top of page

మొట్టికాయ


'Mottikaya' - New Telugu Story Written By Sujatha Swarna

Published In manatelugukathalu.com On 19/10/2023

'మొట్టికాయ' తెలుగు కథ

రచన: సుజాత స్వర్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసమని హైదరాబాద్ రైలెక్కాను. "ఆడపిల్లను ఇంజనీరింగ్ చదివించడమే ఎక్కువ. పైగా ఉద్యోగం కూడా చేయించాలా! పెళ్లి చేయక.. " అని బామ్మ ఎంత మొత్తుకుంటున్నా నా కోరిక కాదనలేక నాన్న నన్ను హైదరాబాద్ పంపడానికి ఒప్పుకున్నాడు.


ఖమ్మం జిల్లాలో మాదో మారుమూల పల్లె. మా ఊరిలో చాలామంది వ్యవసాయమే చేస్తారు. ఈ మధ్యనే కొద్దిమంది మగపిల్లలు పై చదువులకనీ, ఉద్యోగం కోసమని బయటికి వెళుతున్నారు. ఆడపిల్లలు పెద్ద చదువులు చదవడం గగనమే. డిగ్రీ చదివారంటే చాలా గొప్ప విషయం. ఇంటర్ కావటమే ఆలస్యం పెళ్ళి బాజాలు మోగేవి. అలాంటిది నేను ఇంజనీరింగ్ చదివి ఒక సంవత్సరం కోచింగ్ తీసుకున్నాను. ఇప్పుడు ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్తానంటే ఇంట్లో వాళ్ళందరు భయపడుతున్నారు. అయినా ఉద్యోగం చేయాలనే పట్టుదలతో బయలుదేరాను.


రైలు నాంపల్లి స్టేషన్ లోకి చేరబోతోందనే ఎనౌన్స్ మెంట్ విని లగేజీ సర్దుకుందామని తలవంచగానే ఠపీమని మొట్టికాయ పడింది. తలమీద ఎవరైనా చెయ్యి పెట్టినా, మొట్టికాయ వేసినా నాకు మాచెడ్డ చిరాకు. చిన్నప్పుడు గురువులు ఆశీర్వదిస్తున్నా తలకు చెయ్యి తగలకుండా జాగ్రత్త పడేదాన్ని. అలాంటిది మొట్టికాయ పడితే ఊరుకుంటానా! తిట్ల దండకం మొదలెడదామని "కళ్ళు కనబడట్లేదా?"అంటూ తలపైకెత్తాను.


పక్క బెర్తు లోని ప్రయాణీకుడనుకుంటా సుమారు ముప్పై ఏళ్లు ఉంటాయేమో. "క్షమించండి" అంటూ చిన్నగా నవ్వుతూ ముందుకి నడిచాడు.


ఆ నవ్వు చూసి నాకు ఒళ్ళుమండి "క్షమించాలట క్షమించాలి కొట్టినప్పుడు తెలియదా?" గట్టిగా అతనికి వినబడేలా అన్నాను. అతను వెనుతిరిగి చూస్తూ వెళ్ళిపోయాడు.


రైలు దిగి స్నేహితురాలు నందిని చెప్పిన చిరునామాకు ఆటో మాట్లాడుకుని వెళ్ళాను. నాకు అనుకూలంగా ఉన్న కంపెనీలకు దరఖాస్తు చేశాను. ఓ పదిరోజులు గడిచాక ఒక కంపెనీ నుంచి పిలుపొచ్చింది.


ఆ రోజే ఇంటర్వూ. వాళ్ళిచ్చిన సమయం కంటే అరగంట ముందే ఆఫీసుకి చేరుకున్నాము. నందిని ఆఫీసు చూపించి, నాకు ధైర్యం చెప్పి వెళ్ళిపోయింది. పైన పెద్ద అక్షరాలతో సంస్థ పేరు కనిపిస్తోంది. ''నిజంగా ఈ కంపెనీలో నాకు ఉద్యోగమొస్తుందా?'' ఆలోచిస్తూ బెరుకుగానే లోపలికి వెళ్ళాను.


