top of page

నా డైరీ



'Na Diary' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 10/02/2024

'నా డైరీ' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


సోములు గత కొంతకాలంగా ఎన్నడూ లేనివిధంగా వ్యాపార రంగంలో దూసుకుపోతున్నాడు. ఇదివరకే అతడికి వ్యాపారం పై పెద్దగా అవగాహన లేక నష్టాలు చవిచూశాడు. 

తండ్రి నుండి అతడికి వ్యాపార మెలుకువలు అబ్బినా.. అప్పటికి, ఇప్పటికీ ట్రెండ్ మారగా.. సోములు ఆ కొత్త పరంపరను తెలుసుకోలేక ఎప్పుడూ నష్టాలతో సతమతమయ్యేవాడు. అలా అతడి వ్యాపారం కాలానికి అనుగుణంగా మారలేదు కానీ.. ! అతడిలో మాత్రం వ్యాపారం వదిలేయ్యాలనే ఆలోచన రాలేదు. అందుకే ఇప్పుడు అతడు వెనక్కి చూసుకోవల్సిన అవసరం లేకుండాపోయింది. 


ఇప్పుడు సోములు వ్యాపార లావాదేవీల కోసం ఒక్కోసారి దూర ప్రయాణం చేయల్సి వస్తుంది. అందుకుగాను ఒక కారును సైతం తీసుకున్నాడు. అయితే.. ! బిజీ కారణంగా ఆ కారుని నడపటానికి మంచి డ్రైవింగ్ నైపుణ్యం ఉన్న వ్యక్తిని ఎంపిక చేసే బాధ్యతను తన సిబ్బందికి అప్పగించాడు. 


సిబ్బంది ఎంపిక చేసిన వ్యక్తిని చూసి సోములు ఆశ్చర్యపడ్డాడు. ఆ వ్యక్తికి ఒక కాలు, ఒక చెయ్యి ప్లాస్టిక్. బహుశా పోటిపడ్డ వారిలో అతడే బాగా వాహనం నడిపి ఉంటాడు. తన సిబ్బంది పై నమ్మకంతో ఆ డ్రైవర్ అంటే ఇష్టం లేకున్నా.. ఒప్పుకున్నాడు. అతడి పేరు సత్యరాజ్ సింగన్న. పేరు మాత్రమే సోములు తెలుసుకున్నాడు. 


ఇక తనకు పని ఉన్న రోజు సింగన్నతో దూర ప్రాంతాలకు వెళ్ళేవాడు. సింగన్న వాహనం చాలా బాగా నడుపుతున్నాడు. దీంతో సోములు రాత్రి పగలుతో సంబందం లేకుండా క్షేమంగా ఇంటికి చేరుతున్నాడు. ఎవరికైనా తన డ్రైవర్ పై ఎంతో ప్రేమ గౌరవం ఉంటుంది కాదా.. ! అందుకు భిన్నం ఈ సోములు. సింగన్నకు ఏనాడూ గౌరవం ఇవ్వలేదు. కాలు, చెయ్యి లేనందున అతడంటే చులకన. సరికదా తన దూర ప్రయాణంలో అతడికి ఏ సౌకర్యాలు కల్పించేవాడు కాదు. 


దూర ప్రయాణం అనగానే సింగన్న ఇంటి నుండే భోజనం, తాగునీరు తెచ్చుకునేవాడు. ఇంటి దగ్గర భోజనం అయితే పెట్టేవాడు కానీ.. ! పెట్టే తీరు మాత్రం అతని సిబ్బందికి కూడా నచ్చేది కాదు. ఏదో ముష్టివాడికి వేసినట్లు బయట ఒక కంచంలో కాసింత తిండి పడేసేవాడు. అంతేనా.. ఎప్పుడు కారణం లేకుండానే ఏదో ఒకటి తిడుతు ఉంటాడు. 

కారు ఏ మాత్రం అపరిశుభ్రంగా ఉన్నా.. సింగన్న లేనిపోని మాటలు అనుభవించటం ఖాయం. ఇక డ్యూటీ అయిపోయాక చీకటి పడినా.. వర్షం పడినా.. బైక్ కాదుకదా ఒక గొడుగు కూడా ఇచ్చేవాడు కాదు. ఇన్ని అవమానాలు పడుతున్నా.. సింగన్న క్రమశిక్షణగా, నిజాయితీగా పని చేస్తున్నాడు. 


అలా ఒక సంవత్సరం గడిచాక సింగన్న డ్రైవింగ్ నైపుణ్యం ఏడాదంతా దగ్గరుండి సోములు చూశాక అతడంటే ఇష్టం ఏర్పడింది. కానీ.. అప్పటికే అతడిని అవమానించిన క్షణాలు కేవలం సోములు యొక్క మనస్సాక్షికే తెలుసు. 


రెండు రోజుల నుంచి సింగన్న విధులకు రావటంలేదు. బహుశా నా టార్చర్ భరించలేక రావటం లేదని సోములు అనుకున్నాడు. అతని పేరు తప్ప వివరాలు తెలుసుకోలేకపోయాడు తన పరివారానికి ఆ వివరాలు అడిగి సింగన్న ఇంటికి వెళ్ళాడు. మద్యతరగతి వారి ఇళ్ళులా ఉంది. ఇంట్లో ఆయన భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. 


