top of page

ముక్కోణంలో మగువ


'Mukkonamlo Maguva' - New Telugu Story Written By Ch. C. S. Sarma

Published In manatelugukathalu.com On 29/10/2023

'ముక్కోణంలో మగువ' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


అది రెండు మూడు వందల ఇళ్లు వున్న అందమైన గ్రామం... గోదావరి డెల్టా.. ఊరిచుట్టూ పచ్చని పైరు పొలాలు... అరటి... చెరకు... మామిడి... జామ తోటలు... ఎటువైపు చూచినా కనులకు విందు... మనస్సుకు పసందు.


వెంకట్రావు ఆవూరికి సర్పంచ్... వారు పెద్దగా చదువుకోలేదు. కాని సత్యం ధర్మం నీతి న్యాయం... మంచి చెడ్డా తెలిసిన వ్యక్తి. ఆ ప్రశాంత వాతావరణంలో పుట్టి పెరిగినవారు... ఏ సమస్యనైనా ప్రశాంతంగా పరిష్కరించుకొనే తత్వం... వారి కుమారుడు వేణుగోపాల్... పిరికివాడు.. స్వంత ఆలోచన, బుద్ధి లేదు. మేనత్త శకుంతల... గోపిక ఆమె కూతురు. వెంకట్రావు భర్తలేని శకుంతలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో.... భార్య సౌదామినిని ఒప్పించి గోపికకు వేణుగోపాల్ కు... రెండు వైపుల ఖర్చులను తనే భరించి... పెండ్లి ఖర్చుకు చెల్లెలుకు తనే పెట్టుబడి పెట్టి ప్రామిసరీ నోటు వ్రాయించుకున్నాడు.


పిల్ల బాగున్నందున... వేణు, వాని తల్లి సౌదామినీ వూరుకొన్నారు. వున్న దాంట్లో ఒక ఎకరాన్ని అమ్మాలని శకుంతల ఎంత ప్రయత్నించినా... పదిహేను లక్షల పైగా ఎకరం విలువ అయితే ఆడకూతురు కదా అవసరం కదా అని... భూమికి, ఇరుగుపొరుగుగా వుండే వ్యక్తి... మూడు లక్షల కిస్తావా.. నాలుగు లక్షలకిస్తావా.... అని శకుంతల జీవితాన్ని దుర్భరం చేశాడు ప్రక్కనవుండే భూస్వామి కోదండరామయ్య.. వెంకట్రావుకు అది అన్యాయంగాతోచి నోటు వ్రాయించుకొని తనే చెల్లికి డబ్బు ఇచ్చి పెండ్లి జరిపించాడు.

గోపి అత్తగారి ఇంటికి వెళ్లింది.


సౌదామిని భర్త మాటను ధిక్కరించలేక మౌనంగా వుండిపోయింది. కారణం తన వివాహాన్ని వెంకట్రావుతో జరిపించింది శకుంతల భర్త ముకుందరావు. వెంకట్రావు కాంట్రాక్టు పనిని నేర్పించింది. వారే పెండ్లి అయాక తన భర్తే అంతా ఖర్చుపెట్టి పెళ్లి జరిపించాడన్న విషయం తెలుసుకొన్న సౌదామిని మనసును భర్తమీద కోడలు మీద కోపం... ఆవేశం.. చోటుచేసుకొన్నాయి. అన్నా... చెల్లి.. కోడలు ఒకటై తనను మోసం చేశారంటూ రచ్చ చేసింది.


వేణుగోపాల్కు ఇరువురు ముఖ్య స్నేహితులు... వారిలో రాజా తన మేనమామ కొడుకు. ఆ పూర్లోనే వారూ వుండేది. మరొకతను శివ... దూరపు చుట్టం... శకుంతల ప్రక్క ఇల్లు. వేణుగోపాల్... రాజా... శివ కలసి ఒకే స్కూలు కాలోజీలో చదువుకొన్నారు. వేణుగోపాల్ రిజిస్ట్రార్ ఆఫీస్లో క్లర్కు... రాజా సి. డబ్ల్యుది ఆఫీస్లో గుమాస్తా... శివ ఆ పి. డబ్ల్యుడ్ ఆఫీసులో ఎ. ఈ. ,


ముగ్గురికీ మంచి స్నేహం... కొన్ని స్నేహాలు టైమ్ పాస్కు... వారి అవసరాలను తీర్చుకొనేదానికి... నటన పూర్వకంగా రక్తి కడుతుంటాయి. ఆ ముగ్గురిలో వేణుగోపాల్... రాజా ఆ తరహాకు చెందినవారు...


కానీ... శివ వారి తత్వానికి పూర్తిగా భిన్నం. రాజా వేణుగోపాల్ తత్వాన్ని ఎరిగినవాడు. సమయస్ఫూర్తిగా బహు జాగ్రత్తగా నడుచుకొనేవాడు.


***

వేణు వివాహం జరిగి నెలరోజులు. గోపిక వేణు... హనీమూన్కు చెన్నై... మధుర... కంచి.... తిరువన్నామలై... మహాబలిపురం.... పక్షితీర్థం... సందర్శించారు. ఆ ప్రాంతాలన్నింటినీ ప్రశాంతంగా ఆనందంగా తిరిగారు. ఆ నూతన దంపతులు చివరగా వెళ్లింది మహాబలిపురం... ఆలయాలను.. శిల్పాలను చూచారు.


అక్కడ వారికి శివ తటస్థ పడ్డాడు... అతను వారితో కలసి ఆనందంగా మాట్లాడాడు.

గోపికకు శివ అంటే చాలా అభిమానం.... తను దక్షిణ దేశపు ప్రసిద్ధ ఆలయాలను అన్నింటినీ చూచి ఒక గ్రంథాన్ని రచించాలని ఆతని సంకల్పం... కొంత వరకు ఆలయాలు చూడడం ఫొటోలు.. చరిత్రను సేకరించడం జరిగింది. త్వరలో దాన్ని పూర్తి చేయాలని అతని నిర్ణయం.

