top of page

మోసం!

Sudha Murali Inamanamelluri

'Mosam' written by Sudhamurali

రచన : సుధామురళి

"ఏవండోయ్..హెంత పని జరిగిందో చూశారూ!" కోవై సరళ బ్రహ్మానందాన్ని అరిచినట్టు అరుస్తూ వచ్చింది వరాలు.

"ఆ...ఆ....చూశా! చూశా నీ ఘనకార్యం మొత్తం చూశా!" తాపీగా అచ్చులూ, హల్లులూ కలిపిన దీర్ఘాలు తీస్తూ చెప్పాడు వరపతి.

"హేమిటీ, నా ఘనకార్యమా!? మీ కళ్ళజోడు సంతలో జరిగిన దొంగతనంలో పోవడమూ, మీరూనూ. మీ మీసాలపై కాకులు గూడు పెట్టడమూ, మీరూనూ.."

"హా, హా ఏమిటేమిటే నీ ప్రేలాపనలూ, నువ్వూ! నీకు ఎన్నోసార్లు నొక్కి, తొక్కి చెప్పాను. నా కళ్ళజోడు జోలికీ, నా మీసకట్టు జోలికీ రావద్దూ, వస్తే తొక్క తీ.."

"ఆ..ఏమిటీ, ఏదో అంటూ..అంటూ.."

"ఆ ..అదేదో మరచిపోయి గతజన్మ అయ్యింది కానీ జరిగిన సంగతి ఏమిటో చెప్పి ఉద్ధరించు!"

"మొన్న మనమ్మాయి నిశ్చయ తాంబూలాల అప్పుడు ఏం జరిగింది"

"ఏం జరిగింది? నిశ్చితార్థం, అటుపైన కమ్మటి కందాబచ్చలి కూర, పైగా ఆవ పెట్టింది, గుమ్మడి వడియాలు, ఇంకా గోంగూర పులిహోర.. వీటితో కూడిన విందు భోజనం జరిగింది. కొంపదీసి ఇప్పుడు గానీ నీకా వంటలు చేయాలని మనసు మళ్లిందా ఏమిటి? అసలే కరోనా లాక్డౌన్, నేనా సరుకులు పట్టుకురాలేను తల్లో.."

"ఏడ్చినట్టే ఉంది యవ్వారం! ఎప్పుడూ ఆ తిండి గోల, తప్పితే మీసాలకు సంపెగ నూనె అనుకుని వీధి చివరి అంగడిలో దొరికే కల్తీ కొబ్బరి నూనె రాయడం, తప్పితే భూతద్దాలకు ఎక్కువ, రీడింగ్ గ్లాసెస్ కు తక్కువ అయిన ఆ కళ్ళజోడుని చూసుకుంటూ ఏదో ప్రేయసిని చూసుకుని మురిసిపోయే ప్రియుడిలా మీలో మీరు నవ్వుకోవడం తప్పించి కూతురు పెళ్ళి, దాని ఏర్పాట్లు.. ఇలా ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా అసలు?"

"వున్నా, నువ్వెప్పుడు నన్ను చేయించావులెద్దూ"

"ఏదో గొణుక్కుంటున్నారు?"

"ఏమీ లేదులేవోయ్! ఇప్పుడు ఏర్పాట్లకు ఏమి లోటు జరిగింది? ఆన్ లైన్ లో పెళ్లి వీక్షణకు ఆ ఛానెల్ వాడితోనూ, నీ గొట్టం వాడితోనూ మాట్లాడేశాను. ఇక స్కైప్ లో అబ్బాయి జీలకర్రా బెల్లం పెట్టినప్పుడు, తాళి కట్టినప్పుడు, తలంబ్రాలు పోసేటప్పుడు ఇక్కడ అమ్మాయికి అవి చేసేందుకుగానూ ఓ అమ్మాయిని సిద్ధం చేశాను కూడా. పైగా ఆ అమ్మాయ్ అరగంట అరగంటకూ శానిటైజర్ లో స్నానం చేసేందుకు కూడా ఒప్పుకుంది. అక్కడ అబ్బాయి తరపు వాళ్ళూ ఇలాంటి అరేంజిమెంట్స్ చేసుకున్నట్టు భోగట్టా. ఇక భోజనాలు.."

"మళ్లీ అక్కడికే వచ్చా..రూ.."

"అందుకేగా ఆపే..శాను"

"ఇంతకీ అసలు విషయం మరుగున పెట్టావు"

"నిశ్చితార్థానికి వచ్చినప్పుడు వాళ్ళు మనకు ఏం చెప్పారు"

"ఏం చెప్పారు..!?"