ఆపాటికే ఇంటర్వూకి వచ్చిన ఇద్దరు, ముగ్గురు కూర్చొని కనిపించారు. నేనెళ్ళాక ఇంకొంతమంది వచ్చారు. వారందరినీ చూసేసరికి నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఒక్కొక్కరిని పిలుస్తున్నారు లోపలికి. నా వంతు రానే వచ్చింది. మనసులో భయమున్నా పైకి కనిపించనీయకుండా బింకంగా ఉన్నాను.


లోపలికెళ్ళగానే బోర్డు మెంబర్స్ లో ఇంటర్వూ చేసే వ్యక్తిని చూసి గుండె గతుక్కుమంది. నా ప్రయాణంలో మొట్టికాయతో గొడవపడిన వ్యక్తే అతను. అందుకే ఎవ్వరి మీద పడితే వారి మీద నోరు పారేసుకుంటే ఇప్పుడు నిజంగానే గట్టి మొట్టికాయ పడుతుంది. క్షమించమన్నా కూడా వినిపించుకోకుండా తిట్టాను.


‘ఇక ఈ ఉద్యోగం నాకొచ్చినట్టే.. ?!’ మనసులో అనుకున్నాను.


''మౌనిక..” నా పేరుని గట్టిగా ఒత్తి పలుకుతున్నాడతను. “పేరు బాగుంది.. కానీ పేరుకు తగిన స్వభావమేనా మీది?'' అంటున్న అతడిని ఆ ప్రక్కనే కూర్చున్న మరో మెంబర్ అదేం ప్రశ్నో అర్థం కాక వింతగా చూసింది.


సర్టిఫికెట్స్ పరిశీలించి కొన్ని ప్రశ్నలు వేసి నా జవాబులు విని సంతృప్తి చెందినట్లే ఉన్నా ''వియ్ విల్ కాల్ యూ ల్యాటర్, నౌ యూ కెన్ గో''' అన్నాడు. ఎన్ని ప్రశ్నలు వేస్తాడో ఏమోనని కంగారు పడ్డాను. బతుకు జీవుడా! అనుకుంటూ అక్కడ నుంచి బయట పడ్డాను.


వారం తర్వాత వచ్చిన మెసేజ్ చూసి నా సంతోషానికి అవధులు లేవు. నేను ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యానని దాని సారాంశం.

అమ్మానాన్నలకు ఫోన్ చేసి నా ఆనందాన్ని పంచుకున్నాను.


ట్రైనింగ్ పీరియడ్ మూడు నెలలు తెలియకుండానే గడిచిపోయాయి. పోస్టింగ్ కూడా ఇచ్చారు. మాటీం లీడర్ మాత్రం నన్ను ఇంటర్వూ చేసిన సంతోష్ గారే. నాకు ఆయన కింద పని చేయడమంటేనే కంగారుగా ఉండేది. ఆయన కూడా మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చాడని, కష్టపడి తన ప్రతిభతో చిన్నవయస్సులోనే పైస్థాయికి ఎదిగాడని తెలిసింది.


కాకపోతే కాస్త కోపమెక్కువట. పని విషయంలో ఏమాత్రం సహించడట. ఆ మాటకొస్తే నాకు కూడా ముక్కుమీదనే ఉంటుంది కోపం. నెమ్మదిగా చెప్తే ఎంత పనైనా చేయగలను. కోపాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాను గట్టిగా.


నేను భయపడినంత ఏమీ లేదు ఆఫీస్ లో. సంతోష్ ఎక్కువగా మాట్లాడడు. చెప్పవలసిన విషయం సూటిగా చెప్తాడు. అతడిని చూస్తే మాత్రం కంగారుగా ఉంటుంది. బహుశా అది నా గిల్టీ ఫీలింగేమో! అతనిని కలవకుండా పని పూర్తి చేయాలని చూస్తుంటాను.. కానీ అతనితో ఏదో ఒక అవసరం పడుతూనే ఉంటుంది.