శివకు వేణుగోపాల్... అంటే ఎంతో అభిమానం.. శివను చూచి గోపిక భర్తతో చెప్పింది.


“శివా!... " పిలిచాడు వేణుగోపాల్... శివ వారిని చూచాడు.


“ఆ... గోపికా !... కులాసానా !... ఆ మిత్రమా !... వేణుగోపాల్.. మిమ్మల్ని ఇక్కడ చూస్తాననుకోలేదు.... చాలా సంతోషం... " నవ్వుతో చెప్పాడు శివ.


వేణు... తను పిలిస్తే తనను పలకరించకుండా శివ తన భార్యను ముందుగా పలకరించి... తర్వాత తనను పలకరించడం... అతని మనస్సున సంసశయాన్ని కలిగించింది.


దానికి కారణం... వివాహం అయిన తర్వాత మిత్రులందరితో పగలు ఓ పార్టీ ఏర్పాటు చేశాడు వేణుగోపాల్... రాజూ... శంకర్... దామోదరం... నలుగురూ ఆనందంగా కబుర్లు చెప్పుకొన్నారు.

యదార్థంగా రాజా.. గోపిక వారికున్న ఆస్థిని చూచి ఆమెను తాను పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు. ఆ విషయం తన తల్లి మాలతికి చెప్పాడు. అతని తండ్రి భద్రయ్య గతించి. పదిహేను సంవత్సరాలు. శివ తండ్రి రాఘవయ్య గారికి భద్రయ్య దూరపు బంధువు. వరుసకు బావ.

రాఘవయ్యగారు... రాజా చదువు సంధ్యలకు చిన్నతనం నుంచి సాయం చేసి.. శివాలాగానే రాజాను చూచుకొని చదివించి పెద్ద చేసి ఉపాధి కల్పించాడు.


తనయుడి నిర్ణయాన్ని విన్న మాలతి... శకుంతలని కలిసికొంది.... ఆ క్రిందటి రోజే... వెంకట్రావు శకుంతల చేత నోటు వ్రాయించుకొని వేణుగోపాల్... తన మేనకోడలు గోపికల వివాహాన్ని నిర్ణయించాడు. శకుంతల ఆ విషయాన్ని మాలతికి చెప్పింది.... మాలతి నోరు విప్పలేకపోయింది. 'మంచిదే వదినా అంటూ... చేజారిన అదృష్టాన్ని తలచుకొంటూ ఇంటికి పోయింది. విషయాన్ని రాజాకు చెప్పింది. జుగుప్సావంతుడు... స్వార్థపరుడు.. అయిన రాజా... వేణుగోపాల్ మనస్సున ఆ పార్టీ సమయంలో శివకు గోపికకు మంచి స్నేహం... ఇరువురూ మంచి సన్నిహితులు... అనే కల్పిత పదాలను అతని బుర్రలో నాటాడు... అతని వుద్దేశ్యం... వేణుగోపాల్ను గోపికను విడగొట్టి... గోపికకు మాయమాటలు చెప్పి... ఆమె వేణుగోపాల్కు విడాకులిచ్చేలా చేసి... గోపికను తనదాన్ని చేసికోవాలనే నీచతత్వం.


శివ... వేణుగోపాల్, గోపికలను పలకరించి... తన పనిమీద వెళ్లిపోయాడు. రాజా... వారు మహాబలిపురానికి వెళ్లారన్న విషయాన్ని వెంకట్రావ్ ద్వారా తెలిసికొని... అక్కడికి వచ్చాడు.

వేణుగోపాల్... గోపికలను కలుసుకొన్నాడు. తనూ శివా శిల్పాలను చూచేదానికి వచ్చామని అబద్ధం చెప్పాడు. ఆ రాత్రి రాజా... వేణుగోపాల్ గోపిక... మహాబలిపురంలోనే రెండు లాడ్జీల్లో వున్నారు. రాజా.... వేణు... ప్రొద్దుపోయేదాకా తప్పతాగారు... యదార్థానికి రాజా తాగినట్టు నటించాడు. తప్పతాగించాడు.


పదకొండున్నర సమయంలో తప్పతాగి సోలిపోయిన వేణుగోపాల్ను తన రూమ్లో వుంచి... లాక్ చేసి.. వేణు, గోపిక తీసుకొన్న గదికి పోయాడు. తలుపు తట్టాడు...


భర్త అనుకొని గోపిక తలుపు తీసింది.... జిడ్డుకారే ముఖంతో... వికారంగా నవ్వుతూ.. తనముందు తలుపుకు ఆవతల నిలబడివున్న రాజాను.. చూచింది. ఆమెకు విషయం అర్థం అయింది. వెంటనే వేగంగా తలుపును వేసి గడియ బిగించింది. భోరున ఏడుస్తూ... మంచంపై వాలిపోయింది.

తన ప్రయత్నం ఫలించనందుకు రాజా... గోపికను తెగ తిట్టుకొన్నాడు. తన గదికి చేరాడు. వేణుగోపాల్ను మంచంపై పక్కకు తోసి... తాను తలుపు బిగించి మంచంపై వాలిపోయాడు.... పావుగంట తరువాత గోపిక మెల్లగా తలుపు తెరిచింది... వాకిట ఎవరూ లేరు.


మెల్లగా... వేణుగోపాల్ కోసం... రాజా గదికి వెళ్లింది. భయంతో మెల్లగా తలుపు తట్టింది. తలుపు రెక్కల్లో కదలిక లేదు. తలుపు మూసివున్న కారణంగా తలుపులు తెరవబడలేదు.

