధ్రువతార కనిపించనట్టు గా, ఎడారిలో ఎటుపోవాలో చెప్పే కంపాస్ పనిచేయనట్టు గా, ఒంటరి అయిపోయినట్టు అనిపించింది. అపురూపకి, వీడియో బయటకు ఎలా వొచ్చిందో? ఎందుకు వొచ్చిందో ? అర్థం కావటం లేదు, తన మది గది స్వగతాలతో కుంగిపోయింది.


అలా ఎన్నో ఆలోచనలతో ఆ రోజు నిద్రపోవడానికి ప్రయతించగా, ఎప్పటికో తెల్లవారుజామున నిద్రపట్టింది. ఇంతలోనే, ఫోన్ చేసే శబ్దాలకి, అపురూపకి మెలుకువ వొచ్చింది, నిన్న తాను అనుకున్నట్టు గా లేదు ఈ ఉదయం, చాలా మంది అడిగేది ఒకటే ప్రశ్న, "అది నువ్వేనా?", పెద్దగా పరిచయం లేనివాళ్లు కూడా అదే ప్రశ్న. వెంటనే సుజనకు ఫోన్ చేసి, పోలీస్ స్టేషన్ కి బయలుదేరింది, అక్కడ వున్న ఇన్స్పెక్టర్ తో మాట్లాడాలని సమయం తీసుకొని, అయన ఎదురుగా కూర్చుని విషయం చెప్పారు.


" ఇది నీదేనా ?" కటువుగా వుంది ఆ గొంతు.


"అవును"


"నీకు తెలుసా వీడియో తీసేటప్పుడు?"


"తెలుసు "


"మరి ఇంకేంటి సమస్య ? " ఆ ప్రశ్నలో కొంత వెటకారం కొంత ఏవగింపు కనపడ్డాయి అపురూపకి.


"ఇలా అందరికి.. అన్నది తెలీదు, మీరు ఎలా అయినా సైట్ నుండి తొలిగించాలి సార్ " అని అర్ధించింది, అపురూప.


"పెట్టినవాడు లేడా? " మళ్ళీ అడిగాడు ఇన్స్పెక్టర్.


"లేదు సర్, ఇప్పుడు విడిపోయాం.. అతని వివరాలు కూడా తేలీదు"


"చూడు, ఇవి దావానలం లా ఒకసారి, బయటకొస్తే అంతే, కాళీకా దేవి, రక్తబీజుడ్ని, అంతమొందించినట్టు, అంతమొందించాలి. అది మనకు ఇప్పుడు సాధ్యం కాదు.పైగా ఇలాంటివి పట్టించుకునే తీరికా లేదు. మీకు అంతగా కావాలనుకుంటే సైబర్ సెల్ వాళ్ళు కొన్ని సైట్ల నుండి తీయటానికి ప్రయత్నిస్తారు. ఫోన్లో, కంప్యూటర్లలో వున్నవి మళ్ళి, మళ్ళి వొస్తూ ఉంటాయి. ఎవరం ఏం చెయ్యలేము " అని, యధాలాపంగా అనేసి, ఫోన్ వెనక్కి ఇస్తూ వెళ్ళమన్నట్టు చూసాడు.


సమయం గడుస్తున్నకొద్దీ, అపురూపకు ఏమి చెయ్యాలో అర్థం అవ్వటంలేదు తన ఫోన్ శబ్దం చేస్తూనే వుంది. అది భరించలేక ఫోన్ ఆఫ్ చేసింది. ప్రపంచం అంతా తన గురించే మాట్లాడుకొంటున్నటు అనిపిస్తోంది. ఇంక ఆ రోజు కాలేజీ కి వెళ్లకుండా, అపురూప తన ఇంటి కి వెళ్తానని చెప్పింది సుజనకు. సుజన కూడా తన పరిస్థితిని తెలుసు కాబట్టి సరే అంది.


అపురూప, ఇంటికి వెళ్ళటం, తన గదిలోకి వెళ్లి తలుపేసుకోవటం, తన డెస్క్ మీద వున్న పేపర్ కట్ చేసే బ్లేడ్ తీసి మణికట్టు కోసుకోవటం, క్షణాల్లో జరిగిపోయి.