ఆఫీసులో ఎంత పెద్ద వారినైనా పేరు పెట్టే పిల్చుకుంటారు. టీంలో నేనే జూనియర్ నైనా కొద్ది కాలం లోనే పని బాగా చేస్తాననే పేరు తెచ్చుకున్నాను. మా అందరి టీంవర్క్ తో ప్రోజెక్ట్ లోని మా బ్లాక్ తొందరగా పూర్తయింది. ఆ సందర్భంగా ఒక రోజు ఔటింగ్ ఏర్పాటు చేశారు.


ఆ రోజంతా సరదాగా గడిచింది ఆడ మగ భేదం లేకుండా అందరం కలిసి ఆటలాడాము. షటిల్లో నేనూ సంతోష్ ఒక జట్టుగా ఆడవలసి వచ్చింది. మా ఎదురు జట్టు వాళ్ళు మాకు బాగా పోటీనిచ్చారు. ఒక సారి నేను కాక్ ని కొడదామని వెళ్ళి సంతోష్ కి దగ్గరగా ఉండడంతో, అతడు కొడతాడని నేను, నేను కొడతానని అతను అనుకుని తికమక పడడంతో కాక్ కింద పడిపోయింది. నేను మిస్ చేయడం వల్ల ఎదుటి జట్టుకి పాయింట్ వచ్చిందని నా తలమీద ఒక మొట్టికాయ వేశాడు.


నేను అతనికేసి కోపంగా చూసాను. ఆట వదిలేసి వెళ్ళిపోదామన్నంత ఉక్రోషమొచ్చింది. బాగుండదని తమాయించుకున్నాను. చివరికి ఆట మేమే గెలిచాము. సంతోష్ నా దగ్గరకు వచ్చి నవ్వుతూ ''కంగ్రాట్స్'' అంటూ చేయి కలిపాడు. అయినా అతని మీద కోపం పోలేదు.


నేనింకా ముభావంగా ఉండడాన్ని గమనించి నన్ను పిలిచి "ఏమిటి అలా ఉంటున్నావేం మౌనిక? నా మీద కోపమా? నిన్ను బాధపెట్టి ఉంటే క్షమించు. చిన్నప్పటి నుంచి నాకో చెడ్డ అలవాటు ఉంది. అదీ.. తల మీద మొట్టికాయ వేయడం" అన్నాడు. అతను చెప్పే పద్ధతికి నేను నవ్వు ఆపుకోలేకపోయాను.


అతను కూడా నవ్వుతూ "నాకు వాళ్ళు బాగా నచ్చితేనే సుమా!" అన్నాడు.


నేను ఆశ్చర్యపోతూ "మీ అలవాటు నాకస్సలు నచ్చలేదు సుమా!" అంటూ బయటికి వచ్చేశాను.


మా టీంలోని వారంతా చక్కగా కలిసి పోయారు. ఉద్యోగం చేస్తున్నట్లే లేదు. చాలా సరదాగా గడిచిపోతున్నాయి రోజులు. అందరం కలిసే లంచ్ చేస్తాము. సంతోష్ కూడా వీలున్నప్పుడల్లా మాతోనే తింటాడు. అతని మాట తీరు, పనితనం, చాకచక్యం నచ్చి అతనంటే నాకు గౌరవం పెరిగింది. ఆతను కూడా నా పట్ల అభిమానంగా ఉండేవాడు.


సంవత్సరకాలం ఇట్టే గడిచిపోయింది. ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఆ మధ్య ఫోన్ చేసినప్పుడు నాన్న గట్టిగానే చెప్పారు. నేనేమీ మాట్లాడలేదు. మౌనం అర్థాంగీకారమని వాళ్ళ పనుల్లో వాళ్ళున్నారు.


సంతోష్ రెండు రోజులు ఆఫీసుకు రాలేదు. అప్పుడప్పుడు టూర్ వెళ్ళవలసి ఉంటుంది అతనికి. అలా వెళ్ళారేమో అనుకున్నాను. అతని గురించి ఎవరిని అడిగినా సరైన సమాధానం లేదు. ''బహుశా వాళ్ళ అమ్మగారి వద్దనుండి ఫోన్ వస్తే వెళ్ళి ఉండవచ్చేమో'' అన్నారు కొందరు. వాళ్ళది వరంగల్ దగ్గర అని మాత్రమే తెలుసు. ఫోన్ చేద్దామనుకొని, మొహమాటపడి ఆగాను.