'తప్పతాగి పడిపోయుంటాడు... ' అనుకొని కన్నీటితో తన గదికి చేరి తలుపు బిగించి దుఃఖిస్తూ మంచంపై వాలిపోయింది.... గోపిక పాలిట ఆరాత్రి కాళరాత్రి....


***

రాజా... వేణుగోపాల్, గోపికల కంటే ముందే వూరికి చేరాడు. అతని అభిప్రాయం... నిర్ణయం.... సక్రమమైనది కాదు. కానీ అతని తత్వంలో మార్పు లేదు. దినదినానికి అహంకారం.. గోపిక మీద మోజు పెరుగుతూ వుంది. దానికి తగినట్టుగా మిత్రుడు వేణుగోపాల్కు రాజామీద నమ్మకం... శివా మీద అనుమానం బలపడసాగాయి. రాజా... వేణుగోపాల్లోని ఆ బలహీనతను తన అభిప్రాయానికి అనుకూలంగా మార్చుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు.


వూరికి రావడంతోనే వెంకట్రావు ఇంటికి వచ్చాడు. అతని భార్య సౌదామినిని కలిసాడు.

"పిన్నీ!... కుశలమా!.. ”


“ఆ... రారా.. రాజా... వారం రోజులుగా కనబడ లేదు. ఏ వూరికైనా వెళ్లావా?... "


“అవును పిన్నీ!... ఒక రీసర్చి విషయంగా మహాబలిపురం వెళ్లాను.... అక్కడ ఒక విచిత్రాన్ని చూచాను పిన్నీ!... "


"ఏమిట్రా అది ?... "


“మన వేణుగోపాల్... గోపికలు నాకు అక్కడ కలిశారు... " వికటంగా నవ్వాడు.


"ఏమిట్రా... ఆ పిచ్చినవ్వు ?... " ప్రశ్నార్థకంగా రాజా ముఖంలోకి చూచింది సౌదామిని.


"పిన్నీ... అక్కడ నేను శివాను కూడ చూచాను... "


“వాడూ అక్కడకి వచ్చాడా !... "


"ఆ... పిన్నీ వచ్చాడు... మనవాళ్లను కలిశాడు... మాటలు కలిపాడు.. పని ముగించుకున్నాడు... వెళ్లిపోయాడు... "


"ఏం పని?... ”


“వాడి గీచే బొమ్మల పని... "


"రాజా!... శివా నీలాగే మంచివాడు కదరా!... "


"ఆ... ఆ... చాలా.. చాలా... " పగలబడి నవ్వాడు.


"ఎందుకురా ఆ నవ్వు.... " ఆశ్చర్యంతో రాజా ముఖంలోకి చూచింది సౌదామిని.


“పిన్నీ... నీవు చాలా అమాయకురాలివి. తెల్లవన్నీ పాలు... నల్లవన్నీ నీళ్ళని సంబరపడి పోతావ్ !... వాడు అక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా?... ".


“ఎందుకొచ్చాడురా.... ”


"నీ కోడలు... ఆ గోపిక కోసం... "


"రాజా.... ఏమిట్రా... నీవు అన్నది?... " ఆశ్చర్యంగా రాజా ముఖంలోకి చూచింది.


“ఆ... నిజం నిష్ఠూరంలా వుంటుందంటా... అర్ధం చేసుకో!... వస్తా... వాళ్లు వచ్చాక.... ” నవ్వుకుంటూ ఇంటికి వెళ్లిపోయాడు.


సౌదామిని మనస్సున తన భర్త వెంకట్రావు వేణు గోపికల వివాహాన్ని శకుంతల వద్ద ప్రామిసరీ నోటు వ్రాయించుకొని జరిపించిన ఆ వివాహం ఇష్టం లేనిది. కాని మొగుడు నోరుగలవాడు కాబట్టి జరిగిన వివాహాన్ని చూస్తూ వుండిపోయింది. కానీ... ఇప్పుడు రాజా... అంటించిన నిప్పు... అనుమానం... సంశయంగా గోపికపట్ల మారిపోయింది.


కరోనా కాలంలో జాగ్రత్తలు తీసుకొంటూ ప్రయాణాన్ని సాగించిన వేణుగోపాల్ గోపికలు రెండో రోజు ఇంటికి చేరారు. రాజా మందు తాగుతూ వేణుగోపాల్తో శివ విషయంలో చెప్పిన మాటలు ఓ మూల కదిలాడుతునే వున్నాయి. ఇల్లాలి మీద ప్రేమ ఉండవలసిన స్థానంలో.. అనుమానం ద్వేషం... నిండిపోయింది. ఇట్లో అందరూ ముభావంగా పలికి పలకకుండ వుండటం గోపికకు అర్థంకాని విషయంగా.. బాధపడసాగింది.


సౌదామిని.. దూరపు బంధువు అన్నయ్య వరసైన భూషణంగారు చుట్టపుచూపుగా వచ్చారు.

వారికి ఇరువురు ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి పార్వతి.. రెండేళ్ల క్రిందట వివాహం అయింది. రెండవ కూతురు స్వాతి... ఇంకా వివాహం కాలేదు.


మాటల సందర్భంలో సౌదామినిని ఏదైనా సంబంధం వుందా అని అడిగాడు భూషణం.

సౌదామిని మస్తిష్కంలో మెరుపులాంటి ఆలోచన... ఆ పిల్లను తన కొడుక్కు చేసుకొంటే.. భూషణం ఆస్థిలో సగ భాగం... తన కొడుక్కు సంక్రమిస్తుంది. ఆ పెండ్లి జరగాలంటే... వేణుగాడు గోపికకు విడాకులు ఇవ్వాలి... వేణుచేత గోపికకు విడాకులు ఇప్పించాలనే నిర్ణయానికి వచ్చింది సౌదామిని.

