మురిపించే ముచ్చటైన ఊరు
- Neeraja Prabhala
- May 8
- 3 min read
#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #మురిపించేముచ్చటైనఊరు, #MuripincheMuchhatainaVuru, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Muripinche Muchhataina Vuru - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 08/05/2025
మురిపించే ముచ్చటైన ఊరు - తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
-అందమైన వేసవికాలము.
వేసవికాలము అనగానే ఇప్పుడు
"అమ్మో! ఎంత ఎండలో?" అని అనిపిస్తోంది కానీ మా చిన్నప్పుడు వేసవిశెలవుల కోసం ఎంతగానో ఎదురుచూసేదాన్ని. వేసవి శెలవులు ఇస్తారు అనే దానికి సూచనగా మార్చినెల వచ్చేలోగానే ఒంటిపూట బడులు పెట్టేవాళ్ళు. ఉదయమే 5గంటలకే లేచి అమ్మ చేత రెండు జడలు వేయించుకుని, మాదొడ్లో పూసిన మల్లెపూవులతో అమ్మ కట్టిన పెద్ద పువ్వులచెండు పెట్టుకుని స్కూలు యూనిఫామ్ వేసుకుని చద్దన్నం తినేదాన్ని. తియ్యని గడ్డ పెరుగుతో (మాకు గేదెలు, పాడి ఉండేది) చద్దన్నంలో ఆవకాయ ముక్క నంచుకుని తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్టుండేది.
అప్పుడు గడియారాలు లేవు కనుక ఊరి పంచాయతీ మైకులో భక్తి రంజని వినిపిస్తుంటే "అమ్మో! ఇంక వార్తలు వచ్చే టైము. స్కూలుకు టైమవుతోంది " అని అరిగిపోయిన బాటా చెప్పులతో 2 కి.మీ దూరం నడిచి స్కూలుకు వెళ్ళేదాన్ని. ఒంటిపూట బడులు కనుక తక్కువ పుస్తకాలు ఉండేవి. ఇప్పుడు మార్నింగ్ వాక్ లాగా అప్పుడు చక్కటి పొలాల మధ్యన, ప్రశాంత వాతావరణంలో, ప్రకృతి సిధ్ధమైన చల్లటి గాలి మేనిని తాకుతూఉండగా, అందమైన పచ్చని ప్రకృతి పరిసరాలను చూస్తూ వాటి మధ్యలో నడుస్తుంటే ఎంత హాయిగా ఉండేదో! ఆ మధురానుభూతిని మాటల్లో చెప్పలేను. చెప్పనలవికానిది. అది అనుభవించి తీయని అనుభూతిని పొందాల్సిందే.
"అందమైన ఊరు మా మున్నంగి గ్రామం" అనటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కృష్ణా తీరం ఒడ్డున, చక్కటి మాగాణి పొలాలతో, సమృధ్ధిగా పాడి- పంటలతో, స్కూల్స్, హాస్పిటల్, బాంకు వంటి మౌలిక వసతులు ఉండి, బస్సు వంటిమౌలిక వసతులు, నిరంతరం రవాణా సౌకర్యాలు ఉండి, అందమైన దేవాలయాలతో, పచ్చటి లోగిళ్ళలో తీర్చిదిద్దిన రంగవల్లులతో ముచ్చట గొలిపేది మా మున్నంగి గ్రామం.
ఇక్కడి ప్రజలు ఆప్యాయత- ఆదరాభిమానాలకు మారుపేరు. మంచి తనం- మానవత్వం వీరి సొంతం. కలనైన కీడు తలపెట్టని నిష్కల్మష హృదయులు. నిర్మల మనస్కులు. అందుకే ఎన్ని దేశాలు తిరిగినా, ఎంత సుందర ప్రదేశాలు చూసినా మా మున్నంగి అంటేనే నాకు ఎక్కువ మక్కువ. ఆ ఊరికి ఎప్పుడు వెళ్లినా మధురస్మృతులతో నా తనువు పులకరించిపోతుంది.
అలా స్కూలుకు వెళ్ళి క్లాసులో పాఠాలు విని ఇంటికి వచ్చి చదువుకునేవాళ్ళం. మా స్నేహితులు కూడా చాలా మంచి వాళ్ళు. కష్టపడి చదివి మంచి ప్రతిభావంతులయి మా ఊరిని ఎంతో అభివృద్ధి పరిచి, ఆ ఊరి ముద్దు బిడ్డలయి మంచి పేరు- ప్రతిష్టలు తెచ్చారు. స్కూలులో యాన్యువల్ పరీక్షలు వ్రాశాక శెలవులు ఇచ్చే వాళ్ళు. ప్రతి ఇంటి ముందు చల్లని తాటాకు పందిర్లు ఉండేవి. తాటి ముంజలు, చెరుకు గడలు, ఖర్జూరాన్ని మరిపించే ఈత పళ్ళు, సీమతమ్మకాయలు తిని, మట్టికుండలలో చల్లటి మంచినీళ్ళను త్రాగేవాళ్ళం.