ఆ రోజు గురువారం. నాన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. రేపు ఆఫీసు అయిపోగానే బయలుదేరి రమ్మని దాని సారాంశం. ఓ గంట ముందుగానే పర్మిషన్ తీసుకుని శాతవాహన రైలు కోసమని స్టేషన్ కి వెళ్ళాను. పది నిమిషాలు ఆలస్యానికి మూల్యం - నా కళ్లముందే రైలు వెళ్ళి పోయింది. చేసేదిలేేక కాళ్ళీడ్చుకుంటూ బస్టాండ్ కి వెళ్ళి కదులుతున్న బస్ ఎక్కా.. నక్రేకల్ లో సీటు దొరికింది.


నేను ఖమ్మంలో బస్ దిగేసరికి నాన్న నాకోసం ఎదురు చూస్తున్నారు. గంటలో మా ఊరు చేరుకున్నాము. మార్గమధ్యంలో నాన్న, విషయం చెప్పారు రేపే పెళ్ళిచూపులని. నాకు మనసంతా దిగులుగా ఉంది. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. సంతోష్ బాగా గుర్తొచ్చాడు.


ఆడపిల్లకు ఏదీ తన చేతుల్లో ఉండదు. ఎంత చదువుకున్నా ఆమె ఇష్టాయిష్టాలతో పనిలేదు. ఆడపిల్లంటే బరువు, బాధ్యత తీర్చుకోవాలనే ఆరాటమే తల్లిదండ్రులది.


అబ్బాయి హైదరాబాద్ లోనే ఉద్యోగం చేస్తున్నాడు. తల్లికి ఆరోగ్యం బాగా లేదని ఇంట్లో తొందరపడుతున్నారట. అబ్బాయి బాగున్నాడు. మంచి వ్యక్తి. ఏ దురలవాట్లు లేవని చూసొచ్చినట్లు చెబుతోంది బామ్మ.


'ఈ రోజుల్లో తాగని వారెవరూ' మనసులో అనుకున్నాను. ఫోటో చూడమని ఇచ్చి పోయారు. కవర్ మీద ఆర్. ఎస్. కుమార్ అని ఏదో అడ్రస్ కనిపిస్తోంది. ఫోటో కూడా చూడాలని అనిపించక పక్కన పడేసాను.


ఉదయం ఏడు గంటలకే వచ్చారు పెళ్ళి వారు. నచ్చితే ముహూర్తాలు కూడా పెట్టుకుందా మని పెందరకడ వచ్చారట.


''అక్కా! బావగారు బాగున్నారే హీరోలాగా. ''.. చెల్లి సరదా పడుతోంది.


అమ్మ వచ్చి అభావంగా ఉన్న నన్ను చూసి "ఏమైందే అలా ఉన్నావు? కాస్త నవ్వుతూ ఉండవే, ప్రయాణ బడలికేమోలే!" అంటూ ముస్తాబు చేసి వాళ్ళ ఎదురుగా కూర్చోబెట్టింది.


నేను తలవంచుకొని కూర్చున్నాను. వాళ్ళు ఐదారుగురు ఉన్నట్లు లీలగా తెలుస్తోంది. ఎవ్వరినీ స్పష్టంగా చూడలేదు. చూడాలని కూడా అనిపించట్లేదు. "అమ్మాయికి బాగా సిగ్గెక్కువనుకుంటా?" నవ్వుతున్నారు. "అంత సిగ్గైతే ఉద్యోగం ఎలా చేస్తోంది?".. మళ్ళీ నవ్వులు.


వారడిగిన ప్రశ్నలకు కూడా తల ఎత్తకుండానే సమాధానమిచ్చాను.


"మా కుమార్ కి అమ్మాయి నచ్చింది. అమ్మాయితో మాట్లాడతాడట" అన్నారు.