రెండురోజులుండి భూషణం బయలుదేరేముందు అతని చిన్న కూతురు స్వాతి ఫొటోను అడిగి తీసుకొంది. త్వరలో మంచి సంబంధాన్ని గురించి తెలియచేస్తానని అన్నను సాగనంపింది సౌదామిని.


***

రేపటినుంచి ఆషాఢమాసం... ఆ వుదయాన... ఇంట్లో అందరూ వున్నారు. గోపిక అందరికి కాఫీ టిపిన్ లు అందించింది.

సౌదామిని... “ఏమండీ!... "


"ఏమిటో చెప్పు... ” అడిగాడు వెంకట్రావు.


రేపటినుంచి ఆషాఢమాసం... ”


"అయితే !... "


"ఏమిటో తెలీదా!... "


“తెలీదు... ఏమిటో చెప్పు....."


"మీ కోడలు నేను ఒక ఇంట్లో వుండకూడదు !...."

వెంకట్రావు భార్య ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచాడు. ఆమె భావన అతనికి అర్థం అయింది...

"వేణూ!... " బిగ్గరగా పిలిచాడు.


కొన్ని సెకండ్లలో వరండాలో వున్న వేణూ అతనితో రాజా లోనికి వచ్చారు.

“ఏం నాన్నా !... "అడిగాడు వేణు.


"పెద్దోడా!... రేపటినుండి ఆషాఢమాసం... నా కోడలు గోపికను నా చెల్లిలి ఇంట్లో దింపిరా!... సరేనా!...” అడిగాడు వెంకట్రావు.


వేణుగోపాల్... తల్లి... తండ్రి... భార్య ముఖాల్లోకి క్షణాల్లో చూచి...

"అలాగే నాన్నా!... " వినయంగా చెప్పాడు.


ప్రక్కనవున్న రాజా... వంటఇంటి ద్వారం ముందు నిలబడివున్న గోపికను తల అటుఇటూ త్రిప్పుతూ నోట్లో ఏదో నములుతూ చూస్తున్నాడు.


వాడి చర్యను సౌదామిని గ్రహించిది. రెండురోజుల క్రితం వాడు చెప్పిన మాటలు.. గుర్తుకు వచ్చాయి. దానికి నాందీ యీ ఆషాఢమాసం కావాలి... గోపిక ఇక శాశ్వతంగా వారి అమ్మగారి ఇంట్లోనే వుండిపోయేలా చేయాలని, అవసరం అయితే రాజా గాడి సాయం తీసుకొని వేణుచేత గోపికకు విడాకులిప్పించాలని, అది తప్పక జరగాలనే ధృఢ నిర్ణయానికి వచ్చింది.


వెంకట్రావుకు చెల్లెలు... కోడలంటే అంతర్యంలో అభిమానం... అణువంత అభిమానాన్ని చూపించిన సౌదామిని... పెండ్లి అయిన నాటి నుండి వెంకట్రావును విమర్సిస్తూ, అతని మంచితనాన్ని విమర్శిస్తూ.. అతని హృదయాన్ని గాయపరిచేది. తనవైపు తల్లిదండ్రి బంధువులపట్ల ఒకరకమైన ప్రేమాభిమానాలు... వెంకట్రావు బంధుజాలం పట్ల మరొక భావన... నిరసన సౌదామిని తత్వం... కొందరి మొగవారి జీవితం... చిత్రంగా వుంటుంది. దానికి కారణం... వివాహానంతరం... సంతానం కలిగేంతవరకు అర్ధాంగి భర్త పట్ల చూపే ఆధారాభిమానాలు ఒకరీతి... ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టాక... కొందరి అతివల ధోరణి మారి... వారికి నచ్చిన కారణాలవలన భార్యభర్తల మధ్యన.. దూరం మాసికంగా శారీరకంగా పెగడం... కారణంగా ఆలుమగలు జీవితంలో నటన సాగిస్తారు.


బయట ప్రపంచానికి వారు ఆదర్శ దంపతులు. కానీ ఇంట్లో ఎవరిలోకం వారిది... ఇరువురికీ ఆత్మాభిమానం... కుటుంబ గౌరవం ముఖ్యం... అందుకే ఆ అపూర్వనటన ఇంటా బయటా. !...

ఆ సాయంత్రం వేణుగోపాల్ గోపికను తీసుకొని వెళ్లి వాళ్ల ఇంట్లో వదిలిపెట్టి ఇంటికి వెళ్లిపోయాడు.

ఆ రాత్రి వెంకట్రావు గ్రామాంతరం వెళ్లాడు. తల్లీకొడుకులు గోపికను ఆషాఢమాసం తర్వాత ఇంటికి రానీయకూడదని నిర్ణయించుకొన్నాడు. తన భూషణం అన్నయ్య చిన్న కూతురు స్వాతిని తన కోడలిగా చేసుకోవాలనే తననిర్ణయాన్ని కుమారునకు తెలియచేసింది.


రాజా మహిమతో శివ మీద అనుమానంతో వున్న వేణుగోపాల్ తన తల్లి నిర్ణయానికి ఆనందించాడు.

మరుదినం తల్లి కొడుకులు పట్నం వెళ్లి లాయర్ గారిని సంప్రదించారు. తన కోడలికి చాదస్తం.... మతిస్థిమితం లేదని... తన కొడుకు జీవితంలో ఆనందం లేదని... కొడుకు కోడలికి విడాకులు ఇప్పించాల్సిందిగా కోరింది... కపట సౌదామిని.


ఆ లాయర్ గారి పేరు సుబ్బరామయ్య. శకుంతల భర్త ముకుందరావుకు బంధువు. వేణుగోపాల్ సౌదామినిల మాటలను సాంతం విని... "ఒకసారి మీ భార్యా భర్తలు కలసిరండి... ఇరువురితో చర్చించి. వివాహరద్దు నిర్ణయానికి ప్రయత్నిస్తానని” సమాధానం చెప్పారు లాయర్ సుబ్బరామయ్యగారు... తల్లీ కొడుకు మౌనంగా వెళ్లిపోయారు.