"వాళ్ళ ఇంట్లో అందరూ అంటే ఆఖరుకు అబ్బాయి కూడా (దొంగతనంగా) కోవిషీల్డ్ వేసుకున్నాము, మొదటి డోస్ అయ్యింది, రెండవ డోస్ సరిగ్గా పెళ్లికి వారం ముందు వేసుకున్నాము అని చెప్పారా!? లేదా!?"

"చెప్పారు..."

" అదిగో అక్కడే వాళ్ళు మనకు అబద్ధం చెప్పారు. వాళ్ళు వేసుకున్నది కోవిషీల్డ్ కాదట, పోనీ కోవాక్సిన్ అన్నానా అంటే అదీ కాదట, అదేదో స్పుత్నిక్ నో బుత్నిక్ నో అట. వారి వేలు విడిచిన పెదనాన్న తమ్ముడి, కూతురి, తోడికోడలు చెల్లెలి భర్త నిన్న మీ తమ్ముడి గారికి ఏదో జూమ్ మీట్ లో తారసపడితే చెప్పాడట!"

"ఏమిటీ ఇంత మోసమా.."

"ఆ...మరే! పైగా అంటారట, మేము బోలెడు డబ్బులు పోసి వ్యాక్సిన్ వేయించుకున్నాము. మీరు బోడి ఉచిత కోవిషీల్డ్ వేసుకుని ఏదో బిల్డప్ ఇస్తున్నారు అని దెప్పి పొడుపులు కూడానట"

"అసలిప్పుడు కోవిషీల్డ్, కోవాక్సిన్ అమ్మాయి, అబ్బాయికి జోడీ కుదురుతుందా, లేదా అని జూమ్ మీట్లలో, డుయో కాల్స్ లో, వాట్సప్ స్టేటస్ లలో చర్చ జరుగుతూ, ఒక నిర్ణయానికి రాక, కోర్టును ఆశ్రయించడమా, కేంద్రానికి ఫిర్యాదు చేయడమా, ఇన్ని రకాల వ్యాక్సిన్ లను ఎందుకు కనిపెట్టారంటూ సైంటిస్ట్ లను నిలదీయడమా అని బుర్రను అటు అరవై, ఇటు తొంభై డిగ్రీలలో తిప్పుతూ ఆలోచిస్తుంటే ఈ కొత్త చిక్కు ఎక్కడినుంచి వచ్చిందోయ్"

"అదే కదా మరి! నేను మాత్రం మా కాకరకాయ ముచ్చట్లు గ్రూప్ లోనూ, అమ్మలకు అరవై కళలు యాప్ లోనూ, వయసు మీద పడ్డ భామ(మ్మ!?)లు గ్రూప్ లోనూ దీని గురించే కదూ ఎన్నెన్ని సమీక్షలు, సలహాలు ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళ ముందు నా పరువు ఏమై పోవాలి? ఏ వ్యాక్సిన్ వేసి దాన్ని నేను బతికించుకోవాలి!"

"ఏడవకు వరం! అంతగా వాళ్ళు మళ్లీ కోవిషీల్డ్ వేసుకుని మన అమ్మాయితో పెళ్లికి ఒప్పుకోక పోతే, ఈ సంబంధం తెగ కొట్టేసుకుందాం"

"అంతే అంటారా?"

"అంతే వరం! అంతే.. లేకుంటే ఆ వ్యాక్సిన్ మోసాన్ని బతికినంత కాలం భరించడం నా వల్ల కాదు. అంతగా అనుకుంటే మొన్న జాతకాలు కుదరక పక్కకు పెట్టిన ఆ వెబ్ ఎక్స్ యాప్ లో పెళ్లి చూపులు అయిన వాళ్ళు కోవిషీల్డ్ వేసుకుని మన కోసమే ఎదురుచూస్తున్నారట! వాళ్ళతో కుదుర్చుకుందాం"

"జాతకాలు.."

"ఇప్పుడు జాతకాల కంటే వ్యాక్సిన్ కలవడమే ప్రధానం కదూ వరం"

"సరేనండీ! మీ మాటే నా చాట్.. ఇప్పుడే కొత్త గ్రూప్ క్రియేట్ చేసుకుంటాను.

*తెగగొట్టుకున్న స్పుత్నిక్ - కలుపుకుంటున్న షీల్డ్* అని చర్చ మొదలుపెట్టాలి"

"అలాగే వరం! నేనూ షీల్డ్ వర్సెస్ క్సిన్ - మధ్యలో దూరిన స్పుత్ని అని ఆన్లైన్ డిబేట్ కు ప్లాన్ చేసుకుంటాను"

వరపతి చివరి పంచ్ పేలింది కదూ..

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


 
 
 

Comments


bottom of page