'Thelani Lekka' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
Pochampally Published In manatelugukathalu.com On 19/10/2023
'తేలని లెక్క' తెలుగు కథ
రచన: సుదర్శన రావు పోచంపల్లి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
రోహిణీకాంత్ ధన్వంతరి స్నేహితులు - ధన్వంతరి రోహిణీ కాంత్ కంటె కొంత తెలివైనవాడు- ఒకనాడు ధన్వంతరి రోహిణీ కాంత్ ను ఆట పట్టించాలని ఒక లెక్క అడుగుతాడు సమాధానము చెప్పమంటూ-
{1}లెక్క ఏమిటంటె ఒక యజమాని అతని నౌకరుకు ఏబది రూపాయలు ఇచ్చి కిలో చక్కెర తెమ్మంటాడు- నౌకరు దుకాణముకు పోయి ఏబది రూపాయలు ఇచ్చి చక్కెర కొంటాడు- ధర తగ్గిందని దుకాణము యజమాని నౌకరుకు ఐదు రూపాయలు వాపసు ఇస్తాడు- ఐతె నౌకరు తాను రెండు రూపాయలు ఉంచుకొని యజమానికి మూడు రూపాయలు ఇస్తాడు - యజమానికి చక్కెర ఎంతకు వచ్చినట్టు?
ఇచ్చిన సొమ్ము ఏబది రూపాయలు. అతనికి తిరిగి వచ్చిన సొమ్ము మూడు రూపాయలు అంటె చక్కెర ఎంతకు వచ్చినట్టు 50- 3 = 47 రూపాయలు. నౌకరు ఉంచుకున్నవి రెండు రూపాయలు అంటె 47 + 2 =49 మరి ఇంకొక రూపాయి ఎటు పోయినట్టు అని అడుగుతాడు ధన్వంతరి- లెక్క ఎటూ తేలక బిక్క ముఖమేస్తాడు రోహిణీకాంత్.
ఇంకొకనాడు ఇంకొక ప్రశ్న వేస్తాడు ధన్వంతరి ఏమిటంటే..
{2} దారి వెంట ఒక స్త్రీ ఒక పురుషుడు నడుచుకుంటూ పోతుంటే ఒకతను ఆ స్త్రీని అడుగుతాడు “భామామణి, ఆ చక్కని పురుషుండెవరో తెలియగ జెపుమా” అని {అంటె ఆ పురుషుడు నీకు ఏమి కావలయును అని అర్థము}
దానికి ఆమె సమాధానము “ఏ మారు పలుక నేటికి మా మామను అతని మామ మామని పిలుచున్{అంటె నేను చెప్పేదేముంది మా మామను అతని మామ కూడా మామా అని పిలుస్తాడు}
దీనికి సమాధానము చెప్పమంటాడు ధన్వంతరి-
మళ్ళీ బిక్క ముఖమేస్తాడు రోహిణీ కాంత్.
రెండు ప్రశ్నలకు సమాధానము చెప్ప లేక పోయిన రోహిణీ కాంత్ ఈ సారి తన వంతుగా ధన్వంతరికి ఒక ప్రశ్న వేస్తాడు.
{3}ఖర్జూర ఫలములు గణికుండు కొనితెచ్చి
సగపాలు మోహంబు సతికి నిచ్చె-
నందు నాల్గవపాలు ననుగు తమ్మునకిచ్చె
నష్ట భాగంబిచ్చె నతని సతికి
తగ తొమ్మిదవ పాలు తనయున కిచ్చె
తన చేత నాల్గున్న తల్లి కిచ్చె-
మొదట తెచ్చినవెన్ని
మోహంబు సతికెన్ని
భ్రాతకెన్ని వాని భార్య్కెన్ని
తనయున కెన్నిచ్చె
తల్లికి నాల్గెటులాయె
గణిత మెరిగినట్టి కరుణాల బిలిపించి లక్క సూడరయ్య నిక్కమెరుగ-
మొత్తము ఖర్జూర ఫలములెన్ని అని అడుగగానే ఈ సారి బిక్కముఖము ధన్వంతరి వంతైతది.
మళ్ళి ఒక నాడు{4} ధన్వంతరి అడుగుతాడు రోహిణీకాంత్ తో- ఏమిటంటె నా స్వంతము కానిది నాదగ్గర ఉన్నది- నీ స్వంతము కానిది నీదగ్గర ఉన్నది ఏమిటి సమాధానం అని అడుగుతాడు- ఈ సారి బాగుగా ఆలోచించు అంటాడు ధన్వంతరి.
ఈ రకంగ ఎక్కువ ప్రశ్నలు సంధించుకోవడముతోనే వారి స్నేహము నడుస్తుంది..