ఆషాఢమాసం వెళ్లిపోయేవరకు దినం మార్చి దినం... రాజా శకుంతల ఇంటికి వచ్చి గోపికతో సమయం చూచుకొని సరససల్లాపాలాడుతూ... గోపికను తనదారికి మళ్లించుకొనేదానికి విశ్వప్రయత్నం చేశాడు.


ఆ సమయంలో ఒకనాడు శివ వచ్చాడు. అతనంటే అందరికి ప్రియమే!... మంచి మనస్సు వున్న వ్యక్తి.


గోపిక... రాజా ధోరణిని గురించి కన్నీటితో శివాకు చెప్పింది. మహాబలిపురంలో ఆ రాత్రి జరిగిన విషయాన్ని... వేణుగోపాల్ అమాయకత్వాన్ని... రాజామీద అతనికి వున్న గుడ్డి నమ్మకాన్ని గురించి... బాధపడుతూ ఆ రాత్రి సంఘటనను వివరించింది.


అంతా విని సాలోచనగా శివ వెంకట్రావ్ ఇంటికి వెళ్లాడు. సౌదామిని అతన్ని చూచి.. చూడనట్టు వంటింట్లోకి వెళ్లిపోయింది.


మిత్రుడు వేణుగోపాల్... ముభావంగా ముఖం చిట్లించి శివా ముఖంలోకి వింతగా చూచాడు. అతని వాలకాన్ని చూచిన శివ ఆ ఇంటినుండి బయటకు రాబోతూ వుండగా... రాజా అతనికి ఎదురుపడ్డాడు.

"మిత్రత్వానికి కొత్త అర్థాన్ని కల్పిస్తున్నావు కదా రాజా!... వాడికి ఇపుడు నీవు ప్రాణ మిత్రుడివయావుగా.... చెప్పు వాడికి... గోపికను ఇంటికి పిలుచుకువచ్చి హాయిగా సంసారజీవితాన్ని ఆనందంగా గడపమను. అలా చేస్తే వేణుగోపాల్కు గోపికకు మంచిది. మన గడచిపోయిన రోజులు... ఆస్నేహం.. ఇప్పటికీ నా మనస్సునిండా వుంది. ఆ పవిత్రభావంతో చెబుతున్నా... వాడు నాకు పెడముఖం చూపాడు... నాకు చాలా బాధేసిందిరా!... అందరం బాగుండాలిరా!.. గోపిక నాకు నీగురించి అంతా చెప్పింది... నీ తత్వాన్ని మార్చుకో... మరొక్క విషయం... నీకూ ఓ చెల్లెలున్నదన్న విషయాన్ని మరచిపోకు.... పదిమందిలో మంచిగా బ్రతికి... మంచిగా చావాలిరా... అదే మంచి మానవత్వం... నీవు మనిషివా !... లేక ఏమిటో నీవే అలోచించుకో.. రాజా!... " భుజం తట్టి వేగంగా వెళ్లిపోయాడు శివ.


పట్నంలోని లాయర్ సుబ్బరామయ్య... శివకు బంధువు... ఇరువరూ కలసిన సమయంలో వారు... సౌదామిని వేణుగోపాల్ తనను కలసి వారు చర్చించిన విషయాన్ని విపులంగా శివకు చెప్పాడు సుబ్బరామయ్య.


అంతా విన్న తర్వాత... శివ ఒక నిర్ణయానికి వచ్చాడు. సుబ్బరామయ్యగారితో వారికి విడాకులు అమలుజరిగేదానికి వీలుకాదని వారికి తెలియచేయవలసిందని చెప్పాడు. శివ కోరింది సుబ్బరామయ్య వేణుగోపాల్కు ఫోన్లో మీరు చెప్పిన కారణాల ఆధారంగా విడాకులు అమలు జరిపేదానికి వీలుకాదని ఖచ్చితంగా చెప్పాడు.


తల్లి దుర్భోధ... రాజా మాటలు విని జీర్ణించుకున్న మూర్ఖుడు వేణుగోపాల్... శకుంతల ఇంటికి వెళ్లి... తనకు గోపికకు ఇకపై ఎలాంటి సంబంధం లేదని... నాకు విడాకులు కావాలని అహంకారంగా మాట్లాడి ఆవేశంగా తన ఇంటికి వెళ్లిపోయాడు. ఎదుటపడిన తండ్రిని కూడ ధిక్కరించి... గోపికను గురించి అసహ్యంగా మాట్లాడి తన గదిలోకి వెళ్లిపోయాడు..


వాడి మాటలకు ఆశ్చర్యపోయిన వెంకట్రావు “ఏమిటిది" అని అర్థాంగిని ఆశ్చర్యంతో అడిగాడు. సౌదామిని తన కొడుకు నిర్ణయాన్ని... భర్తకు ఆవేశపూర్వకంగా తెలియచేసి ప్రక్కకు వెళ్లిపోయింది. తల్లీ కొడుకులు ఒక్కటై గోపికకు అన్యాయం చేస్తున్నారని వాపోయాడు వెంకట్రావు.


***

విషయాన్ని తెలుసుకున్న శివ... వెంకట్రావ్ ఇంటికి వచ్చాడు. “మన వేణుగోపాల్ చెప్పుడుమాటలు విని మంచిని మానవత్వాన్ని మరచిపోయాడు... మామయ్యా... వాడు గోపిక విషయంలో తీసుకొన్న నిర్ణయం తప్ప... వాడు ఇంట్లో వుంటే ఒకసారి పిలవండి... ఒకనాడు ఒకరికోసం ఒకరం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న వాళ్లం... కానీ నేడు వాడి తత్వం మారింది. నాలో మార్పులేదు. ఆ కారణంగానే వాడికి నాలుగు మంచిమాటలు చెప్పాలని వచ్చాను మామయ్యా... పిలవండి... " అనునయంగా చెప్పాడు శివ.