రక్తం ధారగా పోతుండగా.. కళ్ళు మూతలు పడుతున్నాయి, చనిపోయేముందు జీవిత చక్రం అంతా కళ్ళ ముందు తిరుగుతుందంటారు కానీ, అపురూపకి మాత్రం అతని పరిచయం దగ్గర నుంచే గుర్తుకు రావటం మొదలు పెట్టింది.


*************

ప్రపంచమంతా, ఫెయిర్నెస్ క్రీమ్స్ ల చుట్టూ, అందమంటే తెలుపే అనే భావన బాగా పాతుకుపోయిన ఇప్పటి పరిస్థితులలో తనలాగా, చామన ఛాయలో వున్న అపురూప వైపు చూసే వాడే లేనప్పుడు, అతను తనకి, బీటెక్` రెండొవ సంవత్సరం లో పరిచయం అయ్యాడు. మొదట స్నేహితులుగా వున్నా.. అతను అపురూప కళ్ళను చూస్తూ కమలాక్షి అన్నప్పుడు, పెదాలు పగడం మాదిరి వున్నాయన్నప్పుడు, అపురూప దంతాలని, ముత్యాలతో పోల్చినప్పుడూ, .. తన వ్యక్తిత్వం ని వజ్రం అని అభివర్ణించినప్పుడు, సాక్ష్యాత్తు ఆ అన్నమాచార్యుడు చిన్ని కృష్ణుడుని నవరత్నాలలో పోల్చినంత అందంగా, ఆనందం గా అనిపించింది అపురూపకి.


అలా కొంతకాలని స్నేహపు హద్దులు చెరిగి, బాగా దగ్గరయ్యారు. అలా ఆలోచనలో వుండగ్గానే అపురూపకి స్పృహ తప్పింది.


కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్ బెడ్ మీద పడుకొని వుంది, తన మణికట్టుకి కట్టు కట్టి వుంది. తనకి రక్తం ఎక్కిస్తున్నారు, ఇంతలో నర్స్ వొచ్చి, "స్పృహ వొచ్చిందా గుడ్!, డాక్టర్ ని పిలుస్తా" అని వెళ్ళిపోయింది.


డాక్టర్ గారు, అపురూప అమ్మ వసుంధర, వెంటనే వొచ్చారు, ఏ భావము లేని అమ్మమొహం లో ఆమె ఆలోచనులు పసిగడదామని విఫలయత్నం చేసింది అపురూప. ఆ డాక్టర్ ఏమి చెపుతున్నాడో కూడా అపురూప కి వినపడటంలేదు. డాక్టరువెళ్లిపోయాక, అమ్మ అపురూప పక్కన కూర్చొని, తలపై చెయ్యిపెట్టి "నీకు అపురూప అని ఎందుకు పేరుపెట్టామో తెలుసా? నీ ముందు నాలుగు సారులు మిస్ క్యారేజ్ అయ్యాక నువ్వు పుట్టావు. నాకు ఇంకా గుర్తు, నీ ఫైల్ మీద ప్రేషియస్ అని డాక్టర్ రాసినప్పుడు, నేను, నాన్న ఎంతో భయపడ్డాము. మొత్తానికి నువ్వు ఆరోగ్యం గా పుట్టావు, మాకు ఆనందానికి అవధుల్లేవు. నువ్వు పెరుగుతున్నా కూడా మాకు ఆ భయం వీడలేదు మా ఇద్దరికీ చావంటే విపరీతమైన భయం ఏర్పడింది.


మీ నాన్న రైల్ ఇంజిన్ డ్రైవర్ గా పనిచేసేటప్పుడు, ఆ పట్టాల పై కనిపించే శవాలను చూడలేక, కొన్ని సారులు రైలు కింద నలుగుతూన్నమనుషుల్ని తలచుకొని నిద్రకూడా పోయేవారు కాదు. 'చిన్న వయసు వసుంధరా' అని, .. 'చావు కంటే పెద్ద కష్టమొముంటుంది ?' అని ఒక రెండు మూడు రోజలు మనశాంతి ఉండేది కాదు ఆయనకి. ఏమిచెయ్యలేని నిస్సహాయ స్థితినుంచి, కనీసం వారి ఆత్మహత్య ప్రయత్నం లో తన పాత్ర ఉండకూడదని, చివరకు ఆ ఉద్యోగమే మానేశారు.