మధ్యాహ్నం అచ్చంగిల్లాలు, చింతగింజలాట, గవ్వలతో చదరంగం, తొక్కుడు బిళ్ళలు ఆడేవాళ్ళం. సాయంత్రం అవగానే శుచిగా రామాలయానికి, శివాలయానికి వెళ్ళి 12 ప్రదక్షిణలు చేసి ఏరోజు కారోజు చాలా కోరికల లిస్ట్ దేవునికి చెప్పుకునేదాన్ని. చీకటిపడకుండానే "నోట్లో ముద్ద- గూట్లో దీపం" లాగా అమ్మ అందరికీ కథలు చెబుతూ తినిపించే గోరుముద్దలు తిని బాదం చెట్ల క్రింద ఆరు బయట నులక మంచాలపైన పడుకొని అమాయకంగా ఆకాశంలో నక్షత్రాలను లెక్కించ ప్రయత్నించి విఫలురాలినై నిరాశతో నిద్రపోయేదాన్ని.
అర్థరాత్రి ఏదన్నా చప్పుడు అయితే ఉలిక్కిపడి 'ధూ ధూ' అని నా వీపు చరుచుకుని, కళ్ళు తెరవకుండానే హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం చదువుకుంటూ మెల్లిగా నిద్రలోకి జారుకునేదాన్ని.
వైశాఖ పౌర్ణమికి మా ప్రక్క ఊరు వల్లభాపురంలో పేరంటాలమ్మ వారి తిరణాల చాలా వైభవంగా జరిగేది. ఆ అమ్మ వారు చాలా మహిమకల తల్లి. గ్రామదేవత. ఆవిడ అత్తవారి ఊరైన
" కొల్లిపర" నుంచి పసుపు- కుంకుమల కావిళ్ళతో ఊరేగింపుగా చీరె, సారె తెచ్చేవాళ్ళు. గ్రామ ప్రజలు తమ ఇంటి వాకిళ్లముందు పసుపు నీళ్ళతో వార్లు పోసేవాళ్ళు. ఎంతో కోలాహలంగా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలతో, ఎడ్ల బండిలకు కట్టిన ప్రభలతో సందడిగా 3 రోజులు చాలా వేడుకగా జరిగేవి. ఇసుక వేస్తే రాలనంత జనం. తిరణాల కదా !
నాన్న ఇచ్చిన 15 రూపాయలతో “టమటమాల బండి' సీమతమ్మకాయలు, నోటితో ఊదే పెద్ద బూరలు. ఇలా రకరకాల వాటిని కొనుక్కుని, అంతా ఖర్చు చేస్తే నాన్న కోపడతారని అందులో సగం డబ్బులు మిగిల్చి నాన్నకు ఇచ్చి ఆయన మెప్పు పొందేదాన్ని నేను.. నాకన్నా 4 సంవత్సరములు పెద్దదైన అక్క తనకిచ్చిన డబ్బులని ఖర్చు చేసేది. నాన్న నన్ను మెచ్చుకుంటుంటే నా వంక గుర్రుగా చూసేది. మదిలో నాకు చాలా సంతోషంగా ఉండేది. చిన్నపిల్లని కదా! ఇంతలో చూస్తూండగానే మళ్ళీ స్కూళ్లు తెరిచేవాళ్ళు. " అయ్యో! అప్పుడే శెలవులు అయిపోయాయా?" అని బాధగా అనిపించేది.
ఇలా వేసవికాలపు శెలవులు చాలా ఆనందంగా గడిచేవి. ఇప్పుడు పెద్ద భవంతులు, కార్లు, ఏసీలు, డబ్బు, ఖరీదైన నగలు, పట్టుచీరలు ఎన్ని ఉన్నా మనసుకు ఆనందం, ఆహ్లాదం లేదు. మా మున్నంగిలో అప్పుడు గడిపిన ఆ బాల్యమే బాగుంది. ఆ రోజులను తలచుకుంటేనే మనసుకు ఎంతో ఆహ్లాదం- ఆనందం. అనిర్వచనీయమైన మధురానుభూతులు కలుగుతాయి.
మరచిపోలేని అమూల్యమైన అందమైన ఊరు మా మున్నంగి. ఆ వయస్సు, అందమైన ఆ బాల్యం, స్కూలు రోజులు, ఆ బాల్యస్నేహితులు మరలా వస్తే ఎంత బాగుండునో కదా !
.
.. సమాప్తం ..

-నీరజ హరి ప్రభల
Profile Link
YouTube Playlist Link
సంగతులు జ్ఞాపకాలు గా మదిలో అప్పుడప్పుడు ప్రకాశవంతమైతేకలిగే భావన వెనక్కి వెళ్లాలని. ఈ మధుర భావన యిచ్చే సంతోషం మనల్ని పునరుజ్జీవింప చేస్తుంది. ప్రతిభ గల రచయత ప్రవహింప చేసిన భావతారంగాల లో తడిసి ముద్ద య్యాం