వెంకట్రావు "వేణూ!... ఇలారా!... " పిలిచాడు.


వేణుగోపాల్ వరండాలోకి వచ్చాడు. ఇరువురి ముఖాల్లోకి తీక్షణంగా చూచాడు.

సమస్యలను సృష్టించుకొని సతమతమవుతున్న వ్యక్తుల ముఖంలో జీవకళ తగ్గుతుంది. పైశాచిక కళ వారి ముఖాల్లో గోచరిస్తుంది. వేణు ముఖంలో అదే నిండివుంది.


“వేణూ!... రా.. ఇలా కూర్చో!... " చిరునవ్వుతో చెప్పాడు శివ....


“చూడు శివా!... నీమీద నాకు మంచి అభిప్రాయంలేదు. నాకు నీ స్నేహం... ఏ విషయంలోనూ నీ సలహా అనవసరం... తమరు దయచేయండి... " ఖచ్చితంగా ఆవేశంగా చెప్పి వేగంగా ఇంట్లోకి వెళ్లిపోయాడు.


వేణు స్థితిని అర్ధంచేసుకొన్న శివ లేచి చేతులు జోడించి... "పెదనాన్నా... వెళ్లివస్తాను... " విచారంగా వెళ్లిపోయాడు.


గోపికకు భర్త వేణుగోపాల్ చెప్పిన విడాకుల వార్త. రాజా తనను వేధించే విధానం... అత్త ఈసడింపులు... ఇరుగుపొరుగువారు బావుల దగ్గర... బోరింగుల దగ్గర... చెప్పుకునే గుసగుసలు... వారి వల్ల వీరివల్ల విని... శాంతి కోసం... మరణమే శరణ్యం అనే నిర్ణయానికి వచ్చింది గోపిక

ఆ సాయంత్రం విరక్తిగా నవ్విన గోపిక ముఖంలో శివ నిరాశ... నిస్పృహలను గమనించాడు. ప్రతి సమస్యకూ ముందుకాలం... భవిష్యత్తు జవాబు చెబుతుందని ఆమెను ఓదార్చాడు శివ.

ఆ రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఇంటినుంచి బయటపడి వూరిముందువున్న పెద్ద దిగుడుబావిని చేరి దూకపోయింది. శివ... వచ్చి రక్షించాడు. గోపిక ఆమె తల్లి శకుంతలతో వూరువదలి ఆ రాత్రే ఎటో వెళ్లిపోయారు.


***

కాలచక్రంలో మూడు వసంతాలు గడిచిపోయాయి. దుర్మార్గ ప్రవర్తన కలిగిన రాజాకు బులెట్ యాక్సిడెంట్లో కుడికాలు విరిగిపోయి... చంక కింద కర్రతో నడవాల్సిన స్థితికి చేరాడు. అతని కుతంత్రాల పాలబడినవారు.... వెధవకు దేవుడు తగిన శాస్తి చేశాడని ఆనందించారు.

వేణుగోపాల్ స్వబుద్ధి లేకుండా... మిత్రుడు రాజా... తల్లి సౌదామిని మాటలను విన్నాడు... రోజులు గడిచేకొద్ది ఇతరులతో పలకడం.. మాట్లాడటం మానేశాడు... రాజాకు తగిన షాక్ లాంటిది.. తనకు కూడా ఏదోరూపంలో తగులుతుందనే భయం... సౌదామినికి తీవ్రంగా బీపీ... షుగర్.. రంభలావున్నా సౌదామిని.. రాగికంకిలా మారి పోయింది. ఇరుగుపొరుగువారు... చేసుకొన్నవారికి చేసుకొన్నంత మహదేవ' అనే సామెతను సౌదామిని వినేలా అనేవారు...


వెంకట్రావ్... తన తోటివారితో... 'తన కోడలు చెల్లెలు గురించి... ఎక్కడవున్నారో.... ఏమైపోయారో.... " అని వాపోయేవాడు.


కొందరు ప్రబుద్ధులు.. శివ గోపికను ప్రేమించాడని.. ఆ కారణంగానే... రాత్రికి రాత్రికి తల్లిని కూతురుని లేపుకొని ఎటో వెళ్లిపోయాడని అనుకున్నారు.

***

ఆ గ్రామంలో కొత్తగా ముగ్గురు మనుషులు వచ్చారు. పాడుపడి కొంత కూలిపోయిన శివా ఇంటిని తాము కొన్నట్టుగా చెప్పి పూర్తిగా మూడు నెలల్లో రిపేర్లు చేయించి... కొత్త గృహంగా మార్చి.... తాళం బిగించి వెళ్లిపోయారు.


వారం రోజుల తర్వాత... ఆ ఇంటికి గోపిక... ఆమె తల్లి శంకుంతల దాదాపు రెండుకాలు సంవత్సరం మొగబిడ్డ వచ్చారు. గోపిక ఆవూరి హైస్కూలుకు సైన్సు మాస్టరుగా వచ్చింది.

వూరికి వచ్చిన మరుదినం స్కూలుకు వెళ్ల జాయిన్ అయింది. ఆ వార్త వూరంతా పొగమంచులా పాకింది.


వెంకట్రావు ఆనందంగా శివ ఇంటికి వెళ్లాడు. చెల్లెలు సౌదామినిని, గోపికను... ఆమె కొడుకును చూచాడు ఆనందంగా పలకరించాడు.


యోగక్షేమాలు పరామర్శించి.... చివరగా......

"అమ్మా!... గోపికా!... ఈ బిడ్డ ఎవరమ్మా!... " దీనంగా అడిగాడు.