అంత మంచి వుద్యోగం మానేసి ఒక ప్రైవేట్ జాబ్ లో చేరి, నిన్ను నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అలాంటిది తన కూతురే ఈ ప్రయత్నం చేసిందంటే ఆయన ఏమైపోతారో? ఇంకా.. నేను చెప్పలేదు ఆయనకి.. అని మౌనంగా ఉండిపోయింది.


అపురూప "అదికాదు అమ్మ " అని చెప్పబోతుంటే,

"అపురూప.. , నాకు తెలిసి జీవితం లో చనిపోయేంటంత పెద్ద సమస్య ఏది ఉండదు, నువ్వు ఏం చేసావు? అది తప్పా ? ఒప్పా ? అని నేను అడగను, అది నీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాను, గతాన్ని నీతో మోసుకుంటూ ముందున్న ప్రయాణం భారం చేసుకుంటావా, గతం తాలూకు జ్ఞాపకాల భారం దించుకొని ముందుకు వెడతావో నువ్వే ఆలోచించుకో. " అని అపురూప నుదిటిమీద ముద్దు పెట్టి వసుంధర వెళ్ళిపోయింది.


అపురూప యెంత వద్దు అనుకున్నా, తన ఆలోచనలు తనని వెంటాడి వేధిస్తున్నాయి. నాన్న అమ్మ కూడా చాలా ప్రశ్నలు ఎదుర్కుంటున్నారు. కానీ వాళ్ళు అపురూప లాగ ధైర్యం కోల్పోలేదు అన్నీ భరిస్తూనే వొచ్చారు. కానీ అపురూపకు, తెల్లారితే భయం, మనిషి కనపడితే భయం, వార్త పత్రిక చూస్తే భయం, టీవీ చూడాలంటె భయం ఫోన్ అంటే ఇంకా భయం.. ఎక్కువ సేపు ఒంటరిగా, ఉండటానికే అపురూప ఇష్టపడేది, మానసిక వైద్యులను కలిసింది. అమ్మ నాన్న పోనీ ఊరు మారదామా? అని అన్నారు కానీ, అది యెంత ఖర్చుతో కూడుకున్న పనో అపురూపకి తెలియనిది కాదు.


అలా రోజులు చాలా నిశ్శబ్ద్ధం గా, భారంగా గడుస్తున్నవేళ, ఒకరోజు అపురూప వసుంధరతో "అమ్మా! గీత దాటటం సీతది తప్పా? సీత చేత గీత దాటించిన రావణుడిది తప్పా?" అని అడిగింది.

ఆ ప్రశ్నకు ఒక క్షణం ఆలోచించి, అపురూప మనసులో ఏముందో? ఏమి అడగలనుకుంటోందో ? అర్థం అయ్యింది వసుంధర కి.


"ఏమోనమ్మా.. పురాణాల గురించి నాకు పెద్దగా తెలీదు.కానీ, ఒక విషయం చెప్పు, నువ్వు ఒక బండి కొనుకున్నావ్, కానీ రోడ్లు అన్ని అస్తవ్యస్తంగా, చాలా గోతులు వున్నాయి. నువ్వు అనుమతించిన స్పీడ్ లో వెళ్ళటం నీ హక్కు అని, రోడ్లు సరిగా వెయ్యకపోవటం ప్రభుత్వానిది తప్పు అని, నువ్వు అంతే స్పీడ్ గా వెళ్లి నీ హక్కును కాపాడుకుంటావా లేక నెమ్మది గా వెడతావా?”


"రోడ్డు బాగయ్యేవరకు నెమ్మదిగానే వెడతాను" అని మౌనం గా ఉండిపోయింది అపురూప.