"సింగన్న ఎక్కడ" అడిగాడు సోములు. 


"డ్యూటీకి వెళ్ళాడు" చెప్పింది సింగన్న భార్య. 


"నా దగ్గరే ఇన్నాళ్లు పనిచేశాడు. రెండు రోజులు నుండి రావటంలేదు. ఎక్కడ నీ భర్త " 

 ఏడుస్తూ మిన్నుకుండిపోయింది ఆవిడ. 


పక్కనే ఉన్న నల్లని పెట్టె పై సోములు కళ్ళు పడ్డాయి. దాని మీద సింగన్న సిగ్నల్స్ అని ఆంగ్లంలో రాసి ఉంది. దాన్ని తెరిచాడు. ఆర్మీ దుస్తులు మరియు ఒక డైరీ ఉంది. ఆ డైరీని ఓపెన్ చేయగా మొదటి పేజిలో.. 

"నేను ఇంటి వద్ద ఉంటే కుటుంబాన్ని, దేశాన్ని ప్రేమిస్తాను. డ్యూటీలో ఉంటే దేశాన్ని, దేశ ప్రజలని మాత్రమే ప్రేమిస్తాను" అని ఉంది.


రెండో పేజి నుండి.. 

పేద కుటుంబం అయినా.. చిన్ననాటి నుండే దేశాన్ని ప్రేమించే వ్యక్తి సింగన్న. దేశం పైన శత్రువులు, శత్రు దేశాలు పైచేయి సాధిస్తుండటం తట్టుకోలేని సింగన్న కోరి, ఆర్మీలోకి అడుగుపెట్టాడు. కఠోర శిక్షణm ఉత్తీర్ణత కానీదే ఆర్మీ యూనిఫామ్ రాదు మనదేశంలో. అలాంటి కష్టసాద్యమైన శిక్షణ దాటి, ఆర్మీదళంలో చేరాడు. 


మొదట సైనికుడిగా ఎన్నో ధైర్యసాహసాలుతో పెద్ద పెద్ద ప్రమోషన్స్ వచ్చినా.. యుద్ధం వస్తే యుద్ధంలోకి దూకాలనే ఉద్దేశ్యంతో సాధారణ పదవిలోనే ఉండిపోయాడు. అయితే అతడి, నిర్ణయాలను, సేవలను ఆర్మీ గుర్తించింది. తర్వాత యుద్ధ ట్యాంకర్ నడిపే డ్రైవర్గా కొనసాగి శత్రు సైన్యాన్ని బెంబేలెత్తించాడు. యుద్ధంలో సహచర ట్యాంకర్లు ఒక్క శత్రు ట్యాంకర్ని ద్వంసం చేయటానికి అపోసపోలు పడ్డా.. సింగన్న మాత్రం ట్యాంకర్ ని అతివేగంగా నడుపుతు శత్రువులు ట్యాంకర్లని ఆవలీలగా ధ్వంసం చేసేవాడు. 


అలా సింగన్న సహచరుల కంటే శత్రువులు ఎక్కువగా ఉన్న సమయంలో ప్రాణనష్టం తనవాళ్ళకే ఉంటుందని గ్రహించి సహచరులను వెనక్కి పిలిచి తానే శత్రువులను వెంబడించి తరిమితరిమి ట్యాంకర్లో బాంబులు పెట్టి గుంపుగా ఉన్న శత్రువులు పైకి దుసుకుపోయేలా చేసి తాను ట్యాంకర్ నుండి దూకి ట్యాంకర్ ని పేల్చివేశాడు. 


ఆ పేలుడుతో పెద్ద సంఖ్యలో శత్రువులు మరణించారు. అయితే.. ! సింగన్న ప్రమాదవశాత్తు పాక్ భూభాగంలో పడిపోగా పాక్ ఆర్మీ అతడిని బంధించింది. 


కొన్ని రోజుల తర్వాత అలాంటి ధైర్యసాహసాలు కలిగిన సైనికుడిని వదులుకోలేక భారత ప్రభుత్వం పాక్ తో చర్చలు జరిపి సింగన్నను విడిపించింది. ప్రాణాలతో సింగన్న వచ్చాడు కానీ.. పాక్ దుశ్చర్యలు కొత్తకాదు కదా.. తన భుజానికి ఏదో చిన్న గాయం అయినట్టు గుర్తించి డాక్టర్ ని సంప్రదించగా సింగన్నకు కోలుకోలేని దెబ్బ. 


అవును.. సింగన్నకు తెలియకుండా అతడి చేతికి ప్రమాదకర ఇన్ఫెక్షన్ గల ఇంజక్షన్ ఇచ్చింది పాక్ సైన్యం. ఆ ఇన్ఫెక్షన్ వలన చేతిని తొలగించాలి. లేకుంటే కొన్ని రోజుల్లో అది శరీరం మొత్తం పాకుతుంది. అలా చెయ్యి తీసేయల్సి వచ్చింది సింగన్నకు. 