గుండెల్లో గుబులు బయలు దేరింది నాకు. నా ప్రమేయం లేకుండానే గదిలోకి పంపబడ్డాను. ఎదురుగా కాస్త దూరంలో అతను. మంచి ఎత్తే. సింపుల్ గా టక్ చేసుకుని ఉన్నట్లు తెలుస్తోంది. నేను తలవంచుకొని ఉండడం వల్ల ముఖం మాత్రం కనడలేదు. చాలా చిరాకు తెప్పిస్తోంది ఈ పరిస్థితి.


అతడు కొంచెం దగ్గరకి వచ్చినట్లు అనిపించి నేను దూరం జరిగాను. అతను ఇంకొంచెం జరిగి తలమీద గట్టిగా ఓ మొట్టికాయ వేశాడు. ఈ హఠాత్ పరిణామానికి కోపంతో తల ఎత్తి అతని వైపు చూశాను.

"ఆ.. ఇక తిట్ల దండకం మొదలు పెట్టు.. " నవ్వుతూ అంటున్న అతడిని చూడగానే నాకోపం కొండెక్కింది. కళ్ళు చిచ్చుబుడ్లలా వెలిగిపోతుండగా, ఆనందం ఆశ్చర్యం మిళితమవగా “మీరు.. ఇక్కడ.. అబ్బాయి..” ఆనందంతో తత్తరపడ్డాను.


"ఓహో! నన్నేకాదు కనీసం నా ఫోటో కూడా చూడలేదన్నమాట ! అనుకున్నా, అమ్మాయి గారు ముఖం అలా పెట్టుకొని కూర్చున్నప్పుడే. ఏదైనా చూస్తేనే కదా తెలిసేది? తల వంచుకొని కూర్చుంటే ఏం తెలుస్తుంది? సరే ఇప్పుడైనా సరిగా చూసి చెప్పు? నేను నీకు నచ్చినట్లేనా?" కొంటెగా అంటూ చేయి ఇచ్చాడు. నేను బిడియం విడిచి అతని చేయి అందుకున్నాను.


కొంచెం తేరుకుని “మరి అడ్రస్ లో మీ పేరు..” అనగానే అది నా షార్ట్ నేమ్. ఇంటి దగ్గర నన్ను కుమార్ అనే పిలుస్తారు. పూర్తి పేరు రాయల సంతోష్ కుమార్” అన్నాడు.


'సంతోష్! నాదొక షరతు'


'చెప్పూ'


'నేను నాఉద్యోగం కొనసాగిస్తాను'.


'అది నీ ఇష్టం మౌనిక '.


'ఇంక నాకు మొట్టికాయలంటే ఇష్టముండదు వెయొద్దు ప్లీజ్'.


'మరక మంచిదే అన్నట్లు మొట్టికాయ వల్ల మంచే జరిగిందిగా ! నీకిష్టంలేదు కాబట్టి నా అలవాటు మానుకోవడానికి ప్రయత్నిస్తాను' నవ్వుతూ నెమ్మదిగా మొట్టి చెప్పాడు.


మేం చాలా సేపు మనసు విప్పి మాట్లాడుకున్నాము. సమయమే తెలియలేదు.


'ఎంతసేపర్రా' అంటూ తలుపులు నెట్టారు.


మమ్మల్ని చూసి “మీ అమ్మాయికి సిగ్గెక్కువాయె, ఏం మాట్లాడకుండా తలవొంచుకొని నిలబడిందేమో అనుకున్నాము. అమ్మో! గడుసు పిండమే" అనగానే అందరూ హాయిగా నవ్వారు.

***

సుజాత స్వర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


*******


రచయిత్రి పరిచయం:

నా పేరు సుజాత స్వర్ణ. మాది సాహితీ గుమ్మంగా పేరొందిన ఖమ్మం. నేను ఉపాధ్యాయినిని. పుస్తక పఠనం, పాటలు వినడం, పాడడం, రచనలు చేయడం... నా వ్యాపకాలు.189 views0 comments

Comments


bottom of page