******

"ఎన్ని సార్లు చెప్పాలి నీకు, ఇంటర్వ్యూ కుదరదు అని, అయినా ఇదేం పిచ్చి నీకు, ఇప్పటికే నీ వీడియో చాల మంది చూసారు, ఇంకా ఏమి చూపిస్తావ్ టీవీ లో కనపడి ?" అని కోపంగా కసురుకుంది జర్నలిస్ట్ జ్యోతి.


"అది కాదు మేడం, నా ప్రయత్నం నన్ను చెయ్యనివ్వండి, పేరు లో జ్యోతి వుండి మీరే వెలుగు ప్రసాదించకపోతే ఎలా? ఇలా ఏ ఛానల్ వాళ్ళు అవకాశం లేదు అని అంటున్నారు మేడం " అని బతిమిలాడింది అపురూప.


"ఏం సాధించవని, నిన్ను టీవీ లో కూర్చోపెట్టాలి?"


"సాధించానని కాదు మేడం, సాధించాలని" అని సమాధానమిచ్చింది అపురూప దృఢంగా.


"సరే లే విసిగించకు, నాకు టైం దొరికితే నీకు చెపుతానులే ఆశ పెట్టుకోకు" అని ఫోన్ పెట్టేసింది జ్యోతి.


ఆ తరువాత, కొన్ని నెలలకి, అపురూపకి అవకాశం వొచ్చింది, అదీ ఏదో ప్రోగ్రాం అనుకోకుండా క్యాన్సిల్ అయితే, జ్యోతి అపురూపని పిలిచింది. అదీ లైవ్ షో, అపురూపకు బెరుకుగా వున్నా గంభీరం గా కూర్చొని వుంది.


మేక పిల్లను చూసిన చిరుతలాగా వుంది జ్యోతి. అపురూపను ఉదాహరించి, ప్రజలకి ఒక సందేశం, నీతులు, నైతిక విలువలు, పెళ్ళీ దానియొక్క ప్రాముఖ్యత గురించి ఓక ప్రసంగమే తయారుచేసుకుంది, అవకాశం కోసం మాటువేసింది అంతే.


"చెప్పు అపురూప ! నీ వీడియో చాలామంది చూసి వుంటారు, చూసిన వారికి మీరు ఏమి సందేశం ఇద్దామని ఈ ఇంటర్వ్యూ కి వొచ్చారు? నీ స్క్రీన్ ప్రెజన్స్ ఎలా వుందో కనుక్కుంటావా?"


యెంత ఆపుదామన్న వెటకారం జ్యోతి కళ్ళలో కనపడుతోంది, ఆ చూపు, ఆ నవ్వు అపురూపకు సుపరిచేయమే కాబట్టి, ఎక్కువ ఆవేశపడలేదు.


చిన్న నవ్వు నవ్వి, "అంత పెద్దమాటలు ఎందుకులెండి జ్యోతిగారు, ఒక విషయం, ఇందాక చూసాను మీ భుజాన వున్న ఆ పర్సు చాలా బావుంది, ఎక్కడ కొన్నారు ?"


"అదా.. కెనడా లో కొన్నా, సీల్ స్కిన్ తో చేసినది"


"మేడం, మీ పర్సు కోసం, సీల్ జంతువు, చెర్మాన్ని బతికుండాగానే వొలుస్తారు అని మీకు తెలుసా ? పైగా చెర్మం వొలిచిన సీల్ జంతువుల్ని అదే మంచులో వదిలేసి వెళ్ళిపోతారు "


ఆ మాట వినగానే జ్యోతి కళ్ళలో ఆర్ద్రత కనిపించింది, దానికోసమే చూస్తోంది అపురూప.

"ఇప్పుడు చెప్పండి మేడం, మీరు మళ్ళీ సీల్ పర్సు ని కొంటారా ?"


"లేదు". అంది జ్యోతి మెల్లిగా.