 ఇంత జరిగినా.. చెయ్యి గూర్చి సింగన్న ఆలోచించలేదు దేశానికి సేవలు అందించగలనా లేదా అనే ఆలోచించాడు. సాదారణంగా ఏ అవయవం కోల్పోయిన అతడు భారత ఆర్మీలో కొనసాగటం కష్టం. అలాంటిది చెయ్యి లేకపోతే ఏం.. ! కాళ్ళు ఉన్నాయి. నా ముఖం చూసే సగం మంది శత్రువులు వణికిపోవాలి అనే అతడి గంభీరమైన మాటలతో అతడిని బాంబ్ స్క్వాడ్ సభ్యుడిగా నియమించింది. 


అలా అక్కడ కూడా ఎన్నో బాంబులును నిర్విర్యం చేసి అందరి మన్ననలు అందుకున్నాడు. అలా ఒకరోజు దళాలు కుంబింగ్ కోసం సిద్దమయ్యే సమస్యాత్మక అడవుల్లో ముష్కరులు పెట్టిన ముందుపాతర్లు గుర్తించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక ముందుపాతర పై అడుగు వేశాడు. దాని పై అడుగు వేసేవాడు ఎవడు బతకడు. ‘’

కానీ..  వెంటనే తన సహచారులను వెనక్కి పంపి చాకచక్యంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే.. ! అతడు కాలు కోల్పోవల్సి వచ్చింది. అలా సింగన్న ఆర్మీ నుండి వైదొలగల్సి వచ్చింది. 


ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే రావటంతో మద్యతరగతికి చెందిన సింగన్న ఇల్లు గడవటం కష్టంగా మారింది. సింగన్న సేవలు గుర్తించి ఒక స్వచ్ఛంద సంస్థ ఆయనకు ప్లాస్టిక్ చెయ్యి, కాలు అమర్చి ఊరటనిచ్చాయి. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్ తలుచుకుని సోములు సిబ్బంది ఇచ్చిన డ్రైవింగ్ ప్రకటన చూసి డ్రైవింగ్ ప్రతిభలో పాస్ అయి సోములు దగ్గర చేరాడు. 


ఎప్పుడూ తనను అవమానించే సోములును తన డైరీలో మాత్రం దేవుడిగా రాశాడు సింగన్న. 


‘దేశ సేవలో కాలు, చెయ్యి కోల్పోయి కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో సోములు నాకు ఉపాధి కల్పించాడు. అతడు పెట్టే ఏ అవమానం అయినా.. నా కుటుంబం పడే బాధకంటే కంటే ఎక్కువేం కాదుకదా.. ? అతడు పెట్టే అవమానం కంటే అతడిచ్చే జీతం నాకు, నా కుటుంబానికి ఇప్పుడు జీవనాధారం. అందుకే అతడు నాకు దేవుడు’ అని ఆ డైరీలో ఉంది. 


ఒక్కపేజీ ఖాళీ తర్వాత.. మరలా.. 

"నేను భారత సైన్యం తో ఉండి చనిపోతే అటు దేశ ప్రజలకు, ఇటు మనకు, మన పిల్లలకు మేలు జరుగుతుంది. ముఖ్యంగా నా కుటుంబ సభ్యులుగా మీకు ఆదుకుంటుంది. నేను దేశసేవ కోసం ఎంతో కష్టపడ్డాను. నేను ఆత్మహుతి దాడితో శత్రువులును చంపి చనిపోతాను. నీవు పిల్లలకు జాగ్రత్తగా చూసుకో అని భార్యకు చెప్పి అధికారులను ఒప్పించి సైన్యంలో కలవటానికి వెళ్తున్నాను. చనిపోయే ఈ చివరి క్షణంలో ఈ డైరీ ఎందుకని ఇక్కడే వదిలి వెళ్తున్నాను. 


ఇది ఆ డైరీ సారాంశం.. 


అది చదివిన సోములు గుండెలు బాదుకున్నాడు. ఒక ఆర్మి సైనికుడు అది కూడా పై పదవులు, కుటుంబం వద్దనుకున్న ధీరుడిని ఇంత ఘోరంగా అవమానించాను. సూటిపోటి మాటలన్నాను. అన్నీటికి మించి ముష్టివాడికి పెట్టినట్టు తిండి పెట్టిన తీరు ఘోరాతిఘోరం. అయినా.. ! డైరీలో నన్ను దేవుడిగా కీర్తించాడు. 


" ఏం చేస్తే.. నా బాధ తీరుతుందిరా దేవుడా " ఆంటూ ఏడవసాగాడు. 


ఎంత ఏడ్చినా.. తన పాపాన్ని కడిగేసుకోలేడని సోములుకు తెలుసు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాడు. ప్రభుత్వం నుండి సహాయం వచ్చినా రాకున్నా.. తన సొంత కుటుంబంలా భావించి తనతో పాటే సింగన్న భార్య, పిల్లలను తీసుకుపోయాడు సోములు. 

**** **** **** **** **** ****

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం 





41 views0 comments
bottom of page