{5} ఈ సారి ధన్వంతరి రోహిణీ కాంత్ కు ఇంకొక ప్రశ్న వేస్తాడు.
ఏమి టంటె పది గంటలకు పనిలో కొచ్చిన కూలీని ఐదు గంటల వరకు గంటకొకసారి తనను కలిసి పొమ్మంటాడు భూస్వామి. ఐతె ఆ రోజు కూలి భూస్వామిని ఎన్ని సార్లు కలిసినట్టు అని అడుగుతాడు ధన్వంతరి-
ఎనిమిది సార్లు అంటాడు రోహిణీకాంత్.
కాదు తప్పు అంటాడు ధన్వంతరి-
మళ్ళీ ఆలోచనలో పడుతాడు రోహిణీకాంత్.
{6 ఈ సారి ప్రశ్న రోహిణీ కాంత్ వేస్తాడు- ఒక పెన్ను పెన్సిల్ కలిసి పండ్రెండు రూపాయలు- పెన్సిల్ కన్న పెన్ను ధర పది రూపాయలు అదనము అయితె పెన్సిల్ ధర ఎంత అని అడుగుతాడు రోహిణీ కాంత్. ధన్వంతరి ఆలోచనలో పడుతాడు.
సంభాషణలతోనే స్నేహము నడుపుతున్న ఇద్దరు స్నేహితులు రోహిణీకాంత్, ధన్వంతరి ఎదో ఒకటి అడిగి ఎదుటి వాడిని తక్షణమే సమాధానమీయలేని ప్రశ్నలు సంధించుచూ కాలక్షేపము చేస్తుంటారు –
{7} అందులో భాగంగ ధన్వంతరి రోహిణీ కాంత్ ను అడుగుతాడు- శశిధరుడు- శశధరుడు అంటే ఎవరని- రోహిణీకాంత్ వెంటనే చెప్పలేకపోతాడు.
తానేమి తక్కువ వాడిని కాదనుచు రోహిణీ కాంత్ ఒక పద్యము చదువుతాడు.
{8} అరి బల భట సాయకములు హరి బలములు గప్పుకొన్న
నడరెడి భీతిన్- హరి మధ్య సిగ్గు తోడను హరి వదనము జూచె నింక భీత హరిణేక్షణయై- ఇందులో హరికి గల నానార్థాలు ఏమిటి అని రోహిణీకాంత్ అడుగగ వెంటనే చెప్ప లేక తటపటాయిస్తాడు ధన్వంతరి.
{9} అసలు మన పేర్లలో సూర్యుడెవరు- చంద్రుడెవరు అని అడుగుతాడు ధన్వంతరి. దానికీ వెంటనే సమాధానము చెప్పలేకపోతాడు రోహిణీకాంత్.
{10} పురాణాలలో తాత ఎవరు, తాత తాత ఎవరు అని అడుగుతాడు రోహిణీకాంత్- జవాబు ఊహకు గూడా అందదు ధన్వంతరికి.
రోహిణీకాంత్- ధన్వంతరి సంధించుకున్న ప్రశ్నలకు సమాధానములు.
1. తమాషా ప్రశ్న మాత్రమే.
47 కి 2 కలపాల్సిన అవసరమే లేదు.
దుకాణాదారుడు ఇచ్చిన ఐదులో ఆ రెండు తీసివేశాకనే మూడు మిగిలింది.
47 కి ఆ 3 కలిపితే 50 సరిపోతుంది.
47 కి ఆ రెండు కలపాల్సిన అవసరము లేదు.
2. తల్లీ కొడుకులు.
3. 288 ఖర్జూర ఫలములు.
4. తెలివి మాత్రమే ఏ ఒకరి సొత్తు కాదు
5. 7 సార్లు మాత్రమే.
6. పెన్సిల్ ధర ఒక రూపాయి.
7. శశిధరుడు అంటె శివుడు- శశధరుడు అంటె చంద్రుడు.
8. అరి = శతృవు
హరి = కృష్ణుడు
హరి మధ్య= సింహము నడుము వంటి నడుము
గలది=సత్యభామ
హరి = కృష్ణుడు
హరిణేక్షణ = జింక కన్నుల వంటి కన్నులు గల
సత్యభామ
9. ధన్వంతరి = సూర్యుడు, . రోహిణీకాంత్= చంద్రుడు
10. తాత = బ్రహ్మ., తాత అంటె సంస్కృతములో=తండ్రి
అంటె బ్రహ్మ తండ్రి =విష్ణువు. {తాత తాత}
ఈ విధంగా రోహిణీకాంత్- ధన్వంతరిల స్నేహము కొనసాగుచుంటది.
సమాప్తం.
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comments