“అదే మేడం నేను చెప్పదలుచుకుంది, లైకులు కోసం, షేర్ల, కోసం పరితపించి, చివరకు అర్ధనగ్నంగా డాన్సులు చేసే వారు వున్నారు. వాటిని చూసే వారు వున్నారు. అది వారిద్దరికీ తెలిసి చేస్తారు. కానీ, ఈ వాయురిజం లేదా రివెంజ్ పోర్న్ లో అంటే వీడియో లో వున్నవారికి తెలీదు, వారిని ఇతరులు చూస్తున్నారు అని గాని, చూస్తారు అని గాని. తెలిసిన క్షణం యెంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా ?... 93 శాతం అని ఎంతమంది కి తెలుసు?”


"అవును, చనిపోతున్నారు. నువ్వు ఏమి చేద్దామని? ప్రభుత్వం వాటిని నిషేదించింది కూడా.. " అంది జ్యోతి.


"మీకు ఆ సీల్ పడే బాధ తెలిస్తే, ఇంకోసారి కొనేటప్పుడు ఆలోచిస్తారు కదా. అలాగే.. నా విషయం లో, నాకు బాధ కలిగించిన విషయం ఏమిటంటే, మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాలబ్బాయికి ఆ వీడియో వొచ్చింది. అది వెంటనే తనకు తెలుసున్న వాళ్ళకి పంపించాడు. మా ఫ్రెండ్ ఆ విషయం గమనించి, " నువ్వు ఎందుకు వేరే వాళ్ళ పర్సనల్ వీడియో చూస్తావు ? పైగా మీ ఫ్రెండ్స్ కి పంపావు?" అని అడిగింది.


దానికి ఆ పిల్లాడు, "అక్కా, నేను అడిగానా వీడియో పంపమని? నేను తీశానా ఆ వీడియో ని? నా తప్పేముంది?, నేను కాకపొతే ఇంకొకడు పంపుతాడు” అన్నాడు నిర్లక్ష్యంగా.


ఇక్కడ నేను చేసినది తప్పా? ఒప్పా ? అని వాదించటానికి రాలేదు, ఆ సీల్ లాగానే, నేను ఎంతబాధపడ్డానో, నాలానే మిగిలినవాళ్లు యెంత బాధపడ్డారో తెలియచేస్తే కనీసం, వేరేవాళ్లకు పంపించేముంది మాలాంటి వాళ్ళగురించి ఒక్క క్షణం ఆలోచిస్తే నేనే ఒక డుగు ముందుకు వేసినట్టే "

"అంటే? అలా ఫార్వర్డ్ చెయ్యకపోతే, వీడియో మాయమవ్వదు కదా?"


"అవును అవదు, కానీ ఈ దావానలం కాస్త తగ్గుతుంది అని ఆశ. నిజానికి ఇప్పుడు, ఈ కార్యక్రమం చూస్తున్నవాళ్ళు, చాలామంది నా వీడియో కోసం నెట్ లో వెతుకుతూ వుంటారు. అలా, చూసేవాళ్ళు వున్నంతవరకు ? పెట్టేవాళ్ళు పెడుతూనే వుంటారు. పక్కింట్లో ఏమిజరుగుతుందో తెలుసుకోవాలనే ఆశ ఉన్న ప్రతిఒక్కరు, ఈ వీడియో లు చూస్తారు. నాలాంటి వాళ్ళని చావు వరకు తీసుకెడతారు. ఒక అమ్మని, నాన్నని, ఇంటికే పరిమితం చేస్తారు. హత్య చేసినవాళ్లను కూడా పట్టించుకోని ఈ సమాజం, నాలాంటి వాళ్ళమీద మాత్రం చాలా ఇంటరెస్ట్ చూపిస్తారు. ఒక్కసారి, దిన పత్రికల్లో, 'ఎక్కువమంది చదివినది' కాలమ్ దగ్గర ఉన్న వార్తలను చూస్తే మన సమాజం ఎలాంటి వార్తల్ని కోరుకుంటోందో మీకే తెలుస్తుంది.


నేను మీ అందరిని అర్ధించేది ఒక్కటే. మాలాంటి వాళ్ళ ఆత్మహత్యల్లో కనీసం మీ పాత్ర లేకుండా చెయ్యండి " అంది అపురూప అశ్రు నయనాలతో ప్రేక్షకుల వైపు తిరిగి దణ్ణం పెడుతూ.