అపుడే అక్కడకు వచ్చిన శివ... "మామయ్యా... వీడు ఎవడో కాదు!... గోపిక బిడ్డ!.. రేపు మాఇంట్లో మీకందరికీ విందు భోజనం.. మీ కుటుంబం అంతా రావాలి... రేపు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతునాను మామయ్యా!... " చిరునవ్వుతో చెప్పాడు శివ.


అతని వదనంలోని ప్రశాంతత... పెదవులపై చిరునవ్వు... లాలనతో ఆ బిడ్డను అతను ఎత్తుకొన్న తీరు వెంకట్రావుకు ఆశ్చర్య ఆనందాలను కలిగించాయి. కారణం తన మేనకోడలు వృద్ధిలోకి వచ్చినందుకు... పండంటి మగబిడ్డకు తల్లి అయినందుకు... కానీ ఒక మూల మనస్సున ' ఆ బిడ్డకు తండ్రి ఎవరు?... శివానా?... లేక మరెవరైనానా?... లేక... తన కొడుకు వేణుగోపాలా!... అడిగితే... తన పెద్దరికానికే అవమానం.... నా మనోభావన శివాకు అర్ధం అయింది.. అతనే అన్నాడుగా... రేపు ముఖ్యమైన విషయం చెబుతాను మామయ్యా అని... సహనంతో వేచిచూద్దాం!... ' అనుకొన్నాడు వెంకట్రావ్.


ఇంటికి వెళ్లి భార్య సాదామినికి కొడుకు వేణుగోపాల్ కు శివా చెప్పిన మాటలు చెప్పాడు.

"మనం తప్పక వెళ్లాలి!.. ” శాసించినట్టు చెప్పి తన గదిలోకి వెళ్లిపోయడు వెంకట్రావ్.

***

ఉదయం ఏడుగంటల ప్రాంతంలో శివ నోట్లో వేపపుల్లను వేసికొని దంతధావనం చేస్తూ... వెంకట్రావ్ ఇంటికి వెళ్లి.. వేణు.. సౌదామినికి రావుగారికి పన్నెండు గంటలకు భోజనానికి రావాల్సింది అని ఆహ్వానించి వచ్చాడు.


ఆరోజు ఆదివారం... ఉద్యోగస్థులందరికి శలవుగా!...

శివ ఇంట్లో ఆరోజు పండుగ వాతావరణం. అందరూ ఎంతో ఆనందంగా వున్నారు. పసందైన వంటకాలు చేయబడ్డాయి. సమయం పదకొండూ ముక్కాలు.


వెంకట్రావ్ తయారై...

"ఏయ్ !... సౌదామినీ!.. వేణూ!... నేనుశివా ఇంటికి బయలుదేరుతున్నాను. ఇద్దరూ కలసి రండి... " బయలుదేరి శివ ఇంటివైపుకు నడిచాడు వెంకట్రావ్.


అయిష్టంగానే వేణు.. సౌదామినీ అతన్ని అనుచరించారు. ఇరువురి మనస్సుల్లో గుబులు... గుబులు... అక్కడ ఏం జరుగబోతోందో అనే సందేహం ఒకవైపు... మరోవైపు భయం.. శకుంతల బాబుకు స్నానం చేయించి మంచి దుస్తులు వేసి అందంగా తయారు చేసింది. వచ్చీరాని మాటలతో వాడు ఇంట్లో గునగున నడుస్తుంటే శకుంతల గోపిక శివలకు ఎంతగానో సంతోషం.....


వెంకట్రావ్ గారు శివ ఇంటిని సమీపించి గృహ ఆవరణలో ప్రవేశించారు. వారిని చూచిన శివ సాదరంగా ఎదురువెళ్లి వారి కుడిచేతిని తన చేతిలోకి తీసుకొని వరండాలోకి వచ్చి... “మామయ్యా!... మీ తత్వం నాకు బాగా తెలుసు. చెప్పిన మాట ప్రకారం ముందుగానే వచ్చారు. కూర్చొండి... " ప్రీతితో చెప్పాడు శివ.


వెంకట్రావ్ గారు కూర్చున్నారు. అతని చూపులు ఇంట్లోనివారి పైన....

కోడలు గోపికను చూడాలనే ఆశ...


గ్రామపెద్దలు పుండరీకయ్య... పురుషోత్తం... వారి సతీమణులు వచ్చారు. వారు ఇటు శివకు.. అటు వెంకట్రావ్కు కావలసివారే. డెబ్బై సంవత్సరాలకు పైబడ్డవారు.

అందరూ వరండాలో కూర్చున్నారు.


"గోపికా!... పిలిచాడు శివ.

గోపిక వచ్చింది. చిరునవ్వుతో పెద్దలనందరినీ చూచింది.

వినయంగా చేతులు జోడించింది.


అదేసమయానికి వేణుగోపాల్... సౌదామిని వచ్చారు... వారిని సాదరంగా ఆహ్వానించి కూర్చొబెట్టాడు శివ.

గోపికలోనికి వెళ్లింది.

సౌదామిని... వేణుగోపాల్ ఏంజరుగబోతోందో అనే సంశయం... కలవరం... ముఖాలు వాడిపోతున్నాయి. మిగతా వారంతా ఆనందంగా... శివ తత్వాన్ని గురించి కబుర్లు చెప్పుకొంటున్నారు.


కూల్డ్రింక్ గ్లాసులను అందరికీ అందించింది గోపిక...

అందరూ గ్లాసులను అందుకున్నారు.

కొద్దిగా సిప్ చేసి శివా.....

“మామయ్యా!... " ప్రీతిగా వెంకట్రావ్ను పలకరించాడు.


"మీకు మా అమ్మ నాన్న... చెల్లి చిన్ని గుర్తున్నారా... జాలిగా అడిగాడు.