ఒక్క క్షణం ఆగి, జ్యోతి.. ”నేను కూడా, నువ్వు ఫోన్ చేసి నీ విషయం చెప్పినప్పుడు, చాలా తేలికగా తీసుకున్నాను. కానీ నీ బాధ వింటూ ఉంటే, నాది పొరపాటు అనిపిస్తోంది సారి " అని అంటూవుండగానే, జ్యోతి కి ఎవరో సైగ చేసారు.


జ్యోతి ఒక్కసారి, తల ఊపి, వెంటనే, "ఒకసారి మన లైవ్ వీడియో కింద వొస్తున్న కామెంట్స్ చూద్దాం అని స్క్రీన్ మీద ఆ కామెంట్స్ ప్రసారం చెయ్యమని సైగ చేసింది

అనుకున్నట్టుగానే, మొదట, "ఈ పిల్ల నాకు తెలుసు" అని, "ఓఒహ్ ఈ అమ్మాయా ? "అని "భలేవుందని ", అలా రకరకాలుగా కామెంట్స్ వొస్తున్నాయి, అలా లేటెస్ట్ కామెంట్స్ కి వొస్తున్నకొద్దీ, "అరెరే ", "పాపం కదా", "మనకి తెలీదే ఇంత బాధ ఉంటుందని" అని చివరిగా ఫ్రెండ్స్ ఇప్పుడే మనమందరం "#స్టాప్ వాయురిజం" ని ట్రెండ్ చేద్దాం అన్నారు, అంటే అలా పర్సనల్ వీడియోలు అందుబాటులో వున్నా వాటిని ని చూడమని ప్రతిజ్ఞ చేస్తున్నారు, కామెంట్స్ అన్ని ఆ హాష్ టాగ్ ని సమర్ధించేవిగానే వున్నాయి.


అక్కడ నుండి జ్యోతి వేరే స్క్రీన్ లో, ట్విట్టర్ ఓపెన్ చేసింది, అక్కడ కూడా #స్టాప్ వాయురిజం ట్రెండ్ అవ్వటం మొదలుపెట్టింది. , జ్యోతి, అపురూప ఒకరినొకరు చూసుకున్నారు, కొద్దిగా ప్రశాంతత కనిపించింది అపురూపకి.


తన మరక మానుతుందేమో అని అపురూప ఆశ పడింది.

*****

కిరణ్ జమ్మలమడక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: Dr: కిరణ్ జమ్మలమడక

కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్స్ చేసి, GE లో సీనియర్ మేనేజర్ గా, భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. కిరణ్ , "స్ప్రింగ్" అనే సంస్థ ను స్థాపించి, తద్వారా విద్యార్థులకు మోటివేషనల్, లైఫ్ కోచింగ్ తరగతులను నిర్వహిస్తూ వుంటారు. తన సంస్థ ద్వారానే కాకుండా పిల్లలు , పెద్దలు ప్రపంచం పట్ల సానుకూల దృక్పథం తో ముందుకుసాగాలనే ఉద్దేశం తో కథలు రాయటం మొదలుపెట్టారు, ప్రముఖ పత్రికల్లో ఆయన కథలు కొన్ని ప్రచురితమయ్యాయి ,తెలుగు వెలుగు 'కథా- విజయం 2019' పోటీలో భాగంగాఎన్నిక అయ్యిన "మిరప మొక్క " ప్రజాదరణ పొందినది. పదేళ్లలోపు పిల్లల కోసం రాసిన "యాత్ర", పదేళ్ల పైబడిన పిల్లల కోసం రాసిన నవల "అతీతం" లను తానా - మంచిపుస్తకం 2021 లో ప్రచురించింది.


76 views2 comments

2 Comments


కథ నేటి పరిస్థితుల్లో యువత సంఘర్షణను చాలా చక్కగా చూపించింది. ఒక చక్కని ముగింపు.

Like

Surekha Arunkumar
Surekha Arunkumar
Nov 09, 2023

కధ బావుంది. యువత ఎదుర్కునే సమస్యల్లో ఒకటి👌

Like
bottom of page