"ఆ.. ఆ.. ఎందుకు లేరు!... మా బావ శంకరయ్య అక్క గౌరమ్మ ఎంతో మంచివారు. నీ చెల్లి చిన్ని బంగారు బొమ్మ!... దైవనిర్ణయం బస్సు ప్రమాదంలో ముగ్గురూ మరణించారు. అప్పటికి మీ అమ్మా నాన్నల వయస్సు నలభై... నలభై అయిదు... నీచెల్లి వయస్సు ఆరు సంవత్సరాలు..... ” విచారంగా చెప్పాడు వెంకట్రావ్....


శివా విరక్తిగా నవ్వాడు. "అవును మామయ్యా!... వారు ముగ్గురూ ఒకేసారి... నాకు దూరమైపోయారు. నన్ను ఒంటరివాణ్ణి చేశారు... ” విచారంగా చెప్పాడు శివ.


'అవును.. అవును.. ' అని ఆ పెద్దలందరూ శివా పట్ల సానుభూతితో.... అన్నారు.


“మామయ్యా!... నేను ముందు చెప్పబోయే ప్రతి అక్షరం... పలుకు... సత్యం. నా తల్లిదండ్రులమీద ప్రమాణం చేసి చెబుతున్నాను.


చిన్నతనం నుంచీ నాకూ ఈ గోపికను... చిన్నీని చూచినపుడల్లా ఇరువురిపట్ల నాకు ఒకే భావం.... ఇరువురూ ఒకే వయస్సువారు... నా చెల్లి గతించిన తర్వాత నేను గోపికలో నా చెల్లిని... చూచుకొని నన్ను నేను ఓదార్చుకున్నాను.


కాలగతిలో మీ మంచి మనస్సుతో తండ్రిలేని ఆ అమ్మాయిని మీ ఇంటి కోడలిగా చేసుకొన్నారు. నేను ఎంతగానో సంతోషించాను.


మామయ్యా!... మనం వచ్చేటపుడు ఏం తీసుకొని రాలేదు... పోయేటపుడు ఏమీ తీసుకొనిపోబోము ఈ మధ్యకాలంలో మనలో ఒకరిపట్ల ఒకరికి ద్వేషాలు... పగలు... పంతాలు... వీటన్నింటి పర్యవసానం పతనమే.... చెప్పుడు మాటలను విని... గోపికను నిందించి... అసహ్యించుకొని విడాకులతో విడిపోవాలనుకున్నాడు నీ కొడుకు... నా మాజీ మిత్రుడు... వేణుగోపాల్... అగ్నికి అజ్యం... గాలిలా ఆ నీచుడు రాజా వేణుకు తోడైనాడు. ఆవేశంలో నీ కొడుకు... గోపికను అవమానించాడు..... నీవు నాకు అనవసరం అని చెప్పి వెళ్లిపోయాడు.


రాజా గోపికను తనదాన్ని చేసుకోవాలని వేధించాడు. అన్ని విషయాలు తెలిసిన నేను.. అర్ధరాత్రి పూరిముందున్న దిగుడు బావిలో దూకి చాపబోయిన గోపికను రక్షించి... పిన్నినీ గోపికను తీసుకొని దూరంగా వెళ్లిపోయాను. వుద్యోగం మార్పించుకున్నాను. గోపిక తన కాళ్లమీద తాను నిలబడేలా చేయాలనుకున్నాను. నా నిర్ణయాన్ని పిన్నికి గోపికకు తెలియజేశాను. వారు సమ్మతించారు. బియస్సీ పూర్తిచేయించి బి. ఇడి. , కాలేజీలో చేర్పించాను.... బియస్సీలో చేరకముందే గోపిక బాబును ప్రసవించింది... "


వేగంగా లోనికి వెళ్లి బాబును ఎత్తుకొనివచ్చి.... "మామయ్యా... వీడు నీ వారసుడు... పేరు మీదే... వెంకట్రావ్... " చిరునవ్వుతో చెప్పాడు శివ.


అందరూ ఆశ్చర్యంతో అతని ముఖంలోకి... గోపిక... బాబు ముఖంలోకి చూచారు. వారిలో ఎవరికీ నోటినుండి మాట వెలువడలేదు.


“మామయ్యా!.. నేను చెబుతానన్న విషయాన్ని చెప్పాను. నమ్మడం... నమ్మకపోవడం... మీ ఇష్టం... నమ్మితే ఆనందంగా నవ్వుతూ వచ్చి నా చేతిలో వున్న మీ యీ మనుమడిని ఎత్తుకోండి... ముద్దులాడండి... ఆనందంగా అందరం కలసి భోజనం చేద్దాం. రేయ్!... వేణు... వచ్చి నీ కొడుకును ఎత్తుకోరా!... నేను నీ బంధువునురా... అంతకంటే నేను నీకు మంచి స్నేహితుడిని.. ”


అతన్ని సమీపించి... "వేణూ... గత చేదు జ్ఞాపకాలను మరచిపోరా... " ప్రాథేయపూర్వకంగా చెప్పాడు శివా.


వెంకట్రావ్ నవ్వుతూ శివ చేతిలోనుండి జూనియర్ వెంకట్రావ్ను తన చేతిలోకి తీసుకొన్నాడు. నవ్వుతూ ఆ బాబు బుగ్గలపై ఆనందంతో ముద్దులు పెట్టాడు.


సౌదామిని... వేణు తండ్రి పక్కకు చేరారు. మనుమడిని ఎత్తుకొంది సౌదామిని... శివ వేణుగోపాల్ చేతిని తన చేతిలోకి తీసుకొని ఆ చేతిని గోపిక చేతిలో వుంచాడు చిరునవ్వుతో...

ఆ ఇరువురూ ఒకరినొకరు చూచుకొని నవ్వుతో తలదించుకొన్నారు.

***

// సమాప్తి//

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


60 views0 comments

Comments


bottom of page